Skip to main content

ఫిబ్రవరి 2017 వ్యక్తులు

ఆర్థికవేత్త కెన్నెత్ కన్నుమూత
ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత కెన్నెత్ జె.ఆరో (95) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 21న మరణించారు. ఆయనకు సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో గణిత నమూనాలపై చేసిన కృషికి 1972లో నోబెల్ బహుమతి దక్కింది.

అజర్‌బైజాన్ ఉపాధ్యక్షురాలిగా అధ్యక్షుడి భార్య
అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్ తన భార్య మెహ్రిబన్‌ను ఆ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దీని కోసం 2016, సెప్టెంబర్‌లో రిఫరెండం నిర్వహించారు.

నాగాలాండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన లీజిత్సు
Current Affairs
నాగాలాండ్ 17వ ముఖ్యమంత్రిగా నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు షుర్హోజీలి లీజిత్సు ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. లీజిత్సు శాసనసభ సభ్యుడు కానందున ఆయన ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది.

పురపాలక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి ఝెలియాంగ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఝెలియాంగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

జ్యుడీషియల్ రిఫామ్స్- రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్ పుస్తకావిష్కరణ
అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రాసిన Judicial reforms-Recent Global Trends పుస్తకాన్ని ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ పాల్గొన్నారు.

సీఆర్‌పీఎఫ్ తాత్కాలిక డీజీగా సుదీప్ లక్డాకియా
సీఆర్‌పీఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లక్డాకియాకు డెరైక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన లక్డాకియా ప్రస్తుతం సెంట్రల్ జోన్‌లోని పారామిలటరీ బలగాలకు నేతృత్వం వహిస్తున్నారు. ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)లో లక్డాకియా పనిచేశారు. 2016లో సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్ బాధ్యతలు చేపట్టిన దుర్గాప్రసాద్(1981 బ్యాచ్, తెలంగాణ కేడర్) ఫిబ్రవరి 27న పదవీ విరమణ చేశారు.

ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నంద్‌కుమార్
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్-NCST చైర్మన్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు, మాజీ ఎంపీ నంద్ కుమార్‌సాయి ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు. నంద్ కుమార్ గిరిజనుల హక్కుల సాధనకు, వారి ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈయన 1977, 85, 98ల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

భారత మహిళల హాకీ చీఫ్ కోచ్‌గా మరిన్
భారత మహిళల హాకీ కోచ్‌గా నెదర్లాండ్‌‌సకు చెందిన జోర్డ్ మరిన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న హాకీ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.మరిన్ నాలుగేళ్ల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారు. నెదర్లాండ్‌‌సకే చెందిన ఆయన సహచరుడు ఎరిక్ వోనింక్‌ను విశ్లేషక కోచ్‌గా హాకీ ఇండియా నియమించింది. మరిన్ శిక్షణలోనే నెదర్లాండ్‌‌స అండర్-21 మహిళల జట్టు ప్రపంచకప్ టైటిల్ గెలువగా సీనియర్ జట్టు హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ (2015)లో బంగారు పతకం సాధించింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా కె.పళనిస్వామి
తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎడపాడి కె. పళనిస్వామి ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 30 మంది మంత్రుల చేత గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా కొలువుదీరిన మంత్రివర్గంలో సెంగోట్టయన్ మినహా మిగిలిన 29 మంది జయలలిత కేబినెట్‌లో పనిచేసినవారే. ఫిబ్రవరి 18న పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు.
2016, డిసెంబర్ 5న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో డిసెంబర్ 6న పన్నీర్ సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల పాటు ఆ పదవిలో ఉన్న ఆయన ఫిబ్రవరి 5న రాజీనామా చేయటంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శశికళని ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో AIADMK నేతలు ఆమెను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. తీరా ఆమె ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యే సమయంలో పన్నీరు సెల్వం ఎదురు తిరిగారు. ఆపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేలుస్తూ ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది. దీంతో శశికళ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
పళనిస్వామి రాజకీయ ప్రయాణం
  • 1989లో ఎడపాడి నుంచి అసెంబ్లీకి ఎన్నిక.
  • 1991లో ఎడపాడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా గెలుపు.
  • 1998లో తిరుచ్చంగోడు నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నిక.
  • 2011లో తొలిసారి మంత్రి పదవి.
  • 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు
  • 2017 ఫిబ్రవరి 14 అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
  • 2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం
విశ్వాస పరీక్ష నెగ్గిన పళనిస్వామి
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి ఫిబ్రవరి 18న శాసనసభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గాడు. స్వామి, పన్నీర్‌సెల్వంకు మధ్య తీవ్ర ఘర్షణల మధ్య ప్రారంభమైన విశ్వాస పరీక్షలో స్వామికి అనుకూలకంగా 122 ఓట్లు రాగా ప్రతికూలంగా 11 ఓట్లు వచ్చాయి. బలపరీక్ష సందర్భంగా చెలరేగిన ఘర్షణలో అసెంబ్లీ స్పీకర్‌పై ప్రతిపక్ష పార్టీ డీఎంకే సభ్యులు దాడి చేసి స్వల్పంగా గాయపరిచారు.
జయలలిత మరణం తర్వాత అపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వం అనతికాలంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అవ్వాలని శశికళ ఎమ్మేల్యేల మద్ధతు కూడగడుతున్న సందర్భంలో ఆమెపై తిరుగుబావుటా ఎగురవేసిన పన్నీర్ తనకు ఎమ్మేల్యేల మద్ధతు ఉందంటూ బలపరీక్షకు సిద్ధమయ్యాడు. ఇదే తరుణంలో సుప్రీంకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఈ.పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేస్తూ ఏఐడీఎంకే ఏకగ్రీవ తీర్మానం చేసింది. బలనిరూపణకు తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజులు సమయం ఇవ్వగా పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన రెండోరోజే బలపరీక్షకు సిద్ధమయ్యాడు.
తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షను రెండుసార్లు ఎదుర్కొన్న పార్టీగా అన్నాడీఎంకే చరిత్ర సృష్టించింది. ఎంజీఆర్ మరణం తరువాత జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య 1988 జనవరి 27న నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ నెగ్గారు.

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఫిబ్రవరి 17న ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 28కి చేరింది. కొత్తగా నియమితులైన వారిలో మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నవీన్ సిన్హా, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహన్ ఎం.శాంతన గౌడర్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ గుప్తా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు ఉన్నారు.

సుప్రీం కోర్టు కొత్త న్యాయమూర్తులు
  • జస్టిస్ సంజయ్ కే కౌల్
  • జస్టిస్ మోహన్ శాంతనా గౌడర్
  • జస్టిస్ ఎస్‌ఏ నజీర్
  • జస్టిస్ నవీన్ సిన్హా
  • జస్టిస్ దీపక్ గుప్తా
నాగాలాండ్ సీఎం రాజీనామా
నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ ఝెలియాంగ్ ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో తప్పనిసరి పరిస్థిత్లులో ఝెలియాంగ్ రాజీనామా చేశారు. దీన్ని గవర్నర్ పీబీ ఆచార్య ఆమోదించారు. నాగాలాండ్ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలున్నారు.

కెనడా హైకమిషనర్‌గా వికాస్ స్వరూప్
విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కెనడాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 16న విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ డివిజన్‌లో ఉమ్మడి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ బాగ్లే విదేశాంగ శాఖ నూతన అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1986 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన స్వరూప్ విదేశాంగ శాఖ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన రాసిన తొలి నవల ‘క్యూ అండ్ ఏ’ ఆధారంగా స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా తీశారు. ఈ చిత్రం 2009లో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

జాతీయ ఎస్టీకమిషన్ ఛైర్మన్‌గా నందకుమార్ సాయి
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భాజపా సీనియర్ నేత నందకుమార్ సాయి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఫిబ్రవరి 28న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్‌గఢ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నందకుమార్ సాయి చత్తీస్‌ఘడ్ శాసనసభలో తొలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

త్వరలో కలాం చివరి పుస్తకం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాసిన చివరి పుస్తకం 2017 మార్చిలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆయన మరణానికి నాలుగు నెలల ముందు 2015లో రాసిన Pathways to Greatness ను ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ హార్పర్ కొలిన్‌‌స ప్రచురించింది. రాజకీయ నాయకులు చట్టాలను ఉల్లంఘించటం, అధికార దుర్వినియోగం, కాలం చెల్లిన చట్టాలు, హింస ద్వారా అసహనాన్ని వెల్లడించటం వంటి అంశాలను కలాం ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

మాజీ సీజేఐ ఆల్థమస్ కబీర్ కన్నుమూత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ (68) ఫిబ్రవరి 19న కోల్‌కతాలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కబీర్ సెప్టెంబర్ 29, 2012 నుంచి జూలై 19, 2013 వరకు అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
1973లో కోల్‌కతాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన అల్తమస్ 1990లో కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 మార్చి 1న జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

పార్టీనుంచి బహిష్కృతుడైన తర్వాత ఓ ఎంపీ పదవిలో కొనసాగొచ్చా అనే అంశంపై స్పష్టతనిస్తూ.. పార్టీతో సంబంధం లేకుండా ఎంపీగా ఉండొచ్చని, ఓటింగ్‌లోనూ పాల్గొనవచ్చని కబీర్ కీలక తీర్పునిచ్చారు.

నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రి షురోజీలి లిజిత్సు
నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్-NPF అధ్యక్షుడు షురోజీలి లీజిత్సు (81) ఎంపికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న జరిగిన డెమొక్రటిక్ అలయెన్‌‌స ఆఫ్ నాగాలాండ్-DAN శాసనసభాపక్ష సమావేశంలో లీజిత్సును రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ఫిబ్రవరి 19న జెలియాంగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

సాయుధ రైతాంగ పోరాట యోధుడు నారాయణ కన్నుమూత
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గెంట్యాల నారాయణ (98) ఫిబ్రవరి 8న కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (పాత కరీంనగర్ జిల్లాలో అంతర్భాగం) చందుర్తి మండలం ఎన్గల్‌కి చెందిన నారాయణ తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రజలను చైతన్యపరిచారు.

ఫిఫా అంబాసిడర్‌గా డీగో మారడోనా
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య-ఫిఫా పాలకమండలి అంబాసిడర్‌గా అర్జెంటీనా మాజీ క్రీడాకారుడు డీగో మారడోనా నియమితులయ్యారు. అర్జెంటీనా 1986 ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలవడంలో మారడోనా కీలకపాత్ర పోషించాడు. అలాగే 2008 నుంచి 2010 వరకు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు.

సెబీ కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-సెబీ కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ త్యాగీ ఎంపికకు ఫిబ్రవరి 10న ఆమోదం తెలిపింది. 1984 ఐఏఎస్ బ్యాచ్, హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన త్యాగి ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ యు.కె. సిన్హా మార్చి 1న పదవీ విరమణ చేయనున్నారు.

జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్ వాల్టర్ స్టీన్
Current Affairs జర్మనీ నూతన అధ్యక్షుడిగా ఫ్రాంక్ వాల్టర్ స్టీన్‌మీయర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 12న జర్మనీ పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 1,239 ఓట్లు పోలవ్వగా సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్టీన్‌మీయర్‌కు 931 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్‌లో చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌‌స పార్టీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి క్రిస్టోఫ్ బటర్‌వేగ్ ఓడిపోయారు. ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మీయర్ గతంలో జర్మనీ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన విష్ణువర్దన్ రెడ్డి జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా మానవహక్కుల విభాగంలో సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఉన్న అశ్వని సత్తారు ఢిల్లీకి బదిలీ అయ్యారు.

హెదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు ఏపీలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి.

అసోచామ్ కొత్త పాలకవర్గం ఎన్నిక
మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ సీఎండీ సందీప్ జజోడియా అసోచామ్ నూతన ప్రెసిడెంట్‌గా ఫిబ్రవరి 13న నియమితులయ్యారు. వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న బాలక్రిషన్ గోయెంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ చైర్మన్‌గా ఉన్న కిరణ్ కుమార్ గ్రంధి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ శ్రేయీ ఇన్‌ఫ్రా వైస్ చైర్మన్ సునీల్ కనోరియా అసోచామ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు 4 ఏళ్ల జైలు
ఆదయానికి మించిన ఆస్తులకేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు వి.ఎన్.సుధాకరన్, జె.ఇళవరసిలు కూడా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని నిర్ధారించింది. ఈ మేరకు జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది. ఇదే కేసులో వీరితో పాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ జయలలిత, శశికళ తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన కర్ణాటక హైకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

దీన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే పార్టీ సుప్రీం కోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక హైకోర్టు తీర్పుని రద్దు చేస్తూ ప్రత్యేక హైకోర్టు తీర్పుని పునరుద్ధరించింది. జయలలిత మరణించినందున ఆమెపై దాఖలైన అప్పీళ్లన్నీ రద్దయ్యాయి. ఈ తీర్పుతో శశికళ పదేళ్లపాటు ఎన్నికలకు దూరం కానున్నారు.

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు
సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జీలు నియమితులయ్యారు. ఈ మేరకు నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 14న ఆమోదం తెలిపారు.

కొత్త జడ్జీలు

పేరు

ప్రస్తుత పదవి

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ నవీన్ సిన్హా

రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ మోహన్ గౌడర్

కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ దీపక్ గుప్తా

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి


48.8 అడుగుల ఎత్తయిన సైకత కళాఖండం
అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ సముద్ర తీరంలో రూపొందించిన 48.8 అడుగుల ఎత్తయిన సైకత కళాఖండానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దీంతో ఆయన తన రికార్డును తానే అధిగమించాడు. 2015 అక్టోబర్ 27న సుదర్శన్ పూరీ తీరంలో 45 అడుగుల ఎత్తయిన దుర్గాన్ని రూపొందించాడు.

ఆర్థిక శాఖ సలహాదారుగా సంజీవ్ సన్యాల్
Current Affairs
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్ సన్యాల్ ఎంపికయ్యారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్-ACC ఫిబ్రవరి 3న ఆయన నియామకాన్ని ఆమోదించింది. గతంలో డాషే బ్యాంక్ ఎండీగా పనిచేసిన సంజీవ్ పలు పుస్తకాలు రచించారు. పట్టణ అంశాలపై చేసిన కృషికి గాను 2007లో ఐసెన్ హోవర్ ఫెలోషిప్ పొందిన సంజీవ్ 2014 వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో సింగపూర్ ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు.

సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత
సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్ సింగ్(77) ఫిబ్రవరి 3న కన్నుమూశారు. 1961 బ్యాచ్, కర్నాటక కేడర్‌కు చెందిన జోగిందర్ హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో సీబీఐ డెరైక్టర్‌గా ఎంపికయ్యారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు.

సుప్రీం కోర్టుకు ఐదురుగు కొత్త జడ్జీలు
నలుగురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సహా మొత్తం ఐదుగురు సిట్టింగ్ హైకోర్టు జడ్జీల పేర్లను ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కొలీజియం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని కొలీజియం ఫిబ్రవరి 3న జాబితాను ఆమోదించింది. మద్రాస్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ మోహన్ శాంతన గౌడర్, జస్టిస్ దీపక్ గుప్తలతోపాటు కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

ఐరాస అనుబంధ సంస్థ సభ్యుడిగా భారత రాయబారి
ఐరాసకు చెందిన ఉమ్మడి దర్యాప్తు సంస్థ-JIU సభ్యుడిగా భారత రాయబారి అచంకులగరే గోపీనాథన్ మరోసారి ఎంపికయ్యారు. ఆయనతో పాటు సుకాయ్ ప్రోం జాక్సన్(జాంబియా), జీన్ వెస్లీ(హైతీ), లోజిన్‌స్కీ(రష్యా) కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 4న ఐరాస సాధారణ అసెంబ్లీ వీరి నియామకాన్ని ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి ఐదేళ్లు పాటు వీరు ఈ పదవిలో ఉంటారు. గోపీనాథన్ పేరును భారత్ ప్రతిపాదించగా, ఆసియా పసిఫిక్ బృందం తన ఏకైక అభ్యర్థిగా ఆమోదం తెలిపింది. తొలిసారి 2013 జనవరి నుంచి 2017 డిసెంబర్ వరకూ ఈ పదవికి ఎన్నికైన గోపీనాథన్ ప్రస్తుతం ఉమ్మడి దర్యాప్తు సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ
AIADMK అధ్యక్షురాలు శశికళ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 5న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు తదుపరి సీఎంగా శశికళ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published date : 11 Feb 2017 10:38AM

Photo Stories