మే 2018 వ్యక్తులు
కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామి మే 25న జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు చెందిన 78, జేడీఎస్‌కు చెందిన 37, ఇద్దరు స్వతంత్రులు మొత్తం కలిపి 117 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సర్కారుకి అనూకులంగా ఓటు వేశారు. అలాగే స్పీకర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో బీజేపీతో కలిసి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన కర్ణాటక సీఎం
ఎప్పుడు : మే 25
ఎవరు : హెచ్‌డీ కుమారస్వామి
నటుడు మాదాల రంగారావు కన్నుమూత
ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు (70) మే 27న కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. నాటకాల్లో నటించిన రంగారావు మొదటిసారిగా నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై 1980లో ‘యువతరం కదిలింది’ అనే సినిమాను తీశారు. తర్వాత సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలను రూపొందించారు. ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, జనం మనం, ప్రజాశక్తి చిత్రాల్లో నటించి రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.
మాదాల రంగారావు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ శర్మ కాలేజీలో బీఏ చదివిన ఆయన నల్లూరి వెంకటేశ్వర్లు సాహచర్యంలో కళాకారుడిగా ఎదిగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ టాలీవుడ్ నటుడు కన్నుమూత
ఎప్పుడు : మే 27
ఎవరు : మాదాల రంగారావు (70)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : హృద్రోగ సమస్యతో
ఐజేయూ అధ్యక్షునిగా దేవులపల్లి అమర్
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షునిగా దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్‌గా సబీనా ఇందర్‌జిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐజేయూ-2018 ఎన్నికల కమిటీ మే 28న తెలిపింది. త్వరలో జరగనున్న ఐజేయూ ప్లీనరీలో వీరిరువురూ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐజేయూ అధ్యక్షునిగా ఎస్‌ఎన్ సిన్హా, సెక్రటరీ జనరల్‌గా అమర్ ఉన్నారు.
1976లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన అమర్
ప్రస్తుతం సాక్షి టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రజాతంత్ర పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా, ఏపీ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా రెండుసార్లు వ్యవహరించారు.
సబీనా ఇంద్రజిత్ ఢిల్లీలో ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్స్ ఏజెన్సీ (ఇన్ఫా)లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్‌గా, బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ జర్నలిస్ట్‌ల సమాఖ్య (ఐఎఫ్‌జే) ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐజేయూ అధ్యక్షుని ఎన్నిక
ఎప్పుడు : మే 28
ఎవరు : దేవులపల్లి అమర్
ఆర్‌బీఐ సీఎఫ్‌వోగా సుధా బాలకృష్ణన్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తొలి చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్‌వో) ఎన్‌ఎస్‌డీఎల్ వైస్-ప్రెసిడెంట్ సుధా బాలకృష్ణన్ మే 15న నియమితులయ్యారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బాలకృష్ణన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హోదాను కలిగి ఉంటారు. 2017 మేలో ఆర్‌బీఐ కొత్తగా సీఎఫ్‌వో పోస్ట్‌ను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ తొలి సీఎఫ్‌వో నియామకం
ఎప్పుడు : మే 15
ఎవరు : సుధా బాలకృష్ణన్
అమెరికా వ్యోమగామి అలెని బీన్ కన్నుమూత
అమెరికా వ్యోమగామి అలెన్ లావెర్న్ బీన్(86) అనారోగ్యం కారణంగా మే 26న హ్యూస్టన్ నగరంలో కన్నుమూశారు. 1969 నవంబర్ 14న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అపోలో 12 పేరిట చేపట్టిన చంద్రగ్రహ యాత్రలో కన్రాడ్, రిచర్డ్ గోర్డాన్‌లతోపాటు అలెన్ బీన్ పాల్గొన్నారు. ఇది విజయవంతం అవడంతో చంద్రునిపై కాలుమోపిన నాలుగో వ్యక్తిగా అలెన్ బీన్ గుర్తింపు పొందారు.
1932 మార్చి 15న టెక్సాస్‌లోని వీలర్‌లో జన్మించిన అలెన్ లావెర్న్ బీన్ తొలుత నౌకాదళంలో పైలట్‌గా చేరారు. అనంతరం 1963లో నాసాలో వ్యోమగామి అయి 1970లో వ్యొమగామి శిక్షణ విభాగానికి అధిపతి అయ్యారు. ఆ తర్వాత నాసా నుంచి పదవీ విరమణ పొంది అంతరిక్షం, చంద్రుడి ఉపరితలం వంటి అంశాలపై ఆయన పలు చిత్రాలు గీశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా వ్యోమగామి కన్నుమూత
ఎప్పుడు : మే 26
ఎవరు : అలెన్ లావెర్న్ బీన్(86)
ఎక్కడ : హ్యూస్టన్, అమెరికా
ఎందుకు : అనారోగ్యం కారణంగా
డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా పంకజ్ శరణ్
భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా సీనియర్ దౌత్యవేత్త పంకజ్ శరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ మే 29 ఆమోదముద్ర వేసింది. దీంతో ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1982 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) బ్యాచ్‌కు చెందిన పంకజ్ 2015 నుంచి ఇప్పటివరకు రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు. 1995-99 మధ్యకాలంలో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా, 2007 నుంచి 2012 వరకూ సంయుక్త కార్యదర్శిగా పంకజ్ పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ నియామకం
ఎప్పుడు : మే 29
ఎవరు : పంకజ్ శరణ్
టాప్-30 గ్లోబల్ సీఈవోలలో ఆదిత్య పురి
ప్రపంచంలోని టాప్-30 గ్లోబల్ సీఈవోలలో వరుసగా నాలుగో ఏడాది కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పబ్లికేషన్ ‘బారన్’ టాప్-30 గ్లోబల్ సీఈవోల జాబితాను మే 29న విడుదల చేసింది. అదే విధంగా అమెజాన్ జెఫ్ బెజోస్, బెర్క్‌షైర్ హాతవే వారెన్ బఫెట్, జేపీ మోర్గాన్ చేస్ జమీ డిమోన్, అల్ఫాబెట్ లారీ పేజ్, నెట్‌ఫ్లిక్స్ రీడ్ హస్టింగ్‌స, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాప్-30 గ్లోబల్ సీఈవోలలో హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్ డెరైక్టర్
ఎప్పుడు : మే 29
ఎవరు : ఆదిత్య పురి
మిజోరాం, ఒడిశాలకు గవర్నర్ల నియామకం
మిజోరాం గవర్నర్‌గా కుమ్మనం రాజశేఖరన్, ఒడిశా గవర్నర్‌గా ప్రొఫెసర్ గణేషిలాల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి వరకు కేరళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖరన్ గతంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా సేవలందించారు. ఇక ప్రొఫెసర్ గణేషిలాల్ హరియాణాకు చెందిన మాజీ మంత్రి.
జవహర్‌లాల్ నెహ్రూ.. యన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ ఆవిష్కరణ
తమిళనాడు కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జ్ ఏ.గోపన్న రచించిన జవహర్‌లాల్ నెహ్రూ.. యన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీని ఈనెల 27న ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. మొదటి ప్రతిని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు అందజేశారు.
ఎన్‌సీడీఆర్‌సీ అధ్యక్షునిగా జస్టిస్ ఆర్‌కే అగర్వాల్
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) అధ్యక్షునిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌కే అగర్వాల్ నియమితులయ్యారు. ఇటీవలే న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది.
పర్వతారోహణలో అర్జున్ వాజ్‌పేయి రికార్డు
8 వేల మీటర్ల కన్నా ఎతైన ఆరు పర్వతాలను 24 ఏళ్ల వయసులో అధిరోహించిన వ్యక్తిగా భారత యువ పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పేయి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ రికార్డు నేపాల్‌కు చెందిన చాంగ్ డవా పేరు మీద ఉంది. కాంచన్ గంగా పర్వతాన్ని అధిరోహించి ఈ రికార్డు నెలకొల్పిన ఈ యువ తరంగం 2010లో 16 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. 8 వేల మీటర్ల కన్నా ఎతైన 14 పర్వతాలను పిన్న వయసులోనే అధిరోహించాలన్నదే అర్జున్ లక్ష్యం.
యార్లగడ్డకు జీవితకాల సాఫల్య పురస్కారం
కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు.. అమెరికన్ తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘాలు సంయుక్తంగా జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు డల్లాస్‌లో జరిగే కార్యక్రమాల్లో యార్లగడ్డకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు జీవితకాల సాఫల్య పురస్కారం
ఎప్పుడు : మే 17
ఎవరు : అమెరికన్ తెలుగు సంఘం, తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం
ప్రముఖ రచయిత పెద్దిభొట్ల కన్నుమూత
ప్రముఖ కథా, నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య (80) కన్నుమూశారు. కాలేయవ్యాధితో బాధపడుతున్న మే 18న విజయవాడలో మరణించారు.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కృష్ణశాస్త్రి, అన్నపూర్ణలకు 1938 డిసెంబర్ 15న ఒంగోలు సమీపంలోని వల్లూరులో జన్మించారు. మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీతోపాటు ఎం.ఎ. చేశారు. గుణదలలోని ఆంధ్రా లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 38 ఏళ్లు పని చేసి, పదవీ విరమణ చేశారు.
వృత్తి రీత్యా అధ్యాపకుడైన పెద్దిభొట్ల ప్రవృత్తిరీత్యా కథకులు. ఇప్పటివరకు ఆయన 350 కథలు, 8 నవలలు రాశారు. ఆయన రాసిన ‘పెద్దిభొట్ల సుబ్బరామయ్య’ కథా సంకలానికి 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. చాసో, రావిశాస్త్రి పురస్కారంతో పాటుగా అబోవిబో (అప్పాజోశ్యుల విష్ణుభట్ల ఫౌండేషన్) పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఇంగ్లిషులో ది రైనీడే అనే పేరుతో కథలు కూడా రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కథా, నవలా రచయిత కన్నుమూత
ఎప్పుడు : మే 18
ఎవరు : పెద్దిభొట్ల సుబ్బరామయ్య
ఎందుకు : కాలేయ వ్యాధితో బాధపడుతూ
పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చలమేశ్వర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జూన్ 22న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు తన చివరి పనిదినం అయిన మే 18న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కలసి కోర్టు నంబర్-1లో వేదిక పంచుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసే వారు తమ చివరి పనిదినం నాడు ప్రధాన న్యాయమూర్తితో కోర్టు నంబర్-1లో వేదిక పంచుకోవడం ఆనవాయితీ. 2011 అక్టోబర్ 11వ తేదీన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్‌లు ఇద్దరూ ఒకేరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యాక చలమేశ్వర్ అదే కోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. 2007-11 మధ్య గువాహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలిపై అసమ్మతి వ్యక్తంచేస్తూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న చలమేశ్వర్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
జస్టిస్ చలమేశ్వర్ చరిత్రాత్మక తీర్పులు
- జడ్జిల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేస్తూ చేసిన చట్టం చెల్లదని అక్టోబర్ 17, 2015న ధర్మాసనంలోని నలుగురు జడ్జిలు మెజారిటీ తీర్పు ఇవ్వగా, దానిని సమర్థించిన ఏకైక జడ్జిగా చలమేశ్వర్ నిలిచారు. కొలీజియం వ్యవస్థ పనితీరు పారదర్శకంగా లేదని తీర్పులో విమర్శించారు.
- ‘చికాకు లేదా ఇబ్బంది’ కలిగించే ఈ మెయిల్ సందేశాలు పంపేవారిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఏ సెక్షన్ చెల్లదని జస్టిస్ నారిమన్‌తో కలిసి జస్టిస్ చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. ఈ సెక్షన్ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు.
- ఆధార్ కార్డు లేదనే సాకుతో ఏ పౌరునికి మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదని జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్‌లతో కలిసి చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. జస్టిస్ జేజే పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు.
- అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులే కాకుండా జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడ్డవారు కూడా ఆస్తులు, ఆదాయం వివరాలు వెల్లడించాలని ఆయన తీర్పునిచ్చారు.
ఏమిటి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : జస్టిస్ జాస్తి చలమేశ్వర్
రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) మే 18న కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తె వద్ద ఉన్న ఆమె గుండెపోటుతో చనిపోయారు. 1940 సంవత్సరంలో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో నెమలికంటి వెంకట చలపతిరావు, మహాలక్ష్మి దంపతులకు సులోచనారాణి జన్మించారు. కాజ హైస్కూల్లోనే ఎస్‌ఎల్‌సీ చదివిన ఆమె జుజ్జూరు గ్రామానికి చెందిన యద్దనపూడి నరసింహారావుని వివాహం చేసుకున్నారు. అనంతరం నవలా రచయిత్రిగా ఎదిగారు.
చిత్ర నళినీయం అనే కథతో సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె సుమారు ఐదు దశాబ్దాల పాటు దాదాపు 80 నవలలను రచించింది. యద్దనపూడి తొలిరచనలు ముక్కామల నాగభూషణం సారథ్యంలో నడిచిన ప్రగతి అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.
ఆమె రాసిన సెక్రటరీ, మీనా, జీవన తరంగాలు వంటి నవలలు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా రూపుదిద్దుకున్నాయి. తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు అనే చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు మమతలు సినిమాకు కథను అందించారు. 1966లో రాసిన సెక్రటరీ నవల 2016లో స్వర్ణోత్సవం జరపుకోగా మరో నవల మీనా పత్రికలో ధారావాహికగా వచ్చింది. 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు హంస పురస్కారాన్ని ప్రదానం చేసింది.
యద్దనపూడి సులోచనారాణి రచించిన కొన్ని రచనలు
సెక్రటరీ | మీనా | జీవన తరంగాలు | అమ్మానాన్న | రాధాకృష్ణ |
అగ్నిపూలు | చండీప్రియ | ప్రేమ లేఖలు | బంగారు కలలు | విజేత ఆగమనం |
ఆరాధన | ఆత్మీయులు | అభిజాతం | ఆశల శిఖరాలు | అమరహృదయం |
మౌన తరంగాలు | దాంపత్యవనం | వెన్నెల్లో మల్లిక | కలల కౌగిలి | గిరిజా కళ్యాణం |
జై జవాన్ | కాంచనగంగ | ఆహుతి | అమర హృదయం | రుతువులు నవ్వాయి |
ప్రేమ పీఠం | బహుమతి | మౌన పోరాటం | మౌనభాష్యం | శ్వేత గులాబి |
ఏమిటి : సుప్రసిద్ధ రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : మే 18
ఎవరు : యద్దనపూడి సులోచనారాణి
ఎక్కడ : కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : గుండెపోటుతో
హాకీ ఇండియా అధ్యక్షుడిగా రాజిందర్
హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా రాజిందర్ సింగ్ ఎంపికయ్యారు. రెండు దశాబ్దాలుగా హాకీ ఇండియాకు సేవలందించిన మరియమ్మ కోషే రాజీనామా చేయడంతో రాజిందర్ మే 19న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హాకీ ఇండియా ఉపాధ్యక్షుడిగా ఆయన పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాకీ ఇండియా అధ్యక్షుడి ఎంపిక
ఎప్పుడు : మే 19
ఎవరు : రాజిందర్ సింగ్
పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ సీకే ప్రసాద్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మే 23న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం కౌన్సిల్‌లో చైర్మన్‌తోపాటు మరో 28 మంది సభ్యులు ఉంటారు.
బిహార్‌లోని పట్నాలో జన్మించిన జస్టిస్ ప్రసాద్ అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. 2008లో పట్నా హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2009 మార్చిలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2014 జూలై 14 వరకు సుప్రీంకోర్టు జడ్జీగా సేవలందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీసీఐ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 23
ఎవరు : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీకే ప్రసాద్
సీఐఏ తొలి మహిళా డెరైక్టర్‌గా గినా హాస్పెల్
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తొలి మహిళా డెరైక్టర్‌గా గినా హాస్పెల్ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చిలో హాస్పెల్‌ను సీఐఏ డెరైక్టర్‌గా నామినేట్ చేయగానియామకానికి సెనేట్ మే 17న ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఐఏ తొలి మహిళా డెరైక్టర్
ఎప్పుడు : మే 17
ఎవరు : గినా హాస్పెల్
ఎక్కడ : అమెరికా
భౌతిక శాస్త్రవేత్త సుదర్శన్ కన్నుమూత
ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇ.సి.జి.సుదర్శన్ మే 14న అమెరికాలోని ఆస్టిన్‌లో మరణించారు. 1931లో కేరళలోని కొట్టాయంలో జన్మించిన సుదర్శన్ 40 ఏళ్లపాటు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయిదు దశాబ్దాలపాటు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా వ్యవహరించారు. పీహెచ్‌డీ సిద్ధాంత పత్రం కోసం పనిచేస్తున్న సమయంలో ‘ఎ థియరీ ఆఫ్ వీక్ ఇంటరాక్షన్స్’ను కనుగొన్నారు. భౌతిక శాస్త్రం, క్వాంటమ్ ఆప్టిక్స్, క్వాంటమ్ కంప్యూటేషన్ తదితర రంగాల్లో అద్భుత ఆవిష్కర ణలు చేశారు. భారత ప్రభుత్వం ఆయన్ను 2007లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త కన్నుమూత
ఎప్పుడు : మే 14
ఎవరు : ఇ.సి.జి.సుదర్శన్
ఎక్కడ : ఆస్టిన్, అమెరికా
లలిత కళా అకాడమీ చైర్మన్‌గా ఉత్తమ్ పాఛర్ణే
ప్రముఖ శిల్పి, కళాకారుడు ఉత్తమ్ పాఛర్ణే లలిత కళా అకడామీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మే 17న ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లలిత కళా అకడామీ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 17
ఎవరు : ఉత్తమ్ పాఛర్ణే
సియాచిన్‌ను సందర్శించిన రాష్ర్టపతి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మే 10న సందర్శించారు. సైనికులు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉన్నారని చెప్పడానికే తానిక్కడికి వచ్చానని తెలిపారు. సియాచిన్ బేస్ క్యాంపునకు సమీపంలోని కుమార్ పోస్ట్‌ను కూడా కోవింద్ సందర్శించారు. దీంతో 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తర్వాత సియాచిన్‌ను సందర్శించిన రెండో రాష్ట్రపతిగా కోవింద్ గుర్తింపు పొందారు.
జమ్మూకశ్మీర్‌లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియాచిన్‌ను సందర్శించిన రాష్ట్రపతి
ఎప్పుడు : మే 10
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : జమ్మూ కశ్మీర్
కారుణ్య మరణం పొందిన డేవిడ్ గుడ్‌ఆల్
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ గుడ్‌ఆల్(104) అనే శాస్త్రవేత్త కారుణ్య మరణం పొందారు. ఈ మేరకు స్విస్ ఫౌండేషన్ మే 10న వెల్లడించింది. తన ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయేందుకు అనుమతివ్వాలని గుడ్‌ఆల్ ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకోగా ఆ దేశ అధికారులు తిరస్కరించారు. దీంతో స్విట్జర్లాండ్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకున్న గుడ్‌ఆల్ నెంబుటాల్ అనే మందును ఇంజెక్షన్ ద్వారా తీసుకొని మృతి చెందారు. మనస్ఫూర్తిగా, తెలివితో ఉండి కారుణ్యం మరణం పొందాలని ఎవరైనా కోరితే స్విట్జర్లాండ్‌లో అనుమతిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కారుణ్య మరణం పొందిన శాస్త్రవేత్త
ఎప్పుడు : మే 10
ఎవరు : డేవిడ్ గుడ్‌ఆల్(104)
ఎక్కడ : స్విట్జర్లాండ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
మాజీ డీఎస్పీ శివరామకృష్ణ కన్నుమూత
మాజీ డీఎస్పీ జి.శివరామకృష్ణ గౌడ్ (66) కన్ను మూశారు. అనారోగ్యంతో భాదపడుత్ను ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో మే 11న తుది శ్వాస విడిచారు. 2002లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ పేలుడు కేసు, గుజరాత్ పేలుళ్లకు కుట్ర కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ)కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్‌జీఆర్‌ఐలో శాస్త్రవేత్తగా పని చేసిన శివరామకృష్ణ 1985లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ డీఎస్పీ శివరామకృష్ణ కన్నుమూత
ఎప్పుడు : మే 11
ఎక్కడ : హైదరాబాద్
డీజీపీ హిమాంశురాయ్ ఆత్మహత్య
మహారాష్ట్ర అదనపు డీజీపీ, యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మాజీ చీఫ్ హిమాంశురాయ్(54) ముంబైలో మే 11న ఆత్మహత్య చేసుకున్నారు. ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న హిమాంశు నారీమన్ పాయింట్‌లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. ముంబై దాడి కేసులో అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ హాడ్లీ భారత్‌లో రెక్కీ నిర్వహించిన విషయంలో ఆయన కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన హిమాంశురాయ్ 1988లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర అదనపు డీజీపీ ఆత్మహత్య
ఎప్పుడు : మే 11
ఎవరు : హిమాంశురాయ్
ఎక్కడ : ముంబై
బ్రిటన్ సంపన్నుల్లో హిందూజా బ్రదర్స్‌కు రెండో స్థానం
బ్రిటన్ సంపన్నుల జాబితాలో 20.64 బిలియన్ పౌండ్ల సంపదతో భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు (శ్రీచంద్, గోపీచంద్) రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో కెమికల్స్ వ్యాపారి జిమ్‌రాట్‌క్లిఫ్ 21.05 బిలియన్ పౌండ్ల సంపదతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ మేరకు 1,000 మంది బ్రిటన్ సంపన్నులతో సండే టైమ్స్ ‘రిచ్ లిస్ట్ 2018’ నివేదికను మే 13న విడుదల చేసింది. అశోక్ లేలండ్, ఇండస్‌ఇండ్ బ్యాంకు వంటి కంపెనీలు హిందుజాల అధ్వర్యంలో నడుస్తున్నాయి. జాబితాలో లక్ష్మి నివాస్ మిట్టల్ 14.66 బిలియన్ పౌండ్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
ప్రపంచ టాప్-50 సంపన్నుల జాబితాలో వాల్‌మార్ట్ యజమానులు వాల్టన్ కుటుంబం మొదటి స్థానంలో ఉండగా 31.7 బిలియన్ పౌండ్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 19వ స్థానం దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ సంపన్నుల జాబితా
ఎప్పుడు : మే 13
ఎవరు : శ్రీచంద్, గోపీచంద్ (హిందుజా సోదరులు)
ఎక్కడ : రెండో స్థానం
ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ మే 15న మరోసారి ఎన్నికయ్యారు. దీంతో మరో రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 2016లో తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయన రెండోసారి కూడా ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన మనోహర్ గత రెండేళ్ల కాలంలో ఐసీసీలో పలు సంస్కరణలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీసీ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 15
ఎవరు : శశాంక్ మనోహర్
అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ
ఫేస్‌బుక్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. మొత్తం 4.32 కోట్ల మంది ఫాలోవర్లతో మోదీ అగ్ర స్థానంలో ఉండగా 2.31 కోట్ల మందితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో ఉన్నాడు. ‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలు’ అనే పేరుతో బుర్సన్ కోన్ వోల్ఫీ అనే సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 2017 జనవరి 1 నుంచి దేశాధినేతలు, ప్రభుత్వాలు, విదేశాంగ మంత్రులకు సంబంధించిన సుమారు 650 పేజీల్లోని డేటాను ఈ సంస్థ విశ్లేషించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 193 దేశాలలో 175 దేశాలు ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తున్నారుు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నేత
ఎప్పుడు : మే 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : 4.32 కోట్ల మంది ఫాలోవర్లు కలిగినందుకు
సీఐఎస్‌ఎఫ్ ఐజీగా సీవీ ఆనంద్
పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) మే 3న ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ, 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను శంషాబాద్ ఎరుుర్‌పోర్టు కేంద్రంగా ఆనంద్ పర్యవేక్షిస్తారు. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్‌ఎఫ్ భద్రత అందిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీ నియామకం
ఎప్పుడు : మే 3
ఎవరు : ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్
ఎక్కడ : దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానశ్రయాలు
అత్యంత శక్తిమంతుల్లో మోదీకి 9వ ర్యాంకు
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి 9వ ర్యాంకు దక్కింది. ఈ జాబితాలో తొలిసారిగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ గతిని మార్చిన 75 మంది ప్రముఖులతో ఫోర్బ్స్ 2018 జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ 13, బ్రిటన్ ప్రధాని థెరిసా మే 14, చైనా ప్రధాని లీకెకియాంగ్ 15, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ 24, రిలయన్‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 32, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 40వ ర్యాంకుల్లో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత శక్తిమంతుల్లో మోదీకి 9వ ర్యాంకు
ఎప్పుడు : మే 9
ఎవరు : ఫోర్బ్స్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఆసారాం బాపుకు జీవిత ఖైదు
పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో స్వామీజీ ఆసారాం బాపు (77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013లో ఓ మైనర్ బాలిక తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఆసారాం జోధ్‌పూర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సింధ్ ప్రావిన్సులోని బెరానీ గ్రామంలో 1941, ఏప్రిల్ 17న జన్మించిన ఆసారాం అసలు పేరు అసుమల్ తౌమల్ హర్‌పలాని. 1947లో దేశ విభజన తర్వాత ఆసారాం కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వలసవచ్చింది. నాలుగో తరగతి వరకు చదువుకున్న ఆసారాం గుజరాత్‌లోని మొతెరాలో సబర్మతి నదీతీరాన ‘మోక్ష కుటీర్’ పేరుతో చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసారంకు 400 ఆశ్రమాలు, రెండు కోట్ల మంది అనుచరులు రూ.10,000 కోట్ల సంపద ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసారాం బాపుకు జీవిత ఖైదు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎందుకు : పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో
మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం టు సోషలిజం పుస్తకావిష్కరణ
ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 26న ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్ హనుమంతరావు రాసిన ‘మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమోరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్’ పుస్తకావిష్కరణ సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఏప్రిల్ 26న ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టుకు ఒక మహిళా న్యాయవాది నేరుగా ఎంపికవడం ఇదే మొదటిసారి. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి మాత్రమే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు.
అదే విధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్(59)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని కోరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇందూ మల్హోత్రా నియామకానికి ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
కిలిమంజారోని అధిరోహించిన ఏడేళ్ల బాలుడు
ఆఫ్రికాలోని కిలిమంజారో (5,380 మీటర్లు) పర్వతాన్ని ఏడేళ్ల సమన్యు యాదవ్ ఏప్రిల్ 2న అధిరోహించాడు. దీంతో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పాడు. అమెరికాకు చెందిన క్యాష్ అనే బాలుడి పేరిట ఉన్న ఈ రికార్డును మూడో తరగతి చదువుతున్న సమన్యు అధిగమించాడు. కర్నూలుకి చెందిన సమన్యు ఇప్పటికే మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా అధిరోహించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కిలిమంజారోని అధిరోహించిన ఏడేళ్ల బాలుడు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : సమన్యు యాదవ్
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ రెడ్డి
సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కొల్లాంలో ఏపిల్ 29న పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులు గల కంట్రోల్ మిషన్‌ను ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు (1998-99, 2004-09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : సురవరం సుధాకర్ రెడ్డి
ఎక్కడ : కొల్లాం, కేరళ
మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాబూరావు కన్నుమూత
మత్స్యకార సంఘం జాతీయ అధ్యక్షుడు రేవు బాబూరావు(77) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 28న విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు. బాబూరావు కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ డెరైక్టర్‌గా కూడా ఉన్నారు. ఆయన భార్య రేవు రత్నకూమారి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మత్స్యకార సంఘం జాతీయ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : రేవు బాబూరావు
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు : అనారోగ్యం కారణంగా
సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎంగా చామ్లింగ్
సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎంగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఏప్రిల్ 28న రికార్డు సృష్టించారు. 1994 డిసెంబర్ 12న తొలిసారి సిక్కిం ముఖ్యమంత్రిగా చామ్లింగ్ ఎన్నికయ్యారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)ని వరుసగా ఐదుస్లారు(1994, 1999, 2004, 2009, 2014) అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఈ ఘనత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు( 23 ఏళ్లకు పైనే- 8,540 రోజులు) ఐదుసార్లు పశ్చిమబెంగాల్ సీఎంగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్
ఐఆర్‌డీఏ చైర్మన్‌గా సుభాష్ చంద్ర
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. 1981 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి సుభాష్ చంద్ర గతంలో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఐఆర్‌డీఏ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన టి.ఎస్.విజయన్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఆర్‌డీఏ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 1
ఎవరు : సుభాష్ చంద్ర కుంతియా
పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున ఖర్గే
పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అధ్యక్షునిగా లోక్‌సభ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మే 2న ప్రకటించారు. 22 మంది సభ్యులు గల ఈ కమిటీ ప్రభుత్వ ఖర్చులు పార్లమెంట్ కేటాయింపులకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. అంచనాల కమిటీకి బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీని, పబ్లిక్ అండర్‌టేకింగ్‌స కమిటీకి శాంతకుమార్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీటు ఏడాదిపాటు కొనసాగుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఏసీ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 1
ఎవరు : మల్లిఖార్జున ఖర్గే
ఆర్థిక వేత్త అశోక్ మిత్రా కన్నుమూత
ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్ మిత్రా (90) అనారోగ్యంతో మే 2న కన్నుమూశారు. మిత్రా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. జ్యోతిబసు పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు పదేళ్లు ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సాహిత్య రంగానికి చేసిన కృషికిగాను మిత్రాకి సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్థిక వేత్త అశోక్ మిత్రా కన్నుమూత
ఎప్పుడు : మే 1
ఎందుకు : అనారోగ్యంతో