Skip to main content

మార్చి 2021 వ్యక్తులు

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎస్‌?
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందిన నీలం సాహ్ని రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా ఖరారయ్యారు. ఈ మేరకు ఆమె నియామకానికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మార్చి 26న ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.
ఇదే తొలిసారి...
1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన నీలం సాహ్ని 2019 నవంబర్‌ 15 నుంచి 2020 డిసెంబర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా పని చేశారు. ప్రస్తుతం క్యాబినెట్‌ హోదాలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే ఎస్‌ఈసీ పదవి చేపట్టే నాటికి ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఓ మహిళ నియమితులవ్వడం ఇదే తొలిసారి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎస్‌?
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : నీలం సాహ్ని
ఎందుకు : ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో

ఎంఅండ్‌ఎం నూతన సీఈఓగా నియమితులైన వ్యక్తి?
ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) నూతన ఎండీ, సీఈవోగా అనీష్‌ షా నియమితులయ్యారు. తద్వారా ఎంఅండ్‌ఎం గ్రూప్‌ చరిత్రలో తొలిసారి వృత్తిగత నిపుణుడిని సీఈవోగా ఎన్నుకున్నట్లయ్యింది. ప్రస్తుతం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్‌ గోయెంకా స్థానంలో అనీష్‌ బాధ్యతలు చేపట్టనున్నారని మార్చి 26న కంపెనీ తెలిపింది. 2021 ఏప్రిల్‌ 2న గోయెంకా పదవీ విరమణ చేయనున్నారు. అనీష్‌ షా ప్రస్తుతం ఎంఅండ్‌ఎం కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూప్‌ సీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు.
టాటా–మిస్త్రీ వివాదానికి తెర...
దేశీ కార్పొరేట్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్‌పీ గ్రూప్‌ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ మార్చి 26న సూచించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) నూతన ఎండీ, సీఈవోగా నియామకం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : అనీష్‌ షా
ఎందుకు : ప్రస్తుతం ఎంఅండ్‌ఎం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్‌ గోయెంకా ఏప్రిల్‌ 2న పదవీ విరమణ చేయనుండటంతో

సీఐఐ మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా షాలిని...
సీఐఐ మహిళా విభాగం దక్షిణాది చైర్‌పర్సన్‌గా (ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌) ఫెడరల్‌ బ్యాంకు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, ఈడీ షాలిని వారియర్‌ 2021–22 సంవత్సరానికి నియమితులయ్యారు. ఫెడరల్‌ బ్యాంకు రిటైల్‌ విభాగం హెడ్‌గానూ షాలిని వారియర్‌ పనిచేస్తున్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సభ్యురాలుగానూ పనిచేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన అగ్రికల్చర్‌ ఇన్‌ ఇండియా పుస్తక రచయిత?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) మోహన్‌ కందా రచించిన ‘అగ్రికల్చర్‌ ఇన్‌ ఇండియా: కాంటెంపరరీ చాలెంజెస్‌–ఇన్‌ ద కాంటెక్ట్స్‌ ఆఫ్‌ డబ్లింగ్‌ ఫార్మర్స్‌ ఇన్‌కమ్‌’పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. మార్చి 31న హైదరాబాద్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... కరోనా కాలంలో వ్యవసాయ ఉత్పత్తులను రికార్డు స్థాయిలో పండించి, మన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్న రైతులు కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్లేనని వ్యాఖ్యానించారు.
పోలూరి పురస్కారానికి ఆమోదం...
తన గురువు పోలూరి హనుమ జానకీరామ శర్మ పేరుతో తెలుగు భాషా పురస్కారం ఏర్పాటు చేసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆమోదం తెలిపారు.
కొన్ని పుస్తకాలు–రచయితలు

రచయిత

పుస్తకం

పిల్లలమర్రి పినవీరభద్రుడు

శృంగార శాకుంతలము

శ్రీ కృష్ణదేవరాయలు

ఆముక్త మాల్యద

అల్లసాని పెద్దన

మనుచరిత్రము

నంది తిమ్మన

పారిజాతాపహరణము

ధూర్జటి

కాళహస్తి మహాత్మ్యము

మొల్ల

మొల్ల రామాయణం

అయ్యలరాజు రామభద్రుడు

రామాభ్యుదయము

మాదయగారి మల్లన

రాజశేఖర చరిత్ర

తాళ్ళపాక చిన్నన్న

పరమయోగి విలాసము

పింగళి సూరన

కళాపూర్ణోదయము

సంకుసాల నృసింహకవి

కవికర్ణ రసాయనము

తెనాలి రామకృష్ణ

పాండురంగ మహాత్మ్యము

భట్టుకవి (రామరాజభూషణుడు)

వసుచరిత్ర

కందుకూరు రుద్రకవి

నిరంకుశోపాఖ్యానము

సారంగు తమ్మయ

వైజయంతీ విలాసము

విశ్వనాథనాయని స్థానాపతి

రాయ వాచకం

చేమకూరి వెంకటకవి

విజయ విలాసము

రంగాజమ్మ

మన్నారుదాస విలాసం

ముద్దు పళని

రాధికా సాంత్వనము

కంటింటి పాపరాజు

ఉత్తర రామాయణము

తరిగొండ వెంకమాంబ

వేంకటాచల మహాత్మ్యము

క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అగ్రికల్చర్‌ ఇన్‌ ఇండియా: కాం టెంపరరీ చాలెంజెస్‌–ఇన్‌ ద కాంటెక్ట్స్‌ ఆఫ్‌ డబ్లింగ్‌ ఫార్మర్స్‌ ఇన్‌కమ్‌ పుస్తాకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్‌

బ్రిక్స్‌ సీసీఐ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన క్రీడాకారిణి?
వాణిజ్య ప్రోత్సాహక అంతర్జాతీయ సంస్థ బ్రిక్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ (2021–22)గా హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు సృష్టి జూపూడి నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. సీసీఐ అంబాసిడర్‌గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాల్లో ఎంఎస్‌ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ఏర్పాటులో జూపూడి కీలకపాత్ర పోషించనున్నారు.
సామాజిక మార్గం వైపు...
జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచ మాజీ ఛాంపియన్‌ సృష్టి జూపూడి పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందారు. సంపూర్ణ నైపుణ్యం సాధించాలంటే పదివేల గంటల శిక్షణ అవసరం అని నిర్వచించే మాల్కమ్‌ గ్లాడ్‌వెల్‌ ‘10, 000గంటల నిబంధన’ను ఆమె సాధించారు. జూనియర్‌ విభాగంలో టాపర్‌గా ఉన్న సమయంలోనే బ్యాడ్మింటన్‌కు విరామమిచ్చి సామాజిక మార్గాన్ని ఎంచుకున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ (2021–22)గా నియమితులైన క్రీడాకారుడు?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : సృష్టి జూపూడి
ఎందుకు : బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాల్లో ఎంఎస్‌ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించేందుకు

కోవిడ్‌ బారిన మాజీ ప్రధాని దంపతులు
జేడీఎస్‌ అధినేత, భారతదేశవ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకు మార్చి 31న పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరూ బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది.
కోవిషీల్డ్‌ షెల్ఫ్‌లైఫ్‌ ఇక 9 నెలలు...
ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా ‘కోవిషీల్డ్‌’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్‌లైఫ్‌ను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్‌లైఫ్‌ అంటారు. ఈ టీకాను భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
దేవెగౌడ ఏ సమయంలో భారత ప్రధానిగా ఉన్నారు?

దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డు జడ్జి?
ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా రిటైర్డు జిల్లా జడ్జి కేవీఎల్‌ హరినాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరినాథ్‌ బాధ్యతలు చేపట్టే రోజు నుంచి మూడేళ్ల పాటు గానీ, లేదంటే అతనికి 65 ఏళ్ల వయస్సు నిండే వరకు ఏది ముందు అయితే ఆ మేరకు ఆ విధుల్లో కొనసాగుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస రావు ఉన్నారు.

ఎస్‌ఆర్‌ఎం ప్రొఫెసర్‌కు రూ.1.10 కోట్ల డీబీటీ ప్రాజెక్టు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ బయాలజీ విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సి.దుర్గారావుకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ పరిశోధన ప్రాజెక్టు లభించింది. జంతు సంబంధ రోటా వైరస్‌ కంటే వేగంగా మానవ రోటా వైరస్‌ను సెల్‌ కల్చర్‌లో అభివృద్ధి చేయడం కోసం అవసరమైన పరిశోధనలు నిర్వహించేందుకు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) రూ.1.10 కోట్లు విడుదల చేసింది. మూడేళ్ల పాటు సాగే ఈ పరిశోధన వలన భవిష్యత్తులో ఏదైనా వ్యాధికి కనుగొనే వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తక్కువ ధరకే అది లభించే అవకాశం ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డు జడ్జి?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : రిటైర్డు జిల్లా జడ్జి కేవీఎల్‌ హరినాథ్

పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ?
Current Affairs
భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లోనే ఈదారు. శ్రీలంక తీరం నుంచి మార్చి 19న ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సా. 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్‌కోటి చేరుకున్నారు. పాక్‌ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా కూడా శ్యామల నిలిచారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌ నేర్చుకున్నారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఆమె తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్‌ లిఫ్టర్‌.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ?
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : గోలి శ్యామల
ఎక్కడ : పాక్‌ జలసంధి, భారత్, శ్రీలంకల మధ్య

టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన మహిళ?
ఆఫ్రికా దేశమైన టాంజానియాకు కొత్త అధ్యక్షురాలిగా సమియా సులుహు హసన్‌ నియమితులయ్యారు. మార్చి 19న టాంజానియాలోని దారెస్సలాంలో అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన 61 ఏళ్ల సమియా ఆ పదవిని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. హిజాబ్‌ ధరించి, ఖురాన్‌ చేతబట్టి, చీఫ్‌ జస్టిస్‌ ఇబ్రహీం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు ముందుగా పని చేసిన అధ్యక్షుడు జాన్‌ మగుఫులి గుండెపోటుతో కన్నుమూయడంతో అధ్యక్ష నియామకం తప్పనిసరైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : సమియా సులుహు
ఎక్కడ : దారెస్సలాం, టాంజానియా

ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించిన ఫ్రాంటియర్‌ పుస్తక రచయిత?
సీనియర్‌ జర్నలిస్ట్‌ రెహనా రచించిన ఫ్రాంటియర్‌ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. మార్చి 19న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవోగా మురళీధరన్‌
ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవోగా కే మురళీధరన్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇతను పుదుచ్చేరిలోని కరైకల్‌ పోర్టు సీఈవోగా ఉన్నారు. పోర్టు రంగంలో అపార అనుభవం గడించారు. ప్రస్తుతం మారిటైమ్‌ బోర్డు సీఈవోగా ఉన్న ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయి అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన పీపుల్‌ క్లోజర్‌ పుస్తకాన్ని ఎవరు రచించారు?
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఎం.రామచంద్రన్‌ రచించిన ‘బ్రింగింగ్‌ గవర్నమెంట్స్‌ అండ్‌ పీపుల్‌ క్లోజర్‌’ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మార్చి 20న వర్చువల్‌ విధానం ద్వారా ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ కార్యకలాపాలను సౌకర్యవంతంగా, పారదర్శకంగా పొందాలని ప్రజలు భావిస్తారన్న రచయిత అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని, ఈ సదుపాయాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.

విదేశీ ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌
చరిత్రలో తొలిసారి విదేశాలకు చెందిన ప్రేక్షకుల్లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహంచనున్నారు. కోవిడ్‌–19 కారణంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌ను విదేశీ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.

నటుడు సోనూ సూద్‌కు స్పైస్‌ జెట్‌ అరుదైన గౌరవం
సినీ నటుడు సోనూ సూద్‌... కరోనా కష్టకాలంలో ప్రజలకు చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ బోయింగ్‌–737 రకం విమానం మీద ఆయన బొమ్మను వేశారు. ఆ బొమ్మకు ‘ఏ సెల్యూట్‌ టూ సేవియర్‌ సోనూసూద్‌’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఇలా ఒక దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.

ఖాకీ బతుకులు నవలను రచించిన రచయిత?
స్పార్టకస్‌ కలం పేరుతో పోలీస్‌ వ్యవస్థలోని మరో కోణాన్ని ‘ఖాకీ బతుకులు’ నవలగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్‌శాఖలో సంచలనం రేపిన విశ్రాంత హెడ్‌ కానిస్టేబుల్‌ గంటినపాటి మోహనరావు(68) కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి పోలీస్‌ క్వార్టర్స్‌లోని నివాసంలో మార్చి 21న ఆయన తుదిశ్వాస విడిచారు. తెనాలిలో ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 1980–83 మధ్యకాలంలో మోహనరావు ‘ఖాకీ బతుకులు’ నవల రాశారు. 1940–75 మధ్య పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలతో రాసిన ఈ నవల, 1996లో పుస్తకరూపం దాల్చింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఖాకీ బతుకులు నవలను రచించిన రచయిత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : గంటినపాటి మోహనరావు(68)
ఎక్కడ : తెనాలి, గుంటూరు జిల్లా

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా నియమితులు కానున్న న్యాయమూర్తి?
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం పొందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుంది.
తెలుగువారిలో రెండో వ్యక్తి...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ రమణ ఆ పదవి పొందిన తెలుగు వారిలో రెండో వ్యక్తి. అంతకుముందు జస్టిస్‌ కోకా సుబ్బారావు (జూన్‌ 30, 1966– ఏప్రిల్‌ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు తదుపరి సీజేగా నియమితులు కానున్న న్యాయమూర్తి?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ
ఎందుకు : ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుండటంతో...

ఏపీ హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్‌ న్యాయమూర్తి?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి మార్చి 24న బాధ్యతలు చేపట్టారు. అలాగే కమిషన్‌ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్‌), న్యాయవాది డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడిషియల్‌) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ సీతారామమూర్తి, సుబ్రహ్మణ్యంలు హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టగా, శ్రీనివాసరావు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1958, జనవరి 16న న్యాయవాదుల కుటుంబంలో సీతారామమూర్తి జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. లా ఆఫ్‌ టార్ట్స్‌లో బంగారు పతకం సాధించారు. 1996లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ... 2013, అక్టోబర్‌ 23న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016, మార్చి 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2020, జనవరి 15న హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు:
గుంటూరు జిల్లా నంబూరుకి చెందిన శ్రీనివాసరావు హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. మానవ హక్కులపై ఆయన రాసిన పలు ఆర్టికల్స్‌ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
దండి సుబ్రహ్మణ్యం:
కర్నూలు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం 1955, ఆగస్టు 8న జన్మించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2005లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. జిల్లా జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శిగా, ఏపీ మానవహక్కుల కమిషన్‌ కార్యదర్శిగానూ ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి
ఎక్కడ : హైదరాబాద్

బ్రహ్మకుమారీస్‌ చీఫ్‌ దాది హృదయ్‌ మోహిని ఇక లేరు
Current Affairs
ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలు రాజయోగిని దాది హృదయ్‌ మోహిని(93) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మార్చి 11న ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బ్రహ్మకుమారీస్‌ మాజీ చీఫ్‌ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత హృదయ్‌ దాది మోహినిని చీఫ్‌గా నియమించారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన మోహిని ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి. అనేక దేశాల ఆహ్వానం మేరకు దాది మోహిని తూర్పునుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించి, ఉపన్యాసాలు ఇచ్చారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్‌ అధ్యక్షురాలు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రాజయోగిని దాది హృదయ్‌ మోహిని(93)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ప్రధాని మోదీ ఆవిష్కరించిన తమిళ భగవద్గీత గ్రంథ రచయిత?
స్వామి చిద్భవానంద తమిళ భాషలో రచించిన భగవద్గీత ఈ–బుక్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 11న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. భారత్‌ స్వావలంబన సాధించడం(ఆత్మనిర్భర్‌) ప్రపంచానికి కూడా మేలు ఎంతో చేస్తుందని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. సంపద సృష్టించడం, మానవాళికి విలువనివ్వడం అనేవి ఆత్మనిర్భర్‌ భారత్‌లోని కీలకాంశాలని చెప్పారు.
యూనియన్‌ బ్యాంక్‌ ఈడీగా నితేశ్‌...
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నితేశ్‌ రంజన్‌ (44) బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. రంజన్‌ అంతక్రితం యూనియన్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. ట్రెజరీ ఆపరేషన్స్‌ హెడ్‌గా, చీఫ్‌ ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గానూ గతంలో బాధ్యతలు నిర్వహించారు.
 
  • యూబీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
  • ప్రస్తుతం యూబీఐ సీఈవోగా జి.రాజ్‌ కిరణ్‌ రాయ్‌ ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : స్వామి చిద్భవానంద తమిళ భాషలో రచించిన భగవద్గీత ఈ–బుక్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్‌ విధానంలో

యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌లో చోటు దక్కించుకున్న హైదరాబాదీ?
యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ (వైజీఎల్‌)లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్‌కు చెందిన బోలంట్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ అండ్‌ సీఈఓ శ్రీకాంత్‌ బొల్లా ఎంపికయ్యారు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బ్రెయిన్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్‌ 2012లో హైదరాబాద్‌ కేంద్రంగా పర్యావరణహితమైన ప్యాకేజింగ్‌ కంపెనీ బోలంట్‌ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఇందులో పనిచేసేవారంతా ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవారే.
దేశంలో మొదటి విద్యార్థి కూడా...
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్‌ బొల్లా హైదరాబాద్‌లోని దేవ్‌నార్‌ బ్లైండ్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మన దేశంలో ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ స్ట్రీమ్‌ అధ్యయనం చేసిన మొదటి విద్యార్థి కూడా శ్రీకాంతే.
దీపికా పదుకొనే కూడా...
వైజీఎల్‌–2021లో బెంగళూరు కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే లైవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే కూడా ఎంపికయ్యారు.
అరిజ్‌ ఖాన్‌కు ఉరి శిక్ష
2008 నాటి బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అరిజ్‌ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మను చంపినందుకు అతడికి ఈ శిక్షను ఖరారు చేసింది. అరిజ్‌ చేసిన నేరం గరిష్ట శిక్ష విధించేందుకు వీలు కల్పించే అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిని మరణించే వరకూ ఉరికి వేలాడదీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి సందీప్‌ యాదవ్‌ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అరిజ్‌ ఖాన్‌కు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షలను తక్షణమే మోహన్‌చంద్‌ శర్మ కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది.
కేసు వివ‌రాలు..
  • 2008 సెప్టెంబర్‌ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. 39 మంది మృతి, 159 మందికి గాయాలు.
  • 2008 సెప్టెంబర్‌ 19: దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.
  • 2009 జూలై 3: అరిజ్‌ ఖాన్, షాజాద్‌ అహ్మద్‌ను నిందితులుగా ప్రకటించిన న్యాయస్థానం.
  • 2010 ఫిబ్రవరి 2: యూపీలోని లక్నోలో షాజాద్‌ అహ్మద్‌ అరెస్టు.
  • 2010 అక్టోబర్‌ 1: ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ.
  • 2013 జూలై 30: షాజాద్‌ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు.
  • 2018 ఫిబ్రవరి 14: అరిజ్‌ ఖాన్‌ అరెస్టు.
  • 2021 మార్చి 8: హత్య, ఇతర నేరాల్లో అరిజ్‌ ఖాన్‌ దోషిగా గుర్తింపు.
  • 2021 మార్చి 15: అరిజ్‌కు మరణ శిక్ష

ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ రాజీనామా

ప్రధాన మంత్రి మోదీ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా ఉన్న పి.కె. సిన్హా బాధ్యతల నుంచి వైదొలిగారని అధికార వర్గాలు మార్చి 16వ తేదీన తెలిపాయి. 1977 బ్యాచ్‌ రిటైర్డు ఐఏఎస్‌ అధికారి అయిన సిన్హా, కొద్దికాలం పాటు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా బాధ్యతలు చేపట్టారు. 2019 సెప్టెంబర్‌ నుంచి ప్రధాని ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు, కేబినెట్‌ సెక్రటరీగా నాలుగేళ్లపాటు పనిచేశారు. ప్రధాని పదవిలో మోదీ కొనసాగినంత కాలం లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా ఉంటారని ఆయన నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఏపీ హెచ్చార్సీ చైర్మన్‌గా ఎంపికైన రిటైర్డ్‌ న్యాయమూర్తి?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ఎంపికయ్యారు. అలాగే కమిషన్‌ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్‌), న్యాయవాది డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడిషియల్‌) ఎంపికయ్యారు. మార్చి 17న సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన... సమావేశమైన ఎంపిక కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఎంపిక కమిటీలో శాసనమండలి చైర్మన్‌ షరీఫ్, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోం మంత్రి మేకతోటి సుచరిత సభ్యులుగా ఉన్నారు. ఎంపిక చేసిన వారి పేర్లను తదుపరి ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రభుత్వం పంపించనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చైర్మన్‌గా ఎంపిక
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి

స్టాప్‌ టీబీ పార్ట్‌నర్‌షిప్‌ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన భారతీయుడు?
ప్రపంచవ్యాప్తంగా క్షయ నిర్మూలనకు కృషి చేస్తున్న ‘‘స్టాప్‌ టీబీ పార్ట్‌నర్‌షిప్‌ బోర్డు’’ చైర్మన్‌గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సంస్థకు హర్షవర్ధన్‌ 2021, జూలై నుంచి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని బోర్డ్‌ ఆఫ్‌ స్టాప్‌ టీబీ పార్ట్‌నర్‌ షిప్‌ తెలిపింది. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి నిర్మూలనకు అవసరమైన వైద్య, సామాజిక నైపుణ్యాన్ని బోర్డు టీబీ పార్ట్‌నర్‌షిప్‌ బోర్డు అందిస్తుంది. భారత్‌లో 2025 నాటికి క్షయ వ్యాధిని తరిమికొట్టాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : స్టాప్‌ టీబీ పార్ట్‌నర్‌షిప్‌ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన భారతీయుడు?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేసేందుకు

మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమా పేరు?
Current Affairs
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ‘ఏక్‌ ఔర్‌ నరేన్‌’ పేరుతో ఒక సినిమా రూపొందనుంది. ‘మహాభారత్‌’ ఫేమ్‌ గజేంద్ర చౌహాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ 2021, మార్చి 12 నుంచి ప్రారంభం కానుందని చిత్ర దర్శకుడు మిలాన్‌ భౌమిక్‌ మార్చి 4న తెలిపారు. ఈ చిత్రంలో రెండు పార్శా్వలు ఉంటాయని, స్వామి వివేకానంద జీవితం, ఆయన బోధనల గురించి ఒకవైపు చెబుతూనే, మరోవైపు ప్రధాని మోదీ జీవితం, దేశాభివృద్ధిలో ఆయనకున్న విజన్‌ను ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామన్నారు.
భారత్‌ను అత్యంత ప్రభావితం చేసిన ఇద్దరు నరేంద్రుల జీవితమే ఏక్‌ ఔర్‌ నరేన్‌ సినిమా అని మిలాన్‌ వివరించారు. కోల్‌కతా, గుజరాత్‌లో షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రాన్ని 2021, సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు కానుకగా విడుదల చేస్తామని తెలిపారు.
గతంలో...
ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం 2019, మే 24న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా, వివేక్‌ ఒబెరాయ్, బొమన్‌ ఇరానీ తదితరులు నటించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏక్‌ ఔర్‌ నరేన్‌ పేరుతో సినిమా రూపకల్పన
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : చిత్ర దర్శకుడు మిలాన్‌ భౌమిక్‌
ఎందుకు : స్వామి వివేకానంద బోధనల గురించి ఒకవైపు చెబుతూనే, మరోవైపు ప్రధాని మోదీ జీవితం, దేశాభివృద్ధిలో ఆయనకున్న విజన్‌ను ఆవిష్కరించేందుకు

ఏపీఆర్‌ఏసీఏ చైర్మన్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి?
ఆసియా–పసిఫిక్‌ రూరల్‌ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఏసీఏ) చైర్మన్‌గా నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవింద రాజులు నియమితులయ్యారు. మార్చి 5న ఢిల్లీలో వర్చువల్‌ విధానం ద్వారా జరిగిన 73వ ఎక్స్‌కామ్, 22వ ఏపీఆర్‌ఏసీఏ జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఏపీఆర్‌ఏసీఏ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ పదవిని అధిరోహించిన తొలి తెలుగువాడిగా, రెండో భారతీయుడిగా డాక్టర్‌ చింతల గుర్తింపు పొందారు. రెండేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు.
బ్యాంకాక్‌ ప్రధాన కేంద్రంగా...
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సెంట్రల్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులతోపాటు పలు ఏజెన్సీలు ఏపీఆర్‌ఏసీఏ పరిధిలో ఉన్నాయి. 1977లో ఏర్పడిన ఏపీఆర్‌ఏసీఏ.. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోని ఐదు ఆర్‌ఏసీఏల్లో ఇదే అతిపెద్దది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆసియా–పసిఫిక్‌ రూరల్‌ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఏసీఏ) చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవింద రాజులు

భారత్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ నికొలాయ్‌ కన్నుమూత
భారత్‌ అథ్లెటిక్స్‌ (మిడిల్‌ అండ్‌ లాంగ్‌ డిస్టెన్స్‌) కోచ్‌ నికొలాయ్‌ స్నెసరెవ్‌ మార్చి 5న అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. బెలారస్‌కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్‌... పాటియాలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌)లోని తన హాస్టల్‌ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్‌ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు.
2005లో తొలిసారి భారత కోచ్‌గా స్నెసరెవ్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే భారత అథ్లెటిక్స్‌ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మార్చి 2వ తేదీనే భారత్‌కు వచ్చారు.
బెలారస్‌ రాజధాని: మిన్‌స్క్‌; కరెన్సీ: బెలారసియన్‌ రూబుల్‌
బెలారస్‌ ప్రస్తుత అధ్యక్షుడు: అలెగ్జాండర్‌ లుకాషెంకో
బెలారస్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: రోమన్‌ గోలోవ్చెంకో
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్‌ అథ్లెటిక్స్‌ (మిడిల్‌ అండ్‌ లాంగ్‌ డిస్టెన్స్‌) కోచ్‌ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : నికొలాయ్‌ స్నెసరెవ్‌
ఎక్కడ : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌), పాటియాలా, పంజాబ్‌

ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చి 9న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1933 ఫిబ్రవరి 22న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో జన్మించిన అన్నపరెడ్డి బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1991లో సోషియాలజీ లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన అనంతరం 30 గ్రంథాలు రచించారు. తెలుగు ప్రజలకు ‘ఫ్రాయిడ్‌’ను, మనోవిజ్ఞాన శాస్త్రాలను పరిచయం చేశారు.
కళారత్న పురస్కారం...
2000–2002 మధ్యకాలంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సీనియర్‌ ఫెలోషిప్‌తో ‘తెలుగు సాహిత్యంపై బౌద్దం ప్రభావం’ అంశంపై అన్నపరెడ్డి పరిశోధన చేశారు. ఆయన జరిపిన సాహితీకృషికి గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది.
అన్నపరెడ్డి రచనల్లో కొన్ని: ‘సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌’, మానవీయ బుద్ధ, చింతనాగ్ని, కొడిగట్టినవేళ, ఆచార్య నాగార్జునుడు, మేధావుల మెతకలు, బుద్ధదర్శనం (అనువాదం), ‘బుద్ధుని సూత్రసముచ్చయం’(సుత్తనిపాతానువాదం).
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88)
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా
ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మార్చి 9న తన పదవికి రాజీనామా చేశారు. డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. రాష్ట్ర పాలనను మరొకరు చేపట్టాలని తమ పార్టీ(బీజేపీ) నిర్ణయించిందని రావత్‌ తెలిపారు. 2017, మార్చి 18న రావత్‌ ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్‌ నేత ఎన్‌డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్‌ ప్రత్యేకత.
ఉత్తరాఖండ్‌...
అవతరణ: నవంబర్‌ 9, 2000లోఉత్తరాంచల్‌ ఏర్పడింది. 2007లో ఉత్తరాఖండ్‌గా పేరు మార్చారు.
రాజధాని: డెహ్రడూన్‌(వేసవి కాలం), గైర్‌సెయిన్‌(శీతా కాలం)
ప్రస్తుత గవర్నర్‌: బేబీ రాణి మౌర్య
శాసనసభ సీట్లు: 70
లోక్‌సభ: 5
రాజ్యసభ: 3
హైకోర్టు: ఉత్తరాఖండ్‌ హైకోర్టు(నైనిటాల్‌లో ఉంది).
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : త్రివేంద్ర సింగ్‌ రావత్‌

ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటైంది. దీనితోపాటు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీలను, జిల్లా స్థాయి అమలు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మార్చి 10న ఉత్తర్వులు జారీ చేశారు.
చైర్మన్‌గా ముఖ్యమంత్రి...
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖాధికారి మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆక్వాకల్చర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు

ఆర్మీలో కెప్టెన్‌ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్‌ సభ్యుడు?
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌(46) ప్రాదేశిక సైన్యం(టెరిటోరియల్‌ ఆర్మీ)లో కెప్టెన్‌ అయ్యారు. దీంతో ఈ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్‌ సభ్యునిగా ఆయన రికార్డు సృష్టించారు. 124 సిఖ్‌ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా అనురాగ్‌ పదోన్నతి పొందారు. 2016 జూలైలో ఆయన ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్‌గా మొదటి బాధ్యతలు చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అనురాగ్‌ హమీర్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు.
అత్యవసర సమయాల్లో దేశానికి సేవలందించేందుకు... స్వచ్ఛందంగా చేరే వారితో ఏర్పాటు చేసిన టెరిటోరియల్‌ ఆర్మీని ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆర్మీలో కెప్టెన్‌ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్‌ సభ్యుడు?
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?
ఉత్తరాఖండ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తీరథ్‌సింగ్‌ రావత్‌ (56) మార్చి 10న ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణం చేయించారు. తీరథ్‌సింగ్‌ ఒక్కరే ప్రమాణం చేశారు. ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అంతకుముందు ఆయనను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
పౌరీ గర్వాల్‌ నుంచి...
ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా తీరథ్‌సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013 నుంచి 2015 వరకూ ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : తీరథ్‌సింగ్‌ రావత్‌
ఎక్కడ : రాజ్‌భవన్, డెహ్రాడూన్‌

చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కార కమిటీకి నేతృత్వం వహించనున్న న్యాయమూర్తి?
దేశ వ్యాప్తంగా కోర్టుల్లో పేరుకుపోతున్న చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు... ఈ దిశలో మార్చి 10న కీలక చర్య తీసుకుంది. ఇందుకు సంబంధించి తగిన సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీకి బాంబే హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సి చవాన్‌ నేతృత్వం వహిస్తారు. మూడు నెలల్లో కమిటీ తన సిఫారసులను సమర్పించాల్సి ఉంటుంది.
భారీగా పేరుకుపోయిన నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రమెంట్‌ (ఎన్‌ఐ) యాక్ట్‌ కేసుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైనమార్గమని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం పేర్కొంది.

ప్రముఖ కథా రచయిత సింగమనేని కన్నుమూత
Current Affairs
రాయలసీమ అస్తిత్వ పోరాటాలకు సాహితీ పరిమళాలద్దిన ప్రముఖ కథా రచయిత, సాహితీ విమర్శకులు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ సంపాదకవర్గ సభ్యులు సింగమనేని నారాయణ (78) ఫిబ్రవరి 25న అనంతపురంలో కన్నుమూశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లిలో 1943 జూన్‌ 23న సింగమనేని జన్మించారు. తిరుపతిలోని ప్రాచ్య కళాశాలలో విద్వాన్‌ చదివిన ఆయన.. తెలుగు ఉపాధ్యాయునిగా 2001లో పదవీ విరమణ చేశారు.
కథకుడు, నవలా రచయితగా..
  • 1960లో ‘న్యాయమెక్కడ’ పేరుతో తొలికథ రచించిన సింగమనేని మొత్తం 43 కథలు రాశారు.
  • జూదం, సింగమనేని కథలు, అనంతం అనే కథా సంపుటాలను, సీమ కథలు, ఇనుపగజ్జెల తల్లి, తెలుగు కథలు–కథన రీతులు, తెలుగు కథ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
  • సంభాషణ అనే పేరుతో ఆయన రచించిన వ్యాస సంపుటి ఎంతోమందికి స్ఫూర్తినందించింది.
  • అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు నవలలు రాసి మెప్పించారు.
  • ‘సింగమనేని’ని 2017లో రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కథా రచయిత, సాహితీ విమర్శకులు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : సింగమనేని నారాయణ (78)
ఎక్కడ : అనంతపురం

విశ్వభారతం గ్రంథాన్ని రచించిన వారు?
బ్రహ్మశ్రీ, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన సంస్కృత మహాకావ్యం ‘విశ్వభారతం’గ్రంథాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని అవధాన సరస్వతీ పీఠం ప్రాంగణంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
అభిబస్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం
ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)లో ఇక నుంచి బస్‌ టికెట్లను కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ ఈ–టికెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అభిబస్, ఐఆర్‌సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది.
వార్తల్ని వాడుకుంటే..
ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌లు ఏదైనా మీడియా సంస్థకి చెందిన వార్తల్ని వాడుకుంటే వాటికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు న్యూస్‌ మీడియా(సవరణ) బిల్లుకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ఫిబ్రవరి 25న ఏకగ్రీవంగా ఆమోదించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బ్రహ్మశ్రీ, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన సంస్కృత మహాకావ్యం ‘విశ్వభారతం’గ్రంథావిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌
ఎక్కడ : హైదరాబాద్‌

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ సీఈవోగా నియమితులైన వ్యక్తి?
ప్రభుత్వరంగ సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఎండీ, సీఈవోగా జార్జ్‌ యేసు వేద విక్టర్‌ నియమితులయ్యారు. 2021, మార్చి 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన రాజేష్‌ త్రిపాఠి ఫిబ్రవరి 26 పదవీ విరమణ చేశారు.
దక్షిణాదిలో సీసీఐ కార్యాలయం
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ప్రాంతీయ కార్యాలయం చెన్నైలో ఏర్పాటైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీన్ని ఫిబ్రవరి 26న ప్రారంభించారు. సీసీఐకి న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. త్వరలో ముంబై, కోల్‌కతాలో కూడా ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుతం సీసీఐ చైర్మన్‌గా అశోక్‌ కుమార్‌ గుప్తా ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఎండీ, సీఈవోగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : జార్జ్‌ యేసు వేద విక్టర్‌
ఎందుకు : డీసీఐ ఎండీ, సీఈవోగా రాజేష్‌ త్రిపాఠి పదవీ విరమణ చేయడంతో

తూర్పు నౌకాదళాధిపతిగా నియమితులైన వైస్‌ అడ్మిరల్‌?
తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ నియమితులయ్యారు. నేవల్‌ డిఫెన్స్‌ అకాడమీలో విద్యనభ్యసించిన అజేంద్ర బహదూర్‌... 1983లో నౌకాదళంలో చేరారు. ప్రస్తుతం ఈఎన్‌సీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ న్యూఢిల్లీలోని సీఐఎస్‌సీకి ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌గా బదిలీ అయ్యారు.
మయన్మార్‌ సైన్యం కాల్పుల్లో 18 మంది మృతి
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 28న దేశంలో శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
మయన్మార్‌(బర్మా) రాజధాని: న్యేఫిడా(Naypyidaw)
మయన్మార్‌ కరెన్సీ: క్యాట్‌ (kyat)
మయన్మార్‌ అధికార భాష: బర్మీస్‌(Burmese)
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) అధిపతిగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌
ఎందుకు : ఈఎన్‌సీ చీఫ్‌గా ఉన్న వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ బదిలీ కావడంతో

జనరల్‌ ఝావోకి కీలక బాధ్యతలు
భారత సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) మాజీ ఉన్నతాధికారి జనరల్‌ ఝావో జాంగ్‌ఖిని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ)లోని విదేశీ వ్యవహారాల కమిటీకి డెప్యూటీ చైర్మన్‌గా చైనా నియమించింది. 2017 నాటి డోక్లాం వివాదం సమయంలో, 2020 నాటి లద్దాఖ్‌ ఉద్రిక్తతల సమయంలో జనరల్‌ ఝావో చైనా వెస్ట్రన్‌ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఎన్‌పీసీలోని ముఖ్యమైన బృందాల్లో విదేశీ వ్యవహారాల కమిటీ కూడా ఒకటి.

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు
అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీ (66)కి పారిస్‌లోని ఓ న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షాకాలాన్ని సర్కోజీ తన నివాసం నుంచే పూర్తి చేసే అవకాశం ఉంది. జాక్‌ షిరాక్‌ తర్వాత జైలు శిక్ష పడిన రెండో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సర్కోజీయే. 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా పనిచేసిన సర్కోజీ 2014లో ఓ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించేందుకు సీనియర్‌ మేజిస్ట్రేట్‌కు లంచం ఆశచూపారని కోర్టులో రుజువైంది.
ఫ్రాన్స్‌ రాజధాని: పారిస్‌; కరెన్సీ: యూరో, సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మానుయెల్‌ మాక్రాన్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్‌ కాస్టెక్స్‌
ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం పేరు: ఎలీసీ ప్యాలెస్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఎన్‌పీసీలోని విదేశీ వ్యవహారాల కమిటీకి డెప్యూటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : జనరల్‌ ఝావో జాంగ్‌ఖి
ఎక్కడ : చైనా

సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి?
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన ఎండీ, సీఈవోగా ఎం. వెంకటరావు మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఆయన కెనరా బ్యాంక్‌ ఈడీగా ఉన్నారు. కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ విలీనంలో కీలక పాత్ర పోషించారు. 1965 జూలై 3న జన్మించిన వెంకట రావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్‌ కళాశాలలో పీజీ పూర్తి చేశారు. 1988లో అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా అలహాబాద్‌ బ్యాంక్‌లో చేరారు. బ్యాంకు హోల్‌సేల్, రిటైల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌గా విధులు నిర్వర్తించారు. ఆస్తి–కేంద్రీకృత బ్యాంకింగ్‌గా అలహాబాద్‌ బ్యాంక్‌ను మలచడంలో ముఖ్య భూమిక పోషించారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యలయం భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన ఎండీ, సీఈవోగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : ఎం. వెంకటరావు
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీసీఐ) ఎండీ అండ్‌ సీఈవోగా డా.జీవైవీ విక్టర్‌ మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991లో డ్రెడ్జ్‌ క్యాడెట్‌గా డీసీఐలో చేరి వివిధ హోదాల్లో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. క్వాలిఫైడ్‌ లాయర్, ఫెలో ఇన్‌ ఆర్బిట్రేషన్‌ ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చాటుకున్నారు. డీసీఐ ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది.
రూ.11,870 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు...
నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధిని ప్రమోట్‌ చేస్తున్న సాగర్‌మాల డెవలప్‌మెంట్‌ కంపెనీ (ఎస్‌డీసీఎల్‌) వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో 48 ఒప్పందాలు చేసుకుంది. వీటి విలువ రూ.11,870 కోట్లు అని ఎస్‌డీసీఎల్‌ సంస్థ ఎండీ దిలీప్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. ఒప్పందాల్లో భాగంగా ఉత్పత్తి ఆధారిత గిడ్డంగుల అభివృద్ధి, ప్రత్యేక నౌకలను కార్యరూపంలోకి తీసుకురావడం, సముద్ర సంబంధ కార్యక్రమాలను చేపడతారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : డీసీఐ ఎండీ అండ్‌ సీఈవోగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : డా.జీవైవీ విక్టర్‌
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌

సన్సద్‌ టీవీ సీఈవోగా నియమితులైన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి?
లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేయాలని పార్లమెంట్‌లోని ఉభయ సభల అధ్యక్షులు నిర్ణయించారు. రెండింటిని కలిపి సన్సద్‌ టీవీగా ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చేందుకు రాజ్యసభ సభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అంగీకరించారు. ఇందుకు సంబంధించి లైసెన్సు కోసం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
సీఈవోగా రవి కపూర్‌...
సన్సద్‌ టీవీ సీఈవోగా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రవి కపూర్‌ను 2021, మార్చి 1వ తేదీ నుంచి ఏడాది కాలానికి నియమిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. రెండు చానెళ్లు విలీనం అయినప్పటికీ లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను ఇప్పటి మాదిరిగానే ప్రసారం చేస్తాయని, సంయుక్త సమావేశంలో ఒకే వేదికపై పనిచేస్తాయని రెండు సభల సెక్రటేరియట్‌ అధికారులు వివరించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సన్సద్‌ టీవీ సీఈవోగా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రవి కపూర్‌ నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : లోక్‌సభ సెక్రటేరియట్
Published date : 14 Apr 2021 02:23PM

Photo Stories