Skip to main content

మార్చి 2020 వ్యక్తులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా
Current Affairs
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మార్చి 20న తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మార్చి 20న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కమల్‌నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ 2018, డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : కమల్‌నాథ్
ఎందుకు : అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను తీహార్ జైలులో మార్చి 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి వరకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు మార్చి 19న స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు.

భారత ఫుట్‌బాల్ దిగ్గజం పీకే బెనర్జీ అస్తమయం
భారత ఫుట్‌బాల్ దిగ్గజం ప్రదీప్ కుమార్ (పీకే) బెనర్జీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 83 ఏళ్ల బెనర్జీ మార్చి 20న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. తన కెరీర్‌లో భారత్ తరఫున ఫ్రెండ్లీ తదితర మ్యాచ్‌లు కలుపుకొని ఓవరాల్‌గా 84 మ్యాచ్‌లాడిన బెనర్జీ 65 గోల్స్ చేశారు. 36 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్ సాధించాడు. స్ట్రయికర్‌గా... సారథిగా... కోచ్‌గా... ఐదు దశాబ్దాలు ఫుట్‌బాల్ కోసమే పరితపించారు.
క్రీడాకారుడిగా...
పశ్చిమ బెంగాల్‌లోని మొయినగురిలో 1936, జూన్ 23న జన్మించిన బెనర్జీ 1951లో తొలిసారి సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ ఆడారు. తదనంతర కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికై కీలక ఆటగాడిగా ఎదిగారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు నాయకత్వం వహించారు. అలాగే వరుసగా మూడు ఆసియా క్రీడల్లో (1958-టోక్యో, 1962-జకార్తా, 1966-బ్యాంకాక్) స్ట్రయికర్‌గా రాణించారు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం నెగ్గడం అదే చివరిసారి.
కోచ్‌గా...
క్రీడాకారుడిగా రిటైరైన బెనర్జీ 1970 నుంచి 1985 వరకు భారత జట్టుకు కోచ్‌గా సేవలందించారు. ఆయన భారత్ 1970 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గింది. ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు పతకం సాధించడం అదే చివరిసారి. భారత జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక ఆయన 2003 వరకు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్నారు.
తొలి అర్జున అవార్డు...
జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారుల్ని అవార్డులతో గుర్తించాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 1961లో ‘అర్జున’ అవార్డులు ఇవ్వడం మొదలైంది. ఫుట్‌బాల్ క్రీడాంశంలో తొలి అర్జున పొందింది బెనర్జీనే. 1990లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో ఆయనను ప్రభుత్వం గౌరవించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
భారత ఫుట్‌బాల్ దిగ్గజం అస్తమయం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ప్రదీప్ కుమార్ (పీకే) బెనర్జీ(83)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమబెంగాల్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లొరెంజో మృతి
ప్రపంచ ఫుట్‌బాల్‌లో విఖ్యాత క్లబ్‌గా పేరొందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లొరెంజో సాంజ్ మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చిక్సిత తీసుకుంటూ మార్చి 22న కన్నుమూశారు. 76 ఏళ్ల లొరెంజో 1995 నుంచి 2000 వరకు రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో రియల్ మాడ్రిడ్ జట్టు 1998, 2000లో ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
118 ఏళ్ల చరిత్ర ఉన్న రియల్ మాడ్రిడ్ క్లబ్ స్పెయిన్ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ లా లీగాలో 33 సార్లు... యూరోప్ దేశాల్లోని క్లబ్ జట్ల మధ్య జరిగే చాంపియన్స్ లీగ్ టోర్నీలో 13 సార్లు విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : లొరెంజో సాంజ్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా

ముఖ్యమంత్రి సలహాదారుగా ఆర్.ధనుంజయరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సలహాదారుగా ఆర్.ధనుంజయరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన కార్యక్రమాల విషయంలో ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షిలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.

పీఆర్ మాజీ డెరైక్టర్ నర్సింహారెడ్డి కన్నుమూత
సమాచార, పౌర సంబంధాల శాఖ మాజీ డెరైక్టర్ డా. పీవీ నర్సింహారెడ్డి (87) మార్చి 25న కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన రాత్రి 8.45 గంటల సమయంలో స్వగృహంలో మృతి చెందారు. యూజీసీ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ ప్రొఫెసర్‌గా, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షునిగా, సమాచార, పౌర సంబంధాలకు సంబంధించిన ఏకై క భారతీయ జర్నల్ ఎడిటర్‌గా ఆయన సేవలు అందించారు.

బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా
బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్ సోకింది. ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు మార్చి 25న తెలిపారు.
బ్రిటన్ రాజకుటుంబానికి పరీక్షలు:
బ్రిటన్ రాజ కుటుంబానికి మార్చి 23న కోవిడ్ పరీక్షలు నిర్వహించగా చార్లెస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన భార్య కెమిల్లాతో కలిసి స్కాట్లాండ్‌లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కెమిల్లాకు వ్యాధి లేనట్లు తేలింది.

భారత మాజీ ఫుట్‌బాలర్ అబ్దుల్ లతీఫ్ కన్నుమూత
గువాహటి: భారత దిగ్గజ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అబ్దుల్ లతీఫ్ కన్నుమూశారు. ఆయనకు 73 ఏళ్లు. దిగ్గజ ఆటగాడి మృతి పట్ల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) సంతాపం తెలిపింది. ‘అబ్దుల్ లతీఫ్ ఇక లేరు అనేది చాలా విచారకరం. భారత ఫుట్‌బాల్‌కు ఆయన చేసిన సేవలు మరువలేనివి’ అని ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షులు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. 1968లో బర్మాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లతీఫ్... 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించిన ఆయన జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీ (1966, 1968, 1970)లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు కోల్‌కతా విఖ్యాత క్లబ్‌లు మోహన్ బగాన్, మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్లకూ తన సేవలు అందించారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక మొహమ్మదాన్, అస్సాం జట్లకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఆయన శిక్షణలో అస్సాం జట్టు ఆటలో ఎంతో పురోగతి సాధించింది.

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ మార్చి 23న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆయనతో రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్ రికార్డు సృష్టించారు.
ఎన్‌పీఆర్, జనగణన వాయిదా
దేశమంతా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 1 నుంచి నిర్వహించాల్సిన జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్), మొదటి దశ జనగణనలు ఆగిపోయాయి. ఈ కార్యక్రమాలు మొదటి దశ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సి ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రెండు కార్యక్రమాలు నిలిచిపోతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : శివరాజ్ సింగ్ చౌహాన్

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్
Current Affairs
రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ మార్చి 12న ఆమోదించింది. 2020, ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను సమీక్షించనుంది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగేందుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : రష్యా పార్లమెంట్

 

తెలంగాణ సీఈవోగా శశాంక్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్ మార్చి 12న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న శశాంక్ సీఈవోగా ఎంపికైన విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా రజత్ స్థానంలో శశాంక్ బాధ్యతలు చేపట్టారు.
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శశాంక్ గతంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డెరైక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : శశాంక్ గోయల్

ఏపీ జెన్‌కో చైర్మన్‌గా సాయిప్రసాద్ నియామకం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ(ఏపీజెన్‌కో) బోర్డు చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మార్చి 11న ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాయిప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా ఉన్నారు. జెన్‌కో బోర్డు చైర్మన్‌గా ఇప్పటి వరకూ ట్రాన్స్‌కో ఎండీ శ్రీకాంత్ ఉన్నారు.
సీఎం వైఎస్ జగన్‌తో కెనడా కాన్సుల్ జనరల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్, కాన్సుల్ సీనియర్ ట్రేడ్ కమిషనర్ మార్క్ ష్రోటర్, ట్రేడ్ కమిషనర్ విక్రం జైన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో మార్చి 11న జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి సీఎం వారికి వివరించారు. వివిధ రంగాల్లో అవకాశాలను గుర్తించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని గిరార్డ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ(ఏపీజెన్‌కో) బోర్డు చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : జి. సాయిప్రసాద్

గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కెటరీనా
గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కెటరీనా సకెల్లార్‌పౌలూ మార్చి 13న ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ 19(కరోనా వైరస్) విజృంభణ కారణంగా అతికొద్ది మంది ఎంపీల సమక్షంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. 2020, జనవరిలో జరిగిన ఎన్నికల్లో 63 ఏళ్ల ఘన విజయం సాధించారు. కేటరీనా ఐదేళ్ల పాటు దేశాధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఆర్థిక సంక్షోభ పరిష్కారం, వాతావరణ మార్పులు, సామూహిక వలసల నిరోధంపై కృషి చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : కెటరీనా సకెల్లార్‌పౌలూ

యస్ బ్యాంక్ సీఈవో, ఎండీగా ప్రశాంత్ కుమార్
2020, మార్చి 13 నుంచి ‘యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020’ని అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం... సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌పై మార్చి 18న మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత బ్యాంక్ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మారటోరియం తొలగిన 7 రోజుల తర్వాత ప్రశాంత్ సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటుకానుంది.
నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సునీల్..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... యస్ బ్యాంక్ కొత్త బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లుగా ఉండనున్నారు.
2020, ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యస్ బ్యాంక్ సీఈవో, ఎండీగా నియామకం
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : ప్రశాంత్ కుమార్

సారస్వత సౌరభం గ్రంథావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘సారస్వత సౌరభం’ గ్రంథాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ హిందీ విభాగంలో మార్చి 14న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ... దేశంలో అన్ని భాషలకు సమ ప్రాధాన్యం అవసరమని అన్నారు. మనమంతా ఒకటేననే భావన కలిగించడానికి భాష ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సారస్వత సౌరభం గ్రంథావిష్కరణ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఎక్కడ : ఏయూ హిందీ విభాగం, విశాఖపట్నం

రాజ్యసభ సభ్యుడిగా మాజీ సీజేఐ జస్టిస్ గొగోయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. నామినేటెడ్ సభ్యుల కోటాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను నియమించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్ నామినేట్ అయ్యారు.
తొలి సీజేఐ...
రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ సీజేఐగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.
జస్టిస్ గొగోయ్...
అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గొగోయ్ 2001లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు 46వ సీజేఐగా 2018, అక్టోబర్ 3న ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 17న పదవీ విరమణ చేశారు. 2019, నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యసభకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు
నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు ది హెగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు. తమకు ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. దోషుల తరఫు లాయర్ ఏపీసింగ్ ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2020, మార్చి 20వ తేదీన దోషులు ముకేశ్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్‌గుప్తా(25), వినయ్ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మార్చి 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

జార్ఖండ్ నూతన డీజీపీగా విష్ణువర్ధనరావు
జార్ఖండ్ రాష్ట్ర నూతన డీజీపీగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధనరావు మార్చి 17న బాధ్యతలు స్వీకరించారు. 18 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఆయన.. గతంలో జార్ఖండ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో సేవలందించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంకకు చెందిన విష్ణువర్ధనరావు వరంగల్ ఆర్‌ఈసీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఆయన కుమార్తె దీపిక.. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం అమలు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. అల్లుడు విక్రాంత్ పాటిల్ విజయవాడ డీసీపీగాను, కుమారుడు హర్షవర్ధన్ అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో ఏసీబీ ఎస్పీగాను పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జార్ఖండ్ నూతన డీజీపీగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మండవ విష్ణువర్ధనరావు

ఏపీ సైన్స్ సిటీ సీఈవోగా జయరామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా డాక్టర్ జయరామిరెడ్డి కొండాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏపీ సైన్స్ సిటీ వైస్ చైర్మన్, సీఈవోగా ఉన్న డాక్టర్ అప్పసాని కృష్ణారావును బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. జయరామిరెడ్డి ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : డాక్టర్ జయరామిరెడ్డి కొండా

రాజ్యసభ సభ్యుడిగా జస్టిస్ గొగోయ్ ప్రమాణం
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ మార్చి 19న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గొగోయ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తూ మార్చి 16న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గొగోయ్ 2018, అక్టోబర్ 3 నుంచి 2019, నవంబర్ 17 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2019, నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు.
తొలి సీజేఐ...
రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ సీజేఐగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్


సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావు కన్నుమూత
Current Affairs సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చి 5న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా పొత్తూరులో 1934 ఫిబ్రవరి 8న జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. 1957లో తన సమీప బంధువైన బీవీ రాజు సారథ్యంలో వెలువడిన ఆంధ్రజనత పత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఉదయం పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. 2005లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లోనూ పొత్తూరి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన వ్యాసప్రభ, చింతన, నాటి పత్రికలు-మేటి విలువలు తదితర పుస్తకాలతో పాటు ‘విధి నా సారథి’ పేరుతో ఆత్మకథను రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : పొత్తూరి వెంకటేశ్వరరావు(86)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

టైమ్ శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ
గత శతాబ్దానికి సంబంధించి టైమ్ మేగజైన్ మార్చి 5న ప్రకటించిన ‘ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితా’లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్‌కు స్థానం లభించింది. గడిచిన శతాబ్దంలో వీరివూరు తమదైన ముద్ర వేశారని టైమ్ మేగజైన్ పేర్కొంది. అమృత్ కౌర్‌ను 1947 సంవత్సరానికి, ఇందిరా గాంధీని 1976 ఏడాదికి ‘విమెన్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. 1976లో ఇందిర ‘ఎంప్రెస్ ఆఫ్ ఇండియా’గా ఉండేవారని టైమ్ పేర్కొంది.
స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్ 1889, ఫిబ్రవరి 2న కపూర్తలా రాచకుటుంబంలో జన్మించారు. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె 1918లో స్వదేశానికి తిరిగొచ్చారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితమై, ఆయన బాటలో నడిచారు. వలస పాలన, సామాజిక దురాచారాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు విశేష కృషి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆమె పదేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ, అమృత్ కౌర్
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : టైమ్ మేగజైన్

ఐరాస మాజీ సెక్రటరీ జేవియర్ కన్నుమూత
ఇరాన్, ఇరాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి కుల్లార్(100) కన్నుమూశారు. పెరూ రాజధాని లిమాలో మార్చి 4న తుదిశ్వాస విడిచారు. లిమాలో 1920, జనవరి 19న జన్మించిన ఆయన 2000, నవంబర్ 22 నుంచి 2001, జూలై 21 వరకు పెరూ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1982, జనవరి 1 నుంచి 1991, డిసెంబర్ 31 వరకు ఐరాస 5వ సెక్రటరీ జనరల్‌గా సేవలందించారు. ఐరాస సెక్రటరీగా ఉన్నప్పడు ప్రపంచ ఆకలిపై పోరాటం, ఇరాన్, ఇరాక్ మధ్య ఎనిమిదేళ్లుగా సాగిన యుద్ధానికి తెరదించడం, ఎల్ సాల్వడార్‌లో అమెరికా ఎగదోసిన అంతర్యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పడం వంటి చర్యలు ఆయన పాలనాదక్షతకు నిదర్శనం. 1990లో నమీబియా స్వాతంత్ర సముపార్జనను తన గొప్ప విజయంగా ఆయన భావిస్తారు. 1973 నుండి 74 వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడుగా జేవియర్ వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : జేవియర్ పెరెజ్ డి కుల్లార్(100)
ఎక్కడ : లిమా, పెరూ

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మార్చి 6న ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శశాంక్ ప్రస్తుతం కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డెరైక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు.
గతంలో రాష్ట్ర సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా రజత్ స్థానంలో శశాంక్ నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : శశాంక్ గోయల్

ఫ్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్ జుల్కా
కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్‌గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత ఐసీ కావడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది.
మాజీ సీఐసీ సుధీర్ భార్గవ 2020, జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. కేంద్ర సమాచార కమిషన్‌లో సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 6 మందే ఉన్నారు. 2020, ఫిబ్రవరిలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సమాచార కమిషన్ సీఐసీగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : బిమల్ జుల్కా
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ

గాప్ ఇంక్ సీఈవోగా సోనియా సింగాల్
ఫార్చూన్500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గాప్ ఇంక్’ సీఈవోగా భారత సంతతి మహిళ సోనియా సింగాల్ నియమితులయ్యారు. గాప్ ఇంక్‌లో 2004లో చేరిన 49 ఏళ్ల సింగాల్ గ్రూప్‌లోని ఓల్డ్ నేవీ సీఈవోగా, గాప్ ఇంక్ యూరప్ ఎండీగా ఉన్నారు. అంతకుముందు సన్ మైక్రోసిస్టమ్స్, ఫోర్డ్ మోటార్స్‌లో 15 ఏళ్లపాటు పనిచేశారు. భారత్‌లో పుట్టిన సింగాల్ కుటుంబం.. ఆమె చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లింది. సింగాల్ కెట్టరింగ్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
గాప్ ఇంక్ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ డాలర్లు. అమెరికాసహా విదేశాల్లో 3,727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫార్చూన్500 కంపెనీల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 33 మంది మహిళలు ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గాప్ ఇంక్ సీఈవోగా నియామకం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : సోనియా సింగాల్

ఏడుగురు మహిళలకు ప్రధాని సోషల్ ఖాతాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 8న తన సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ‘‘ఎవరి జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయో ఆ శక్తిమంతమైన ఏడుగురు మహిళలకి నా సామాజిక మాధ్యమాల ఖాతాలను అప్పగిస్తున్నాను. ఇలా చేయడం వల్ల వారు చేస్తున్న సామాజిక సేవ లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ రోజంతా నేను నా అకౌంట్ల నుంచి తప్పుకుంటాను. ఆ ఏడుగురు మహిళలు వారి జీవిత ప్రయాణాన్ని నా అకౌంట్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
ఏడుగురు మహిళలు
స్నేహ మోహన్ దాస్: చెన్నైకి చెందిన స్నేహ ఫుడ్‌బ్యాంక్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆహార వృథాను అరికట్టడం, పేదల ఆకలిని తీర్చడంలో కృషి చేస్తున్నారు.
డాక్టర్ మాళవిక అయ్యర్: తమిళనాడుకి చెందిన మాళవిక ఒక దివ్యాంగురాలు. 13 ఏళ్ల వయసులో రాజస్తాన్‌లో బికనీర్ బాంబు పేలుళ్లలో ఆమె చేతులు కోల్పోయారు. కాళ్లు విరిగిపోయాయి. వంటినిండా ఫ్రాక్చర్లే. అయినా ఆమె పీహెచ్‌డీ చేసి డాక్టరయ్యారు. ఇప్పుడు సామాజిక కార్యకర్తగా పలువురిలో స్ఫూర్తిని నింపుతున్నారు.
ఆరిఫా జాన్: శ్రీనగర్‌కు చెందిన ఆరిఫా కశ్మీర్‌లో సంప్రదాయమైన చేతివృత్తుల్ని పునరుద్ధరించి, వాటికో బ్రాండ్ కల్పించడానికి కృషి చేస్తున్నారు. కశ్మీర్ చేతివృత్తులపై మహిళలకు శిక్షణనివ్వడమే కాకుండా వారి వేతనాలను రోజుకి రూ.175 నుంచి రూ. 450కి పెంచారు.
కల్పన రమేష్: హైదరాబాద్‌కి చెందిన ఈమె వృత్తిపరంగా ఒక ఆర్కిటెక్ట్. కానీ ఆమె తన జీవితాన్ని నీటి సంరక్షణకే అంకితం చేశారు. టెడ్‌ఎక్స్ స్పీకర్... తాను డిజైన్ చేసిన నీటి సంరక్షణని విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ (సాహె) సంస్థను స్థాపించి వాననీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
కళావతి దేవి: మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన కళావతి దేవి ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ఆమె విసృ్తతంగా పోరాడుతున్నారు.
వీణా దేవి: బిహార్‌లో ముంగూర్ జిల్లాకు చెందిన వీణా దేవి పుట్టగొడుగుల సాగుతో పేరు ప్రఖ్యాతులు సాధించారు. పుట్టగొడుగుల్ని సాగు చేయడంలో, సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పించి రైతుల ఆర్థిక స్థితిగతుల్ని పెంచారు.
విజయ పవార్: మహారాష్ట్రకు చెందిన విజయ పవార్ బంజారా చేతివృత్తుల మహిళలతో కలిసి రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రలోని గ్రామీణ గోర్మతి కళలో నిపుణులైన మహిళల్ని ప్రోత్సహిస్తూ వారి తయారు చేసిన ఉత్పత్తుల్ని విక్రయించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి హెచ్‌ఆర్ భరద్వాజ్ కన్నుమూత
కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్ రాజ్ భరద్వాజ్ (83) మార్చి 8న కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో మార్చి 8న తుదిశ్వాస విడిచారు. 1937 మే, 17న హరియాణలోని రోహతక్‌లో జన్మించిన ఆయన 1982లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ, పీవీ మంత్రివర్గాల్లో న్యాయశాఖ సహాయ మంత్రిగా, యూపీఏ హయాంలో కేబినెట్ మంత్రిగా పదవులు చేపట్టారు. 2009 నుంచి 2014 వరకు కర్ణాటక గవర్నర్‌గా పనిచేశారు. కొంతకాలం పాటు కేరళ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : హన్స్ రాజ్ భరద్వాజ్ (83)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఎస్‌బీఐ సీఎఫ్‌ఓగా వెంకట నాగేశ్వర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా చలసాని వెంకట నాగేశ్వర్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ఎస్‌బీఐ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక నుంచి చలసాని ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ, సీఎఫ్‌ఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని బాంబే స్టాక్స్ ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలో బ్యాంక్ పేర్కొంది.
2020లో 5.3 శాతంగా భారత వృద్ధి: మూడీస్
భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2020 సంవత్సరానికి గతంలో వేసిన 5.4 శాతం నుంచి 5.3 శాతానికి మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సవరించింది. కరోనా వైరస్ కారణంగా భారత్‌లో వినియోగ డిమాండ్ క్షీణిస్తుందన్న అంచనాలతో ఈ నిర్ణయానికి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐ సీఎఫ్‌ఓగా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : చలసాని వెంకట నాగేశ్వర్

ఆసియా అపర కుబేరుడు జాక్ మా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో మార్చి 9న స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణం. దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ మళ్లీ నంబర్‌వన్ స్థానంలో నిల్చారు. అంబానీ కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 2018 మధ్యలో జాక్ మా ఆసియాలో నంబర్ 1 హోదాను కోల్పోయారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో జాక్ మా
ఎప్పుడు: మార్చి 9 నుంచి
ఎవరు : ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు జాక్ మా
ఎక్కడ: చైనా
ఎందుకు : కరోనాభయాలతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో..

కోస్సియుస్కోని అధిరోహించిన తుకారాం
తెలంగాణ యువ పర్వతారోహకుడు ఆంగోత్ తుకారాం మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా ఖండంలోనే ఎత్తైన పర్వతం కోస్సియుస్కోను మార్చి 10న అధిరోహించాడు. ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో పర్వతారోహణ మొదలుపెట్టిన ఆంగోతు తుకారాం...ఇప్పటికే నాలుగు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు. తాజాగా కోస్సియుస్కోను అధిరోహించడంతో ఐదు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని కోస్సియుస్కో పర్వతాన్ని అధిరోహించేందుకు మార్చి 5న హైదరాబాద్ నుంచి బయల్దేరిన తుకారాం..8న అక్కడికి చేరుకున్నారు. మార్చి 8న సాహసయాత్ర ప్రారంభించి 10వ తేదీకి పూర్తి చేశాడు.
తుకారాం 2018 జూలైలో ఆఫ్రికాలోని కిలీమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత 2019 మే 22న ఆసియాలోని మౌంట్ ఎవరెస్ట్, 2019 జూలై 27న యూరప్‌లోని మౌంట్ ఎల్బ్రూస్, 2020 జనవరి 26న ఉత్తర అమెరికాలోని మౌంట్ అకాన్గువా పర్వతాలను అధిరోహించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోస్సియుస్కో పర్వతాన్ని అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించిన తుకారాం
ఎప్పుడు: మార్చి 10
ఎవరు : ఆంగోత్ తుకారాం
ఎక్కడ: ఆస్ట్రేలియా

ఫ్రాన్స్ లో భారత రాయబారిగా జావెద్ అష్రాఫ్
Current Affairs
ఫ్రాన్స్ లో భారత రాయబారిగా దౌత్యవేత్త జావెద్ అష్రాఫ్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన జావెద్ ఇంతవరకు సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేశారు. ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్ క్వత్రా నేపాల్ రాయబారిగా నియమితులయ్యారు.
ఢిల్లీలో హింస ఆందోళనకరం
ఢిల్లీలో చెలరేగిన హింసపై అమెరికాకు చెందిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వాల ప్రధాన బాధ్యత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలకు భద్రత కల్పించడం, పూర్తి రక్షణ కల్పించడమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సరికావని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.
సీఏఏపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ
భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రభావంపై బ్రిటన్ పార్లమెంట్‌లోని ఎగువ సభ(హౌస్ ఆఫ్ లార్డ్స్)లో చర్చ జరిగింది. ఈ చట్టం అమలు, మైనారిటీల హక్కులపై ఆందోళనను వివరించేందుకు భారత్‌కు ప్రతినిధి వర్గాన్ని పంపాలని కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత రాయబారిగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : జావెద్ అష్రాఫ్
ఎక్కడ : ఫ్రాన్స్

ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శెట్టర్ కన్నుమూత
ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు డాక్టర్ ఎస్.శెట్టర్ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 28న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హంస సాగరలో జన్మించిన షడక్షరీ శెట్టర్ మైసూరు, ధార్వాడ్, కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చరిత్ర, కళలు, పురావస్తు తవ్వకాలు, పర్యాటకం, గ్రాంథిక భాషాంశాలపై 27కు పైగా పరిశోధన గ్రంథాలను రాశారు. వివిధ వర్సిటీల్లో ఆచార్యులుగా సేవలందిస్తూనే 1978-1995 మధ్య కాలంలో భారతీయ కళా చరిత్ర సంస్థకు సంచాలకులుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
శెట్టర్ ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చ్ అధ్యక్షునిగా, బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్‌లో ఆచార్యులుగా సేవలందించారు. భారతీయ, కర్ణాటక చరిత్ర అనుసంధాన పరిషత్‌లకు అధ్యక్షులుగా వ్యవహరించారు. మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)లో విశ్వ సంస్కృత సమ్మేళనం విభాగానికి, బళ్లారి జిల్లా సాహిత్య సమ్మేళనాలకు, అఖిల భారత పురాతన కన్నడ (హళేగన్నడ) సాహిత్య సమ్మేళనాలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. కర్ణాటక రాజ్యోత్సవ, కుంద, కేంద్ర సాహిత్య అకాడమి, భాషా సమ్మాన్, మాస్తి, రన్న, 2016 ప్రాచీక కన్నడ వాజ్ఞయ పురస్కారాలను ఆయన అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : డాక్టర్ షడక్షరీ శెట్టర్ (85)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా

మలేసియా ప్రధానిగా మొహియుద్దీన్ ప్రమాణం
మలేసియా నూతన ప్రధానమంత్రిగా మొహియుద్దీన్ యాసిన్ మార్చి 1న ప్రమాణం చేశారు. మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రిబూమి బెర్సాతు మలేసియా (పీపీబీఎం) వ్యవస్థాపకుడైన మొహియుద్దీన్‌కు యునెటైడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ (యూఎంఎన్‌ఓ), ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మొహియుద్దీన్ గతంలో మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇప్పటివరకు మలేసియా ప్రధానమంత్రిగా పనిచేసిన మహతీర్ మొహమాద్ 2020, ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలేసియా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : మొహియుద్దీన్ యాసిన్

ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్‌చంద్ర గార్గ్
కేంద్ర ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సుభాష్ చంద్ర గార్గ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు నిధులు సమీకరించే విషయంలో ముఖ్యమంత్రి సలహదారునిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి పవ్రీణ్ ప్రకాష్ మార్చి 1న ఉత్తర్వులు జారీచేశారు. కేబినేట్ మంత్రి హోదాలో ఆయన రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నెలలో కనీసం 15 రోజులు పాటైనా ఆయన ఈ బాధ్యతల్లో పనిచేయాలని.. అలాగే, 7-10 రోజుల పాటు ఆయన రాష్ట్ర రాజధానిలోనే ఉండి పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సీఎం సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : సుభాష్ చంద్ర గార్గ్
ఎందుకు : అదనపు నిధులు సమీకరించే విషయంలో

నోకియా సీఈఓగా రాజీవ్ సూరి రాజీనామా
ఫిన్లాండ్‌కి చెందిన దిగ్గజ కంపెనీ నోకియా అధ్యక్షుడు, సీఈఓ రాజీవ్ సూరి తన పదవికి రాజీనామా చేశారు. రాజీవ్ సూరి వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు మార్చి 2న కంపెనీ తెలిపింది. కంపెనీ నూతన అధ్యక్షుడు, సీఈవోగా పెక్కా లుండ్‌మార్క్‌ను నోకియా డెరైక్టర్ల బోర్డు నియమించింది. 2020, సెప్టెంబర్ నుంచి పెక్కా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి గత 25 ఏళ్లుగా నోకియాలో పనిచేశారు. నోకియా అధ్యక్షుడు, సీఈఓగా 2020, ఆగస్టు 31 వరకు సూరి కొనసాగుతారు. ఇక 2021 జనవరి 1 వరకు నోకియా బోర్డులో సలహాదారుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోకియా అధ్యక్షుడు, సీఈఓ రాజీనామా
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : రాజీవ్ సూరి

టర్కీలో భారత రాయబారిగా సంజయ్
టర్కీలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ పాండా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మార్చి 3న వెల్లడించింది. 1991 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కి చెందిన సంజయ్ ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో(అమెరికా)లో భారత కాన్సులేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

పెట్రోలియం శాఖ కార్యదర్శిగా బీఎన్‌రెడ్డి
కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శిగా 1993 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి బీఎన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన మూడేళ్లపాటు పెట్రోలియం శాఖ కొనసాగనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టర్కీలో భారత రాయబారిగా నియామకం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : సంజయ్ కుమార్ పాండా
Published date : 10 Apr 2020 08:19PM

Photo Stories