మార్చి 2019 వ్యక్తులు
అమెరికాలోని ప్రఖ్యాత డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్‌రావు ఎన్నికయ్యారు. వైట్‌హౌస్‌లోని రూస్‌వెల్ట్ రూమ్‌లో యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ క్లారెన్స్ థామస్ నేతృత్వంలో ఆమె మార్చి 21న ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018, నవంబర్‌లో నియోమీని జడ్జిగా నామినేట్ చేయగా ఆమె నియామకానికి 53-46 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది. నియోమీ గతంలో ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్‌ఏ)లో అడ్మినిస్ట్రేటర్‌గా కీలక పాత్ర పోషించారు. డీసీ కోర్టు జడ్జిగా నియమితులైన భారతీయుల్లో నియోమీ రెండో వ్యక్తి. గతంలో శ్రీ శ్రీనివాసన్ అనే వ్యక్తి డీసీ కోర్టు జడ్జిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : నియోమీ జహంగీర్‌రావు
ఎక్కడ : కొలంబియా, అమెరికా
తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్ ప్రమాణ స్వీకారం
భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(పీసీ ఘోష్) ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మార్చి 23న జరిగిన కార్యక్రమంలో పీసీ ఘోష్ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పాల్గొన్నారు. లోక్‌పాల్‌లో ఘోష్‌తోపాటు మరో ఎనిమిది సభ్యుల నియమకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 19న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
లోక్‌పాల్‌కు నియమితులైన ఎనిమిది మంది సభ్యులలో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా ఉండనున్నారు. జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాషా కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠిలు జ్యుడిషియల్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత తొలి లోక్‌పాల్‌గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
వింజమూరి అనసూయాదేవి కన్నుమూత
ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) కన్నుమూశారు. వయోభారంతో అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920, మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడం, బాణీలు కట్టడం, పాడడంతోపాటు హార్మోనియం వాయించడంలోనూ ఆమె విశేషమైన ప్రతిభ కనబరిచారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత‘ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే.
జానపద సంగీతంపై అనసూయాదేవి ఏడు పుస్తకాలను రచించారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12న ఆవిష్కరించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్ అయి్యంది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ, సుభాస్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో అనుసూయాదేవి దేశభక్తి గీతాలు పాడారు. ఆమెకు 1977లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ అనే బిరుదును, గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ఆమెకు పారిస్‌లో ‘క్వీన్ ఆఫ్ ఫోక్’అనే బిరుదును ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని కన్నుమూత
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : వింజమూరి అనసూయాదేవి (99)
ఎక్కడ : హ్యూస్టన్, అమెరికా
నావికాదళం అధిపతిగా కరమ్‌బీర్ సింగ్
భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ మార్చి 23న నియమితులయ్యారు. 2019, మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో మే 31న ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ప్రస్తుతం విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్(ఎఫ్‌వోసీ-ఇన్- సీ)గా కరమ్‌బీర్ ఉన్నారు. హెలికాప్టర్ పెలైట్ ఒకరు నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే ప్రథమం. అత్యంత సీనియర్ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి ప్రతిభే గీటురాయిగా కరమ్‌బీర్‌ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
పంజాబ్‌లోని జలంధర్‌లో 1959, నవంబర్ 3న కరమ్‌బీర్ సింగ్ జన్మించారు. 1980 జూలై 1న నేవీలో చేరిన ఆయన 1982 హెలికాప్టర్ పెలైట్‌గా ఎంపికయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (పూణె), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్(వెల్లింగ్టన్)లలో శిక్షణ పొంది చేతక్, కమోవ్ హెలీకాప్టర్ల పెలైట్‌గా విశేష అనుభవం గడించారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ చాంద్‌బీబీ, మిసైల్ కార్వెట్ ఐఎన్‌ఎస్ విజయ్‌దుర్గ్, గెడైడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్‌ఎస్ రాణా నౌకలకు కమాండర్‌గా కరమ్‌బీర్ పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నావికాదళం తదుపరి అధిపతి నియామకం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్‌ను కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2019, ఏప్రిల్ 6లోపు కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించాలని న్యాయశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి ఆమోద ముద్ర వేశారు. 2018, జూలై 7న తె లుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నియమితుల య్యారు. తర్వాత ఉమ్మడి హైకోర్టును విభజించడంతో 2019, జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోల్ కతా హైకోర్టుకు బదిలీ
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్
అప్రూవర్‌గా మారేందుకు సక్సేనాకు అనుమతి
అగస్టా వెస్ట్‌లాండ్ మనీ లాండరింగ్ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారేందుకు పటియాల హౌజ్ కోర్టు మార్చి 25న అనుమతినిచ్చింది. కేసుకు సంబంధించిన సమాచారం మొత్తాన్నీ తాను వెల్లడిస్తాననీ, తనకు శిక్షను రద్దు చేయాలంటూ సక్సేనా వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో సక్సేనా అప్రూవర్‌గా మారితే తమకేమీ అభ్యంతరం లేదనీ, విచారణకు ఆయన చెప్పే విషయాలు పనికొస్తాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కోర్టుకు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అప్రూవర్‌గా మారేందుకు రాజీవ్ సక్సేనాకు అనుమతి
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : పటియాల హౌజ్ కోర్టు
ఎక్కడ : అగస్టా వెస్ట్‌లాండ్ మనీ లాండరింగ్ కేసులో
జెట్ ఎయిర్‌వేస్‌కు నరేష్ గోయల్ రాజీనామా
జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ మార్చి 25న తన పదవికి రాజీనామా చేశారు. అలాగే జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్‌వేస్ పీజేఎస్‌సీ నామినీ డెరైక్టర్ కెవిన్ నైట్ వైదొలిగారు. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు.
జెట్ ఎయిర్‌వేస్‌కు 1500 కోట్లు
తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్‌కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. ఈ మేరకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికను జెట్ ఎయిర్‌వేస్ బోర్డు మార్చి 25న ఆమోదించింది. డెట్ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : నరేష్ గోయల్
ఎందుకు : జెట్ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా
లోక్‌సభ వ్యయ పరిశీలకుడిగా గోపాల్ ముఖర్జీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా మాజీ ఐఆర్‌ఎస్ అధికారి గోపాల్ ముఖర్జీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 26న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీబీడీటీ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయంపై నిఘాపెట్టి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ఎన్నికల వ్యయ పరిశీలకుడు చర్యలు తీసుకుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ వ్యయ పరిశీలకుడి నియామకం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : గోపాల్ ముఖర్జీ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తెలంగాణ ఏసీజేగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ చౌహాన్ ఏసీజేగా నియమితులయ్యారు.
1959 డిసెంబర్ 24న రాజస్తాన్‌లో జన్మించిన జస్టిస్ చౌహాన్ 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018, నవంబర్ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నియామకం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ది థర్డ్ పిల్లర్ పుస్తకావిష్కరణ
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించిన ‘ది థర్డ్ పిల్లర్’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో మార్చి 27న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్‌గా రాజన్ సేవలందించారు. ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది థర్డ్ పిల్లర్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఒకేసారి ఆరుగురికి జన్మనిచ్చిన టెక్సాస్ మహిళ
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. టెక్సాస్‌లోని హూస్టన్‌కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ మార్చి 15న నలుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించింది. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారికి కొంతకాలం అడ్వాన్స్ డ్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పారు. ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికే సాధ్యమవుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకేసారి ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : తెల్మా చియాకా
ఎక్కడ : హూస్టన్, టెక్సాస్, అమెరికా
లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా జస్టిస్ ఘోష్
అవినీతి వ్యతిరేక అంబుడ్‌సమన్ వ్యవస్థగా పిలుస్తున్న లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పేరును కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ మార్చి 17న ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేసింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, న్యాయ కోవిదుడు ముకుల్ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు. జనలోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి.
1952 మే 28న కోల్‌కతాలో జన్మించిన జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఘోష్ తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌పాల్ తొలి చైర్మన్ ఎంపిక
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కన్నుమూత
దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 17న గోవా రాజధాని పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పరీకర్ పనిచేశారు.
పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో పరీకర్ జన్మించారు. పాఠశాల స్థాయిలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. గోవా ముఖ్యమంత్రిగా 2000లో బాధ్యతలు చేపట్టిన పరీకర్ ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా ఖ్యాతి గడించారు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పరీకర్ ఆదర్శంగా నిలిచారు.
ఆరెస్సెస్ వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్ ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై గోవాలో విసృ్తతంగా ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసి ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. 2000లో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పరీకర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోవా ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మనోహర్ పరీకర్(63)
ఎక్కడ : డౌనాపౌలా, పణ జి, గోవా
ఎందుకు : ప్యాంక్రియాటిక్ కేన్సర్ కారణంగా
తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్ నియామకం
భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నియమితులయ్యారు. ఈ మేరకు ఘోష్‌తోపాటు మరో ఎనిమిది సభ్యుల నియమకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 19న ఆమోదం తెలిపారు. ఎనిమిది మంది సభ్యులలో సశస్త్ర సీమా బల్ మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా ఉండనున్నారు. జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాషా కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠిలు జ్యుడిషియల్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
ఏమిటీ లోక్‌పాల్?
కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు.
- లోక్‌పాల్ కమిటీలో ఒక ఛైర్మన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉండాలి. వీరిలో నలుగురు జ్యుడిషియల్ సభ్యులై ఉండాలి.
- లోక్‌పాల్‌లో కనీసం 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా విభాగానికి చెందినవారై ఉండాలి.
- ఛైర్‌పర్సన్, ఇతర సభ్యుల ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వయసు వచ్చేవరకూ పదవుల్లో కొనసాగుతారు.
- ఛైర్మన్ జీత భత్యాలు భారత న్యాయమూర్తి తరహాలోనే ఉంటాయి.
ఏమిటి : భారతదేశపు తొలి లోక్‌పాల్ నియామకం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్)
కజక్‌స్థాన్ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ రాజీనామా
కజక్‌స్థాన్ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ మార్చి 19న తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పదవిలో ఉన్న ఆయన జీవన ప్రమాణాలు పడిపోతుండడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొనడాన్ని గమనించి ఇటీవలే మొత్తం మంత్రివర్గాన్ని తొలగించారు. చమురు నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ ప్రగతి మందగించడంతో నూతన ప్రణాళికను రూపొందించారు.
నూర్‌సుల్తాన్ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ‘జాతి నేత’గా కొనసాగుతారు. దానిప్రకారం విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు సెనేట్ ఛైర్మన్ కస్యం జొమ్రాట్ టొకాయెవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కజక్‌స్థాన్ అధ్యక్షుడు రాజీనామా
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు బ్రిటన్‌లో మార్చి 20న అరెస్ట్ చేశారు. అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయనను హాజరుపరచగా, కోర్టు ఆయనకు మార్చి 29 వరకూ కస్టడీ విధించింది. స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాట్లాడుతూ..భారత అధికారుల విజ్ఞప్తి మేరకు నీరవ్‌ను హోల్‌బోర్న్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలుచేసిన పిటిషన్ ఆధారంగా లండన్‌లోని ఓ కోర్టు నీరవ్ అరెస్ట్‌కు వారెంట్ జారీచేసిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : పీఎన్‌బీకు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో
ఎల్‌ఐసీ ఎండీగా టీసీ సుశీల్ కుమార్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా దక్షిణ మధ్య జోన్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవికి ముందు ఆయన అనేక కీలక బాధ్యతల్లో ఎల్‌ఐసీకి సేవలందించారు. రైతు బీమా, చంద్రన్న బీమా వంటి పథకాలు ఆయన ఏపీ, తెలంగాణ జోన్ మేనేజర్‌గా ఉన్న కాలంలోనే అమలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎల్‌ఐసీ ఎండీగా టీసీ సుశీల్ కుమార్ నియమాకం
ఎవరు : టీసీ సుశీల్ కుమార్
బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా పేరుపొందిన మాతా మహాదేవి (70) బెంగళూరులో మార్చి 14న కన్నుమూశారు. ఆమె కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్నారు. అనేక మఠాలకు, పీఠాలకు నెలవైన కర్ణాటకలో ఏకై క మహిళా సాధ్విగా మహాదేవి చోటు సంపాదించారు. బాగల్‌కోటె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడల సంగమ కేంద్రంగా ఆమె బసవధర్మ పీఠాన్ని నిర్మించిన బసవేశ్వరుని తత్వాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దసంఖ్యలో పీఠ శాఖలు, లక్షలాది మంది భక్తులు, అనుచరులకు ఆమె మాటే వేదవాక్కు. చిత్రదుర్గ జిల్లాలో జన్మించిన మహాదేవి కళాశాల విద్య తరువాత లింగాయత్ సన్యాస దీక్షను స్వీకరించారు. మంచి వాక్పటిమ, ధైర్యం ఆమె సొంతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : మాతా మహాదేవి
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య
కడప దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్సార్ జిల్లాలో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. పులివెందులలోని తన ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ను మార్చి 15 వేకువజామున దుండగులు తలపై నరికి దారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా తలపై నరకడంతోనే మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.
పులివెందుల సమితి ప్రెసిడెంటుగా 1981లో వైఎస్ వివేకానందరెడ్డి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. రాయలసీమ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. ఆపై తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించడంతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను వివేకానందరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 1989లో తొలిసారిగా పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1994లో మరోమారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో, కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ వివేకా పోటీ చేసి గెలుపొందారు. 2004లో మరోమారు కడప ఎంపీగా పోటీ చేసి సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
మిజోరం గవర్నర్ రాజశేఖరన్ రాజీనామా
మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ తన పదవికి మార్చి 8న రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. 2018 మే నెలలో మిజోరం గవర్నర్‌గా రాజశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీచేసిన రాజశేఖరన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేతిలో ఓడిపోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిజోరం గవర్నర్ రాజీనామా
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కుమ్మనమ్ రాజశేఖరన్
యూఎన్‌డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 8న యూఎన్‌డీపీ ప్రకటించింది. అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి యూఎన్‌డీపీ గుడ్‌విల్ అంబాసిడర్‌ను నియమిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌డీపీ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : పద్మాలక్ష్మి
ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్
కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్‌ను నియమిస్తూ కేంద్ర నియామకాల మంత్రిత్వశాఖ మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అజయ్ నారాయణ్ ఝా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1983 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గార్గ్ 2017 జూన్ నుంచి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఆర్థికశాఖలో బాధ్యతలు నిర్వహించే ఐదుగురు కార్యదర్శుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్నవారే ఫైనాన్స్ కార్యదర్శిగా నియమితులవుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సుభాష్ చంద్ర గార్గ్
అత్యధిక వయస్కురాలిగా కానే తనకా రికార్డు
ప్రపంచంలోనే అత్యధిక వయస్కురాలిగా జపాన్‌లోని ఫుకోకా ప్రాంతానికి చెందిన 116 ఏళ్ల కానే తనకా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ మేరకు జపాన్ రాజధాని టోక్యోలో మార్చి 9న జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 1903, జనవరి 2న జన్మించిన తనకా..1922లో హిదియో తనకాను వివాహమాడారు. ఇంతకు ముందు అత్యధిక వయస్కురాలిగా రికార్డు ఉన్న చియో మియాకో (117) 2018 జూలైలో మరణించారు. మియాకో కూడా జపాన్ చెందిన వారే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అత్యధిక వయస్కురాలిగా గిన్నిస్ రికార్డు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : కానే తనకా
వాస్తు బ్రహ్మ కాశీనాథుని కన్నుమూత
ప్రముఖ పాత్రికేయులు, వాస్తుబ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణం (90) హైదరాబాద్‌లో మార్చి 11న కన్నుమూశారు. 1928లో జన్మించిన సుబ్రహ్మణ్యం పాత్రికేయ రంగంలో, వాస్తువిజ్ఞాన రంగంలో విశిష్ట సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయాల్లో ఆయన వాస్తు సలహాలతో మార్పులు చేశారు. వాస్తు విజ్ఞానానికి గుర్తింపుగా సీఎంల నుంచి, ప్రముఖ సంస్థల నుంచి సత్కారాలతో పాటు భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, వాస్తు బ్రహ్మ, వాస్తు సామ్రాట్ వంటి బిరుదులను పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ పాత్రికేయులు, వాస్తుబ్రహ్మ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : కాశీనాథుని సుబ్రహ్మణం (90)
ఎక్కడ : హైదరాబాద్
సమాజ సేవకు రూ.52,700 కోట్లు కేటాయింపు
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్ విలువ రూ.52,700 కోట్లుగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది. దీంతో తన ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ప్రేమ్‌జీనే వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. 2018 డిసెంబర్ నాటికి విప్రోలో ప్రమోటర్ హోల్డింగ్ 74.3 శాతంగా ఉంది. దేశంలో విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు పలు ఇతర విభాగాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సాయం అందిస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్‌లో ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విసృ్తతం చేయనున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. ఉత్తరభారత్‌లోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. సమానత, మానవతతో కూడిన స్థిరమైన సమాజం కోసం అన్నది ప్రేమ్‌జీ ఫౌండేషన్ లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సమాజ సేవకు రూ.52,700 కోట్లు కేటాయింపు
ఎందుకు : సమాజ సేవ కోసం
ఎవరు : విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ
ఎల్‌ఐసీ నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్
ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్ నియమితులయ్యారు. మార్చి 13న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. గతేడాది డిసెంబర్‌లో చైర్మన్ వీకే శర్మ విరమణ తరువాత నుంచి ఇప్పటివరకు చైర్మన్ పదవి ఖాళీగానే ఉన్న విషయం తెలిసిందే. ఎంఆర్ కుమార్ అంతక్రితం జోనల్ మేనేజర్‌గా సంస్థలకు సేవలందించారు. నూతన చైర్మన్‌గా ఈయన నియమకంతో పాటు.. విపిన్ ఆనంద్, టీసీ సుసెల్ కుమార్‌లను సంస్థకు మేనేజింగ్ డెరైక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎల్‌ఐసీ నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్ నియమాకం
ఎవరు : ఎంఆర్ కుమార్
ఎప్పుడు : మార్చి 13
ఎక్కడ : న్యూఢిల్లీ
మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో గూడ్స్ గార్డుగా ఓ మహిళను నియమించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాధవికి శిక్షణ ఇప్పించి వర్కింగ్ ఆర్డర్ అందజేశామని కాజీపేట రైల్వే ఏరియా ఆఫీసర్ పూర్ణచంద్రరావు తెలిపారు., కాజీపేట నుంచి సనత్‌నగర్ వెళ్లే యూటీసీఎం గూడ్‌స గార్డుగా ఆమె వెళ్లినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లో మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవి ఒక్కరే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవిని పలువురు అధికారులు అభినందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు నియమాకం
ఎవరు : మాధవి
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో
బీఓబీ చైర్మన్‌గా హస్‌ముఖ్ అదియా
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి హస్‌ముఖ్ అదియా నియమితులయ్యారు. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ మేరకు మార్చి 1న తెలిపారు. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం అనంతరం బీఓబీ దేశీ మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించనున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చైర్మన్ నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : హ స్‌ముఖ్ అదియా
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ
సీఎం కేసీఆర్ పీఆర్వోగా పనిచేస్తున్న ట్రాన్స్ కో జీఎం గటిక విజయ్ కుమార్ రచించిన ‘తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం’(తెలుగులో), ‘ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్’(ఇంగ్లిష్‌లో) పుస్తకాలను మార్చి 4న ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదర్కొన్న తీరును ఈ పుస్తకాలలో వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ట్రాన్స్ కో జీఎం గటిక విజయ్ కుమార్
ఎక్కడ : హైదరాబాద్
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం
ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019’ను ఫోర్బ్స్ మ్యాగజైన్ మార్చి 5న విడుదల చేసింది. 2018లో 40.1 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్న ముకేశ్ 2019లో 50 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు లభించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు.
ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019
స్థానం | పేరు | కంపెనీ |
1 | జెఫ్ బెజోస్ | అమెజాన్ |
13 | ముకేశ్ అంబానీ | రిలయన్స్ ఇండస్ట్రీస్ |
36 | అజిమ్ ప్రేమ్‌జీ | విప్రో |
82 | శివ్ నాడార్ | హెచ్‌సీఎల్ కో-ఫౌండర్ |
91 | లక్ష్మీ మిట్టల్ | ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్ |
114 | ఉదయ్ కోటక్ | కోటక్ మహీంద్రా బ్యాంక్ |
122 | కుమార మంగళం బిర్లా | ఆదిత్య బిర్లా గ్రూప్ |
167 | గౌతమ్ అదానీ | అదానీ గ్రూప్ |
244 | సునీల్ మిట్టల్ | భారతీ ఎయిర్‌టెల్ |
365 | ఆచార్య బాల్‌కృష్ణ | పతంజలి ఆయుర్వేద |
436 | అజయ్ పిరమల్ | పిరమల్ ఎంటర్‌ప్రెజైస్ |
617 | కిరణ్ మజుందార్ షా | బయోకాన్ |
962 | ఎన్.ఆర్. నారాయణ మూర్తి | ఇన్ఫోసిస్ |
1349 | అనిల్ అంబానీ | ఆర్‌కామ్ |
ఏమిటి : ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామస్వామి కన్నుమూత
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) హైదరాబాద్‌లో మార్చి 6న కన్నుమూశారు. 1932 జూలై 13న జన్మించిన జస్టిస్ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు. 1981-82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
1982 సెప్టెంబర్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా రామస్వామి నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్ నుంచి ఇంటర్నేషనల్ జూరిస్ట్స్ ఆర్గనైజేషన్ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన 1989 అక్టోబర్ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులైన ఆయన 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : జస్టిస్ కె.రామస్వామి (87)
ఎక్కడ : హైదరాబాద్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ పదవీ విమరణ
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ మర్చి 6న పదవీవిరమణ చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా 1999, జూలై 7న సిక్రీ నియమితులైన ఆయన 2011లో తాత్కాలిక సీజేగా చేశారు. పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు స్వీకరించారు. 2013, ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. సీబీఐ డెరైక్టర్‌గా ఐపీఎస్ అధికారి ఆలోక్ వర్మ నియామకాన్ని రద్దుచేసిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ సభ్యుడిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి పదవీవిరమణ
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : జస్టిస్ ఏకే సిక్రీ
హిందుస్తాన్ జింక్ చైర్మన్‌గా కిరణ్ అగర్వాల్
హిందుస్తాన్ జింక్ కంపెనీ చైర్మన్‌గా కిరణ్ అగర్వాల్ నియమితులయ్యారు. 2019, మార్చి 2 నుంచే ఆమె నియామకం అమల్లోకి వస్తుందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఆమెను అదనపు డెరైక్టర్‌గా కూడా నియమించామని వెల్లడించింది. అగ్నివేశ్ అగర్వాల్ స్థానంలో కిరణ్ అగర్వాల్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జింక్, లెడ్, వెండి లోహాలను ఉత్పత్తి చేస్తున్న హిందుస్తాన్ జింక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ టన్నులుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిందుస్తాన్ జింక్ కంపెనీ చైర్మన్ నియామకం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : కిరణ్ అగర్వాల్