Skip to main content

జనవరి 2018 వ్యక్తులు

ప్రముఖ నటీమణి కృష్ణకుమారి కన్నుమూత
తెలుగు చలనచిత్ర రంగంలో తన ముగ్ధ మనోహర రూపంతో, అద్వితీయ నటనా కౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, ప్రముఖ నటీమణి కృష్ణకుమారి జనవరి 24న బెంగళూరులో కన్నుమూశారు. 1933, మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో కృష్ణకుమారి జన్మించారు. ఆమె భర్త ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మాజీ ఎడిటర్ అజయ్ మోహన్ ఖైతాన్. ప్రముఖ నటీమణి షావుకారు జానకి కృష్ణకుమారికి స్వయానా సోదరి.
1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా కృష్ణకుమారి తెరంగ్రేటం చేశారు. అనంతరం పల్లెపడుచు, బంగారు పాప, ఇలవేల్పు, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్ర వేశారు. ఆమె నటనా కౌశలానికి మూడుసార్లు జాతీయ అవార్డు, రాష్ట్ర స్థాయి నంది అవార్డు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ నటి కృష్ణకుమారి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 24
ఎక్కడ : బెంగళూరులో

దాణా మూడో కేసులోనూ దోషిగా తేలిన లాలూ
దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 24న దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992-93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్ ప్రసాద్.. ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు.

బెంగాలీ నటి సుప్రియా దేవి కన్నుమూత
బెంగాలీ ప్రముఖ నటి సుప్రియా దేవి(85) జనవరి 26న కన్నుమూశారు. రిత్విక్ ఘటక్ దర్శకత్వం వహించిన ‘మేఘే ఢాకా తారా’ చిత్రంలో నీతా అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1933లో మిచ్‌కినాలో జన్మించిన సుప్రియా దేవి 1952లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 55 ఏళ్లు ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో చౌరింగీ, బాగ్ బందీ ఖేలా, సన్యాసి రాజ్, దేబ్‌దాస్ లాంటి క్లాసిక్ చిత్రాలున్నాయి. 2007లో విడుదలైన నేమ్‌సేక్ చిత్రంలో చివరిసారి నటించారు. దేవికి పద్మశ్రీ అవార్డుతో పాటు బెంగాల్ ప్రభుత్వ పౌర పురస్కారం బంగా విభూషణ్ లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ బెంగాలీ నటి సుప్రియా దేవి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 26
ఎక్కడ : కోల్‌కతా

దేశంలో తొలి మహిళా ఇమామ్‌గా జమిథా
Current Affairs ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం(జనవరి 26) ప్రార్థనల(జుమ్మా నమాజ్)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్ సున్నత్ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్ కాకూడదని ఖురాన్‌లో ఎక్కడా లేదని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి మహిళా ఇమామ్
ఎప్పుడు : జనవరి 26
ఎక్కడ : కేరళ
ఎవరు : జమిథా

విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలే
విదేశాంగ నూతన కార్యదర్శిగా చైనా వ్యవహారాల్లో నిపుణుడైన 1981 ఐఎఫ్‌ఎస్ అధికారి విజయ్ కేశవ్ గోఖలే జనవరి 29న బాధ్యతలు చేపట్టారు. భారత్ - చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అమెరికా-భారత్ పౌర అణు ఒప్పందంతో పాటు ఇండియా-చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ జనవరి 28న పదవీవిరమణ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జైశంకర్.. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ 2015, జనవరి 28న విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలే
ఎప్పుడు : జనవరి 29
ందుకు : జనవరి 28న పదవీ విరమణ చేసిన ఎస్.జైశంకర్

హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇద్దరు భారతీయులు
అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీఓ) ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్‌కు చెందిన ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్, సుమితా మిత్రాలకు చోటు దక్కింది. అత్యంత వేగంగా డేటాను ట్రాన్‌‌సమిట్ చేయడంతో పాటు స్వీకరించేలా వైర్‌లెస్ టెక్నాలజీని రూపొందించినందుకు పాల్‌రాజ్ ఈ ఘనత సాధించారు. నానో కాంపోజిట్ డెంటల్ మెటీరియల్ అభివృద్ధికి కృషి చేసినందుకు సుమితా మిత్రాకు ఈ గౌరవం లభించింది. మే 3న వాషింగ్టన్‌లో ఈ అవార్డును పాల్‌రాజ్, సుమితాలకు అందిస్తారు.

వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్ సింగ్ మృతి
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్ సింగ్ కల్కట్(92) జనవరి 27న చండీగఢ్‌లో మరణించారు. పంజాబ్ హరిత విప్లవంలో కీలకపాత్ర పోషించిన కల్కట్.. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

ది టాల్ మ్యాన్ పుస్తకావిష్కరణ
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌పై గణేశన్ రాసిన ‘ది టాల్ మ్యాన్’ పుస్తకాన్ని జనవరి 27న భువనేశ్వర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

సుఖోయ్‌లో ప్రయాణించిన రక్షణమంత్రి సీతారామన్
Current Affairs
రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 17న రెండు సీటర్ల సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. సీతారామన్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ పెలైట్‌తో కలిసి 45 నిమిషాల సేపు ఆకాశంలో విహరించారు. దీంతో సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్-30 విమానంలో చక్కర్లు కొట్టారు. రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : నిర్మలా సీతారామన్

ఎన్‌ఎస్‌జీ డీజీగా సుదీప్ లఖ్టాకియా
అత్యంత ప్రముఖుల వ్యక్తిగత భద్రత బాధ్యతలు చేపట్టే నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్‌ఎస్‌జీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన ఉన్న క్యాబినెట్ నియామకాల కమిటీ జనవరి 19న ఆమోదించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ డీజీగా ఉన్న ఎస్‌పీ సింగ్ జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేయనుండగా కేంద్రం తాజా నియామకం చేపట్టింది.
1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లఖ్టాకియా ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.‘బ్లాక్ క్యాట్స్’ గా పిలిచే ఎన్‌ఎస్‌జీ గుర్‌గావ్‌లోని మనేసర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎస్‌జీ డెరైక్టర్ జనరల్ నియామకం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : సుదీప్ లఖ్టాకియా

ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఓపీ రావత్
కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ప్రస్తుత కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. జనవరి 22న పదవీ విరమణ చేసిన ప్రస్తుత సీఈసీ ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘంలో ప్రస్తుతం సునీల్ అరోరా మరో కమిషనర్‌గా ఉన్నారు. రావత్ ఈ పదవిలో 2018 డిసెంబర్ వరకు కొనసాగుతారు.
1953లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన రావత్ 1977లో మధ్యప్రదేశ్ కేడర్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ విభాగంలో కార్యదర్శిగా, రక్షణ శాఖలో డెరైక్టర్‌గా పనిచేశారు. 2004-08 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్‌కు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
1980 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన లావాసా కేంద్ర ఆర్థిక, పర్యావరణం, పౌర విమానయానం, విద్యుత్, హోం మంత్రిత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన ఎన్నికల కమీషనర్ నియామకం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఓం ప్రకాశ్ రావత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రస్తుత సీఈసీ ఏకే జోతి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో

హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ‘సియట్’ ఒప్పందం
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’ జత కట్టింది. ఈ సంస్థకు అంబాసిడర్‌గా ఎంపికై న హర్మన్... ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్ బ్యాట్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది హర్మన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్‌‌స ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందిబెన్
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియ మితులయ్యారు. రాష్ర్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

కార్టూనిస్ట్ చండీ లాహిరీ కన్నుమూత
ప్రముఖ కార్టూనిస్టు, రచయిత చండీ లాహిరీ (87) జనవరి 18న కోల్‌కతాలో మరణించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాహిరీ 1952లో పాత్రికేయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. తర్వాత కొన్నేళ్లకు పూర్తి స్థాయి కార్టూనిస్టుగా మారి విశేష కీర్తి గడించారు. దీంతోపాటు ఆయన అనేక పుస్తకాలను రచించారు.

ఇస్రో చైర్మన్‌గా శివన్
Current Affairs
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె.శివన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శివన్‌ను ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా నియమిస్తూ జనవరి 10న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఏఎస్ కిరణ్‌కుమార్ పదవీకాలం జనవరి 18తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న శివన్ ఇస్రో ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడేళ్లపాటు శివన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు.
ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన శివన్..బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స(ఐఐఎస్‌సీ)లో మాస్టర్స్ చేశారు. ఇస్రో 1982లో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) ప్రాజెక్టుతో శివన్ కెరీర్ ప్రారంభమైంది. భారత జాతీయ ఇంజనీరింగ్ అకాడమీతో పాటు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో శివన్ సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో చైర్మన్‌గా శివన్
ఎప్పుడు : జనవరి 10
ఎందుకు : జనవరి 18న ప్రస్తుత చైర్మన్ కిరణ్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో

బ్రిటన్ కేబినెట్‌లో నారాయణమూర్తి అల్లుడు
టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్‌కు బ్రిటన్ మంత్రి మండలిలో చోటు దక్కింది. ఇటీవల ప్రధాని థెరిసా మే చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రిషితో పాటు మరో ఇద్దరు భారత మూలాలున్న ఎంపీలను కూడా మంత్రి పదవులు వరించాయి. రిచ్‌మాండ్ (యార్క్‌షైర్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిషి సునాక్, స్థానిక ప్రభుత్వం, కమ్యూనిటీస్ శాఖకు సహాయ మంత్రిగా నియమితులయ్యారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన కృషిచేశారన్న పేరుంది. నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని రిషి వివాహమాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ కేబినెట్‌లో భారత మూలాలు ఉన్న ఎంపీ రిషి సునాక్
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రిషి సునాక్.. టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు

ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్‌లతో కూడిన కొలీజియం జనవరి 11న సమావేశమై పలు నియామకాలకు ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులతో పాటు పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలను ఆమోదిస్తూ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటిలో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కేంద్రం ఆమోదముద్ర అనంతరం కొలీజియం సిఫార్సులు రాష్ట్రపతికి చేరతాయి. అనంతరం రాష్ట్రపతి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు.
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దాదాపు ఏడాదిన్నరగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ సీజేగా రానున్న నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారని తెలిసింది. హైకోర్టు విభజన పూర్తయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తి
ఎవరు : జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్
ఎక్కడ : హైదరాబాద్

సరోద్ పండితుడు దాస్‌గుప్తా కన్నుమూత
సరోద్ పండితుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా(84) దక్షిణ కోల్‌కతాలో 2018 జనవరి 15న మరణించారు. ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత.

విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే
Current Affairs
భారత విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న ఎస్ జయశంకర్ పదవీకాలం జనవరి 28తో ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ఆయన 1981 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాంగ శాఖ కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : విజయ్ కేశవ్ గోఖలే

ఇన్ఫీ సీఈవో పరేఖ్‌కు రూ.16.25 కోట్ల ప్యాకేజీ
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వాహకఅధికారి (సీఈవో) సలీల్ పరేఖ్.. ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం తీసుకోనున్నారు. స్థిరవేతనంగా రూ.6.50 కోట్లు, భత్యాలరూపంలో మరో రూ.9.25 కోట్లను అదనంగా ఏడాది చివరన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు కిరణ్ మజుందార్ వెల్లడించారు. ఇది వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసిన విశాల్ సిక్కాకు గత ఏడాది రూ.42.92 కోట్లను చెల్లించారు. మరోవైపు విప్రో కంపెనీ సీఈవో అబిదాలి నిమూచ్‌వాలా ఏడాదికి రూ.12.71 కోట్లను ఆర్జిస్తున్నారు. స్టాక్ ఆప్షన్ల కింద సలీల్‌కు అదనంగా మరో రూ.3.25 కోట్లు ఇవ్వనున్నారు. ఆయన ఐదేళ్లపాటు ఇన్ఫోసిస్‌కు సేవలు అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ సీఈవోకు ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : సలీల్ పరేఖ్

దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష
21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ జనవరి 6న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు

వ్యోమగామి జాన్ యంగ్ కన్నుమూత
అత్యధిక పర్యాయాలు అంతరిక్షయానం చేయటంతోపాటు, చంద్రునిపై నడిచిన ప్రముఖ అమెరికా వ్యోమగామి జాన్ వాట్స్ యంగ్(87) కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన హూస్టన్‌లో తన నివాసంలో జనవరి 5న మృతి చెందారని నాసా తెలిపింది. అంతరిక్షయానంలో లెజెండ్‌గా అందరూ పిలిచే జాన్ యంగ్ నేవీ ఆఫీసర్, టెస్ట్ పెలైట్, ఏరోనాటికల్ ఇంజినీర్ కూడా. ఆయన పేరిట అనేక రికార్డులున్నాయి. జెమిని, అపొలోతోపాటు పలు అంతరిక్ష యాత్రల్లో కీలకంగా వ్యవహరించారు. 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత జెమిని మిషన్‌లో ఆయన కూడా సభ్యుడే. అంతరిక్షంలోకి ఆరుసార్లు వెళ్లి వచ్చిన ఏకైక వ్యోమగామిగా జాన్ రికార్డు నెలకొల్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక సార్లు అంతరిక్షయానం చేసిన వ్యోమగామి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : జాన్ వాట్స్ యంగ్

సిక్కిం ప్రచారకర్తగా రెహ్మాన్
సిక్కిం రాష్ట్ర ప్రచారకర్తగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నియమితులయ్యారు. గ్యాంగ్‌టక్‌లోని పాల్జోల్ స్టేడియంలో జనవరి 9న జరిగిన రెడ్ పాండా వింటర్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఇక నుంచి ఏఆర్ రెహ్మాన్ సిక్కిం పర్యాటక, వ్యాపార అంశాలలో ప్రచార కర్తగా కొనసాగుతారని ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో తొలి ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న సిక్కింకు రెహ్మాన్ అంబాసిడర్‌గా కొనసాగడం.. ఆ రాష్ట్ర పర్యాటక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిక్కిం ప్రచారకర్తగా ఏఆర్ రెహ్మాన్
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్

సంగీత విధ్వాంసురాలు రాధా విశ్వనాథన్ కన్నుమూత
కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు. ఈమె ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి కూతురు.

రాజకీయాల్లోకి రజనీకాంత్
Current Affairs
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు డిసెంబర్ 31న ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు హీనదశకు చేరుకున్న నేపథ్యంలో ఓ సరైన రాజకీయ వేదిక అవసరం ఉందని.. సొంతగా ఓ పార్టీ పెట్టి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ తెలిపారు.

డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా రాజిందర్ ఖన్నా
నిఘా ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2017 ఆగస్టులో అరవింద్ గుప్తా పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంటోంది. 1978 బ్యాచ్‌కు చెందిన ఖన్నాకు పాకిస్తాన్ వ్యవహారాలు, ఇస్లాం ఉగ్రవాదంపై పూర్తి అవగాహన ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిన ఖన్నా నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ పచ్చజెండా ఊపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా

విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలే
సీనియర్ దౌత్యవేత్త విజయ్ కేశవ్ గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితుల య్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
Published date : 05 Jan 2018 03:22PM

Photo Stories