Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు

1991 ఆగస్ట్ 3వ తేదీన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ రాయ్ వారణాసిలోని ఆయన ఇంటిగేటు వద్దే హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అన్సారీతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవధేశ్ రాయ్ హత్య కేసును విచారించిన ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి అవనీశ్ గౌతమ్ అన్సారీకి జీవిత ఖైదుతోపాటు రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు లాయర్ ఒకరు చెప్పారు.
బందా జైలులో ఉన్న అన్సారీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. వేర్వేరు రాష్ట్రాల్లో 61కి పైగా క్రిమినల్ కేసులను అన్సారీ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆరు కేసుల్లో దోషిగా తేలింది. ఒక కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో ఘాజీపూర్ కోర్టు అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూపీలోని మౌసదర్ స్థానం నుంచి అయిదు పర్యాయాలు అన్సారీ ఎమ్మెల్యే అయ్యాడు. 2022 ఎన్నికల్లో ఆయన కొడుకు అబ్బాస్ అన్సారీ సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.