Skip to main content

ఏప్రిల్ 2018 వ్యక్తులు

ఎఫ్‌ఎల్‌వో నేషనల్ ప్రెసిడెంట్‌గా పింకీ రెడ్డి
Current Affairs ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో)కు నేషనల్ ప్రెసిడెంట్‌గా పారిశ్రామికవేత్త పింకీ రెడ్డి ఎంపికయ్యారు. ఎఫ్‌ఎల్‌వో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హర్జిందర్ కౌర్ తల్వార్, వైస్ ప్రెసిడెంట్‌గా జాహ్నవిలు నియమితులయ్యారు. హైదరాబాద్‌కి చెందిన పింకీ రెడ్డి ప్రస్తుతం ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చాప్టర్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : పింకీ రెడ్డి

కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్
కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్ నియామకానికి 53 దేశాధినేతలు ఆమోదముద్ర వేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సులో భాగంగా ఏప్రిల్ 20న విండ్‌సర్ కోటలో రహస్యంగా జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామన్వెల్త్ చీఫ్ ఎన్నిక
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ప్రిన్స్ చార్లెస్

జస్టిస్ రాజిందర్ సచార్ కన్నుమూత
ప్రముఖ హక్కుల కార్యకర్త, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజిందర్ సచార్ (94) ఏప్రిల్ 20న కన్నుమూశారు. సచార్ 1985లో ఆగస్టు 6 నుంచి డిసెంబర్ 22 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై యూపీఏ ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కి అధిపతిగా వ్యవహరించారు. ఈ కమిటీ 2006 నవంబర్‌లో ముస్లింల స్థితిగతులపై పార్లమెంటుకు నివేదికను సమర్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జస్టిస్ రాజిందర్ సచార్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సచార్ కమిటీ అధిపతి

ప్రముఖ పాత్రికేయుడు షెణాయ్ మృతి
ప్రముఖ పాత్రికేయుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత టి.వి.ఆర్.షెణాయ్ (77) ఏప్రిల్ 17న బెంగళూరులో మరణించారు. ఆయన వీక్ పత్రికకు సంపాదకుడిగా, ప్రసార భారతి కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు. 2003లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.

క్యూబా అధ్యక్షుడిగా డియాజ్ కానెల్
క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నాయకుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ ఏప్రిల్ 18న ఎన్నికయ్యారు. 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న కానెల్ ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో బాధ్యతలు చేపడతారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యూబా అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : మిగ్వెల్ డియాజ్ కానెల్

శ్వేత దేవత సిస్టర్ ఆగ్నెస్ మృతి
కెనడా సైనికులు శ్వేత దేవతగా పిలుచుకునే సిస్టర్ ఆగ్నెస్-మేరీ వలోయిస్(103) ఏప్రిల్ 20న మరణించారు. ఆమె రెండో ప్రపంచ యుద్ద సమయంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సంకీర్ణ దళాలకు చెందిన కెనడా సైనికులకు విశేష సేవలందించారు.

బ్యాంక్స్ బోర్డ్ చైర్మన్‌గా భాను ప్రతాప్ శర్మ
Current Affairs బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చైర్మన్‌గా పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) మాజీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మను కేంద్రం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. శర్మ ప్రస్తుతం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ చైర్మన్‌గా ఉన్నారు. బీబీబీ తొలి చైర్మన్ వినోద్ రాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంక్స్ బోర్డ్ చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : భాను ప్రతాప్ శర్మ

వీహెచ్‌పీ అధ్యక్షుడిగా వీఎస్ కోక్జె
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఏప్రిల్ 10న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. దీంతో మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. అధ్యక్ష ఎన్నికలకు ఆయన నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓడిపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. తొగాడియా 2011 నుంచి వీహెచ్‌పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె

ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా శేఖర్‌గుప్తా
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఎన్నికయ్యారు. శేఖర్‌గుప్తా ప్రస్తుతం బిజినెస్ స్టాండర్డ్‌లో ‘నేషనల్ ఇంట్రెస్ట్’ కాలమిస్ట్‌గా, ‘దిప్రింట్’ న్యూస్ పోర్టల్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పని చేస్తున్నారు. గిల్డ్ ప్రధాన కార్యదర్శిగా బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ ఏకే భట్టాచార్య, కోశాధికారిగా న్యూస్‌ఎక్స్ ఎడిటర్ (న్యూస్ ఎఫైర్స్) షీలా భట్ ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : శేఖర్ గుప్తా

ప్రపంచ వృద్ధుడుగా నొనకా
జపాన్‌కు చెందిన 112 ఏళ్ల మసాజో నొనకా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏప్రిల్ 10న ధ్రువీకరణ పత్రం అందించింది.

మలబార్ గోల్డ్ అంబాసిడర్‌గా మానుషి చిల్లర్
Current Affairs ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌‌స మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 5 న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ చేతుల మీదుగా మానుషి బ్రాండ్ అంబాసిడర్ ఒప్పంద పత్రాలను స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : మిస్ వరల్డ్ మానుషి చిల్లర్

కృష్ణజింకల కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(52)కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 1998 నాటి కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల శిక్ష విధించింది. ‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నా’ అని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి తీర్పు వెలువరించారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సహ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలతో పాటు స్థానిక వ్యక్తి దుష్యంత్ సింగ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
కేసు నేపథ్యం
1998, అక్టోబర్ 2: కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, సోనాలీ బెంద్రె, టబు, నీలంపై రాజస్తాన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు.
2006, ఏప్రిల్ 10: సల్మాన్‌ను దోషిగా ప్రకటించి అయిదేళ్లు జైలు శిక్ష, 25 వేల జరిమానా విధించిన ట్రయల్ కోర్టు.
2006, ఆగస్టు 31: ట్రయల్ కోర్టు తీర్పుపై రాజస్తాన్ హైకోర్టు స్టే.
2016, జులై 25: సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు.
2016, నవంబర్ 11: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన రాజస్తాన్ ప్రభుత్వం.. కేసును మళ్లీ విచారించాలని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు.
సల్మాన్‌పై ఉన్న ఇతర కేసులు
కృష్ణ జింకల కేసు (1998)
హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్తాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సల్మాన్‌ను జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
అక్రమ ఆయుధాల కేసు (1998)
కృష్ణ జింకల్ని చంపే సమయంలో సల్మాన్ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదైంది. కృష్ణ జింకల్ని వేటాడడానికి అమెరికాలో తయారైన .22 రైఫిల్, .32 రైఫిల్ వాడారని అభియోగాలు నమోదయ్యాయి. 2017, జనవరి 18న కోర్టు ఈ కేసును కొట్టేసింది.
చింకారా కేసు (1998)
హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలోనే సల్మాన్ మూడు చింకారా (లేళ్లు)లను వేటాడారని మరో కేసు నమోదైంది. సల్మాన్ ఖాన్ భావాడ్ గ్రామంలో రెండు లేళ్లు, మాంథానియా గ్రామంలో మరో లేడిని వేటాడారని వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2006లో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించినా, 2017లో రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
హిట్ అండ్ రన్ కేసు (2002)
ముంబైలోని బాంద్రా వీధుల్లో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని సల్మాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినా.. 2015లో ముంబై హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా తేల్చింది.
జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ శిక్ష అనుభవించడం ఇది నాలుగోసారి.. వన్యప్రాణుల్ని వేటాడిన కేసుల్లో గతంలో 1998, 2006, 2007ల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్ జైల్లో గడిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు, రాజస్తాన్
ఎందుకు : రెండు కృష్ణ జింకల్ని కాల్చి చంపినందుకు

నాస్కామ్ చైర్మన్ గా రిషద్ ప్రేమ్‌జీ
నేషనల్ ఆసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) చైర్మన్‌గా విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ ఏప్రిల్ 10న నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న రామన్ రాయ్ స్థానంలో రిషద్ బాధ్యతలుస్వీకరిస్తారు. నాస్కామ్ వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేశ్ నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాస్కామ్ చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : రిషద్ ప్రేమ్‌జీ

మేడమ్ టుస్సాడ్స్ లో కోహ్లి బొమ్మ
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు బొమ్మను న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్‌‌స మ్యూజియంలో ప్రతిష్టించనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు మార్చి 28న ప్రకటించారు. ఈ మ్యూజియంలో కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ విగ్రహాలు ఉన్నాయి. విరాట్ కోహ్లి ఇప్పటికే ఐసీసీ నుంచి ‘వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, బీసీసీఐ నుంచి ‘ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మేడమ్ టుస్సాడ్స్ లో మరో క్రికెటర్ మైనపు బొమ్మ
ఎప్పుడు : త్వరలో
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎక్కడ : న్యూఢిల్లీ

ఫోర్బ్స్ జాబితాలో హెచ్‌సీయూ విద్యార్థి
Current Affairs హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రాహుల్ గాయమ్‌కి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. ఏసియా పరిధిలో ఉన్న 300 మంది యంగ్ ఇన్నోవేటర్లలో రాహుల్ తొలి 30 మందిలో ఒకరిగా నిలిచారు. ఈ మేరకు ఫోర్బ్స్ ‘30 అండర్-30 ఏసియా 2018’ జాబితాను విడుదల చేసింది.
రాహుల్ హెచ్‌సీయూలో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ కోర్సును పూర్తి చేశారు. 2013లో హెచ్‌సీయూలో పీహెచ్‌డీ కోర్సులో చేరారు. గాయమ్ సోదరులు రాహుల్ గాయమ్, రాజా గాయమ్‌లు కలసి 2010లో టీ-హబ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ను (గాయమ్ మోటార్స్) రూపొందించారు. దీని ద్వారానే ప్రపంచంలోనే బ్యాటరీతో నడిచే తొలి ఆటోరిక్షా లీ-అయాన్ ను రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫోర్బ్స్ జాబితాలో హెచ్‌సీయూ విద్యార్థి
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : రాహుల్ గాయమ్
ఎక్కడ : ఫోర్బ్స్-30 అండర్-30 ఏసియా 2018

నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్
భారత ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ నియమితులయ్యారు. ఈమె ఇంతకుముందు ఇంటెల్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాస్కామ్ ప్రెసిడెంట్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 2న
ఎవరు : దేవయాని ఘోష్

పద్మభూషణ్ అందుకున్న ధోని
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నాడు. మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 2న జరిగిన వేడుకలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశాడు. 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సారథిగా వ్యవహరించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పద్మభూషణ్ అందుకున్న క్రికెటర్
ఎప్పుడు : ఏప్రిల్ 2న
ఎవరు : మహేంద్ర సింగ్ ధోని
ఎక్కడ : రాష్ట్రపతి భవన్‌లో

ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్‌గా ద్రవిడ్
ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓంప్రకాశ్ రావత్ మార్చి 27న న్యూఢిల్లీలో ప్రకటించారు. ద్రవిడ్ ఇప్పటికే ధూమపాన నిషేధం, ఆరోగ్య జాగృతి వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పీఎం సహాయనిధికి సచిన్‌వేతనం
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా అందుకున్న వేతనం, ఇతర భత్యాలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. సచిన్ ఆరేళ్లలో వేతనభత్యాల కింద దాదాపు రూ.90 లక్షలు అందుకున్నారు.

ఎన్‌టీఏ డెరైక్టర్ జనరల్‌గా జోషి
జాతీయ పరీక్షా సంస్థ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డెరైక్టర్ జనరల్‌గా వినీత్ జోషి మార్చి 30న నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన వినీత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

పౌరహక్కుల ఉద్యమకారిణి లిండా మృతి
పౌరహక్కుల ఉద్యమకారిణి లిండా బ్రౌన్(76) అమెరికాలోని కెన్సాస్‌లో మార్చి 25న మరణించారు. ఆమె 1954లో అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో జాతి వివక్షపై న్యాయపోరాటం చేసి అనూహ్య విజయం సాధించారు.
Published date : 04 May 2018 02:51PM

Photo Stories