డిసెంబరు 2018 వ్యక్తులు
అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా కొనసాగుతున్న నవ్‌తేజ్ సర్నా స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన హర్షవర్ధన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. గతంలో థాయ్‌లాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో భారత రాయబారిగా సేవలందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాలో భారత రాయబారి నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : హర్షవర్ధన్ ష్రింగ్లా
టైమ్స్ జాబితాలో భారత సంతతి విద్యార్థులు
టైమ్ మ్యాగజైన్ డిసెంబర్ 20న ప్రకటించిన ‘అత్యంత ప్రభావశీల టీనేజర్లు-2018’ జాబితాలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు చోటు సంపాదించారు. వారి వారి విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఇండో-అమెరికన్ కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, బ్రిటిష్-ఇండియన్ అమికా జార్జ్‌లు ఈ జాబితాలో మొదటి 25 స్థానాల్లో నిలిచారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కావ్య మెదడు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు కణజాలాన్ని క్షుణ్నంగా స్కాన్ చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. అలాగే ఎనిమిదో తరగతి చదువుతున్న రిషబ్ ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశాడు. అమికా జార్జ్ బ్రిటన్‌లో మహిళల కోసం ఫ్రీ పీరియడ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ జాబితాలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, అమికా జార్జ్‌ల
వాలీబాల్ ఆటగాడు కోదండరామయ్య కన్నుమూత
ప్రముఖ వాలీబాల్ ఆటగాడు, క్రీడా కురువృద్ధుడు కోదండరామయ్య (81) విశాఖపట్నంలో డిసెంబర్ 20న కన్నుమూశారు. కృష్ణాజిల్లాలో నందిగామ మండలం సెనగపాడుకు చెందిన కోదండరామయ్య గుంటూరు లయోలా కళాశాలలో ఇంటర్, ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ అభ్యసించారు. 1963లో పటియాలాలోని భారత క్రీడా శిక్షణా సంస్థలో డిప్లొమా అందుకున్నారు. 1971లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో వాలీబాల్ శిక్షకునిగా బాధ్యతలు చేపట్టారు. 1982 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ సంఘానికి అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం సేవలందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ వాలీబాల్ ఆటగాడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కోదండరామయ్య (81)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా రామన్
భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్‌ను నియమిస్తున్నట్లు డిసెంబర్ 20న బీసీసీఐ ప్రకటించింది. 1992-93 సీజన్‌లో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన 53 ఏళ్ల రామన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ జట్టు తరఫున 11 టెస్టులు, 27 వన్డేలాడిన ఆయన గతంలో తమిళనాడు, బెంగాల్ రంజీ జట్లతో పాటు భారత అండర్-19 జట్టుకూ కోచ్‌గా పనిచేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : డబ్ల్యూవీ రామన్
ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓగా నీలాంజన్ రాయ్
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా (సీఎఫ్‌ఓ) నీలాంజన్ రాయ్‌ను నియమిస్తున్నట్లు డిసెంబర్ 20న ఆ సంస్థ ప్రకటించింది. దీంతో 2019 మార్చి 1న ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓగా రాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్ గ్లోబల్ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఎయిర్‌టెల్‌లోనే దాదాపు 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అంతకుముందు యూనిలివర్‌లో సుమారు 15 ఏళ్లు పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : నీలాంజన్ రాయ్
అమెరికా రక్షణ మంత్రి మేటిస్ రాజీనామా
అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్ డిసెంబర్ 20 తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాలను విభేదిస్తూ మేటిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 2019, ఫిబ్రవరి 28తో మేటిస్ పదవికాలం ముగియనుంది. భారత్‌కు మంచి మిత్రుడైన మేటిస్ పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా సైనిక కమాండ్ పేరును భారత్-పసిఫిక్ కమాండ్‌గా మార్చడంలో విశేష కృషి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా రక్షణ మంత్రి రాజీనామా
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : జేమ్స్ మేటిస్
ఎక్కడ : అమెరికా
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా రిలయన్‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఆసియాలో 128 మంది అత్యంత సంపన్నులతో రూపొందించిన జాబితాను బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ డిసెంబర్ 24న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం సుమారు 43.2 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అగ్రస్థానం పొందగా 35 బిలియన్ డాలర్లతో చైనాకి చెందిన ఈ- కామర్స్ సంస్థ ఆలీబాబా గ్రూప్ చీఫ్ జాక్ మా రెండోస్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియాలో అత్యంత సంపన్నుడు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముకేశ్ అంబానీ
ఎక్కడ : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో
కార్పొరేషన్ బ్యాంకు ఎండీగా పీవీ భారతి
ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా పీవీ భారతిని నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డిసెంబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. భారతి ప్రస్తుతం కెనరాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బిరూపాక్ష మిశ్రా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాలకృష్ణ ఆల్సే నియమితులయ్యారు. అలాగే కార్పొరేషన్ బ్యాంకు మరో జనరల్ మేనేజర్ కె.రామచంద్రన్‌ను అలహాబాద్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కార్పొరేషన్ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : పీవీ భారతి
ప్రముఖ మతగురువు షరీఫ్ కన్నుమూత
ప్రముఖ మతగురువు మౌలానా మహ్మద్ ఖాజా షరీఫ్ (82) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో డిసెంబర్ 14న కన్నుమూశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోట్లపల్లిలో జన్మించిన ఆయన ధార్మిక విద్యలో పట్టభద్రులయ్యారు. తర్వాత అరబ్ భాషలో ప్రావీణ్యం సాధించారు. 1966లో జామియా నిజామియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో షేకుల్ హదీస్ (మహ్మద్ ప్రవక్త ప్రవచనాల బోధకులు) అధ్యాపకుడిగా చేరారు. 50 ఏళ్లుగా జామియాలో వేలాది మందికి ప్రవక్త బోధనలను చే సిన షరీఫ్ పలు ధార్మిక పుస్తకాలను రాశారు. అరబ్ దేశాల్లో ప్రవక్త బోధనలను బోధించిన షరిఫ్‌కు దేశవిదేశాల్లో అనేక మంది శిష్యులు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ మతగురువు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : మౌలానా మహ్మద్ ఖాజా షరీఫ్ (82)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
ఐబీ చీఫ్ రాజీవ్ పదవీకాలం పొడిగింపు
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ రాజీవ్ జైన్, రీసెర్చ్ అండ్ అనాలిసిన్ వింగ్(రా) కార్యదర్శి అనిల్ ధస్మనాల పదవీకాలాన్ని ఆరు నెలలపాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసింది. ధస్మనా 2018, డిసెంబర్ 29న, జైన్ 2018, డిసెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐబీ చీఫ్ రాజీవ్ జైన్, రా కార్యదర్శి అనిల్ ధస్మనా పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : కేంద్రప్రభుత్వం
మిస్ ఇండియా ‘వరల్డ్‌వైడ్’గా శ్రీ సైనీ
మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం భారతీయ అమెరికన్ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో డిసెంబర్ 15న జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌కు చెందిన అనూషా సరీన్ మొదటి, రెండో రన్నర్ అప్స్‌గా ఎంపికయ్యారు. శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్ చేయవద్దని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు: శ్రీ సైనీ
మిజోరం కొత్త సీఎంగా జోరంథంగా ప్రమాణ స్వీకారం
ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా డిసెంబర్ 15న ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్‌లోని రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవలి ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 26 సీట్లు గెలవడం తెలిసిందే. జోరంథంగా 1998, 2003ల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురు కేబినెట్ మంత్రులు. తాన్ల్యూయాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతపదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరిన లాల్‌జిర్లియానాకు కూడా కేబినెట్ మంత్రి పదవి దక్కడం గమనార్హం. తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బైబిల్‌లోని వాక్యాలను చదివి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలను కూడా ఆలపించారు. తొలిసారిగా జోరంథంగా, ఆయన మంత్రులు మిజో భాషలో ప్రమాణం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిజోరం కొత్త సీఎం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు: జోరంథంగా
కొత్త పార్టీని ప్రారంభించిన కార్తీక్
సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఇంతకుముందు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత నాడాళుమ్ మక్కళ్ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆ తరువాత కార్తీక్ కొన్ని సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్ మనిద ఉరిమై కాక్కుం కట్చి పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే డిసెంబర్ 15న నెల్లైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరువాత తాను సొంతంగా ప్రారంభించిన నాడాళుం మక్కళ్ కట్చిలోని సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీ
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు: సీనియర్ నటుడు కార్తీక్
13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీ
9 ఏళ్లకే మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 ఏళ్లకే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని దుబాయ్‌లో స్థాపించాడు. కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేశ్ ఐదేళ్లకే కంప్యూటర్ వాడటం ప్రారంభించాడు. ఈ బుడతడు ఇప్పటికే పలు కంపెనీలకు వెబ్‌సైట్లు, లోగో లు రూపొందిస్తున్నాడు. ఆదిత్యన్ కేరళలోనే పుట్టినా తన తల్లిదండ్రులతో కలిసి 8 ఏళ్ల క్రితం నుంచి దుబాయ్‌లో ఉంటున్నాడు. తాజాగా అతను ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని అక్కడే స్థాపించాడు. ప్రస్తుతానికి ఇందులో ముగ్గురు ఉద్యోగులుండగా వారంతా ఆదిత్యన్ సహ విద్యార్థులు, స్నేహితులే. కంపెనీకి యజమాని అవ్వాలంటే 18 ఏళ్ల కనీస వయసు ఉండాలనీ, అయితే ట్రైనెట్ సొల్యూషన్స్ కూడా కంపెనీలాగే పనిచేస్తుందనీ, ఇప్పటికే 12 మంది క్లయింట్లకు ఉచితంగా సేవలందించామని ఆదిత్యన్ తెలిపాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 13 ఏళ్లకే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపన
ఎందుకు: ట్రైనెట్ సొల్యూషన్స్
ఎవరు: ఆదిత్యన్ రాజేశ్
మిస్ యూనివర్స్‌గా కాట్రియానా గ్రే
మిస్ యూనివర్స్-2018గా ఫిలిప్పీన్స్ చెందిన కాట్రియానా గ్రే నిలిచింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో డిసెంబర్ 17న జరిగిన అందాల పోటీల్లో కాట్రియానా విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2017 మిస్ యూనివర్స్‌గా నిలిచిన డేమీ లీ నీల్‌పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఈ అందాల పోటీల్లో 93 దేశాలకు చెందిన యువతులు పాల్గొనగా తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిస్ యూనివర్స్-2018
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కాట్రియానా గ్రే
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
ఫిక్కీ అధ్యక్షునిగా సందీప్ సోమానీ
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షునిగా శానిటరీ వేర్ ఉత్పత్తి సంస్థ హెచ్‌ఎస్‌ఐఎల్ సీఎండీ సందీప్ సోమానీ ఎంపికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించిన ఆయన డిసెంబర్ 17న ప్రెసిడెంట్ పదవికి ఎన్నికై నట్లు ఫిక్కీ ప్రకటించింది. అలాగే ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిక్కీ నూతన అధ్యక్షుడు
ఎప్పుడు : సందీప్ సోమానీ
ఎవరు : డిసెంబర్ 17
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గహ్లోత్
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా సచిన్ రాజేశ్ పైలట్ ప్రమాణం చేశారు. జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్‌సింగ్ గహ్లోత్, పైలట్‌తో ప్రమాణం చేయించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : అశోక్ గహ్లోత్
ఎక్కడ : జైపూర్, రాజస్థాన్
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం
మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం కమల్‌నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కమల్‌నాథ్
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్
ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్ జునేజా ఇండోర్‌స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బఘేల్‌తో ప్రమాణం చేయించారు. బఘేల్‌తోపాటు టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా బఘేల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) దుర్గ్ జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న భూపేశ్ బఘేల్ జన్మించాడు. 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1994-95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దుర్గ్ జిల్లా పటాన్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికై న బఘేల్ అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సంఘ సంస్కర్తగా పేరొందిన బఘేల్ పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్(2000, నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు)లో సామూహిక వివాహాలు జరిపించారు. బఘేల్‌కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భూపేశ్ బఘేల్
ఎక్కడ : రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
టైమ్‌లెస్ లక్ష్మణ్ పుస్తకావిష్కరణ
ప్రముఖ దివంగత వ్యంగ్య చిత్రకారుడు, ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ జీవితంపై రాసిన ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 18న ఆవిష్కరించారు. మంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనకు లక్ష్మణ్ కార్టూన్లే సులువైన మార్గమని అన్నారు.
మరోవైపు రిపబ్లిక్ టీవీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఉత్తుంగా భారత్’ సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. మహారాష్ట్రలో రూ. 41 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ. 33 వేల కోట్లతో ముంబై మహానగరంలో ఇళ్ల సముదాయాలు, రెండు మెట్రో రైల్ లైన్లను నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్‌లెస్ లక్ష్మణ్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
సీబీఐ అడిషనల్ డెరైక్టర్‌గా నాగేశ్వరరావు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అదనపు డెరైక్టర్‌గా సీబీఐ తాత్కాలిక డెరైక్టర్ ఎం.నాగేశ్వరరావు పదోన్నతి పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఈ మేరకు డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా కేడర్ 1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు... సీబీఐలో వెలుగుచూసిన అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థకు తాత్కాలిక చీఫ్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 2016లో సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా ఆయన చేరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ అదనపు డెరైక్టర్‌గా ఎం.నాగేశ్వరరావుకు పదోన్నతి
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్రప్రభుత్వం
అదనపు సొలిసిటర్ జనరల్‌గా మాధవి దీవాన్
భారత అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ)గా మాధవి గొరాడియా దీవాన్‌ను నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మాధవి ఏఎస్‌జీగా కొనసాగనున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వానికి ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే సీనియర్ మహిళా న్యాయవాదులు పింకీ ఆనంద్, మణీందర్ ఆచార్యలను కూడా ప్రభుత్వం ఏఎస్‌జీలుగా నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : మాధవి గొరాడియా దీవాన్
ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల్లో నలుగురు భారతీయులు
ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘అత్యంత శక్తివంతమైన మహిళలు-2018’ జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు చోటు లభించింది. డిసెంబర్ 6న విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి హెచ్‌సీఎల్ రోష్ని నాడార్ మల్హోత్రా, బయో కాన్ కిరణ్ మజుందార్ షా, హిందుస్థాన్ టైమ్స్ శోభన భర్తియ, సినీతార ప్రియాంక చోప్రా ఉన్నారు. ఈ జాబితాలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళలు-2018 జాబితా
ర్యాంకు | పేరు | దేశం |
1 | ఏంజెలా మెర్కెల్ | జర్మనీ |
2 | థెరిసా మే | బ్రిటన్ |
3 | క్రిస్టినా లగార్డే | ఫ్రాన్స్ |
4 | మేరి బర్రా | అమెరికా |
5 | అభిగైల్ జాన్సన్ | అమెరికా |
51 | రోష్ని నాడార్ మల్హోత్రా | భారత్ |
60 | కిరణ్ మజుందార్ షా | భారత్ |
88 | శోభన భర్తియ | భారత్ |
94 | ప్రియాంక చోప్రా | భారత్ |
ఏమిటి : ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళలు-2018’ జాబితాలో నలుగురు భారతీయులు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : రోష్ని నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభన భర్తియ, ప్రియాంక చోప్రా
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ప్రొఫెసర్ కృష్ణమూర్తి
కేంద్ర ప్రభుత్వ నూతన ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబర్ 7న కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ సీఈఏగా కృష్ణమూర్తి మూడు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ సీఈఏగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ 2018 జూలైలో తన పదవిని వీడారు. పారిశ్రామికాభివృద్ధి, విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రధాన ఆర్థిక విషయాల ప్రకటనల్లో కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన సూచనలు, సలహాలను సీఈఏ ఇవ్వాల్సి ఉంటుంది.
ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రస్తుతం బంధన్ బ్యాంకు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకు మేనేజ్‌మెంట్, ఆర్‌బీఐ అకాడమీ బోర్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ, ఆర్‌బీఐ బ్యాంకింగ్ గవర్నెన్స్ కమిటీల్లో పనిచేశారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్, రీసెర్చ్ విషయాల్లో సెబీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ నూతన ప్రధాన ఆర్థిక సలహాదారు నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్
ప్రఖ్యాత రైతు ‘నెల్’ జయరామన్ కన్నుమూత
ప్రఖ్యాత రైతు, శాస్త్రవేత్త ‘నెల్’ జయరామన్ (54) అనారోగ్యం కారణంగా చెన్నైలో డిసెంబర్ 6న కన్నుమూశారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తిరిత్తురైపూండి సమీపంలోని కట్టిమేడులో జన్మించిన జయరామన్ గత 15 ఏళ్లుగా తమిళనాడు వ్యాప్తంగా తిరుగుతూ 174 ప్రాచీన వరి రకాలను సేకరించారు. వీటిలో 169 వంగడాలకు జీవం పోశాడు. అరుదైన వరి వంగడాలను సేకరించి, వాటిని భద్రపరుస్తూ రావడం ద్వారా ప్రకృతి శాస్త్రవేత్తగా జయరామన్ పేరుగడించారు. నెల్ అంటే తమిళంలో వరి అని అర్థం. అందుకే ‘నెల్’ అనే పదం ఆయన ఇంటిపేరుగా మారింది. భారత రాష్ట్రపతి అవార్డుతోపాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి అనేక అవార్డులను జయరామన్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రఖ్యాత రైతు, శాస్త్రవేత్త కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : నెల్ జయరామన్ (54)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ప్రపంచ సుందరిగా వెనెస్సా పోన్స్
ప్రపంచ సుందరి-2018గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డి లియోన్ నిలిచింది. చైనాలోని సన్యా పట్టణంలో డిసెంబర్ 8న జరిగిన అందాల పోటీల్లో 26ఏళ్ల వెనెస్సా విజయం సాధించి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్‌స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచింది. అలాగే మారియా వసిల్విచ్(బెలారస్), కదీజా రాబిన్సన్(జమైకా), క్విన్ అబేనక్యో(ఉగాండా)లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో మొత్తం 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని భారత్‌కు చెందిన మానుషీ ఛిల్లర్ సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సుందరి-2018
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : వెనెస్సా పోన్స్ డి లియోన్
ఎక్కడ : సన్యా, చైనా
కేంద్ర మంత్రి కుష్వాహా రాజీనామా
కేంద్ర మానవ అభివృద్ధి వనరుల సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా డిసెంబర్ 10న తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి వర్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రబ్బర్ స్టాంపుగా మార్చేశారనీ, వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని కుష్వాహా తన రాజీనామా లేఖలో ఆరోపించారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ) అధ్యక్షుడైన కుష్వాహా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర మానవ అభివృద్ధి వనరుల సహాయ మంత్రి రాజీనామా
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : ఉపేంద్ర కుష్వాహా
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా
భారత రిజర్వు బ్యాంకు(ఆర్ బీఐ) గవర్నర్ ఉర్జిత్ రవీంద్ర పటేల్ డిసెంబర్ 10న తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2016 సెప్టెంబర్ 5న ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా మూడేళ్ల కాలానికి నియమితులైన పటేల్ పదవీకాలం ముగియడానికి మరో ఎనిమిది నెలలుండగానే పదవి నుంచి వైదొలిగారు.
1963, అక్టోబర్ 28న జన్మించిన పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కార్పొరేట్ కంపెనీల్లో పటేల్ పనిచేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్న కాలంలో డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులయ్యారు. పటేల్ హయాంలోనే 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎన్‌పీఏలు పెరిగిపోయిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలక అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐ మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ నెలకొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : ఉర్జిత్ రవీంద్ర పటేల్
ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మూడేళ్లపాటు పదవిలో ఉండనున్న దాస్ ఒడిశా నుంచి ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 2008లో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ పదవిని చేపట్టారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అనంతరం 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులయ్యాడు.
మరోవైపు భారత్‌లో జీ-20 సమావేశాల నిర్వహణ బాధ్యతలను శక్తికాంత దాస్ నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అంశాలు సహా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఆటుపోట్లను పరిష్కరించటంలో కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : శక్తికాంత దాస్
పీఎంఈఏసీ సభ్యుడు సుర్జిత్ భల్లా రాజీనామా
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) తాత్కాలిక సభ్యుడుగా ఉన్న ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్ భల్లా రాజీనామా చేశాడు. ఈ మేరకు తన పదవికి డిసెంబర్ 1న రాజీనామా చేసినట్లు డిసెంబర్ 11న భల్లా తెలిపాడు. ఆరుగురు సభ్యుల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి తాత్కాలిక సభ్యుడు రాజీనామా
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సుర్జిత్ భల్లా
ఆర్‌బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ బాధ్యతల స్వీకరణ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్‌గా శక్తింకాంత దాస్ డిసెంబర్ 12న బాధ్యతుల స్వీకరించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ... ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడటంతోపాటు విశ్వసనీయత, సమగ్రతను నిలబెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాతో ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : శక్తికాంత దాస్
సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ
భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న పదవీవిరమణ చేశారు. 1953, నవంబర్ 30న కేరళలో జన్మించిన జస్టిస్ జోసెఫ్ తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చి వరకు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చిత8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు.
2018, జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్ జోసెఫ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి పదవీ విరమణ
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : జస్టిస్ కురియన్ జోసెఫ్
యోగముద్రలో ఆర్చరీ కోచ్ చెరుకూరి రికార్డు
యోగముద్ర విన్యాసం చేయడం ద్వారా ఓల్గా ఆర్చరీ అకాడమీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ (జై ఆంధ్ర సత్యం) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ యూనియన్ బుక్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో నవంబర్ 29న సత్యనారాయణ యోగముద్ర కూడిన 4 రకాల హస్త కదలికల విన్యాసాలు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. 92 నిమిషాల్లో 10,832 సార్లు తన యోగముద్ర హస్త కదలికల విన్యాసాలను చేశాడు. జాతీయ ఆర్చరీ చాంపియన్ దివంగత చెరుకూరి ఓల్గా 14వ వర్ధంతి సందర్భంగా సత్యనారయణ ఈ విన్యాసాలు చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యోగముద్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : చెరుకూరి సత్యనారాయణ
అమెరికా ఫోర్బ్స్ మేగజీన్‌లో భారతీయ విద్యార్థి
అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్‌లో అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో భారతీయ విద్యార్థి బొల్లింపల్లి మేఘనకు చోటు లభించింది. 2018 మేలో ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్) అవార్డును సాధించి అత్యంత ప్రతిభాశాలిగా మేఘన గుర్తింపుపొందడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్ ఫేర్ పోటీల్లో 75 దేశాలతో మేఘన పోటీపడి ‘ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినం’ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగానికి అవార్డును గెలుచుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన మేఘన అమెరికాలోని సెంట్రల్ ఉన్నత పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. మేఘన తల్లిదండ్రులు బల్లింపల్లి వెంకటేశ్వరరావు, మాధవి. వీరు అమెరికాలో ఆర్క్‌నెస్‌లో లిటిల్‌రాక్‌లో నివసిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్‌లో అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో భారతీయ విద్యార్థి
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : బొల్లింపల్లి మేఘన
ఫోర్బ్స్ టెక్నాలజీలో భారత సంతతి మహిళలు
ఫోర్బ్స్ రూపొందించిన అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖులు-2018 జాబితాలో నలుగురు భారత సంతతికి చెందిన మహిళలు చోటు దక్కించుకున్నారు. సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, ఉబెర్ సీనియర్ డెరైక్టర్ కోమల్ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్ సహ వ్యవస్థాపకురాలు నేహ నార్ఖడే, డ్రాబ్రిడ్జ్ వ్యవస్థాపకురాలు, సీఈవో కామాక్షి శివరామకృష్ణన్ ఈ జాబితాలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ టెక్నాలజీ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు
ఎప్పుడు : నవంబర్ 30
ఎక్కడ : అమెరికా
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా రమఫోసా
2019 భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరు కానున్నారు. అర్జెంటీనాలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా రమఫోసాతో డిసెంబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని మోదీ ఆహ్వానించగా రమఫోసా అంగీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథి
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా
అమెరికా మాజీ అధ్యక్షుడు వాకర్ బుష్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్(94) పార్కిన్‌సన్ వ్యాధి కారణంగా డిసెంబర్ 1న కన్నుమూశారు. సీనియర్ బుష్‌గా పిలుచుకునే ఆయన 1924 జూన్ 24న మసాచుసెట్స్‌లో జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే నేవీలో పైలట్‌గా చేరిన బుష్ 1945లో బార్బరా పియర్స్‌ను పెళ్లాడారు. టెక్సాస్ నుంచి రెండుసార్లు రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 1989-1993 మధ్య కాలంలో అమెరికాకు 41వ అధ్యక్షుడిగా బుష్ సేవలందించారు. 2011లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను స్వీకరించారు. సీనియర్ బుష్ కొడుకు జార్జ్ బుష్ జూనియర్ అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్(94)
ఎక్కడ : అమెరికా
ఎందుకు : పార్కిన్‌సన్ వ్యాధి కారణంగా
నూతన సీఈసీగా అరోరా బాధ్యతల స్వీకరణ
భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ - చీఫ్ ఎలక్షన్ కమిషనర్)గా సునీల్ అరోరా డిసెంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు. 23వ ప్రధాన కమిషనర్‌గా నియమితులైన ఆయన 2021 అక్టోబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. 1980 ఐఏఎస్ బ్యాచ్ రాజస్తాన్‌క్యాడర్‌కు చెందిన అరోరా నేతృత్వంలోనే 2019లో 17వ లోక్‌సభకు, ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటివ రకు సీఈసీగా పనిచేసిన ఓపీ రావత్ డిసెంబర్ 1న పదవీ విరమణ చేశారు. రావత్ సీఈసీగా ఉండగా అరోరా ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన సీఈసీ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సునీల్ అరోరా
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సీఓఓగా శివరామన్
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా ఎన్.శివరామన్ డిసెంబర్ 3న నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్‌సకు ప్రెసిడెంట్‌గా, పూర్తి కాలపు డెరైక్టర్ గా శివరామన్ పనిచేశారు. మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సెక్యూరిటీస్ సర్వీసెస్, ఐఎస్‌ఎస్‌ఎల్ సెటిల్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ కంపెనీల్లో వాటాను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ విక్రయానికి పెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సీఓఓ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఎన్.శివరామన్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీకి పవన్ సింగ్ ఎన్నిక
అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య(ఐఎస్‌ఎస్‌ఎఫ్) న్యాయనిర్ణేతల కమిటీకి భారత షూటింగ్ బృందం మాజీ కోచ్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సంయుక్త కార్యదర్శి పవన్ సింగ్ ఎన్నికయ్యాడు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ కమిటీ ఎన్నికల్లో వివిధ దేశాల నుంచి మొత్తం 22 మంది పోటీ పడ్డారు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీలో చైర్మన్‌తోపాటు మరో ఏడుగురు సభ్యులు ఉంటారు.
ఇటివలే ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ న్యాయనిర్ణేతల కమిటీకి ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఎన్‌ఆర్‌ఏఐ సంయుక్త కార్యదర్శి పవన్ సింగ్
వార్తల్లోని వ్యక్తుల్లో మోదీకి అగ్ర స్థానం
దేశంలో 2018 ఏడాదిలో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు ‘యాహూ ఇయర్ ఇన్ రివ్యూ’ పేరుతో రూపొందించిన నివేదికను యాహూ డిసెంబర్ 4న విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండవ స్థానం, జస్టిస్ దీపక్ మిశ్రా మూడో స్థానం పొందారు. అలాగే ఆర్థిక నేరగాళ్లు అయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు వరుసగా 4వ, 5వ స్థానాల్లో ఉన్నారు.
యాహూ జాబితాలో వివిధ కేటగిరీల వారీగా వార్తల్లో నిలిచిన ప్రముఖుల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మొదటి స్థానం దక్కించుకున్నారు. పారిశ్రామిక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, పురుష సెలబ్రిటీల్లో సల్మాన్ ఖాన్, మహిళా సెలబ్రిటీల్లో సన్నీ లియోనీలు ప్రథమ స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాహూ ఇయర్ ఇన్ రివ్యూలో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా దీపికా
ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నిలిచింది. ఈ మేరకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న వార పత్రిక ‘ఈస్టర్న్ ఐ’ 50 మందితో కూడిన జాబితాను డిసెంబర్ 5న విడుదల చేసింది. ఈ జాబితాలో దీపికా అగ్రస్థానంలో నిలవగా 2017లో మొదటి స్థానంలో నిలిచిన ప్రియాంక చోప్రా ఈ సారి రెండో స్థానం దక్కించుకుంది.
ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళల జాబితా
ర్యాంకు | పేరు |
1 | దీపికా పదుకోన్ |
2 | ప్రియాంక చోప్రా |
3 | నియా శర్మ |
4 | మహిరా ఖాన్ |
5 | శివంగి జోషి |
6 | ఆలియా భట్ |
7 | సోనమ్ కపూర్ |
8 | హినాఖాన్ |
9 | కత్రినా కైఫ్ |
10 | నీతి టేలర్ |
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : బాలీవుడ్ నటి దీపికా పదుకోన్
ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో సల్మాన్‌కు అగ్రస్థానం
ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన ‘ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ’ల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ మధ్య దేశంలో అత్యధిక సంపద ఆర్జించిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాను డిసెంబర్ 5న ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 253.25 కోట్ల ఆదాయంతో సల్మాన్ వరుసగా మూడోసారి మొదటిస్థానం దక్కించుకున్నాడు. అలాగే రూ. 228 కోట్ల 9 లక్షల ఆదాయంతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానం పొందాడు.
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితా
ర్యాంకు | పేరు | సంపద(రూ.కోట్లలో) |
1 | సల్మాన్ ఖాన్ | 253.25 |
2 | విరాట్ కోహ్లీ | 228.09 |
3 | అక్షయ్ కుమార్ | 185 |
4 | దీపికా పదుకోన్ | 112.8 |
5 | మహేంద్ర సింగ్ ధోని | 101.77 |
6 | అమీర్ ఖాన్ | 97.5 |
7 | అమితాబ్ బచ్చన్ | 96.17 |
8 | రణ్ వీర్ సింగ్ | 84.67 |
9 | సచిన్ టెండూల్కర్ | 80 |
10 | అజయ్ దేవగణ్ | 74.5 |
14 | రజనీకాంత్ | 50 |
20 | పీవీ సింధు | 36.50 |
24 | పవన్ కల్యాణ్ | 31.33 |
28 | జూనియర్ ఎన్టీఆర్ | 28 |
33 | మహేశ్‌బాబు | 24.33 |
34 | సూర్య | 23. 67 |
36 | నాగార్జున | 22.25 |
39 | కొరటాల శివ | 20 |
58 | సైనా నెహ్వాల్ | 16.54 |
64 | అల్లు అర్జున్ | 15.67 |
72 | రామ్‌చరణ్ | 14 |
72 | విజయ్ దేవరకొండ | 14 |
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో మహిళల్లో దీపికా పదుకోన్ అగ్రస్థానం పొందింది. అలాగే క్రీడాకారుల విభాగంలో విరాట్ కోహ్లి తొలి స్థానంలో ఉండగా... మహిళల క్రీడాకారిణుల జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొదటి ర్యాంక్‌లో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీలు-2018 జాబితాలో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్