Skip to main content

సెప్టెంబర్ 2020 జాతీయం

దేశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి రైలు?
Current Affairs
దేశంలోని తొలి ‘రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్)’ రైలు నమూనాను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ విడుదల చేసింది. ఢిల్లీలోని ప్రఖ్యాత లోటస్ టెంపుల్ డిజైన్‌లో దీని ఇంజన్‌భాగం తయారుచేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో గంటకు 180 కిలో మీటర్ల గరిష్టవేగంతో ఈ రైలు దూసుకుపోనుంది. భారత్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి రైలు కానుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందే ఈ రైళ్లు పర్యావరణానికి అనుకూలమైనవి. 2022 నాటికి ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) రైలు నమూనా విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ

రాష్ట్రపతి ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఎన్ని?
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన మూడు వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. సెప్టెంబర్ 27న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు-2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు-2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు-2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుంటాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్‌డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది.

జమ్మూకశ్మీర్‌లో కొత్తగా అధికార భాషల హోదా పొందిన భాషలు?
జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020’కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 27న ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు-2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు

స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం
త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్‌ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సెప్టెంబర్ 28న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వ్యవస్థ...
రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్‌ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయాలని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్‌ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ (ఎస్‌ఏఏడబ్ల్యూ) వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్

రక్షణ మంత్రి ఆవిష్కరించిన డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ప్రధాన లక్ష్యం?
ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 28న ఆవిష్కరించారు. నూతన డీఏపీ ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్‌డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు.
డీఏపీ ప్రధాన లక్ష్యం...
భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా డీఏపీని రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ) ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన అంతర్జాతీయ సంస్థ?
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. భారత ప్రభుత్వం తమను రెండేళ్లుగా వెంటాడి వేధిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయడంతో సిబ్బందిని బలవంతంగా విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని సెప్టెంబర్ 29న ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా బ్యాంకు ఖాతాలన్నీ సెప్టెంబర్ 10న నుంచి స్తంభించి పోయాయి. దీంతో మా సంస్థ చేపట్టే పనులన్నీ ఆగిపోయాయి.’ అని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అవినాశ్ కుమార్ ఆరోపించారు.
చట్ట విరుద్ధంగా నిధులు...
ఆమ్నెస్టికి విదేశీ నిధులు చట్ట విరుద్ధంగా వస్తున్నాయని, ఆ సంస్థ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్టర్ చేసుకోలేదని భారత ప్రభుత్వం చెబుతోంది. ఆమ్నెస్టీ ఆరోపణలు అవాస్తవం, అత్యంత దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన అంతర్జాతీయ సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ఆమ్నెస్టి ఇంటర్నేషనల్
ఎందుకు : భారత ప్రభుత్వం తమను రెండేళ్లుగా వెంటాడి వేధిస్తోందని

నమామి గంగేలో భాగంగా ఏ రాష్ట్రంలో నిర్మించిన ఆరు ఎస్టీపీలను ప్రధాని ప్రారంభించారు?
గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ మిషన్‌లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, రిషికేశ్, ముని-కి-రేతి, బద్రీనాథ్‌లో రూ.500 కోట్లతో నిర్మించిన ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను(ఎస్టీపీ) ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే జల్‌జీవన్ మిషన్ లోగోను ఆవిష్కరించారు.
ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి్యంది. సెప్టెంబర్ 29న సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడికి మాత్రం కోవిడ్ నెగెటివ్‌గా తేలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.500 కోట్లతో నిర్మించిన ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్టీపీ) ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరిద్వార్, రిషికేశ్, ముని-కి-రేతి, బద్రీనాథ్, ఉత్తరాఖండ్
ఎందుకు : గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ మిషన్‌లో భాగంగా

ఆహారపు అలవాట్లపై ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేరు?
దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో రోజువారీగా ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి. ఈ సూచలన్నింటినీ వివరిస్తూ ‘వాట్ ఇండియా ఈట్స్’ నివేదికను విడుదల చేశాయి.
మై ప్లేట్ ఫర్ ది డే పేరుతో మెనూ...
రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను ఎన్‌ఐఎన్ రూపొందించింది. ఈ మెనూకు ‘మై ప్లేట్ ఫర్ ది డే’ అనే పేరు పెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాట్ ఇండియా ఈట్స్ నివేదిక విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)
ఎందుకు : రోజువారీగా ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న వివరాలను వివరించేందుకు

ఏ ఆలయానికి చెందిన ట్రస్టులో ప్రధాని మోదీ సభ్యుడిగా ఉన్నారు?
గుజరాత్‌లో సెప్టెంబర్ 30న ఆన్‌లైన్ ద్వారా జరిగిన సోమనాథ్ ఆలయ ట్రస్టు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత అడ్వాణీ పాల్గొన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను ట్రస్టు చైర్మన్‌గా మరో ఏడాదిపాటు కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ, అడ్వాణీ ఈ ట్రస్టు సభ్యులుగా కొనసాగుతున్నారు.
అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల
కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్-5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెప్టెంబర్ 30న అన్‌లాక్-5 మార్గదర్శకాలను విడుదల చేసింది.

ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్లుకు ఆమోదం
‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు-2020’కు రాజ్యసభ సెప్టెంబర్ 19న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి 2020, జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 14న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 23వ తేదీ వరకు జరిగాయి. చివరిరోజైన సెప్టెంబర్ 23న కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు-సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు
దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు 2020, సెప్టెంబర్ 30న స్పష్టం చేసింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్(సురేంద్ర కుమార్ యాదవ్)కు సెప్టెంబర్ 30వ తేదీ చివరి పని దినం కావడం గమనార్హం.
ఆ 32 మంది వీరే..
బాబ్రీమసీదు కూల్చివేత కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించింది. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది కోర్టుకు హాజరయ్యారు.
32 మంది వివరాలు..
1. ఎల్‌కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్‌ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా.
1992 డిసెంబర్ 6న ఏం జరిగింది?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్‌హాన్ కమిషన్ తన నివేదికలో 1992, డిసెంబర్ 6న అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. మన్మోహన్ సింగ్ లిబర్‌హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి.
1526 నుంచి 2020 దాకా..
1526: 1526లో బాబర్ సైనికాధికారి మీర్ బాకీ అయోధ్యలో మసీదును నిర్మింపజేశాడు. గుడిని కూల్చి కట్టారా? నేలమట్టమైన గుడిపైన మసీదు కట్టారా? అన్నది స్పష్టంగా తెలియదు. అయితే విశాలమైన ప్రాంగణంలో మసీదుతోపాటు ఓ గుడి ఉండటం. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే.. బయట అదే ఆవరణలోని గుడిలో హిందువుల పూజలు జరిగేవన్నమాట.
1949: డిసెంబరు నెలలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్తా నిరసన ప్రదర్శనలకు దారితీసింది. హషీమ్ అన్సారీ ముస్లింల తరఫున కేసు వేస్తే తరువాతి కాలంలో నిర్మోహీ అఖాడా హిందువుల వైపు నుంచి కేసు వేసింది.
1984: రామ జన్మ భూమి ఉద్యమాన్ని కొనసాగించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ ఈ బృందానికి నేతృత్వం వహించారు.
1986: ఫైజాబాద్ జిల్లా జడ్జి వివాదాస్పద ప్రాంతపు గేట్లకు వేసిన తాళలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హిందువులూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని, పూజలు జరుపుకోవచ్చునని తన తీర్పులో పేర్కొన్నారు.
1990: బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి సారి విఫలయత్నం జరిగింది ఈ ఏడాది.
1992: డిసెంబర్ ఆరవ తేదీ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి తాత్కాలిక దేవాలయం ఏర్పాటు చేశారు.
1993: కేసుల సత్వర విచారణకు లలిత్‌పూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు. అయితే యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్‌బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ శివసేన అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాక్రే, బీజేపీ నేత కళ్యాణ్ సింగ్, చంపత్ రాయ్ బన్సల్, ధరమ్ దాస్, నృత్య గోపాల్‌దాస్ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజరంగ్ దళ్ నేత వినయ్ కతియార్ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే మసీదును పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసులూ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారించేలా ఏర్పాటు జరిగాయి.
1996: సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎల్‌కే అడ్వాణీ తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
2001: ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ ఎల్‌కే అడ్వాణీ, ఉమాభారతిలు కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది. రాయ్‌బరేలీ ప్రత్యే కోర్టులో కేసు విచారణ పునఃప్రారంభమైంది. అడ్వాణీ తదితరులు కేసు గెలిచారు.
2003: రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున ఎల్‌కే అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని జడ్జి ఆదేశం.
2005: అలహాబాద్ హైకోర్టు నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది.
2010: అలహాబాద్ హైకోర్టు కింది కోర్టు 2001లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది.
2012: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ.
2015: బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీం నోటీసులు
2017: అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్దరించాలని స్పష్టీకరణ. అన్ని కేసులను కలిపి లక్నోలో విచారణ చేపట్టాలని ఆదేశాలు.
2019: వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతం మొత్తాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు.
2020: కేసు విచారణకు విధించిన గడువు ఆగస్టు 31తో పూర్తి. తుది గడువును ఒక నెల పొడిగించిన సుప్రీంకోర్టు. సెప్టెంబరు 30వ తేదీన అధారాలు లేని కారణంగా నిందితులందరిపైని ఆరోపణలను కొట్టివేస్తూ లక్నో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే.యాదవ్ తీర్పు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు ఆమోదం
Current Affairs
ఎస్‌ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును సెప్టెంబర్ 17న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ఎసెన్షియల్ కమాడిటీస్(అమెండ్‌మెంట్)’ సెప్టెంబర్ 15న లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆర్డినెన్‌‌సల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇవి ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది.
వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతులకు మధ్యవర్తుల బెడద తొలగుతుందన్నారు.
మూడు బిల్లులు-వివరాలు
1. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు
ఈ బిల్లు ప్రకారం... రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు.
2. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు
ఈ బిల్లు ప్రకారం... రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు.
3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు
ఈ బిల్లు ప్రకారం... చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : రైతుల ఆదాయం పెంచేందుకు

మోదీ ప్రభుత్వం సాధించిన 243 అత్యుత్తమ విజయాలను వివరించే పుస్తకం?
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సెప్టెంబర్ 17న ప్రపంచం నలుమూలల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1950 సెప్టెంబర్ 17న మోదీ జన్మించారు. మోదీ జన్మదినం సందర్భంగా... మోదీ ప్రభుత్వం సాధించిన 243 అత్యుత్తమ విజయాలను వివరించే ‘లార్డ్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆవిష్కరించారు. మోదీ వ్యాసాలు, వార్తాకథనాలున్న ‘నరేంద్ర70.ఇన్’ వెబ్‌సైట్‌ను కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జావదేకర్ ప్రారంభించారు.
చైనా మాటలకు, చేతలకూ పొంతన లేదు...
భారత సైన్యం లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్‌లో పరిస్థితిపై సెప్టెంబర్ 17న రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు.
38 వేల చదరపు కిలోమీటర్లు...
లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్‌నాథ్ తెలిపారు.

ఏ రాష్ట్రంలో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?
బిహార్ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజెక్టుల్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న జాతికి అంకితం చేశారు. పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో రెండు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) బాటిలింగ్ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... సరికొత్త భారత్, సరికొత్త బిహార్ లక్ష్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
మధ్యప్రదేశ్‌లో గృహ ప్రవేశాలు...
మధ్యప్రదేశ్‌లో ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై-గ్రామీణ్)లో భాగంగా పూర్తి చేసిన 1.75 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలను సెప్టెంబర్ 12న ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. పీఎంఏవై-గ్రామీణ్ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ సరాసరి సమయం 125 రోజుల నుంచి లాక్‌డౌన్ సమయంలో 45-60 రోజులకు తగ్గిపోయిందని ప్రధాని తెలిపారు. సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులు ఇళ్ల పనుల్లో పాలుపంచుకోవడం కూడా ఇందుకు దోహదపడిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూడు పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిహార్

ఎన్‌ఐసీ కంప్యూటర్లపై మాల్‌వేర్ దాడి
కీలక కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)కు చెందిన దాదాపు 100 కంప్యూటర్లపై మాల్‌వేర్ దాడి జరిగింది. దీనికి సంబంధించి, ఎన్‌ఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎన్‌ఐసీ ఉద్యోగి ఒకరికి, తన అధికారిక మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఆ ఉద్యోగి కంప్యూటర్‌లోకి మాల్‌వేర్ చొరబడింది’ అని సెప్టెంబర్ 18న పోలీసు అధికారులు వెల్లడించారు. బెంగళూరులోని ఒక సంస్థ నుంచి ఆ మాల్‌వేర్ ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు.
సున్నితమైన సమాచారం...
  • ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, దేశ పౌరులు, దేశ భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఎన్‌ఐసీ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్‌ఐసీ ప్రధాన విధుల్లో... ప్రభుత్వానికి సంబంధించి సైబర్ రంగంలో మౌలిక వసతుల కల్పన ఒకటి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ విభాగం ఈ -గవర్నెన్స్ లో నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది.

వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు సెప్టెంబర్ 20న రాజ్యసభ ఆమోదం పొందాయి. ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఆప్.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రైతుల ఆదాయం పెంచేందుకు

ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్లుకు ఆమోదం
‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు-2020’కు రాజ్యసభ సెప్టెంబర్ 19న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి 2020, జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 14న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 23వ తేదీ వరకు జరిగాయి. చివరిరోజైన సెప్టెంబర్ 23న కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు

ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ను ప్రధాని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
బిహార్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ‘ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్’ కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 21న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని 9 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని పేర్కొన్నారు.
ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లుకు ఆమోదం
కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సెప్టెంబర్ 21న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిహార్
ఎందుకు : బిహార్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ.517 కోట్ల ఖర్చు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 నుంచి 2019 వరకు 58 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.517.82 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాలను భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సెప్టెంబర్ 22న రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రధాని పర్యటనల వల్ల విదేశాలతో వ్యాపారం, వాణిజ్యం, సాంకేతిక, రక్షణ తదితర రంగాల్లో భారత్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మోదీ అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఐదు పర్యాయాల చొప్పున పర్యటించారు. సింగపూర్, జర్మనీ, ఫ్రాన్సు, శ్రీలంక, యూఏఈ తదిదర దేశాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు వెళ్లొచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ.517 కోట్ల ఖర్చు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్

2020-21 పంట ఏడాదికి గోధుమ కనీస మద్దతు ధర ఎంత?
2020-21 పంట సంవత్సరానికి(జూన్-జూలై), 2021-22 మార్కెటింగ్ సీజన్‌కు గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6 శాతం వరకు పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సెప్టెంబర్ 21న లోక్‌సభకు తెలిపారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది.
  • బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది.
  • ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది.
  • మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది.
  • ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది.
  • కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-21 పంట ఏడాదికి గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంపు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ

వాయుసేనలోని ఏ స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు?
Current Affairs
భారత్ అమ్ములపొదిలోకి ఐదు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో సెప్టెంబర్ 10న జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఈ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్‌కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్‌కు రాజ్‌నాథ్ అందించారు.
రూ.59 వేల కోట్లతో...
రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్‌లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత వైమానిక విన్యాసాలు నిర్వహించారు. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో 2016లో భారత్ ఒప్పందం చేసుకుంది. 2020, జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి.
గోల్డెన్ ఏరోస్‌కే ఎందుకు?
తొలి విడతలో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్‌కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల నుంచి 2019 ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. 2019, ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్ లో శిక్షణ తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వాయుసేనలోకి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా
ఎక్కడ : 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్, అంబాలా వైమానిక స్థావరం, హరియాణా

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభం
దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పనే లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) ప్రారంభమైంది. సెప్టెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే ఈ-గోపాల యాప్, బిహార్‌లో మరికొన్ని పథకాలను, 50 కోట్లకు పైగా పశువులకు ఫుడ్ అండ్ మౌత్, బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకా వేసే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఫిషరీస్‌తోపాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా రైతులు, ఉత్పత్తి దారుల ఆదాయం పెంచుతామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
పీఎంఎంఎస్‌వై-ముఖ్యాంశాలు

 

  • పీఎంఎంఎస్‌వై కింద వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • ఈ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశ స్వావలంబనకు వీలవుతుంది.
  • వచ్చే ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులను రెట్టింపు చేస్తూ..అదనంగా 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 2024-25 కల్లా ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల ఆదాయం సాధించమే పథకం లక్ష్యం.
  • 2020-21 నుంచి 2024-25 వరకు అమలయ్యే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా పీఎంఎంఎస్‌వై రూ.20,050 కోట్లతో అమలు అవుతుంది.
  • మత్స్య రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా మత్స్య శాఖను ఏర్పాటు చేయనున్నారు.
  • ఈ-గోపాల యాప్‌లో పశుపోషణ, ఆరోగ్యం, దాణా, ఉత్పాదకత వంటి అంశాలపై సమస్త సమాచారం ఉంటుంది. ఈ-గోపాల్‌ను యానిమల్ ఆధార్‌కు అనుసంధానం చేస్తారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పనే లక్ష్యంగా

ఇండియా వర్సిటీ ర్యాంకింగ్‌‌సలో అగ్ర స్థానంలో నిలిచిన వర్సిటీ?
ఔట్‌లుక్-ఐసీఏఆర్‌ఈ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2020లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోని అత్యుత్తమ టాప్-25 వర్సిటీలతో సెప్టెంబర్ 13న విడుదలైన ఈ ర్యాంకుల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండో స్థానం, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) 24వ స్థానం పొందాయి. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్ పొందింది. హెచ్‌సీయూ 887.78 స్కోర్ చేయగా.. మనూ 436.88 స్కోర్ చేసింది. ప్రధానంగా అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్‌మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్‌రీచ్ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా వర్సిటీ ర్యాంకింగ్‌‌సలో అగ్ర స్థానంలో నిలిచిన వర్సిటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా

బీఐఆర్‌ఏసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫార్మా సంస్థ?
కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఫార్మా సంస్థ అరబిందో సెప్టెంబర్ 15న వెల్లడించింది. యూఎస్‌లోని సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ ‘ఆరో వ్యాక్సిన్స్’ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తోంది. నేషనల్ బయోఫార్మా మిషన్‌లో భాగంగా బయోటెక్నాలజీ శాఖకు చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి అరబిందోకు మద్దతుగా నిలిచింది. దేశ అవసరాల కోసం మహమ్మారితో పోరాటంలో భాగంగా వ్యాక్సిన్‌కై అరబిందో ఫార్మాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు బీఐఆర్‌ఏసీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీఐఆర్‌ఏసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫార్మా సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : అరబిందో ఫార్మా
ఎందుకు : కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి

పార్లమెంట్ భవనాల నిర్మాణ బాధ్యతలను గెలుచుకున్న సంస్థ?
నూతనంగా నిర్మించనున్న పార్లమెంట్ భవనాల నిర్మాణ బాధ్యతలను టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. కొత్తగా పార్లమెంట్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకొని బిడ్లు ఆహ్వానించింది. ఇందుకోసం టాటా ప్రాజెక్ట్స్ రూ. 861.90 కోట్లతో బిడ్‌వేయగా, ఎల్‌అండ్‌టీ రూ. 865 కోట్లకు బిడ్ ధాఖలు చేసింది. దీంతో ప్రాజెక్టును టాటాలకు ఖరారు చేశారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద...
ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త భవనాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్ రోడ్‌ను మెరుగుపరుస్తారు. అంతేకాకుండా ప్రధాని నివాసం, కార్యాలయాలను సౌత్‌బ్లాక్ దగ్గరకు, ఉపరాష్ట్రపతి నూతన నివాసాన్ని నార్త్‌బ్లాక్ దగ్గరలోకి మారతాయి.
హెచ్‌సీపీకు ఆర్కిటెక్చర్ బాధ్యత...
గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను సమకూరుస్తోంది. ప్రాజెక్టు కోసం ప్రస్తుత ఉపరాష్ట్రపతి నివాస బంగ్లా, ఉద్యోగ భవన్, కృషి భవన్, శాస్త్రీ భవన్ తదితరాలను కూల్చనున్నారు. 21 నెలల్లో పార్లమెంట్ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అయితే ఇంకా నిర్మాణ ఆరంభ తేదీని నిర్ణయించలేదు. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లోని ప్లాట్ నంబర్ 118లో ఈ భవన నిర్మాణం జరుగుతుందని సీపీడబ్ల్యుడీ తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనంలో దాదాపు 1400 మంది ఎంపీలు కూర్చునే వీలుంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతం ల్యూటెన్ ఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పార్లమెంట్ భవనాల నిర్మాణ బాధ్యతలను గెలుచుకున్న సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : టాటా ప్రాజెక్ట్స్
ఎక్కడ : ల్యూటెన్, ఢిల్లీ

చైనా నుంచి చొరబాట్లు లేవు: కేంద్ర ప్రభుత్వం
చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని సెప్టెంబర్ 16న రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
మరోసారి గాలిలో కాల్పులు..
భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు ఇటీవల మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్‌‌జలైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ
భారత్‌లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ టెక్నాలజీ గ్రూప్ అలీబాబా సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది.

సహకార బ్యాంకుల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలోకి తెచ్చే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి చేసిన సవరణల బిల్లుకు లోక్‌సభ సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. 2020, జూన్ 26 జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి వస్తుంది. పీఎంసీ బ్యాంక్ స్కాము నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో గవర్నెన్స్ మెరుగుపర్చేందుకు, వాటిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లును రూపొందించారు.
రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం
అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చార్లెస్ చక్ ఫ్రీనీ (89) తనకున్న యావదాస్తి 8 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.58 వేల కోట్ల)ను గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలోని పలు ఫౌండేషన్లకు, విశ్వవిద్యాలయాలకు దానం చేశారు. దానం చేసిన మొత్తంలో దాదాపు సగ భాగాన్ని ఇతరులకు విద్య అందించడానికే సాయం చేశారు. 2012లో తన భార్యకు ఇచ్చేందుకు కేవలం 20 లక్షల డాలర్లు అట్టిపెట్టారు. అంతా దానం చేయాలనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఆయన ఈ త్యాగం చేశారని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సహకార బ్యాంకుల సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలోకి తెచ్చేందుకు

ప్రధానికి చెందిన ఏ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌కు గురైంది?
Current Affairs
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా సెప్టెంబర్ 2న హ్యాకయింది. ‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్‌లో డిజిటల్ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ‘‘ఈ అకౌంట్‌ని జాన్ విక్ హ్యాక్ చేసింది. అయితే పేటీఎం మాల్‌ని మాత్రం మేము హ్యాక్ చెయ్యలేదు’’ అని మరో ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్విట్టర్ సంస్థ ప్రధాని ఖాతాను పునరుద్ధరించింది. 2020, జూలైలో బరాక్ ఒబామా, జో బెడైన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ఖాతాలు కూడా హ్యాక్ అయ్యాయి.

చిన్నారులు-పౌష్టికాహారం అంశంపై ఉప రాష్ట్రపతి ఆవిష్కరించిన పుస్తకం?
చిన్నారులు-పౌష్టికాహారం అనే అంశంపై మొబైల్ క్రీచెస్ రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆన్‌లైన్ వేదికగా ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో సెప్టెంబర్ 4న జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలు ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

చార్టర్ టగ్ బోట్లని ఎందుకోసం వినియోగిస్తారు?
స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రప్రభుత్వం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది.
ప్రశ్నోత్తరాలు రద్దు...
2020 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్ బిజినెస్‌ను రద్దు చేస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా జారీచేసిన బులెటిన్లలో వెల్లడించాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వారాంతపు సెలవులు కూడా లేకుండా వరుసగా 18 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలి
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖా
ఎక్కడ : దేశ వ్యాప్తంగా

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకులు
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషనల్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)-2019 ర్యాంకులను 2020, సెప్టెంబర్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విభాగం(ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2019 ఏడాదికి గాను డీపీఐఐటీ, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది.
ఈవోడీబీ 2019 ర్యాంకులు-ముఖ్యాంశాలు

  • తొలిసారిగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను తీసుకొని ప్రకటించడం ఈ ర్యాంకుల ప్రత్యేకత. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేసినట్లు ధృవీకరణ పత్రం ఇస్తే దాని ఆధారంగా ర్యాంకులు ప్రకటించేవారు.
  • సంస్కరణలు అమలు అవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి ర్యాండమ్‌గా డీపీఐఐటీ, ప్రపంచ బ్యాంకు సర్వే చేసి 2019 ఏడాది(నాలుగో విడత) ర్యాంకులు ప్రకటించాయి.
  • గతేడాది 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 10 స్థానాలు ఎగబాకి రెండవ స్థానంలోకి రాగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమైంది.
  • కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కింది.

ఈవోడీబీ-2019 ర్యాంకులు

సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

ర్యాంకు

1

ఆంధ్రప్రదేశ్

1

2

ఉత్తరప్రదేశ్

2

3

తెలంగాణ

3

4

మధ్యప్రదేశ్

4

5

జార్ఖండ్

5

6

ఛత్తీస్‌గఢ్

6

7

హిమాచల్ ప్రదేశ్

7

8

రాజస్తాన్

8

9

పశ్చిమ బెంగాల్

9

10

గుజరాత్

10

11

ఉత్తరాఖండ్

11

12

ఢిల్లీ

12

13

మహారాష్ట్ర

13

14

తమిళనాడు

14

15

లక్షద్వీప్

15

16

హరియాణా

16

17

కర్ణాటక

17

18

డామన్-డయ్యూ

18

19

పంజాబ్

19

20

అసోం

20

21

జమ్మూ, కశ్మీర్

21

22

అండమాన్, నికోబార్ దీవులు

22

23

దాద్రా, నగర్ హవేలీ

23

24

గోవా

24

25

మిజోరాం

25

26

బిహార్

26

27

పుదుచ్ఛేరి

27

28

కేరళ

28

29

అరుణాచల్ ప్రదేశ్

29

30

చండీగఢ్

29

31

మణిపూర్

29

32

మేఘాలయ

29

33

నాగాలాండ్

29

34

ఒడిశా

29

35

సిక్కిం

29

36

త్రిపుర

29

జోనల్ స్థాయిలో...
నార్త్‌జోన్‌లో యూపీ, తూర్పు జోన్‌లో జార్ఖండ్, పశ్చిమ జోన్‌లో మధ్యప్రదేశ్, దక్షిణ జోన్‌లో ఏపీ, ఈశాన్య జోన్‌లో అసోం అగ్రస్థానంలో నిలిచాయి.

మానసిక ఆరోగ్యం కోసం కేంద్రం ప్రారంభించిన హెల్ప్‌లైన్ పేరు?
ప్రజల్లో ఒత్తిళ్లతో తలెత్తిన మానసికపరమైన ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. మానసికంగా దృఢంగా ఉంచి 24x7 ఉచితంగా సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ‘కిరణ్’(18005990019) అనే పేరుతో ఏర్పాటుచేసిన ఈ హెల్ప్‌లైన్‌ను సెప్టెంబర్ 7న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్ ప్రారంభించారు. ఈ హెల్ప్‌లైన్ వివరాలను మంత్రి వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • ఫస్ట్ ఎయిడ్, ఒత్తిడి నివారణ, మానసిక అనారోగ్య సమస్యల పరిష్కారం, ఆశావహ దృక్పథం పెంపు తదితర సేవలను కిరణ్ హెల్ప్‌లైన్ అందిస్తుంది.
  • ఆయా వ్యక్తులు, బాధిత కుటుంబాలు, పునరావాస కేంద్రాలు, ఆస్పత్రులు, ఇలా ఎవరైనా సహాయం తీసుకోవచ్చు.
  • తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ తదితర 13 భాషల్లో కౌన్సెలింగ్ ఇస్తారు.
  • 668 మంది మానసిక నిపుణులు, 660 మంది క్లినికల్ నిపుణులు కిరణ్‌లో పని చేస్తుంటారు.
  • దేశంలో ఎక్కడి నుంచైనా మొబైల్, ల్యాండ్‌లైన్‌తో కాల్ చేయొచ్చు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : కిరణ్(18005990019) అనే పేరుతో హెల్ప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్
ఎందుకు : ప్రజల్లో ఒత్తిళ్లతో తలెత్తిన మానసికపరమైన ఇబ్బందులను తొలగించేందుకు

నమామి గంగే తరహాలో 13 నదుల పరిరక్షణ
గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ తరహాలోనే ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ 13 నదులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నదుల పరిరక్షణకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్‌ఆర్‌ఈ)కి కేంద్రం అప్పగించింది.
13 నదులు, ప్రాజెక్టు ప్రయోజనాలు...

  • దేశంలో అత్యధిక శాతం ఆయకట్టుకు సాగునీటిని, అధిక శాతం ప్రజలకు తాగునీటిని అందించే జీవ నదులుగా బియాస్, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, లూని, యమున, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది పేరొందాయి.
  • తాజా ప్రాజెక్ట్ పూర్తయితే అటవీ విస్తీర్ణం పెరిగి పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అన్నిచోట్లా ఏకరీతి వర్షపాతం సాధ్యమవుతుంది.
  • వర్షపు నీటిని అడవులు ఒడిసి పట్టడం ద్వారా నీటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసి ఫ్లాష్ ఫ్లడ్‌‌సను నివారిస్తాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు స్థిరపడి నదిలో సహజసిద్ధ (ఊట) ప్రవాహం పెరిగేందుకు దోహదం చేస్తుంది. తద్వారా వేసవిలోనూ నదుల్లో పుష్కలంగా జలాలు లభిస్తాయి.
  • అడవుల్ని పెంచడం వల్ల జలాలు కలుషితం కావు. భూమి కోత నివారించబడి ప్రాజెక్టుల్లో పూడిక చేరదు.


నూతన విద్యా విధానంపై గవర్నర్ల సదస్సు
‘రోల్ ఆఫ్ ఎన్‌ఈపీ ఇన్ ట్రాన్స్ ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సెప్టెంబర్ 7న గవర్నర్ల సదస్సు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభోపన్యాసం చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌కు జీడీపీలో అమెరికా 2.8 శాతం, దక్షిణ కొరియా 4.2 శాతం, ఇజ్రాయెల్ 4.3 శాతం నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తోందని కోవింద్ పేర్కొన్నారు.
సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ... నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు.

ప్రధాని మోదీ ప్రారంభించిన పత్రికా గేట్ ఏ నగరంలో ఉంది?
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో పత్రికా గ్రూప్ నిర్మించిన పత్రికా గేట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 8న ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అలాగే పత్రికా గ్రూప్ చైర్మన్ గులాబ్ కొఠారి రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... భారత్ మీడియా చెప్పే విషయాలను ప్రపంచ దేశాలు శ్రద్ధగా వింటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు, పథకాల అమలుని మీడియా తీవ్రంగా విమర్శించినప్పటికీ, ఆ విమర్శలే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పత్రికా గ్రూప్ నిర్మించిన పత్రికా గేట్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జైపూర్, రాజస్తాన్

రాజకీయ నాయకులపై 4,442 క్రిమినల్ కేసులు
దేశంలో రాజకీయ నాయకులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 2,556 కేసుల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు సమర్పించిన సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడయ్యాయి. పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికై న ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌ను ఆదేశించింది. ఇందులోభాగంగా వారిపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని ఆదేశించగా అన్ని హైకోర్టులు సమాచారాన్ని పంచుకున్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..

  • 413 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించే నేరాలుండగా, వీటిలో 174 కేసుల్లో సిట్టింగ్‌లు ఉన్నారు.
  • యూపీలో 1,217 కేసులుండగా బిహార్‌లో 531 కేసులున్నాయి.
  • ఎక్కువ కేసులు అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్, ఆయుధాల చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస నివారణ చట్టం, ఐపీసీ సెక్షన్ 500 కింద దాఖలైన పరువు నష్టానికి సంబంధించినవి.
  • ప్రతీ జిల్లాలో ఎంపీలు/ఎమ్మెల్యేల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి, హైకోర్టు పర్యవేక్షణ ఉండేలా చూడాలని అమికస్ క్యూరీ కోరారు.


స్టార్టప్ చాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం
Current Affairs
వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధుల సాయం అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ‘చునౌతి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి పట్టణాల(టైర్-2)పై దృష్టి సారించే స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించే చునౌతి తదుపరి దశ స్టార్టప్ చాలెంజ్ పోటీని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగస్టు 28న ప్రారంభించారు.
300 వరకు స్టార్టప్‌ల ఎంపిక...
చునౌతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేసే 300 వరకు స్టార్టప్‌లను ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ.25 లక్షల వరకు నిధుల సాయంతోపాటు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. చునౌతి కార్యక్రమం కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.95 కోట్లు ఖర్చు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్టప్ చాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎందుకు : వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధుల సాయం అందించేందుకు

ఎడోబ్ ఇండియాతో నాస్కామ్ జట్టు
యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఎడోబ్ ఇండియాతో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ జట్టు కట్టింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 28న యూఎక్స్ ఫౌండేషన్ ప్రోగ్రాంను ఎడోబ్ ఇండియా, నాస్కామ్ ఆవిష్కరించాయి. నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌స్కిల్స్ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న మొత్తం మూడు లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది. శిక్షణ విషయంలో పరిశ్రమ భాగస్వామిగా కాగ్ని జెంట్ వ్యవహరిస్తుందని నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్ కో-ఆర్కిటెక్ట్ అమిత్ అగర్వాల్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎడోబ్ ఇండియాతో జట్టు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్
ఎందుకు : యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు

పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం
పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్, విచాట్ రీడింగ్, టెన్సెంట్ వీన్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్ వంటి పలు యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2న వెల్లడించింది. ఈ యాప్‌ల వల్ల దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందు వల్లే తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్, యాపిల్ ప్లేసోర్ట నుంచి ఈ 118 యాప్‌లను తొలగించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు- 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. పబ్‌జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్‌జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు.
118 నిషేధిత యాప్‌ల జాబితా...

Edu news

Edu news


Edu news


క్విక్‌ రివ్యూ:

 

 

 

 

 

 

 

 

ఏమిటి : పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : భారత్
ఎందుకు : దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున

ఝాన్సీ వ్యవసాయ వర్సిటీ భవనాలు ప్రారంభం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాలను ఆగస్టు 29న ఆన్‌లైన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ మైక్రో నీడిల్ తయారు
ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణులు అత్యంత సన్నని మైక్రో నీడిల్‌ను తయారు చేశారు. ఈ సూదితో ఇంజెక్షన్ చేస్తే నొప్పే తెలియదని తయారీదారులు పేర్కొన్నారు. అత్యంత సన్నగా ఉన్నప్పటికీ శరీరానికి గుచ్చే సమయంలో విరిగి పోకుండా ఉండేలా బలమైన గాజు కార్బన్‌తో రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఝాన్సీ, ఉత్తరప్రదేశ్

ఇంగ్లీష్ ప్రొ మొబైల్ యాప్ ఆవిష్కరణ
ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు రూపొందించిన ‘ఇంగ్లీష్ ప్రొ’ యాప్‌ను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఆగస్ట్ 31న ఢిల్లీలో ప్రారంభించారు. యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (యూఎస్‌ఆర్)లో భాగంగా ఇంగ్లిష్ అండ్ ఫారేన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, ఆసక్తి గల అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంగ్లీష్ ప్రొ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : న్యూ ఢిల్లీ
ఎందుకు : ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు

మిషన్ కర్మయోగి పథకానికి కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 2న సమావేశమైన కేబినెట్ మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్‌పీసీఎస్‌సీబీ) కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మిషన్ కర్మయోగి-ముఖ్యాంశాలు

 

  • ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది.
  • 2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
  • ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
  • పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్‌ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : మిషన్ కర్మయోగి పథకానికి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు

జమ్మూకశ్మీర్ లాంగ్వేజెస్ బిల్లు ఉద్దేశం ఏమిటీ?
జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 2న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి.
స్కూల్‌నెట్ విక్రయానికి అనుమతి...
రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని విద్యా రంగ సంస్థ విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. స్కూల్‌నెట్ ఇండియా (గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్)లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కున్న 73.69 శాతం వాటాలను ఫలాఫల్ టెక్నాలజీకి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఫలాఫల్ మాతృసంస్థ లెక్సింగ్టన్ ఈక్విటీ హోల్డింగ్‌‌స (ఎల్‌ఈహెచ్‌ఎల్)కు ఇప్పటికే స్కూల్‌నెట్‌లో 26.13 శాతం వాటా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు

Published date : 25 Sep 2020 12:46PM

Photo Stories