Skip to main content

ఫిబ్రవరి 2019 జాతీయం

పాక్ వెళ్లే జలాలను నిలిపేయాలని నిర్ణయించిన భారత్
Current Affairs సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న తన నీటి వాటాను నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్ గడ్కారీ ఫిబ్రవరి 21న ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నారు.
సింధూ ఒప్పందం ఇదీ :
1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పూర్తి హక్కులు పాకిస్తాన్‌కు దక్కాయి. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లలోని నీటిని భారత్‌కు కేటాయించారు. రావి, బియాస్, సట్లెజ్ నదుల రూపంలో భారత్‌కు 33 మిలియన్ ఎకరాల అడుగుల(ఎంఏఎఫ్) జలాలు లభించాయి. ఈ మూడు నదులపై డ్యామ్‌లు నిర్మించి అందులో 95 శాతం నీటిని దేశ అవసరాలకు వాడుతున్నాం. మిగిలిన 5 శాతం(1.6 ఎంఏఎఫ్) నీరు పాక్‌లోకి ప్రవహిస్తోంది. ఈ నీటిని తిరిగి పొందేందుకే భారత్ షాపూర్-కాంది డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నుంచి పాక్ వెళ్లే జలాలను నిలిపేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎక్కడ : భారతదేశం

జవాన్లకు ఉచితంగా విమాన ప్రయాణం
పారామిలిటరీ జవాన్లు ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు ఉచితంగా వాణిజ్య విమానాల్లో ప్రయాణించేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. డ్యూటీలో చేరేందుకు వెళ్తున్నా కానీ, లేదా సెలవుపై ఇంటికి వెళ్తున్నా కానీ ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీ- శ్రీనగర్, శ్రీనగర్- ఢిల్లీ, జమ్మూ- శ్రీనగర్, శ్రీనగర్- జమ్మూ మార్గాల్లో జవాన్లు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్, అంతకంటే ఎక్కువ హోదా ఉన్నవారికే ఈ సదుపాయం ఉండేది. ముందుగా వాణిజ్య విమానాల్లో టికెట్ బుక్ చేసుకుని తర్వాత సంబంధిత కార్యాలయాల నుంచి ఆ మొత్తాన్ని తర్వాత రీయింబర్స్ చేసుకోవచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జవాన్లకు ఉచితంగా విమాన ప్రయాణం
ఎవరు: జవాన్లకు
ఎక్కడ : ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు
ఎందుకు : డ్యూటీలో చేరేందుకు వెళ్తున్నా కానీ, లేదా సెలవుపై ఇంటికి వెళ్తున్నా కానీ ఉచితంగా ప్రయాణించవచ్చు

అనుమతిలేని డిపాజిట్’ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్
ఇన్వెస్టర్లను వంచించే పొంజి పథకాలు, అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేశారు. శారదా స్కామ్, రోజ్‌వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ తరహా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజు లోక్‌సభ ఆమోదం పొందగా, రాజ్యసభ ఆమోదం లభించలేదు. ఈ వారం మొదట్లోనే కేంద్ర కేబినెట్ ఈ ఆర్డినెన్స్ ను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రపతిని అభ్యర్థించడం గమనార్హం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించే ఆర్డినెన్స్
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇన్వెస్టర్లను వంచించే పొంజి పథకాలు, అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించేందుకు

పీఎం-కిసాన్ పథకం ప్రారంభం
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి రైతు గౌరవ నిధి (పీఎం-కిసాన్) పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంలో తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000ను మోదీ బదిలీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మిగిలిన రైతులకు కూడా త్వరలోనే ఈ మొత్తం అందుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రూ.75 వేల కోట్లతో ఈ పీఎం-కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందనీ పేర్కొన్నారు.
పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం-కిసాన్ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవ రి 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గోరఖ్‌పూర్ప, ఉత్తరప్రదేశ్

జాతీయ యుద్ధ స్మారకం అంకితం
స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25న ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు.
నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో..
అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.
స్మారకం విశేషాలు
  • ఇండియా-చైనా(1962), ఇండియా-పాక్ (1947,1965,1971), కార్గిల్(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు.
  • స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు.
  • అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు.
  • త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు.
  • స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్ యోధ స్థల్‌లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్ మేజర్ బానాసింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్‌ల విగ్రహాలు ఉన్నాయి.
స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు. చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం 2018, ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ యుద్ధ స్మారకం అంకితం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

అదానీకి ఐదు విమానాశ్రయాలు నిర్వహణ
ప్రైవేట్ రంగ సంస్థ అదానీ గ్రూప్ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్‌‌సలో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్ చేసినట్లు ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఫిబ్రవరి 25న తెలిపింది. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు వీటిలో ఉన్నట్లు పేర్కొంది. ఆరోదైన గౌహతి ఎయిర్‌పోర్ట్ బిడ్‌ను ఫిబ్రవరి 26న తెరవనున్నారు.
ఏఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు అదానీ గ్రూప్ ప్యాసింజర్ ఫీజు కింద అత్యధికంగా రూ. 177 ఆఫర్ చేసింది. అలాగే జైపూర్‌కు రూ. 174, లక్నో ఎయిర్‌పోర్టుకు రూ. 171, తిరువనంతపురం విమానాశ్రయానికి రూ. 168, మంగళూరు ఎయిర్‌పోర్టుకు రూ. 115 మేర ప్యాసింజర్ ఫీజు కింద ఏఏఐకి అదానీ గ్రూప్ చెల్లించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన ఏఏఐ అధీనంలోని ఆరు విమానాశ్రయాలను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్రం 2018, నవంబర్‌లో ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : అదానీ గ్రూప్
ఎక్కడ : అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు

800 కేజీల భగవద్గీత ఆవిష్కరణ
800 కేజీల బరువైన అతిభారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26న ఢిల్లీలోని ఇస్కాన్( అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం) ఆలయంలో ఆవిష్కరించారు. 2.8 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఈ మహా గ్రంథంలో 670 పేజీలు ఉన్నాయి. ఇటలీలోని మిలాన్ నగరంలో ఈ గ్రంథాన్ని అచ్చువేశారు. గ్రంథంలోని పేజీలను యుపో(వైయూపీవో) సింథటిక్ కాగితం(తడవదు, చిరగదు)తో తయారుచేశారు. గ్రంథంలో సందర్భోచితంగా 18 పెయింటింగ్‌లను పొందుపరిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 800 కేజీల భగవద్గీత ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఇస్కాన్ ఆలయం, ఢిల్లీ

యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌లో ప్రధాని మోదీ
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 27న నిర్వహించిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2019’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పార్లమెంటులో విలువైన చర్చా సమయం దుర్వినియోగం కావడంపై దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ ఎంపీలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న 16వ లోక్‌సభలో ఉత్పాదకత 85 శాతంగా ఉందని, గత లోక్‌సభ సమావేశాల కంటే ఇది 20 శాతం అధికమని చెప్పారు. ఈ లోక్‌సభ సమావేశాల సందర్భంగా 205 బిల్లులను ఆమోదించామని, ఇదంతా సభలో పూర్తి మెజారిటీ ఉన్నందువల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

ఖేలో ఇండియా యాప్ ఆవిష్కరణ
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 27న నిర్వహించిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2019’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఖేలో ఇండియా యాప్‌ను ఆవిష్కరించారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా దేశం లోని క్రీడా ప్రాంగణాలు, వాటిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, క్రీడల నిబంధనలు, ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖేలో ఇండియా యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
Current Affairs జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందిన ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. సెలవుల ముగించుకొని మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదే రగా ఈ దాడి జరిగింది. 2001, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్‌లో ఉడీ ఆర్మీ బేస్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ
ఎక్కడ : లెత్‌పొరా, అవంతిపొరా, పుల్వామా జిల్లా, జమ్మూకశ్మీర్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను న్యూఢి ల్లీలో ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ‘ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్’స్ఫూర్తికి వందే భారత్ రైలు ప్రతినిధి అని అన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల్లో రూపొందించిన ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్రయాణికులకు సేవలందించనుంది. ఫిబ్రవరి 17 నుంచి ప్రయాణికులకు అం దుబాటులోకి రానుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశేషాలు..
  • ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్ (ప్రయాగ్ రాజ్) స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.
  • మొత్తం దూరం - 769 కిలోమీటర్లు.
  • ఢిల్లీ నుంచి బయల్దేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసికి 8 గంటల్లో చేరుకుంటుంది. సాధారణ రైళ్లలో మాత్రం 11.5 గంటల సమయం పడుతుంది.
  • మొత్తం 1,128 మంది రైలులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
  • గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది.
  • ప్రయాణించడానికి అనుమతించిన గరిష్ట వేగం - గంటకు 160 కిలోమీటర్లు
  • సోమ, గురువారాలు తప్ప వారంలో మిగిలిన ఐదు రోజులు నడపనున్నారు.
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల కాలంలో తయారుచేసింది. ఇందులో మొత్తం 16 బోగీలు ఉనాయి. అన్నీ ఏసీ బోగీలే.
  • వై-ఫై, ఆటోమేటిక్ తలుపులు, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, ప్రతికోచ్‌లోనూ ఆహార, పానీయాలు అందించే ఏర్పాట్లున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

పట్నా మెట్రోరైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
బిహార్ రాజధాని పట్నాలో రూ. 13 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. అలాగే జార్ఖండ్‌లోని డుంకా, పాలము, హజారీబాగ్‌ల్లో వైద్య కళాశాలలను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశ ప్రజల గుండెలు రగులుతున్నట్లుగానే తన హృదయం కూడా కోపం, విషాదంతో నిండిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్నా మెట్రోరైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పట్నా, బిహార్

ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112
ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ను ఫిబ్రవరి 19వ తేదీన 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘112’ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయడానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో నిర్భయ ఫండ్ కింద రూ.2,919 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఎఆర్‌ఎస్‌ఎస్) కింద ప్రవేశపెట్టిన 112 హెల్ప్‌లైన్ కింద ప్రస్తుతం పోలీసు (100), ఫైర్ (101), మహిళల హెల్ప్‌లైన్ (1090)లను అనుసంధానించగా, త్వరలోనే హెల్త్ హెల్ప్‌లైన్ (108)ను కూడా చేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కశ్మీర్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం

 

ఆధ్యాత్మిక రైలు.. రామసేతు ఎక్స్‌ప్రెస్
తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రైల్వే శాఖ నూతనంగా ఓ రైలును ప్రవేశపెట్టింది. ‘రామసేతు ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఫిబ్రవరి 28న ఈ రైలు చెన్నైలోని తంబారన్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 18 ప్రముఖ ఆలయాల సందర్శన అనంతరం తిరిగి మార్చి 3న చెన్నై చేరుకుంటుంది. ఈ ప్యాకేజ్‌లో రంగనాథస్వామి ఆలయం, జంబూకేశ్వరాలయం, ట్రిచీ, రామేశ్వరం, మధురై, తంజావూర్‌ల్లోని ఆలయాలను సందర్శించవచ్చు. స్లీపర్ క్లాస్ జర్నీ, ధర్మశాలల్లో వసతి, శాఖాహార భోజనం.. తదితర సౌకర్యాలను కల్పిస్తారు. ఈ ప్యాకేజీకి ఒక్కొక్కరికి రూ. 4885 చార్జి చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఫిబ్రవరి 19న ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రామసేతు ఎక్స్‌ప్రెస్
ఏప్పుడు : ఫిబ్రవరి 28
ఎక్కడ : చెన్నై
ఎందుకు : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం


కొత్త జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి ఆమోదం

నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 19న ఆమోదముద్ర వేసింది. దేశీయంగా కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. మొబైల్స్ తయారీని సుమారు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే 100 కోట్ల యూనిట్ల స్థాయికి చేర్చాలని జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019లో నిర్దేశించుకున్నారు. ఇందులో రూ. 7 లక్షల కోట్ల విలువ చేసే 60 కోట్ల యూనిట్స్ ఉండనున్నాయి. అలాగే, రక్షణ శాఖ, ఇతర వ్యూహాత్మక విభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ అవసరాలను కూడా తీర్చడంపై దృష్టి సారించాలని ఈ విధానంలో నిర్దేశించుకున్నారు. 2012లో తొలిసారిగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం అమల్లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి ఆమోదం
ఏప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు

ఏరో ఇండియా-2019 షోలో రాఫెల్’
రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫిబ్రవరి 20న ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు. సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృందానికి చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రాఫెల్ యుద్ధ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలను గత వారం భారత్‌కు తరలించారు. ఐదు రోజులపాటు జరగనున్న ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన లో మొత్తం 61 విమానాలు పాల్గొననున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏరో ఇండియా-2019 ‘రాఫెల్’ షో
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : వైమానిక ప్రదర్శన

అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం
Current Affairs
అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్ 36వ స్థానంలో నిలిచింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) ఫిబ్రవరి 7న ఆవిష్కరించిన ఈ సూచీలో అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 45 ప్రమాణాల ప్రాతిపదికన, 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఐపీ సూచీని రూపొందించారు. పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, వాణిజ్య రహస్యాల రక్షణ వంటి అంశాలు ఈ 45 ప్రమాణాల్లో ఉన్నాయి. 2018 ఐపీ సూచీలో భారత్ 44వ స్థానం దక్కించుకోగా, తాజాగా ఇది 8 స్థానాలు మెరుగుపడి 36కు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌కు 36వ స్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ)

లక్నోలో వాజ్‌పేయి వైద్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి పేరుతో వైద్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ శాసనసభలో ఫిబ్రవరి 7న 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేశ్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ. 50 కోట్ల మేర నిధులు కేటాయించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్ యూనివర్సిటీ, సైనిక్ స్కూళ్లు, సంస్కృత కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు కూడా నెలకొల్పనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
బాలికా విద్య కోసం కన్యా సుమంగళ పథకం...
ఉత్తరప్రదేశ్‌లో బాలికా విద్యాప్రమాణాల పెంపునకు కొత్తగా ‘కన్యా సుమంగళ పథకం’ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం రూ. 1,200 కోట్ల నిధులను కేటాయించినట్టు మంత్రి రాజేశ్ అగర్వాల్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటల్‌బిహారీ వాజ్‌పేయి పేరుతో వైద్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్

ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
దేశీయ తొలి ఇంజిన్ రహిత రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలును తొలుత ‘ట్రైన్18’గా పిలిచారు. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’గా దీనికి నామకరణం చేశారు. 16 బోగీలు ఉన్న ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా పేరున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ-వారణాసి మధ్య ఇది రాకపోకలు సాగించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ప్రారంభం
పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో నెలకొల్పిన కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 8న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... హైకోర్టు బెంచ్ వల్ల డార్జిలింగ్, కలింగ్‌పొంగ్‌ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందనీ, వీరందరికీ 100 కి.మీ పరిధిలోనే హైకోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జల్‌పాయ్‌గురి, పశ్చిమబెంగాల్

చంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
అస్సాంలోని కామ్రూప్ జిల్లా చంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుతోపాటు బ్రహ్మపుత్ర నదిపై ఆరు వరుసల వంతెన, నార్త్ ఈస్టర్న్ గ్యాస్ గ్రిడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9న శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఓ సభలో మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ బిల్లు ద్వారా అస్సాం లేదా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని ఆయన భరోసా ఇచ్చారు. అస్సాంను దేశానికి పెట్రోలియం, గ్యాస్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ పర్యటించిన మోదీ అక్కడ రూ. 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : చంగ్సారీ, కామ్రూప్ జిల్లా, అస్సాం

అక్షయపాత్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ
అక్షయపాత్ర ఫౌండేషన్ 300 కోట్ల మందికి అన్నదానం చేసిన సందర్భంగా బృందావన్‌లోని చంద్రోదయ మందిర్ ఆవరణలో ఫిబ్రవరి 11న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... చిన్నారులు ఆరోగ్యంగా లేకుంటే శక్తివంతమైన నవ భారత నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. అందుకే పోషకాహారం, టీకాలు, పారిశుధ్యం వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని వివరించారు. అంతర్జాతీయ కృష్ణ భక్తుల సంఘం(ఇస్కాన్) నిధులతో నడుస్తున్న అక్షయపాత్ర వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 14,702 పాఠశాలల్లో బాలలకు మధ్యాహ్నం భోజనం అందజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్‌లో మథుర జిల్లాలోని బృందావన్‌లో అత్యంత ఆధునిక వంటశాల ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్షయపాత్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : బృందావన్, మథుర జిల్లా, ఉత్తరప్రదేశ్

2019 పెట్రోటెక్ సదస్సు ప్రారంభం
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ సదస్సు- పెట్రోటెక్ 2019ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11న ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భాగస్వామ్య దేశాల నుంచి 95 మందికి పైగా ఇంధన శాఖ మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 7,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ... 2030 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అన్నారు.
అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ..
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ (ముడి చమురు శుద్ధి)సామర్థ్యాన్ని సముపార్జించుకుంది. ప్రస్తుతం 230 ఎంఎంటీపీఏ (వార్షికంగా... మిలియన్ మెట్రిక్ టన్నులు)గా ఉన్న సామర్థ్యం 2030 నాటికి మరో 200 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 పెట్రోటెక్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్

ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సులో వెంకయ్య
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 11న జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు-2019 ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల తక్షణ ప్రభావాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా చూస్తున్నాయని అన్నారు. వ్యవసాయం, ఇతర అంశాల్లో ఎక్కువగా ప్రకృతి వనరులపై అధారపడడం, నవకల్పన విధానాలను పాటించే సామర్థ్యం తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు-2019 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ

రైల్వేల వారసత్వ మాసంగా ఫిబ్రవరి
2019, ఫిబ్రవరి మాసాన్ని భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా రైల్వేశాఖ ప్రకటించింది. భారతీయ రైల్వేల 160 ఏళ్ల ఘన చరితకు గుర్తుగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రైల్వేలకు గుర్తుగా నిలిచిన ప్రాచీన బొగ్గు(స్టీమ్) ఇంజిన్లను పలుచోట్ల నడపడానికి దక్షిణ, ఆగ్నేయ, ఉత్తర, తూర్పు తదితర రైల్వే జోన్లు ఏర్పాట్లు చేశాయి. అలాగే ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, బాంద్రా స్టేషన్; కోల్‌కతాలోని గార్డెన్ రీచ్; వడోదర, ఆజ్‌మేర్ స్టేషన్ల వద్ద ప్రత్యేక వారసత్వ యాత్రలను కూడా నిర్వహించనున్నారు. నాటి వారసత్వానికి గుర్తుగా... దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత రైల్వేశాఖ 230 బొగ్గు ఇంజిన్లు, 110 ప్రాచీన (వింటేజ్) కోచ్‌లు, వేగన్లను పదిల పరిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా 2019, ఫిబ్రవరి
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : రైల్వేశాఖ

పార్లమెంట్ హాల్‌లో వాజ్‌పేయి చిత్రపటం
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 12న ఆవిష్కరించారు. అనంతరం వాజ్‌పేయి చిత్రపటాన్ని తయారుచేసిన కృష్ణ కన్హయ్యను రాష్ట్రపతి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాజ్‌పేయి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటం ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్

చిన్న సంస్థల సబ్సిడీ పథకం పొడిగింపునకు ఆమోదం
చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల తోడ్పాటు కోసం ఉద్దేశించిన రుణ ఆధారిత పెట్టుబడి సబ్సిడీ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ స్కీమ్ (సీఎల్‌సీఎస్-టీయూఎస్) వ్యవధి మూడేళ్ల పాటు పొడిగింపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 13న ఆమోదముద్ర వేసింది. 2017-18 నుంచి 2019-20 దాకా ఉద్దేశించిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ. రూ. 2,900 కోట్లు కేటాయించింది. చిన్న సంస్థలు సాంకేతికంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు, ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపర్చుకునేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్న సంస్థల సబ్సిడీ పథకం పొడిగింపునకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : కేంద్ర కేబినెట్

ఫిబ్రవరి 24న పీఎం-కిసాన్ పథకం ప్రారంభం
ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల ఆర్థికసాయం అందించే పీఎం-కిసాన్ పథకాన్ని 2019, ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో నిర్వహించే ‘కిసాన్ మహా అధివేశన్’ (రైతు సదస్సు) సందర్భంగా తొలి వాయిదా రూ. 2 వేలను ప్రధాని రైతుల ఖాతాలో వేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం-కిసాన్ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : గోరఖ్‌పుర్, ఉత్తర్‌ప్రదేశ్

 

గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం
గుజ్జర్లతో పాటుగా మరో నాలుగు కులాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఫిబ్రవరి 13న ఆమోదం తె లిపింది. దీంతో గుజ్జర్లతో పాటుగా బంజారాలు, గడియా లోహార్లు, రైకాస్, గడారియా కులాలకు కూడా రిజర్వేషన్లు వర్తించనున్నాయి. తాజా బిల్లుతో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు 21 శాతం నుంచి 26శాతానికి పెరిగాయి. తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ గుజ్జర్ల నేత కిరోరీ సింగ్ భైన్సాలా నేతృత్వంలోని వివిధ కులాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రాజస్థాన్ అసెంబ్లీ

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
Current Affairs 16వ లోక్‌సభ చివరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 31న ఉభయసభల్ని(రాజ్యసభ, లోక్‌సభ) ఉద్దేశించి ప్రసంగించారు. నవభారత నిర్మాణానికి కేంద్ర సర్కారు కట్టుబడి ఉందని, దానిని సాకారం చేయడానికి అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని కొనియాడారు. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. అలాగే రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను రాష్ట్రపతి ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్

గాంధీ మృణ్మయ కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం(ఎన్‌డీఎంసీ)లో ఏర్పాటు చేసిన 150 చదరపు మీటర్ల జాతిపిత మహాత్మ గాంధీ మృణ్మయ కుడ్యచిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జనవరి 31న ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది గ్రామీణ కుమ్మరులు తయారుచేసిన 3,870 మట్టిపాత్రలతో ఈ కుడ్యచిత్రాన్ని ఏర్పాటుచేశారు. ‘నా జీవితమే నా సందేశం’ అంటూ గాంధీ చెప్పిన మాటను అందులో లిఖించారు. కుడ్యచిత్ర ఆవిష్కరణ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.... మహాత్మా గాంధీ సిద్ధాంతాలు పాటించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహాత్మ గాంధీ మృణ్మయ కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం(ఎన్‌డీఎంసీ)

లడఖ్‌లో తొలి విశ్వవిద్యాలయం ప్రారంభం
జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ఏర్పాటు చేసిన తొలి విశ్వవిద్యాలయాన్ని, బందీపురా జిల్లాలోని దాల్ సరస్సు ఒడ్డున తొలి బీపీఓ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. అలాగే విజయ్‌పుర్‌లో ఎయిమ్స్ సహా దాదాపు రూ.7,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ... రైతుల నిజమైన సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే వారికి నేరుగా నగదును అందిస్తున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లడఖ్‌లో తొలి విశ్వవిద్యాలయం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్

ఫిబ్రవరి నుంచే పీఎం కిసాన్ సాయం
చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నగదు సాయాన్ని 2019, ఫిబ్రవరి నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2018, డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తించనుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఫిబ్రవరి 3న తెలిపారు. 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందే ఈ పథకం కోసం బడ్జెట్ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పీఎం-కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) కింద ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, ఫిబ్రవరి నుంచే పీఎం కిసాన్ సాయం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : కేంద్రప్రభుత్వం

అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఆమోదం
అమెరికా నుంచి 73 వేల అధునాతన రైఫిళ్లను రెఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2న ఆమోదం తెలిపింది. సిగ్ సూయేర్ అని పిలవబడే ఈ రైఫిళ్లను 3,600 కిలోమీటర్లు ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నారు.
సిమిపై నిషేధం కొనసాగింపు
ఉగ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై మరో ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ సభ్యుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్న 58 కేసుల వివరాల్ని హోం శాఖ ఫిబ్రవరి 1న వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : కేంద్రప్రభుత్వం

రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే
రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫిబ్రవ రి 5న వెల్లడించారు. వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) కాలంలో అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఏడాది కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే
ఎప్పుడు : ఫిబ్రవ రి 5
ఎవరు : కేంద్రప్రభుత్వం

ఆసియా ఎల్‌పీజీ సదస్సులో ఎంఎం కుట్టీ
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 5న జరిగిన ఆసియా ఎల్‌పీజీ సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... 2.5 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వినియోగంతో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు చెప్పారు. 2025 నాటికి ఎల్‌పీజీ వినియోగం 30.3 మిలియన్ టన్నులకు, 2040 నాటికి 40.6 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వెల్లడించారు. ఎల్‌పీజీ వినియోగదారులు (తరచూ సిలిండర్ బుక్ చేసుకునేవారు) 2014-15లో 14.8 కోట్లుగా ఉంటే, 2017-18 నాటికి 22.4 కోట్లకు చేరినట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎల్‌పీజీ డిమాండ్ 2025 నాటికి 34 శాతం పెరుగుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా ఎల్‌పీజీ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ
ఎక్కడ : న్యూఢిల్లీ

రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌కు ఆమోదం
గోవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి కోసం ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఒక కొత్త కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త కమిషన్ ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి సబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుందనీ, దీని ద్వారా దేశీయ జాతులకు చెందిన పశుసంపద పెరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. రైతులు, మహిళల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
ఏఎంఐఎఫ్‌కు రూ. 2 వేల కోట్లు
వ్యవసాయ మార్కెట్ మౌలిక నిధి (ఏఎంఐఎఫ్)ను రూ. 2 వేల కోట్లతో సృష్టించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాబార్డ్ ద్వారా సృష్టించే ఈ నిధి గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన హోల్‌సేల్ మార్కెట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది.
సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణకు ఆమోదం
సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా హరియాణాలో ఉన్న ఎన్‌ఐఎఫ్‌టీఈఎం, తమిళనాడు తంజావూరులోని ఐఐఎఫ్‌పీటీలకు జాతీయ విద్యా సంస్థల హోదా లభిస్తుంది. ప్రసార భారతికి వచ్చే మూడేళ్లలో వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల కోసం రూ. 1,054 కోట్లను కేటాయించనున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో సవరించిన ఆఫీస్ మెమొరాండం (ఓఎం)కు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఒక కొత్త కమిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : కేంద్ర కేబినెట్

Published date : 26 Feb 2019 01:26PM

Photo Stories