Skip to main content

ఫిబ్రవరి 2018 జాతీయం

ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్ Current Affairs
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో ఒకదాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటుచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని వల్ల రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఈ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్‌లకు విస్తరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 21న లక్నోలో మొదలైన రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మోదీ ఈ విషయం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అవినీతి సూచీలో భారత్‌కు 81వ స్థానం
ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం ఆయా దేశాల్లో గతేడాది జరిగిన సంఘటనలను పరిగణనలోనికి తీసుకున్న సంస్థ.. ‘ప్రపంచ అవినీతి సూచీ-2017’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అత్యంత తీవ్రమైన నేరాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ నివేదిక పేర్కొంది. 2016 అవినీతి సూచీలో 79వ ర్యాంకు పొందిన భారత్ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 81వ స్థానంలో నిలిచింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి అత్యంత ఎక్కువగా, పత్రికా స్వేచ్ఛ అత్యంత తక్కువగా ఉన్న దేశాలు ఫిలిప్పీన్‌‌స, ఇండియా, మాల్దీవులని నివేదిక వెల్లడించింది. జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తల హత్యలను ఇందుకు కారణంగా చూపింది.
భారత్‌కు 40 మార్కులు..
అవినీతి, పత్రికా స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని ట్రాన్‌‌సపరెన్సీ ఇంటర్నేషనల్ ప్రతి దేశానికీ 0 నుంచి 100 మధ్య మార్కులు కేటాయించింది. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్ (89 మార్కులు-మొదటి ర్యాంకు), డెన్మార్క్ (88 మార్కులు-రెండో ర్యాంకు)లు నిలిచాయి. భారత్‌కు వందకు 40 మార్కులు వచ్చాయి. సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియాలు వరుసగా 9, 12, 14 మార్కులతో చివరి మూడు స్థానాలకు పరిమితమయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అవినీతిలో 81వ స్థానంలో భారత్
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్
ఎక్కడ : 180 దేశాలతో కూడిన ర్యాంకింగ్స్‌లో

మార్చి నుంచి ఎలక్టోరల్ బాండ్స్
రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన ‘ఎలక్టోరల్ బాండ్ పథకం’ మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. బాండ్లు కొనుగోలు చేసేవారు కచ్చితంగా భారతీయపౌరులై లేదా భారత వ్యాపార సంస్థలైనా అయి ఉండాలి. తొలి దశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైల్లోని ఎస్‌బీఐ ప్రధాన కేంద్రాల ద్వారా వీటిని జారీ చేస్తారు. ‘2018 తొలి త్రైమాసికానికి సంబంధించి మార్చి నెలలో ఈ పథకం తొలి ఇష్యూ ప్రారంభం కానుంది. మార్చి 1 నుంచి 10 వరకు ఎలక్టోరల్ బాండ్ల తొలి విడత అమ్మకం జరుగుతుంది. ఈ బాండ్లను అర్హతగల రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ల ద్వారా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా కానీ, సంయుక్తంగా గానీ, ఇతరులతో కలిసైనా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు’ అని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ బాండ్ జారీచేసిన 15రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ సమయం దాటిన తర్వాత ఈ బాండ్ ద్వారా ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీల ఖాతాలోకీ ఈ డబ్బులు జమకావు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కన్నా ఎక్కువ ఓట్లు పొందిన గుర్తింపుపొందిన రాజకీయపార్టీలన్నీ ఈ బాండ్లను పొందవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మార్చి 1 నుంచి ఎలక్టోరల్ బాండ్స్
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : ఆర్థిక శాఖ
ఎందుకు : రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకత కోసం

ఆరోవిల్’ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ
ఫిబ్రవరి 25న జరిగిన ఆరోవిల్ అంతర్జాతీయ టౌన్‌షిప్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అరబిందో అశ్రమంలో మదర్‌గా పేరుగాంచిన మిర్రా అల్ఫాసా ఆలోచన మేరకే అరోవిల్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందిందని మోదీ తెలిపారు. అనాదిగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక గమ్యంగా విరాజిల్లుతోందని.. వేర్వేరు సంస్కృతులు, మతాలు పరస్పరం కలసిమెలసి శాంతియుతంగా జీవించేందుకు భారత్ అనుమతించిందన్నారు. ప్రపంచంలోనే గొప్ప మతాల్లో చాలావరకూ భారత్‌లోనే పుట్టాయన్న మోదీ.. ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక మార్గంవైపు మరలేలా ఇవి ప్రేరేపించాయని పేర్కొన్నారు. 1968లో 124 దేశాల ప్రతినిధులు హాజరుతో ప్రారంభమైన ఆరోవిల్ టౌన్‌షిప్.. నేడు 49 దేశాలకు చెందిన 2,400 ప్రతినిధులకు కేంద్రంగా మారిందన్నారు. అంతకుముందు పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో అశ్రమాన్ని సందర్శించిన మోదీ.. ఆశ్రమ స్థాపకుడు శ్రీ అరబిందోకు నివాళులర్పించారు. అక్కడి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ఆరోవిల్’ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దేశంలో మహిళా పోలీసులు 7 శాతమే
దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో మహిళలు కేవలం 7.28 శాతమే ఉన్నారని హోంశాఖ తాజా గణాంకాల్లో తేలింది. దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులతో తమిళనాడు పోలీస్‌శాఖ తొలిస్థానంలో నిలిచింది. కేవలం 2.47 శాతం మహిళా ఉద్యోగులతో తెలంగాణ పోలీస్ విభాగం చివరన ఉంది. కశ్మీర్‌లోని 80వేల మంది పోలీస్ సిబ్బందిలో 3.05 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 2015లో మహిళలపై 3,29,243 నేరాలు జరగగా.. ఈ సంఖ్య 2016 నాటికి 3,38,954కు చేరింది.
పోలీస్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2009, 2012, 2016ల్లో మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ పరిస్థితి మారలేదని హోంశాఖ తెలిపింది. తెలంగాణలోని 60,700 మంది పోలీస్ సిబ్బందిలో కేవలం 2.47 శాతం మహిళలు ఉండగా, యూపీలోని 3.65 లక్షల సిబ్బందిలో 3.81 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయలలోనూ మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తమిళనాడు తర్వాత హిమాచల్, మహారాష్ట్ర, గోవాలలో మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ పోలీస్‌విభాగంలో మహిళలు అత్యధికంగా ఉండగా, ఢిల్లీ పోలీస్‌విభాగంలో కేవలం 8.64 శాతం మహిళా సిబ్బంది ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో మహిళా పోలీసులు 7 శాతమే
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : కేంద్ర హోంశాఖ

మహారాష్ట్రలో దేశంలో తొలి ట్రామ్ తరహా ట్రాలీ
స్విట్జర్లాండ్, రష్యాలోని ఎత్తయిన కొండ ప్రాంతాల్లో మాత్రమే ఉండే తాళ్లతో లాగే (ట్రామ్ తరహా) ఫ్యునికులర్ ట్రాలీ సేవలు ఇండియాలోనూ అందుబాటులోకి రానున్నాయి. మనదేశంలో ఈ సేవలను తొలిసారిగా మహరాష్ట్ర ప్రభుత్వం మార్చి 4న ప్రారంభించనుంది. పశ్చిమ కనుమల్లో 1,400 మీటర్ల ఎత్తులో కొలువైన సప్తశృంగి దేవిని దర్శించుకోవడానికి భక్తులు.. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీన్ని గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం 2010లో రైల్వే ట్రాక్ తరహా మార్గాన్ని నిర్మించి, ట్రాలీలను తాళ్లతోలాగే అత్యాధునిక సదుపాయాన్ని భక్తులకు కల్పించాలని నిర్ణయించింది. పలు అడ్డంకులను అధిగమించి, ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఈ పథకాన్ని పూర్తిచేసింది. మార్చి 4న ట్రాలీ సేవలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొండను ఎక్కడానికి భక్తులకు దాదాపు మూడు గంటలు పట్టేదని, అయితే ఈ ట్రాలీ సదుపాయం వల్ల కేవలం 3 నిమిషాల్లోనే కొండను చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి ట్రామ్ తరహా ట్రాలీ
ఎప్పుడు : మార్చి 4న ప్రారంభం
ఎక్కడ : సప్తశృంగి దేవాలయం, నాసిక్, మహారాష్ట్ర

దేశం మొత్తానికి ఒకే ట్రిబ్యునల్!
దక్షిణాది రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ నేతృత్వంలో ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. దీనికి 6 దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జలవివాదాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

ఎన్నికల కమిషనర్ల వేతనం రూ.2.50 లక్షలు
Current Affairs ఎన్నికల కమిషనర్ల వేతనాలు రెండింతలు పెరిగాయి. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సమానంగా వారు వేతనాలు అందుకోనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఎన్నికల సంఘంలో ఉన్న మిగతా ఇద్దరు కమిషనర్లూ ప్రస్తుతం ఉన్న నెలకు రూ.90 వేల బదులు రూ.2.50 లక్షలు అందుకోనున్నారు. పెరిగిన వేతనం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

విద్యార్థులతో మోదీ పరీక్షా పర్ చర్చా’ కార్యక్రమం
10వ తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ‘పరీక్షా పర్ చర్చా’ పేరిట ఢిల్లీలోని తల్కతోరాస్టేడియంలో ఫిబ్రవరి 16న నిర్వహించిన కార్యక్రమంలో గంటన్నరకు పైగా విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈ చర్చను దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి.. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి.. ఎలా విజయం సాధించాలన్న అంశాలపై విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. ఫలితం గురించి ఆందోళన చెందకుండా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఆయన బోధించారు. ఇతరులతో పోటీ పడకుండా తమతో తామే పోటీపడాలని, నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టే ధోరణిని అధిగమించాలని సూచించారు. ప్రతి భారతీయ చిన్నారి పుట్టుకతోనే రాజకీయ నాయకుడని, తనకు కావాల్సింది ఎలా పొందాలో వారికి బాగా తెలుసని మోదీ అన్నారు.
పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెపుతూ ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యార్థులతో ‘పరీక్షా పర్ చర్చా’ కార్యక్రమం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢి ల్లీలో

ఎన్నికల్లో పోటీ చేసే వారు ఆదాయ మార్గాలు చెప్పాలి
ఎన్నికల విధానంలో సంస్కరణలకు బాటలు పరిచే కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతోపాటు వారి జీవిత భాగస్వాముల ఆస్తులతోపాటు ఆదాయ మార్గాలనూ వెల్లడించాలని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వారి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన ఇతరుల ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించటంతోపాటు ఆస్తులు అకస్మాత్తుగా పెరిగిందీ లేనిదీ పరిశీలించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ వ్యవస్థ అందజేసిన వివరాలపై ‘సంబంధిత శాసన వ్యవస్థలు’ పరిశీలించి సదరు పార్లమెంటు లేదా శాసనసభల సభ్యులు అర్హులో కాదో నిర్ణయిస్తాయని చెప్పింది. అభ్యర్ధుల ఆస్తుల వివరాలను తెలుసుకోవటం పౌరుల ప్రాథమిక హక్కని తెలిపింది. ఇందుకోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్నికల్లో పోటీ చేసే వారు ఆదాయ మార్గాలు చెప్పాలి
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు
ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రారంభించిన ప్రధాన నరేంద్ర మోదీ.. వాతావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, అయితే మిగిలిన వారే తమ తమ వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సమానత్వం, న్యాయం, వాతావరణ న్యాయం వైపు తమను నడిపిస్తున్నాయని చెప్పారు. 2030 నాటికి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను కరిగించేందుకు కార్బన్ సింక్ రూపొందించే విషయంపై మాట్లాడుతూ.. ‘ఈ లక్ష్యాన్ని సాధించే విషయంలో భారత్ స్థిరమైన వృద్ధి సాధిస్తోంది’ అని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎక్కడ : న్యూఢిల్లీలో

ఘనంగా బాహుబలి అభిషేకోత్సవం
కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో బాహుబలి 88వ మహామస్తకాభిషేకాల్లో ప్రధాన ఘట్టమైన అభిషేకోత్సవం ఫిబ్రవరి 17న ఘనంగా జరిగింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహామస్తకాభిషేకాన్ని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పవిత్రజలంతో బాహుబలిని అభిషేకించారు. అనంతరం జైన మునులు, భక్తులు బిందెలలోని పవిత్ర జలాలతో విగ్రహాన్ని అభిషేకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఎం హోదాలో మహామస్తకాభిషేకాల్లో తొలిసారి పాల్గొన్నాననీ, ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సీఎం వ్యాఖ్యానించారు.

ముంబైకి రెండో విమానాశ్రయానికి శంకుస్థాపన
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 19న శంకుస్థాపన చేశారు. అలాగే దేశంలోనే అతి పెద్ద నౌకాశ్రయమైన జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)లోని నాలుగో టర్మినల్‌లో మొదటి దశను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన (ఒకటే రన్‌వే ఉన్న వాటిలో) ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేనున్నారు. నవీ ముంబైలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన 1997 నుంచి ఉండగా 21 ఏళ్ల తర్వాత శంకుస్థాపన జరిగింది. రూ.16,700 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే గ్రూప్, సిడ్కో (ముంబై నగర పారిశ్రామికాభివృద్ధి సంస్థ) కలసి నిర్మించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముంబై రెండో విమానాశ్రయానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

జైపూర్‌లో మహిళా’ రైల్వే స్టేషన్
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను ఇకపై పూర్తిగా ఉద్యోగినులే నిర్వహించనున్నారు. స్త్రీలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ స్టేషన్‌లో టికెట్ తనిఖీ, ఆర్‌పీఎఫ్, రిజర్వేషన్ కార్యాలయం తదితర అన్ని విభాగాల్లోని ఉద్యోగాల్లోనూ మొత్తం మహిళలనే నియమించినట్లు వాయవ్య రైల్వే అధికారి చెప్పారు. శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్లను ఈ స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. గాంధీనగర్ స్టేషన్ గుండా రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మహిళా’ రైల్వే స్టేషన్
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : జైపూర్, రాజస్తాన్

ముంబై, పుణే మధ్య హైపర్‌లూప్ నెట్‌వర్క్
ముంబై-పుణేల మధ్య హైపర్‌లూప్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్‌లూప్స్ వన్(వీహెచ్‌వో) సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఫిబ్రవరి 18న ఒప్పందం చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. దాదాపు రూ.20,000 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2021 నాటికి పూర్తికానుంది. దీనివల్ల ముంబై, పుణేల మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. హైపర్‌లూప్ టికెట్ ధర విమానాల చార్జీలకు సమానంగా ఉంటాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్‌వో చైర్మన్ రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. హైపర్‌లూప్ వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో రాబోయే 30 ఏళ్లలో భారత్‌కు రూ.3.5 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.
భూమిపై నిర్మించిన గొట్టాల్లాంటి నిర్మాణాల్లో గాలిలేకుండా చేసి మాగ్నెటిక్ లెవిటేషన్ సాయంతో ప్యాడ్ల(బోగీల)ను గంటకు 1,223 కి.మీ వేగంతో వెళ్లేలా చేయడాన్నే హైపర్‌లూప్ టెక్నాలజీగా పిలుస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముంబై, పుణే మధ్య హైపర్‌లూప్ నెట్‌వర్క్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : వర్జిన్ హైపర్‌లూప్స్ వన్(వీహెచ్‌వో) సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం

కొత్తగా 24 మెడికల్ కాలేజీలు: కేంద్రం
Current Affairs దేశవ్యాప్తంగా వైద్యారోగ్య రంగంలో మానవవనరుల కొరతను తగ్గించేందుకు వివిధ పథకాలకు రూ.14,930 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 7న నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు అన్‌రిజర్వ్‌డ్ ప్రాంతాల్లో 24 వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే 2020-21 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 18,058 యూజీ, పీజీ సీట్లను పెంచనున్నట్లు కేంద్రం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. దాదాపు 248 నర్సింగ్ కళాశాలల్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. త్వరలో ఏర్పాటు చేయనున్న 24 మెడికల్ కాలేజీలను ప్రస్తుతమున్న జిల్లా, రెఫరల్ ఆస్పత్రులకు అనుసంధానిస్తామని పేర్కొంది. 3 నుంచి 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయంది.

మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకు
అంతర్జాతీయ మేధోహక్కుల (ఐపీ) సూచీలో భారత్ ర్యాంకింగ్ కొంత మెరుగుపడింది. 50 దేశాల జాబితాలో 44వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 45 దేశాల సూచీలో భారత్‌కు 43వ ర్యాంకు దక్కింది. స్కోరు కొంత మెరుగుపడినప్పటికీ .. ఈ సూచీలో భారత్ ఇంకా అట్టడుగు స్థానంలోనే ఉంది. అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్‌లో భాగమైన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) రూపొందించిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు గాను... విధానాలకు అనుగుణంగా భారత్ మరిన్ని అర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది.
మేధోహక్కుల సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా బ్రిటన్, స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్, అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్

నీతి’ ఆరోగ్య సూచీలో కేరళ టాప్
నీతి ఆయోగ్ వెల్లడించిన ఆరోగ్య సూచీలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. పంజాబ్ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయి. వైద్య సదుపాయాలు, శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు, సంపూర్ణ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతం: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకుల రిపోర్టు’ పేరుతో నీతి ఆయోగ్-ప్రపంచబ్యాంకు సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాను ఫిబ్రవరి 9న విడుదల చేశారు. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఇటీవల వైద్యప్రమాణాలు మెరుగుపరుచుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. జాబితాలో దారుణమైన పనితీరును కనబరిచిన రాష్ట్రాలుగా రాజస్తాన్, బిహార్, ఒడిశా నిలిచాయి. ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మెరుగైన వైద్యవసతులు కల్పిస్తున్న జాబితాలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిక
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : తొలి స్థానంలో కేరళ

ప్రామాణిక సమయానికి వంద కోట్లతో ప్రాజెక్టు
దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక సమయాన్ని అమల్లోకి తేవడానికి కేంద్రం త్వరలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. ఇది ఆచరణకు నోచుకుంటే ఒకే ప్రామాణిక సమయంతో పాటు మరింత కచ్చితత్వంతో కూడిన సమయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల బ్యాంకింగ్, టెలికాం, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, రైల్వే ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ తదితర రంగాల్లో ఏకరూపత రావడంతో పాటు పలు ఇతర కీలక మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రాంతీయ రెఫరెన్‌‌స స్టాండర్డ్స్ లేబొరేటరీ(ఆర్‌ఆర్‌ఎస్‌ఎల్)ల మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అలాంటివి మరో రెండింటిని నెలకొల్పుతారు. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఫరీదాబాద్, గువాహటిల్లో ఉన్న ల్యాబ్‌ల బలోపేతానికి నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ(ఎన్‌పీఎల్) సాయం తీసుకుంటారు.

ఉత్తరాఖండ్‌లో సినిమా షూటింగ్ ఉచితం
ఉత్తరాఖండ్‌లో ఉచితంగా సినిమా షూటింగ్‌లు జరుపుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఫిబ్రవరి 9న వెల్లడించారు. సినిమా షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌ను కేంద్రస్థానంగా మార్చడంలో భాగంగా చిత్రీకరణ ఫీజును రద్దుచేశామన్నారు. తెహ్రీ పట్టణంలో షాహీద్ కపూర్ నటిస్తున్న ‘బిజ్లీ గుల్ మీటర్ చాలూ’ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి రావత్ క్లాప్ కొట్టారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఉత్తరాఖండ్ సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన చోటని రావత్ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సినిమా షూటింగ్ ఉచితం
ఎక్కడ : ఉత్తరాఖండ్ ఎవరు
ఎవరు : సీఎం త్రివేంద్ర సింగ్ రావత్

మహిళా ఎమ్మెల్యే లేని రాష్ట్రంగా నాగాలాండ్
దేశవ్యాప్తంగా శాసనసభలో(అసెంబ్లీలో) మహిళా ఎమ్మెల్యే లేని రాష్ట్రంగా నాగాలాండ్ రికార్డు సృష్టించింది. జాతీయ అక్షరాస్యత (65 శాతం) కంటే నాగాలాండ్‌లో స్త్రీల అక్షరాస్యత (76 శాతం) ఎక్కువయినప్పటికీ ఇప్పటివరకు ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు.
1963లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 30 మంది మహిళలే పోటీ చేశారు. అయితే 1977 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రానో ఎం షాజియా అనే మహిళ గెలుపొంది రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు వెళ్లిన ఏకై క మహిళగా నిలిచారు. 2018 ఫిబ్రవరి 27న నాగాలాండ్‌లో 60 శాసనసభా స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 227 మంది బరిలో నిలవగా వారిలో కేవలం అయిదుగురే మహిళా అభ్యర్థులున్నారు.
నాగాలాండ్‌లో వారసత్వంగా ఆస్తులను పొందే హక్కు కూడా మహిళలకు లేదు. గ్రామాభివృద్ధి బోర్డుల్లో వారికి 25 శాతం రిజర్వేషన్లు ఉన్నా ముఖ్యమైన అంశాలపై కీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. 2016 గణాంకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో 23.5 శాతం, ప్రైవేట్ రంగంలో 49 శాతం మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల సాధనకు ‘నాగా మదర్స్ అసోసియేషన్’ (ఎన్‌ఎంఏ) అనే మహిళా సంస్థ న్యాయపోరాటం చేస్తోంది. 2016లో ఈ సంస్థ పిటిషన్ పైనే స్పందించిన సుప్రీంకోర్టు 33 శాతం మహిళా రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురుషుల ఆధిపత్యంలోని గిరిజన మండళ్లు వ్యతిరేకించడంతో పాటు ఆందోళనలు చెలరేగడంతో అది కార్యరూపం దాల్చలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో మహిళా ఎమ్మెల్యే లేని అసెంబ్లీ
ఎప్పుడు : స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు
ఎక్కడ : నాగాలాండ్

బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తేవాలి: లా కమిషన్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రజా సంస్థే అని 21వ లా కమీషన్ తేల్చింది. దీనిని సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేసింది. బోర్డు ఆర్టీఐ చట్టపరిధిలోకి వస్తే జట్ల సెలక్షన్, ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేయవచ్చు. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను అందించనుంది.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్‌లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరించడంతో పాటు వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు, పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను పొందుతున్నారు. కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ ప్రజాసంస్థే కాబట్టి ఆర్టీఐ పరిధిలోకి తేవాలని సిఫారసు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : 21వ లా కమీషన్

ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు
సాయుధ దళాల బలోపేతానికి రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15,935 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు, సేకరణకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఫిబ్రవరి 13న ఈ మేరకు ఆమోదం తెలిపింది. కొనుగోలు చేయనున్న ప్రతిపాదిత జాబితాలో 7.40 లక్షల రైఫిల్స్, 5719 స్నైపర్ రైఫిల్స్, మెషీన్ గన్‌‌స ఉన్నాయి. సరిహదుల్లో పాక్, చైనాల నుంచి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సుమారు రూ. 12,280 కోట్ల ఖర్చయ్యే రైఫిళ్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారత్‌లో తయారుచేస్తారు. స్నైపర్ రైఫిళ్లను తొలుత విదేశాల నుంచి కొనుగోలు చేసి, తర్వాత భారత్‌లో తయారుచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రక్షణ శాఖ

ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 42వ స్థానం
Current Affairs పెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా, 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసాగుతోంది. ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ ప్రజాస్వామ్య సూచీ - 2017
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : 42వ స్థానంలో భారత్

బోఫోర్స్’ పై మళ్లీ పిటిషన్ వేసిన సీబీఐ
బోఫోర్స్ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఫిబ్రవరి 2న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. రూ.64 కోట్లకు సంబంధించిన ఈ కేసులో యూరప్ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతో సహా పలువురిపై కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి 4న మరో జడ్జి జస్టిస్ జేడీ కపూర్ ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు.
భోఫోర్స్ నేపథ్యం
భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155 ఎంఎం హోవిట్జర్‌లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్‌బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భోఫోర్స్‌పై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : సీబీఐ
ఎందుకు : కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని

ఢిల్లీలో డీజిల్ ఇంజిన్లు మరో ఏడాదే
ఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్‌లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయి్యకి పెంచాల్సి ఉందని గోయల్ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీలో డీజిల్ రైలు ఇంజిన్లు మరో ఏడాదే
ఎప్పుడు : 2019, మార్చి నాటికి
ఎవరు : పీయూష్ గోయల్

విమాన రద్దీలో ముంబై విమానాశ్రయం అరుదైన రికార్డు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్‌పోర్ట్ బద్దలు కొట్టిందన్నారు. గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్ ఎయిర్‌పోర్ట్ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టింది. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్ ఎయిర్‌పోర్ట్ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉంది.

ఈవీఎంలను ఎవరికీ అమ్మొద్దని ఈసీఐ ఆదేశం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు ఆదేశాలు జారీ చేసింది. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్‌ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలపై 2017 నవంబర్‌లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్‌ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి.

తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్‌మెంట్
బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఓ మావోయిస్టు కమాండర్‌కు చెందిన రూ.86 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మావోయిస్టు ఆస్తులను ఈడీ వంటి దర్యాప్తుసంస్థ అటాచ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అవినీతి నిరోధక చట్టం కింద సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా, అతని కుటుంబీకుల స్థిర, చరాస్తులను అటాచ్‌చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. యాదవ్ ప్రస్తుతం మావోయిస్టు బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ‘మధ్య జోన్’ ఇన్‌చార్జిగా ఉన్నాడు. బిహార్‌లోని 5 ప్లాట్లను, ఢిల్లీలో ఫ్లాటు కొనుగోలుకు సంబంధించిన రూ.10.43 లక్షల నగదు, కొన్ని వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారిగా మావో నేత ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : బిహార్
ఎవరు : సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా
Published date : 21 Feb 2018 03:09PM

Photo Stories