Skip to main content

మార్చి 2021 జాతీయం

ఇన్‌ఫ్రా జాతీయ బ్యాంకు ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం
Current Affairs
మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ‘‘నాబ్‌ఫిడ్‌ బిల్లు/నేషనల్‌ బ్యాంకు ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు’’కు రాజ్యసభ మార్చి 25న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. నాబ్‌ఫిడ్‌ 4–5 నెలల్లో కార్యకలాపాలును ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేశాశిష్‌ పాండా పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్‌ వైద్యురాలికి కీలక పదవి
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్‌ లెవీన్‌ నియామకానికి అమెరికా సెనేట్‌ మార్చి 24న ఆమోద ముద్ర వేసింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : నాబ్‌ఫిడ్‌ బిల్లు/నేషనల్‌ బ్యాంకు ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : పార్లమెంట్‌
ఎందుకు : మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటు కోసం

మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ప్రారంభమైన తేదీ?
ప్రతీ నెల చివరి ఆదివారం జరిగే రేడియో కార్యక్రమం మన్‌ కీ బాత్‌లో మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం 2021, మార్చి 28నాటికి 75 భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రోతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్‌–19పై భారత్‌ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందన్నారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మన్‌ కీ బాత్‌...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెల చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం మన్‌ కీ బాత్‌(మనసులో మాట) 2014, అక్టోబర్‌ 3న ప్రారంభమైంది. 2021, మార్చి 28 నాటికి 75 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఆలిండియా రేడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

‘ఎల్జీ’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం...
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)కి ప్రజా ప్రభుత్వం కన్నా ఎక్కువ అధికారాలు కల్పించే ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(అమెండ్‌మెంట్‌) బిల్, 2021’కి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని మార్చి 28న కేంద్రం ప్రభుత్వం గెజెట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెల్లడించింది.

జల్‌జీవన్‌ మిషన్‌ ఎప్పుడు ప్రారంభమైంది?
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 7 కోట్ల గృహాలకు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కుళాయి కనెక్షన్లు అందించినట్లు మార్చి 29న కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. 2019 ఆగస్టు నాటికి 3 కోట్ల కుళాయి కనెక్షన్లు ఉండగా తాజాగా ఈ పథకం ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికి 4,00,37,853 కనెక్షన్లు అందించామని దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ల సంఖ్య 7,24,00,691కి చేరిందని వివరించింది. జల్‌జీవన్‌ మిషన్‌ విజయానికి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కాకిస్‌నూర్‌ గ్రామం ఒక నిదర్శనమని పేర్కొంది.
2019, ఆగస్టు 15న...
దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2019, ఆగస్టు 15న ఈ మిషన్‌ ప్రారంభమైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : గ్రామీణ ప్రాంతాల్లోని 7 కోట్ల గృహాలకు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కుళాయి కనెక్షన్లు అందించాం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : కేంద్ర జల్‌శక్తి శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో

ఎంఎస్పీ లూటీ కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించిన సంస్థ?
Current Affairs
దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే తక్కువ ధరకు పంటలను అమ్ముకొని రైతులు ఎంత నష్టపోతున్నారో ఇక సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం జైకిసాన్‌ ఆందోళన్‌ అనే సంస్థ ఒక ప్రత్యేక క్యాలిక్యులేటర్‌ను మార్చి 18న ఆవిష్కరించింది. దీనికి ‘కనీస మద్దతు ధర లూటీ క్యాలిక్యులేటర్‌’ అని పేరుపెట్టింది.
ఆర్బీకే చానల్‌ ప్రారంభం
రైతులకు అన్ని విధాలా తోడుగా ఉండేలా రూపొందించిన ఆర్బీకే చానల్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 18న ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రైతులకు చాలా విషయాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం గురించి తెలియజెపుతూ నిరంతరం సమాచారం ఇచ్చేందుకు ఈ చానల్‌ ఉపయోగపడుతుందన్నారు. ఏ రైతుకు ఏ సందేహం వచ్చినా టోల్‌ ప్రీ నంబర్‌ 155251కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కనీస మద్దతు ధర లూటీ క్యాలిక్యులేటర్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : జైకిసాన్‌ ఆందోళన్‌ సంస్థ
ఎందుకు : ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పంటలను అమ్ముకొని రైతులు ఎంత నష్టపోతున్నారో తెలుసుకొనేందుకు

కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది?
తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌లను పంజాబ్‌ రాష్ట్రంలోని కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్ట సిద్ధం చేసింది. ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయిందని మార్చి 21న రైల్వే శాఖ తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్‌ అమర్చారు.

నిరుపేదలుగా మారిన 3.2 కోట్ల మంది
కరోనా సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక కష్టాలు భారత్‌లో మధ్య తరగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. దాదాపుగా 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి దిగువకు పడిపోయారని నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం... 2020 ఏడాది కరోనా విజృంభించిన సమయంలో రోజుకి రూ. 724 నుంచి రూ.1449 వరకు సంపాదించే వారిలో 3.2 కోట్ల మంది తమ సంపాదనని కోల్పోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక నిరుపేదలుగా మారారు.

ఢిల్లీ చేరుకున్న కుంభ్‌ సందేశ్‌ యాత్ర
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా ప్రాముఖ్యతను కొత్త తరానికి చాటిచెప్పడం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజలు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించేందుకు ప్రారంభమైన.... కుంభ్‌ సందేశ్‌ యాత్ర, మిషన్‌ 5151 బృందం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. 2021, ఫిబ్రవరి 27న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 7 రాష్ట్రాల్లో సుమారు 7వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మార్చి 20న ఢిల్లీకి చేరుకుంది. గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్ర సుమారు 500 పట్టణాల ద్వారా సాగింది.

తమిళనాడులోని 7 కులాలకు ఒకే పేరు
తమిళనాడు రాష్ట్రంలో ఏడు కులాలను కలిపి దేవేంద్రకుల వెల్లలార్‌ అనే ఒకే పేరు కింద పరిగణించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలపగా మార్చి 22న రాజ్యసభ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ప్రకారం... దేవేంద్రకులన్, కల్లాడి, కుటుంబన్, పల్లన్, పన్నాడి, వథిరియన్, పథరియ కులాల వారు ఇకపై దేవేంద్రకుల వెల్లలార్‌ అనే కులం కింద పరిగణనలోకి వస్తారు.
పుస్తకావిష్కరణ...
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్‌ ఎస్‌కే జోషి రాసిన ‘ఏక్‌ ప్రతిధ్వని–జన్‌ కేంద్రిత్‌ శాసన్‌ కీ ఔర్‌’ పుస్తకాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. మార్చి 22న ఢిల్లీలోని రాజ్‌నాథ్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

క్యాచ్‌ ది రెయిన్‌ 100 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభం
వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ... జలశక్తి అభియాన్‌–‘క్యాచ్‌ ద రెయిన్‌’ అనే 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి 22న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మోదీ మాట్లాడుతూ... వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. క్యాచ్‌ ద రెయిన్‌ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు.
కెన్‌–బెత్వా నదుల అనుసంధానం...
‘కెన్‌–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి మార్చి 22న ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లు సంతకం చేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జలశక్తి అభియాన్‌–క్యాచ్‌ ది రెయిన్‌ 100 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా
ఎందుకు : దేశవ్యాప్తంగా వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం

నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే అని తేల్చిచెప్పే ‘ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ)’ను లోక్‌సభ మార్చి 22న ఆమోదించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెడుతూ... ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. బిల్లు ప్రకారం... ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్‌జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్‌ చర్యకైనా ఎల్‌జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ)కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్‌జీ అని ఖరారు చేసేందుకు

1,300 సైనిక వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
సైన్యానికి అవసరమైన 1,300 లైట్‌ కాంబాట్‌ వెహికల్స్‌ కొనుగోలుకు మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌ఎల్‌)తో భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మార్చి 22న వెల్లడించింది. రూ.1,056 కోట్లతో ఈ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. మహీంద్రా సంస్థ వచ్చే నాలుగేళ్లలో ఈ వాహనాలను రక్షణ శాఖకు అప్పగించేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ లైట్‌ కాంబాట్‌ వాహనాలను మెషిన్‌ గన్లు, అటోమాటిక్‌ గ్రెనేడ్‌ లాంచర్లు, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. లైట్‌ కాంబాట్‌ వెహికల్స్‌ను ఎండీఎస్‌ఎల్‌ దేశీయంగానే డిజైన్‌ చేసి, అభివృద్ధి చేయనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌ఎల్‌)తో ఒప్పందం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎందుకు : సైన్యానికి అవసరమైన 1,300 లైట్‌ కాంబాట్‌ వెహికల్స్‌ కొనుగోలు కోసం

ఏ రాష్ట్రంలో స్పందన తరహా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు?
ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పందన కార్యక్రమం పనితీరును పరిశీలించడానికి కర్ణాటక అధికారుల బృందం మార్చి 22న ఏపీలో పర్యటించింది.
ఎలిమినేడులో ఏరోస్పేస్‌ పార్కు...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు సమీపంలో ఏరోస్పేస్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు మార్చి 22న వెల్లడించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే ఇక్కడున్న 7 ఏరోస్పేస్‌ పార్కులకు ఇది అదనమని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ అమలు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : కర్ణాటక
ఎందుకు : ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి

లోక్‌సభ ఆమోదించిన నేషనల్‌ కమిషన్‌ హెల్త్‌కేర్‌ బిల్లు ఉద్దేశం?
ఆరోగ్య సంరక్షణ, దాని అనుబంధ రంగాల్లో వృత్తి నిపుణులందరికీ ఒకే తరహా విద్యా ప్రమాణాలు బోధించేలా ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించిన ‘‘ది నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలియడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఫ్రొఫెషన్స్‌ బిల్లు, 2021’’కి లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. మూజువాణి ఓటుతో మార్చి 24న బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లుని ఇప్పటికే రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే.
బిహార్‌ డిప్యూటీ స్పీకర్‌గా మహేశ్వర్‌...
బిహార్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా జేడీ(యూ) సీనియర్‌ నాయకుడు మహేశ్వర్‌ హజారి ఎన్నికయ్యారు. విపక్ష సభ్యులు మార్చి 24న సభను బహిష్కరించడంతో అధికారపక్షం మూజువాణి ఓటుతో హజారి ఎన్నికను ఖరారు చేసింది.
బిహార్‌ రాష్ట్రం....
రాజధాని: పాట్నా
శాసనసభ సీట్లు: 243
శాసనమండలి: 95
లోక్‌సభ సీట్లు: 40 (జనరల్‌–34, ఎస్సీ–6, ఎస్టీ–0)
రాజ్యసభ సీట్లు: 16
హైకోర్టు: పాట్నా హైకోర్టు
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి, మైథిలీ
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.
ప్రస్తుత గవర్నర్‌: ఫగు చౌహాన్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: నితీశ్‌ కుమార్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ది నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలియడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఫ్రొఫెషన్స్‌ బిల్లు, 2021కి ఆమోదం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఆరోగ్య సంరక్షణ, దాని అనుబంధ రంగాల్లో వృత్తి నిపుణులందరికీ ఒకే తరహా విద్యా ప్రమాణాలు బోధించేలా ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం కోసం...

ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు ఉద్దేశం?
ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే ‘‘ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ)’’కు బిల్లుకు మార్చి 24న రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే అంతిమాధికారం అని ఈ బిల్లు చెబుతుంది.
హైదరాబాద్‌లో పోకర్ణ ప్లాంట్‌...
క్వాంట్రా బ్రాండ్‌లో క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని మేకగూడ వద్ద 6,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. వార్షిక తయారీ సామర్థ్యం 86 లక్షల చదరపు అడుగులు. మార్చి 24న ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి మొదలైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ)కి ఆమోదం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే అంతిమాధికారం తెలియజెప్పేందుకు

మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రారంభం
Current Affairs
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో భాగంగా... కేంద్రప్రభుత్వం మార్చి 11న ‘‘మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌’’ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌... జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్‌ కార్డ్‌ హోల్డర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం తెలిపింది.
నాలుగు రాష్ట్రాలు మినహా...
ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని వివరించింది. ప్రస్తుతం వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో భాగంగా...

సరకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్‌ కలిగిన తొలి విమానాశ్రయం?
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) ద్వారా సరుకు రవాణ సేవలను మరింత పెంచేందుకు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సరుకు రవాణా టెర్మినల్‌ ఏర్పాటైంది. ఈ టెర్మినల్‌ను బెంగళూరు జోన్‌ కస్టమ్స్‌ విభాగ చీఫ్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ మార్చి 12న ప్రారంభించారు. దీంతో దేశంలో సరుకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్‌ కలిగి ఉన్న మొదటి విమానాశ్రయంగా కేఐఏ ఘనతకెక్కింది. కొత్త టెర్మినల్‌లో సరుకులను స్వీకరించేందుకు, పంపిణీ చేసేందుకు యాంత్రిక ట్రక్‌ డాక్‌లను ఏర్పాటు చేశారు.
తిరుపతిలో అత్యాధునిక ఆస్పత్రి...
తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ముంబైకి చెందిన దాత, ఉద్వేగ్‌ ఇన్‌న్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కన్సల్టెన్సీ ప్రయివేట్‌ లిమిటెడ్‌(యూ.ఐ.సీ) సంస్థ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కె.సింగ్‌ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో దీనిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సరకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : బెంగళూరు జోన్‌ కస్టమ్స్‌ విభాగ చీఫ్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌
ఎక్కడ : కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ), బెంగళూరు
ఎందుకు : సరుకు రవాణ సేవలను మరింత పెంచేందుకు

రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ ఏ పార్టీలో విలీనమైంది?
బిహార్‌లో అధికార జనతాదళ్‌(యూనైటెడ్‌)(జేడీ(యూ)) పార్టీలో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) మార్చి 14న విలీనమైంది. ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సన్నిహితులైన నితీశ్, కుష్వాహ తొమ్మిదేళ్ల క్రితం అభిప్రాయభేదాల వల్ల విడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఒకే గూటికి చేరారు. జేడీ(యూ) నేషనల్‌ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా కుష్వాహను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జనతాదళ్‌(యూనైటెడ్‌)లో విలీనమైన పార్టీ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ)
ఎక్కడ : బిహార్‌

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు తొలుత ఎక్కడ ప్రారంభమయ్యాయి?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా... ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను మార్చి 12న తొలుత గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2022 ఆగస్టు 15 వరకూ వేడుకలు కొనసాగుతాయని మోదీ పేర్కొన్నారు.
పాదయాత్ర ప్రారంభం...
భారత జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన చరిత్రాత్మక దండియాత్రను స్మరించుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి పాదయాత్రకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. వీరంతా 386 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్‌ 5వ తేదీ నాటికి నవసరీ జిల్లాలోని దండికి చేరుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మహాత్మాగాంధీ 78 మంది అనుచరులతో కలిసి 1930 మార్చి 12న దండియాత్రలో మొదటి అడుగు వేసిన సంగతి తెలిసిందే.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సబర్మతీ ఆశ్రమం, అహ్మదాబాద్, గుజరాత్‌ రాష్ట్రం
ఎందుకు : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా...

రైల్వే ప్రైవేటీకరణ ఉండదు : పియూష్‌ గోయల్‌
భారతీయ రైల్వేను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్స్‌ ఫర్‌ రైల్వేస్‌’పై లోక్‌సభలో జరిగిన చర్చకు మార్చి 16వ తేదీన రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. ‘రైల్వేను ప్రైవేటీకరించబోం. అది భారతీయులందరికి చెందిన ఆస్తి. అది అలాగే కొనసాగుతుంది’ అని గోయల్‌ స్పష్టం చేశారు.
అబార్షన్‌ పరిమితి 24 వారాలకు పెంపు
ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్‌) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. లైంగిక దాడి బాధితులు, మైనర్లు, దివ్యాంగులు, వావివరుస తప్పిన ఫలితంగా గర్భం ధరించిన వారికి ఈ పరిమితి వర్తించనుంది. లోక్‌సభ ఏడాది క్రితమే ఆమోదించిన మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లు–2020కు మార్చి 16వ తేదీన రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. 20 వారాలకు పైబడిన 24 వారాలకు మించని గర్భాలకు ప్రత్యేక కేటగిరీలోకి వస్తుంది. గర్భం కారణంగా ఆ మహిళ ప్రాణానికి హాని కలుగుతుందని లేదా ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని లేదా జన్మించే శిశువుకు తీవ్ర శారీరక, మానసిక అవకరాలు కలుగుతాయని వైద్యులు సిఫారసు చేసిన సందర్భాల్లో ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. ఇలాంటి ప్రత్యేక కేటగిరీ కేసులను పరిశీలించేందుకు రాష్ట్రాలు గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, పీడియాట్రీషియన్, మరొకరితో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గర్భస్రావం చేసిన వైద్యుడు ఆ మహిళ పేరు, ఇతర వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగపర్చరాదు.
అలా అయితే...ఈ కోటా తప్పే
102వ రాజ్యాంగ సవరణ ప్రకారం, పార్లమెంటు మాత్రమే సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు(ఎస్‌ఈబీసీ) కేంద్ర జాబితాను రూపొందించాలన్న వాదనను అంగీకరిస్తే.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆ రాష్ట్ర శాసన పరిధిని మించినట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొంది. మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో 16% రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ హేమంత్‌గుప్తా, జస్టిస్‌ రవీంద్రభట్‌ల ధర్మాసనం మార్చి 16వ తేదీన విచారణ జరిపింది. ఈ సందర్భంగా, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ 1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించే అంశాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. 102వ రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్రపతి మాత్రమే ఎస్‌ఈబీసీని నిర్ధారించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ రాజ్యాంగ సవరణ తరువాతనే, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఎస్‌ఈబీసీ జాబితాలో మరాఠాలను చేర్చిందని తెలిపారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఒక ఏకరూపత సాధించాలనేదే 102వ రాజ్యాంగ సవరణ ఉద్దేశమన్నారు. ఈ సమయంలో, ధర్మాసనం కల్పించుకుని.. ‘మీ వాదనే సరైనదనుకుంటే, మహారాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం చేయకూడదు. అలా చేయడం తన శాసన పరిధిని అతిక్రమించడమే అవుతుంది’అని పేర్కొంది. 102వ రాజ్యాంగ సవరణతో వెనుకబడిన వర్గాల రాష్ట్ర కమిషన్‌లను కొనసాగించడమా? లేక వాటిని జాతీయ కమిషన్‌లో విలీనం చేయడమా? ఆ కమిషన్‌ల విధులు, బాధ్యతలు ఏమిటి? అనే అంశాలు కూడా తెరపైకి వచ్చాయన్నారు. 102వ రాజ్యాంగ సవరణ అనంతరం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించడానికి ప్రత్యేకమైన విధానం రూపొందిందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342 ఏ ప్రకారం గవర్నర్‌తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి సంబంధిత నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో మరాఠాలకు రిజర్వేషన్లు పెంచే క్రమంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ లేదని, గవర్నర్‌తో సంప్రదింపులు లేవని, జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌తో చర్చలు లేవని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనల అనంతరం, విచారణ మార్చి 17వ తేదీన కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.

ది నర్చరింగ్‌ నైబర్‌హుడ్స్‌ చాలెంజ్‌కు ఎంపికైన నగరాల సంఖ్య?
దేశవ్యాప్తంగా చిన్నపిల్లలు వారి సంరక్షకుల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తీసుకొచ్చిన ‘‘ది నర్చరింగ్‌ నైబర్‌హుడ్స్‌ చాలెంజ్‌’’కు 25 నగరాలు ఎంపికయ్యాయి. అందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాకినాడ నగరాలు ఉన్నాయి. ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు అన్ని స్మార్ట్‌ సిటీలు, అన్ని రాజధాని నగరాలు, ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలకు అవకాశం ఇవ్వగా...వచ్చిన దరఖాస్తుల్లో నుంచి 25 నగరాలను పైలట్‌ దశలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ది నర్చరింగ్‌ నైబర్‌హుడ్స్‌ చాలెంజ్‌కు ఎంపికైన నగరాల సంఖ్య 25
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : దేశవ్యాప్తంగా చిన్నపిల్లలు వారి సంరక్షకుల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడాన

ఇటీవల పోలీస్‌ విభాగంలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకున్న రాష్ట్రం?
Current Affairs
ఛత్తీస్‌గడ్‌ పోలీసు వ్యవస్థ ఓ సరికొత్త మార్పుకి శ్రీకారం చుట్టింది. ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి 13 మంది ట్రాన్స్‌జెండర్‌లను నియమించి, ట్రాన్స్‌జెండర్‌ సమాజంలో విశ్వాసం నింపేందుకూ, వారిపట్ల సమాజం దృష్టిలో మార్పుని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. రాష్ట్ర పోలీసు శాఖలో ట్రాన్స్‌ జెండర్‌లకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. 13 మంది ట్రాన్స్‌జెండర్‌లను ప్రతిభ ఆధారంగా పోలీస్‌ కానిస్టేబుళ్లుగా నియమించామని, మరో ఇద్దరు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారని ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డి.ఎం.అవస్థి తెలిపారు. 2017–18లో పరీక్షలు నిర్వహించగా, 2021 మార్చి 1న ఫలితాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ఛత్తీస్‌గడ్‌ రాజధాని: నయా రాయ్‌పూర్‌
ఛత్తీస్‌గడ్‌ ప్రస్తుత గవర్నర్‌: అనసూయ ఊకే
ఛత్తీస్‌గడ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి: భూపేశ్‌ బఘేల్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి 13 మంది ట్రాన్స్‌జెండర్‌ల నియామకం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డి.ఎం.అవస్థి
ఎందుకు : ట్రాన్స్‌జెండర్‌ సమాజంలో విశ్వాసం నింపేందుకూ, వారిపట్ల సమాజం దృష్టిలో మార్పుని తీసుకొచ్చేందుకు

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌–2020 ర్యాంకులు
ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకులను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ ర్యాంకులతో పాటు మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ (పురపాలిక పనితీరు సూచీ)–2020 ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి మార్చి 4న న్యూఢిల్లీలో ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. నగరాల్లోని సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని ప్రకటించారు.
విధానాల రూపకల్పనకు...
పోటీతత్వాన్ని పెంచడానికే కాకుండా భవిష్యత్తులో నగరాల అభివృద్ధికి అనువైన విధానాల రూపకల్పనకు ఈ ర్యాంకులు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నగరాల్లో ప్రజల జీవన నాణ్యత, నగర ఆర్థిక సామర్థ్యం, సుస్థిరతకు ఈ ర్యాంకులు అద్దంపడతాయి.
111 నగరాల్లో...
ర్యాంకుల రూపకల్పనలో భాగంగా 2020 జనవరి 16 నుంచి 2020 మార్చి 20వ తేదీల మధ్యలో 111 నగరాల్లోని 32.2 లక్షల మంది ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇండెక్స్‌లో ప్రజాభిప్రాయానికి 30 శాతం, జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం వంటి 13 కొలమానాల పరిధిలోని 49 సూచికలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో భువనేశ్వర్‌కు అత్యధికమార్కులు దక్కాయి.
ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ర్యాంకులు ఇలా...
జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ సూచీ అంచనా వేస్తుంది. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను తెలియజేస్తోంది. ఈ ఇండెక్స్‌లోని ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 111 నగరాలకు ఈ ఇండెక్స్‌లో ర్యాంకులను కేటాయించారు.
పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో...
మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ ఇలా..
దేశంలో తొలిసారిగా మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ రూపొందించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్‌ దోహదపడుతుంది. మొత్తం 111 మున్సిపాలిటీలకు ఈ ఇండెక్స్‌లో ర్యాంకులను కేటాయించారు.
సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ ఇండెక్స్‌లోని ర్యాంకులను కూడా రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు.
పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో...

ర్యాంకు

నగరం

రాష్ట్రం/యూటీ

1

బెంగళూరు

కర్ణాటక

2

పుణే

మహారాష్ట్ర

3

అహ్మదాబాద్

గుజరాత్

4

చెన్నై

తమిళనాడు

5

సూరత్

గుజరాత్

6

నవీ ముంబై

మహారాష్ట్ర

7

కోయంబత్తూర్

తమిళనాడు

8

వడోదర

గుజరాత్

9

ఇండోర్

మధ్యప్రదేశ్

10

గ్రేటర్ ముంబై

మహారాష్ట్ర

41

విజయవాడ

ఆంధ్రప్రదేశ్

పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో...

ర్యాంకు

నగరం

రాష్ట్రం/యూటీ

1

సిమ్లా

హిమాచల్ ప్రదేశ్

2

భువనేశ్వర్

ఒడిశా

3

సిల్వస్స

దాద్రా,నగర్ హవేలి అండ్ డామన్, డయ్యూ

4

కాకినాడ

ఆంధ్రప్రదేశ్

5

సేలం

తమిళనాడు

6

వెల్లూర్

తమిళనాడు

7

గాంధీనగర్

గుజరాత్

8

గురుగ్రామ్

హరియాణ

9

దావ‌న్‌గెరె

కర్ణాటక

10

తిరుచిరాపల్లి

తమిళనాడు

19

వరంగల్

తెలంగాణ

22

కరీంనగర్

తెలంగాణ

46

తిరుపతి

ఆంధ్రప్రదేశ్

మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ ఇలా..
దేశంలో తొలిసారిగా మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ రూపొందించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్‌ దోహదపడుతుంది. మొత్తం 111 మున్సిపాలిటీలకు ఈ ఇండెక్స్‌లో ర్యాంకులను కేటాయించారు.
సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ ఇండెక్స్‌లోని ర్యాంకులను కూడా రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు.
పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో...

ర్యాంకు

మున్సిపాలిటీ

రాష్ట్రం/యూటీ

1

ఇండోర్

మధ్యప్రదేశ్

2

సూరత్

గుజరాత్

3

భోపాల్

మధ్యప్రదేశ్

4

పింప్రీ చించ్వాడ్

మహారాష్ట్ర

5

పుణే

మహారాష్ట్ర

6

అహ్మదాబాద్

గుజరాత్

7

రాయ్‌పూర్‌

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

8

గ్రేటర్ ముంబై

మహారాష్ట్ర

9

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్

10

వడోదర

గుజరాత్

17

హైదరాబాద్

తెలంగాణ

27

విజయవాడ

ఆంధ్రప్రదేశ్

పది లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో...

ర్యాంకు

మున్సిపాలిటీ

రాష్ట్ర/యూటీ

1

న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్

న్యూఢిల్లీ

2

తిరుపతి

ఆంధ్రప్రదేశ్

3

గాంధీనగర్

గుజరాత్

4

కర్నాల్

హరియాణ

5

సేలం

తమిళనాడు

6

తిరుప్పూర్

తమిళనాడు

7

బిలాస్‌పూర్‌

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

8

ఉద‌య్‌పూర్‌

రాజస్థాన్

9

ఝాన్సీ

ఉత్తర్ప్రదేశ్

10

తిరునల్వేలి

తమిళనాడు

11

కాకినాడ

ఆంధ్రప్రదేశ్

18

వరంగల్

తెలంగాణ

21

కరీంనగర్

తెలంగాణ


భారతీయ మహిళా రైతులపై టైమ్‌ ప్రత్యక కథనం
వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులపై ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రత్యేక కథనాన్ని రాసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి వద్ద జరుగుతున్న రైతు నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న 20 మంది మహిళా రైతులు చంకలో బిడ్డల్ని ఎత్తుకొని నినాదాలు చేస్తున్న ఫొటోని 2021, మార్చి నెల సంచికలో కవర్‌ పేజీగా ప్రచురించింది. ‘‘నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు’’ శీర్షికతో ఉన్న ఆ కథనాన్ని నీలాంజన భౌమిక్‌ అనే జర్నలిస్ట్‌ ఆ కథనాన్ని రాశారు.
రైతు ఆందోళనలకు నేటికి 100 రోజులు
వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన మార్చి 6వ తేదీ నాటికి 100 రోజులు పూర్తవుతుంది. వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభించిన రైతులతో కేంద్రప్రభుత్వం 11 విడతల్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారతీయ మహిళా రైతులపై ప్రత్యక కథనం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : టైమ్‌ మ్యాగజైన్‌
ఎందుకు : రైతు నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున

స్వచ్ఛభారత్‌–2 అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ పేరుతో స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమం చేపట్టింది.
రెండో స్థానంలో హరియాణ...
స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమంలో భాగంగా... ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను పూర్తి పరిశుభ్ర పల్లెలను గుర్తించారు. అందులో 680 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఏపీ తర్వాత హరియాణ రెండో స్థానం దక్కించుకుంది. హరియాణలో 199 గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. హరియాణ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు.
స్వచ్ఛ భారత్‌–2...
దేశంలోని 6.03 లక్షల గ్రామాలను 2025 మార్చి నెలాఖరుకల్లా పూర్తి పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమానికి ఓడీఎఫ్‌ ప్లస్‌ పేరుతో శ్రీకారం చుట్టింది.
మనం–మన పరిశుభ్రత...
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్లు ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా తీర్చిందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛభారత్‌–2 అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ : దేశంలో
ఎందుకు : అత్యధిక గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దినందుకు

ఐసీఐఎంఓడీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
2021, ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదలకు పలు శాస్త్రీయ కారణాలను వివరిస్తూ మార్చి 6న ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవెలప్‌మెంట్‌ (ఐసీఐఎంఓడీ) ఓ నివేదికను విడుదల చేసింది. 4 దశాబ్దాలుగా చమోలీ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఫిబ్రవరి 4–6 మధ్య భారీగా పెరిగిన తేమ ›కారణంగానే ఉపద్రవం సంభవించినట్లు తెలిపింది. భారీ మంచు కొండ దాదాపు 1.6 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారుతూ రావడం వల్ల హిమపాతం సంభవించిందని తెలిపింది.
ఐసీఐఎంఓడీ...
స్థాపన: 1983, డిసెంబర్‌ 5
ప్రధాన కార్యాలయం: లలిత్‌పూర్, నేపాల్‌
సభ్య దేశాలు(8): భారత్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, అప్ఘనిస్థాన్, చైనా, మయన్మార్‌
ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌: డాక్టర్‌ పెమా గ్యామ్‌ట్షో

దేశంలో 7500వ జన ఔషధి కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?
దేశంలో 7500వ జన ఔషధి కేంద్రం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఉన్న నార్త్‌ ఈస్ట్రన్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని మార్చి 7న వర్చువల్‌ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి వారికి జన ఔషధి కేంద్రాలు ఔషధాలను చవకగా అందిస్తున్నాయి.
ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు...
  • వైద్య ఖర్చును తగ్గించే దిశగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో పేదలు, సామాన్యులకు ఏటా రూ. 50 వేల మేరకు లబ్ధి చేకూరుతోంది.
  • చవకగా ఔషధాలను అందించే ఉద్యమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకాన్ని ప్రచారం చేసేందుకు మార్చ్‌ 1 నుంచి మార్చ్‌ 7 వరకు జన ఔషధి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
  • 75 రకాల ఆయుష్‌ ఔషధాలు జన ఔషధి కేంద్రాల్లో లభిస్తున్నాయి.
  • 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 75 జిల్లాల్లో కనీసం 75 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దేశంలో 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : నార్త్‌ ఈస్ట్రన్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్, షిల్లాంగ్, మేఘాలయ
ఎందుకు : ప్రజలకు చవక ధరలకే ఔషధాలు అందించేందుకు

ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా 75 ఏళ్ల ఉత్సవాలు
దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపే ఉత్సవాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 259 మంది సభ్యుల ఉన్నతస్థాయి జాతీయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి మార్చి 8న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో వారానికొక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలను చేపడతారు. దేశ వ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలను, నిర్మాణాలను ఎంపిక చేశారు.
ఐదు ఉప శీర్షికల కింద...
దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలని ప్రధాని మోదీ తెలిపారు. కార్యక్రమాలను ‘స్వాతంత్య్ర పోరాటం, 75 ఏళ్ల ఆదర్శాలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల కార్యాచరణ, 75 ఏళ్ల సంకల్పం’అనే ఐదు ఉప శీర్షికల కింద విభజించాలని సూచించారు. ఉత్సవాలకు ప్రజా భాగస్వామ్యంతో జరిపే ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆలోచనలు, భావనలు, సూచనలు, కలలే కేంద్రంగా సాగాలన్నారు.

ఫ్రీడం ఆఫ్‌ రిలీజియన్‌ బిల్‌కి ఆమోదం తెలిపిన రాష్ట్రం?
వివాహం పేరుతో మోసపూరితంగా మతమార్పిడికి పాల్పడడంపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని నేరపూరితంగా పరిగణిస్తూ, అందుకు పదేళ్ళ వరకు జైలు శిక్షని విధించేలా ‘‘మధ్యప్రదేశ్‌ ఫ్రీడం ఆఫ్‌ రిలీజియన్‌ బిల్‌ 2021’’ రూపొందించింది. ఈ బిల్లుకు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ మార్చి 8న ఆమోదం తెలిపింది.
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ప్రొహిబిషన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ కన్వర్షన్‌ ఆఫ్‌ రిలిజియన్‌ ఆర్డినెన్స్, 2020’ని పోలి ఉంది. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం...
అవతరణ: నవంబర్‌ 1, 1956
రాజధాని: భోపాల్‌
మధ్యప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌: ఆనందీబెన్‌ పటేల్‌
మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి: శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
లోక్‌సభ సీట్లు: 29
రాజ్యసభ: 11
హైకోర్టు: మధ్యప్రదేశ్‌ హైకోర్టు(జబల్‌పూర్‌లో ఉంది)
హైకోర్టు బెంచ్‌లు: గ్వాలియర్, ఇండోర్‌.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మధ్యప్రదేశ్‌ ఫ్రీడం ఆఫ్‌ రిలీజియన్‌ బిల్‌ 2021 ఆమోదం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ
ఎందుకు : వివాహం పేరుతో మోసపూరిత మతమార్పిడిలను నిరోధించేందుకు

మహిళా పోలీసులతో పరేడ్‌ నిర్వహించిన తొలి రాష్ట్రం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసు శాఖ మార్చి 8న మహిళా పోలీసులతో పరేడ్‌ నిర్వహించింది. పరేడ్‌లో భాగంగా మహిళా పోలీసులు మోటారుబైక్‌లతో విన్యాసాలు చేశారు. కార్యక్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... అచ్చంగా మహిళా పోలీసులతో పరేడ్‌ నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారి అని, ఇతర రాష్ట్రాలన్నింటికీ ఇది స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం ‘వీరాంగన’సావనీర్‌ని గవర్నర్‌ ఆవిష్కరించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మహిళా పోలీసులతో పరేడ్‌ నిర్వహించిన తొలి రాష్ట్రం?
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : హిమాచల్‌ ప్రదేశ్‌
ఎక్కడ : సిమ్లా, హిమాచల్‌ ప్రదేశ్‌
ఎందుకు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని

అవిశ్వాస పరీక్షలో సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విజయం
హరియాణా శాసనసభలో మార్చి 10న జరిగిన అవిశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ–జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) ప్రభుత్వం సునాయాసంగా నెగ్గింది. ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 55 మంది, అనుకూలంగా 32 మంది సభ్యులు ఓటు వేసినట్లు స్పీకర్‌ జ్ఞాన్‌చంద్‌ గుప్తా ప్రకటించారు. హరియాణా అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి బీజేపీకి 40 మంది సభ్యుల బలం ఉంది.
హరియాణా...
అవతరణ: నవంబర్‌ 1, 1966. పంజాబ్‌లో కొంత భాగాన్ని హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
రాజధాని: చండీగఢ్‌
అసెంబ్లీ సీట్లు: 90
లోక్‌సభ స్థానాలు: 10
రాజ్యసభ స్థానాలు: 5
హైకోర్టు: పంజాబ్‌ అండ్‌ హరియాణ హైకోర్టు(చండీగఢ్‌లో ఉంది)
ప్రస్తుత గవర్నర్‌: సత్యదేవ్‌ నారయణ్‌ ఆర్య
ప్రస్తుత ముఖ్యమంత్రి: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

నావికాదళంలో చేరిన స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి పేరు?
భారతీయ నావికాదళంలోకి మూడో స్టెల్త్‌ స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ చేరింది. మార్చి 10న ముంబైలోని నేవీ డాక్‌యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నేవీ చీఫ్‌ వీఎస్‌ షెకావత్‌ హాజరయ్యారు. వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌లో ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ పనిచేయనుంది.
డీజిల్, విద్యుత్‌ ఆధారితంగా....
ఇప్పటి వరకు ఆరు స్కార్పియన్‌ క్లాస్‌ జలాంత ర్గాములను మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. నేవీలోకి చేరిన మూడో కలావరి క్లాస్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌... డీజిల్, విద్యుత్‌ ఆధారితంగా పనిచేస్తుంది. సముద్ర ఉపరితలంలో పాటు నీటి అడుగు నుంచి వచ్చే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ, సెన్సార్లు ఈ జలాంతర్గామిలో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : నావికాదళంలో చేరిన స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి?
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : ఐఎన్‌ఎస్‌ కరంజ్‌
ఎక్కడ : నేవీ డాక్‌యార్డు, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు

పూర్తి మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను ప్రారంభించిన దేశం?
షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టింది. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన ‘‘ఎమ్‌టీ స్వర్ణకృష్ణ’’ అనే భారీ నౌక ఇందుకు వేదికైంది. మార్చి 8న కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ జెండా ఊపి ఈ చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు. ముంబైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్‌ బెర్త్‌ జెట్టీ నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది. ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి.
ఎమ్‌టీ స్వర్ణకృష్ణ: పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్‌ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. గరిష్ఠంగా 10.5 నాట్‌ (గంటకు దాదాపు 20 కిలోమీటర్లు)ల వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలదు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పూర్తి మహిళా సిబ్బందితో కూడిన ప్రపంచ నౌకా యాత్రను ప్రారంభించిన దేశం?
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : భారత్‌
ఎక్కడ : జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టు, ముంబై, మహరాష్ట్ర
ఎందుకు : షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోన్న రాష్ట్రం?
Current Affairs
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ 29వ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోంది. 2021, మార్చి 4వ తేదీన తిరుపతిలో ఈ సమావేశాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్‌ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి (ప్రస్తుతం సీఎం లేరు) నుంచి ముఖ్యమంత్రులు.. అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రధానంగా 26 అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి సమావేశంలో చర్చించనున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2021, మార్చి 4న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ 29వ సమావేశానికి ఆతిథ్యం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎక్కడ : తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి చర్చించేందుకు

సోషల్‌ మీడియా నిబంధనావళిని కేంద్రం ఏ పేరుతో విడుదల చేసింది?
సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. సోషల్‌ మీడియా, ఓటీటీ, డిజిటల్‌ మీడియాల నియంత్రణకు ఉద్దేశించిన తాజా నియమ, నిబంధనలను ‘‘ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌’’ పేరుతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఫిబ్రవరి 25న వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • 2011 నాటి నిబంధనల స్థానంలో తాజా నిబంధనలను తీసుకొచ్చారు.
  • సోషల్‌ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది.
  • ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ
  • వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి.
  • వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్‌ మీడియా సంస్థలు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను, కేబుల్‌ టెలీవిజన్‌ నెట్‌వర్క్స్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
  • భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌ పేరుతో నిబంధనావళి విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు

స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా 12 దర్శనీయ ప్రదేశాలు?
స్వచ్ఛ ఐకానిక్‌ స్థలాలు–నాలుగో దశలో భాగంగా 12 దర్శనీయ ప్రదేశాలను ‘స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలు’గా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ చొరవతో ‘స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌’ కింద దేశంలోని గొప్ప వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలను ‘స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలు’గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా ఎంపికైన 12 ప్రదేశాలు...

సంఖ్య

ప్రదేశం

రాష్ట్రం/యూటీ

1

గోల్కోండ

తెలంగాణ

2

అజంతా గుహలు

మహారాష్ట్ర

3

సాంచీ స్థూపం

మధ్యప్రదేశ్‌

4

కుంభల్‌గఢ్‌ కోట

రాజస్తాన్‌

5

జైసల్మేర్‌ కోట

రాజస్తాన్‌

6

రామ్‌దేవ్రా

రాజస్తాన్‌

7

కోణార్క్‌ సూర్య దేవాలయం

ఒడిశా

8

రాక్‌ గార్డెన్‌

చండీగఢ్‌

9

దాల్‌ సరస్సు

జమ్మూకశ్మీర్‌

10

బాంకే బిహారీ ఆలయం(మధుర)

ఉత్తరప్రదేశ్‌

11

ఆగ్రా కోట

ఉత్తరప్రదేశ్‌

12

కాళీ ఘాట్‌ ఆలయం

పశ్చిమ బెంగాల్‌

క్విక్‌ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా 12 దర్శనీయ ప్రదేశాల ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా ఎవరు ఉన్నారు?
పశ్చిమ బెంగాల్‌ సహా తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారాను ఫిబ్రవరి 26న కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది. ఐదు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌లోని 294 నియోజకవర్గాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలోని 126 స్థానాలకు 3 విడతల్లోను, 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 స్థానాలు ఉన్న కేరళ, 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరిల్లో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

కేంద్రం ప్రారంభించిన ఈ–దాఖిల్‌ పోర్టల్‌ ఉద్దేశం?
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ఈ–దాఖిల్‌’(edaakhil.nic.in) పోర్టల్‌ 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26న ప్రకటించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 అమలులో భాగంగా ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది.
తొలుత ఢిల్లీలో...
ఈ–దాఖిల్‌ పోర్టల్‌ తొలుత ఢిల్లీలో 2020, సెప్టెంబర్‌ 8 నుంచి అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, హరియాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, గుజరాత్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్ర, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఈ–దాఖిల్‌ పోర్టల్‌ 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది.
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వినియోగదారుల ఫిర్యాదులు దాఖలు చేయడం కోసం

దేశంలో తొలి టాయ్‌ ఫెయిర్‌ ప్రారంభం
దేశంలో తొలి ‘టాయ్‌ ఫెయిర్‌–2021’ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27న ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో మార్చి 2 వరకు జరగనున్న ఈ టాయ్‌ ఫెయిర్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ టాయ్‌ ఫెయిర్‌కు ప్రఖ్యాత టాయ్‌ సంస్థ ‘హామ్లీ’ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. టాయ్‌ ఫెయిర్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... బొమ్మల రంగంలో ఆత్మనిర్భర్‌ (స్వయం సమృద్ధి) సాధించాలని పిలుపునిచ్చారు. భారత్‌లోని బొమ్మల్లో 85 శాతం బొమ్మలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని గుర్తుచేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి టాయ్‌ ఫెయిర్‌–2021 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్‌ విధానంలో

క్యాచ్‌ ది రెయిన్‌ 100 రోజుల ప్రచార కార్యక్రమం ఉద్దేశం?
వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ... క్యాచ్‌ ది రెయిన్‌ అనే 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం(ఫిబ్రవరి 28) మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ మేరకు వెల్లడించారు. రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికలు తీసి ప్రతీ వాన చినుకుని సంరక్షించడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : క్యాచ్‌ ది రెయిన్‌ అనే 100 రోజుల ప్రచారం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కరోనా వ్యాక్సిన్‌ పేరు?
60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లకుపైగా వయసున్న వ్యాధిగ్రస్తులకు కోవిడ్‌–19 టీకా ఇచ్చేందుకు ఉద్దేశించిన కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ మార్చి 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో మార్చి 1న కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసిన ‘‘కోవాగ్జిన్‌’’ టీకాను పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ప్రధాని మోదీకి ఇచ్చారు. ఆమెకు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్‌ సహకరించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు కూడా టీకా తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ తొలి దశ 2021, జనవరి 16న మొదలైన విషయం తెలిసిందే.
కో–విన్‌ 2.0 పోర్టల్‌లో...
కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారు టీకా తీసుకోవాలంటే ముందుగా కో–విన్‌ 2.0 పోర్టల్‌ (http://cowin.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకొని, అపాయింట్‌మెంట్‌ పొందాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కూడా అపాయింట్‌మెంట్‌ పొందవచ్చు. ‘‘రిజిస్ట్రేషన్ల కోసం కో–విన్‌ యాప్‌ అంటూ ఏదీ లేదు. ప్లేస్టోర్‌లో ఉన్న కో–విన్‌ యాప్‌ కేవలం అడ్మినిస్ట్రేటర్ల కోసమే’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : భారతదేశ వ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్‌–19 ఎదుర్కొనేందుకు

ప్రస్తుతం సీఈఆర్టీ–ఇన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై చైనా నుంచి సైబర్‌ దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ–ఇన్‌) హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్‌ సిస్టంలతో ‘కమ్యూనికేట్‌’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని మార్చి 2న తెలిపింది.
నష్టమేంటి!
  • సైబర్‌ నేరగాళ్లు మన విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది.
  • గ్రిడ్‌ కుప్పకూలితే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది.
సీఈఆర్టీ–ఇన్‌ డైరెక్టర్‌గా...
భారతదేశ సైబర్‌ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్‌’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం సీఈఆర్టీ–ఇన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సంజయ్‌ బాహ్ల్‌ ఉన్నారు.

కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు అంటే?
హాకింగ్, సైబర్‌ దాడుల కోసం సైబర్‌ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ (సీ అండ్‌ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్‌ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై చైనా నుంచి సైబర్‌ దాడులకు ప్రయత్నాలు
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ–ఇన్‌)
ఎందుకు : విద్యుత్‌ సంస్థల సరఫరా వ్యవస్థను నియంత్రించేందుకు

ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌ 2020గా గుర్తింపు పొందిన భారతీయ నగరం ఏది?
పట్టణంలో అడవులను పెంచడంతో పాటు వాటిని నిబద్ధతతో నిర్వహించినందును హైదరాబాద్‌ను ట్రీ సిటీ ఆఫ్‌ వరల్డ్‌ 2020గా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, అర్బోర్‌ డే ఫౌండేషన్‌ గుర్తించాయి. పట్టణ, పెరి–అర్బన్‌ ఫారెస్ట్రీ చర్యల అభివృద్ధి, ప్రాజెక్టులు, వ్యూహాత్మక ప్రణాళికతో ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించడానికి నిబద్ధతతో చెట్లను నాటి, పెంచి పోషించిన కారణంగా ఈ గుర్తింపునిచ్చారు. ఈ జాబితాలోని నగరాల్లో ఎక్కువ భాగం యునైటెడ్‌ స్టేట్స్, యునైటెడ్‌ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి.

ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం?
స్థానిక నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘‘హరియాణా స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ బిల్లు – 2020’’ హరియాణా గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మార్చి 2న వెల్లడించారు. త్వరలో దీన్ని నోటిఫై చేస్తామన్నారు. ఈ బిల్లును హరియాణా అసెంబ్లీ గత సంవత్సరం ఆమోదం తెలిపింది. బిల్లు ప్రకారం... రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో నెలవారీ వేతనం రూ. 50 వేల లోపు ఉన్న ఉద్యోగాల్లో స్థానికులకు పదేళ్ల పాటు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : హరియాణా స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ బిల్లు – 2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : హరియాణా గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య
ఎందుకు : స్థానిక నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు

మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌–2021
మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌–2021 ప్రారంభమైంది. విశాఖపట్నం పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో ఫిక్కి (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌ను మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 4 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 24 దేశాలు పాల్గొంటున్నాయి. డెన్మార్క్‌ సమ్మిట్‌ భాగస్వామిగా ఉంది.
సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్న వర్చువల్‌ ఎగ్జిబిషన్‌లో 110కి పైగా పోర్టులు, తీర ప్రాంత రాష్ట్రాలు, ప్రైవేట్‌ రంగ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, డెన్మార్క్‌ రవాణా శాఖ మంత్రి బెన్నీ ఎంగెల్‌బ్రెక్ట్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆన్‌లైన్‌ ద్వారా సమ్మిట్‌లో పాల్గొన్నారు. సమ్మిట్‌ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... భారత్‌ను తమ పెట్టుబడుల గమ్యంగా మార్చుకోవాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లను కోరారు. ప్రస్తుతం విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌గా రామ్మోహనరావు ఉన్నారు.
ఎంఐవీ ఆవిష్కరణ..
మారిటైమ్‌ సదస్సు సందర్భంగా మారిటైమ్‌ ఇండియా విజన్‌ (ఎంఐవీ) 2030 ఈ–బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. దేశీయంగా మారిటైమ్‌ రంగ అభివృద్ధికి సంబంధించి 10 ఏళ్ల బ్లూప్రింట్‌ను ఈ–బుక్‌లో పొందుపర్చారు. పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ శాఖ రూపొందించిన ఈ డాక్యుమెంట్‌ ప్రకారం వివిధ పోర్టు ప్రాజెక్టుల్లో దాదాపు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని, తద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన జరగగలదని అంచనా.
ప్రధాని ప్రసంగం–ముఖ్యమైన అంశాలు...
  • 2035 నాటికి సాగర్‌మాలా ప్రాజెక్టు కింద... పోర్టు ప్రాజెక్టులపై 82 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 6 లక్షల కోట్లు) ఇన్వెస్ట్‌ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులు అవసరమయ్యే 574 పైగా ప్రాజెక్టులను గుర్తించాం.
  • ప్రస్తుతం దాదాపు 400 ప్రాజెక్టుల్లో సుమారు 31 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 2.25 లక్షల కోట్లు) పెట్టుబడుల అవకాశాలు ఉన్నాయి.
  • పోర్టుల రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
  • 2030 నాటికి 23 వాటర్‌వేస్‌ను నిర్వహణలోకి తేవాలని నిర్దేశించుకున్నాం.
  • సీప్లేన్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం 16 ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం.
  • 2023 నాటికి దేశీ, అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్దేశించుకున్నాం.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌–2021 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : విశాఖపట్నం పోర్ట్, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : భారత్‌లోని పోర్టు ప్రాజెక్టులపై ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చించేందుకు
Published date : 27 Mar 2021 05:23PM

Photo Stories