జూన్ 2018 జాతీయం
జమ్మూకశ్మీర్‌లో ఎనిమిదోసారి గవర్నర్ పాలన ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూన్ 20న ఆమోదం తెలపడంతో జమ్మూకాశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ఎన్‌ఎన్ వోహ్రా ప్రకటించారు. పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి జూన్ 19న బీజేపీ వైదొలగడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని రాష్ట్రపతికి వోహ్రా సిఫారసు చేశారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. అలాగే ప్రస్తుత సీఎస్ బీబీ వ్యాస్‌తోపాటు ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను గవర్నర్‌కు సలహాదారులుగా కేంద్రం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా
ఎందుకు : ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసినందుకు
ఆధార్ నమోదుకు 18 వేల కేంద్రాలు
దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18,000 చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే జూన్ 20న తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ ఐడీ అప్‌డేషన్ చేసుకోవచ్చు. కనీసం పది శాఖలకు ఒకటి చొప్పున ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2017 జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను యూఐడీఏఐ కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ నమోదుకు 18 వేల కేంద్రాలు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే
ఎక్కడ : బ్యాంకులు, పోస్టాఫీసుల్లో
నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఆర్‌ఐ) క్యాంపస్‌లో 50 వేల మందికిపైగా ఔత్సాహికులతో కలసి యోగాసనాలు వేశారు. ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో ఐకమత్యం తీసుకొచ్చే శక్తి యోగాకు ఉందని మోదీ పేర్కొన్నారు.
సూరినామ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆ దేశ అధ్యక్షుడు డిజైర్ డెలానో బౌటర్స్‌తో కలసి యోగా సాధన చేశారు. రెండు దేశాల అధినేతలు కలసి యోగా సాధన చేయడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
యోగాసనాల్లో రాజస్తాన్ రికార్డ్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లోని కోటలో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డుకెక్కింది. యోగా గురు బాబా రామ్‌దేవ్ సారథ్యంలో ఒకేసారి లక్ష ఐదు వేల మంది ప్రజలతో రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ‘ఆచార్య’ పేరుతో రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలో యోగా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వసుంధరా రాజే ప్రకటించారు. 2017లో మైసూర్‌లో 55,524 మంది యోగాసనాలు వేసి రికార్డు నెలకొల్పారు.
మరోవైపు యోగా దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యధికంగా లక్షా 26 వేల మందితో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినతొలి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి గుర్తింపు పొందింది. 6 జిల్లాల్లోని, 11 ఏరియాల్లోని బొగ్గు గనులు, కార్యాలయాలు, స్టేడియాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 2016లో సింగరేణి వ్యాప్తంగా 60 వేలమందితో సామూహిక యోగా నిర్వహించి లిమ్కా నేషనల్ రికార్డును ఆ సంస్థ సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యోగాసనాల్లో గిన్నిస్ రికార్డ్
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్ సంయుక్తంగా
ఎక్కడ : కోట, రాజస్థాన్
ఎందుకు : లక్షా ఐదు వేల మందితో యోగా నిర్వహించినందుకు
నేర విచారణకు ఆధార్ డేటా వాడకూడదు: యూఐడీఏఐ
నేరాల విచారణలో ఆధార్ బయోమెట్రిక్ డేటాను వినియోగించడానికి చట్టబద్ధంగా అనుమతి లేదని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ జూన్ 22న స్పష్టం చేసింది. ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలకు ఆధార్ డేటా ఇవ్వలేదని పేర్కొంది. నేరాల విచారణలో పరిమిత స్థాయిలో ఆధార్ డేటాను ఉపయోగించుకోవడానికి పోలీసులకు అనుమతులు ఉండాలంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డెరైక్టర్ ఈశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఈ మేరకు స్పందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరాల విచారణలో ఆధార్ డేటాను వినిగించకూడదు
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : యూఐడీఏఐ
ఎందుకు : చట్టబద్ధంగా అనుమతి లేనందుకు
జాతీయ ఓబీసీ ఫెడరేషన్ ఆవిర్భావం
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న బీసీ సంఘాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఈ మేరకు జూన్ 24న ఢిల్లీలో జరిగిన జాతీయ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో జాతీయ చైర్మన్‌గా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడం, క్రీమీలేయర్‌ను తొలగించడం, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయింపు, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం వంటి పలు తీర్మానాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఓబీసీ ఫెడరేషన్ ఆవిర్భావం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
హింసతో పరిష్కారం దొరకదు: ప్రధాని మోదీ
క్రూరత్వం, హింస ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని.. జలియన్ వాలాబాగ్ దురంతమే దీనికి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శాంతి, అహింస, త్యాగం, బలిదానాల ద్వారానే ఎప్పటికైనా విజయం సాధించవచ్చారు. ఈ మేరకు మాసాంతపు రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్‌లో మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
‘2019లో జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతాయి. 1919, ఏప్రిల్ 13 నాటి ఆ చీకటి రోజును ఎవరు మరిచిపోగలరు. వందేళ్ల నాటి ఈ ఘటన మనకు ఎన్నో నేర్పింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 2019లో గురు నానక్ 550వ జయంతి (ప్రకాశ్ పర్వ్) జరుపుకోబోతున్నామని ‘భారతీయులంతా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
భారత్‌లో అత్యంత ఖరీదైన నగరం ముంబయి
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి దేశంలో అత్యధిక జీవన వ్యయం అయ్యే నగరంగా ముంబై నిలిచింది. అలాగే ప్రపంచ స్థాయిలో చూస్తే 55వ స్థానంలో ఉంది. ఈ మేరకు ప్రపంచస్థాయి నగరాల్లో జీవన వ్యయంపై కాస్ట్ ఆఫ్ లివింగ్-2018 పేరుతో మెర్సర్ సంస్థ నిర్వహించిన సర్వేలో జూన్ 26న ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ అగ్రస్థానంలో నిలవగా మెల్‌బోర్న్ 58, ఫ్రాంక్‌ఫర్ట్ 68, బ్యూనస్ ఐరిస్ 76, స్టాక్‌హోమ్ 89, అట్లాంటా 95, ఢిల్లీ 103, చెన్నై 144, బెంగళూరు 170, కోల్‌కతా 182వ స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 209 నగరాల్లో ఆహార పదార్థాలు, ఆల్కహాల్, గృహోపకరణ, నిత్యావసర వస్తువులు వంటి వాటి ధరల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక జీవన వ్యయం అయ్యే నగరంగా ముంబై
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : మెర్సర్ సంస్థ
ఎక్కడ : దేశంలో
పాస్‌పోర్టు దరఖాస్తుకు కొత్త విధానం
నివసిస్తున్న ప్రదేశంలోనే కాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆరో పాస్‌పోర్టు సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జూన్ 26న ఈ విధానాన్ని ప్రారంభించారు. అలాగే పాస్‌పోర్టు దరఖాస్తు, ఫీజు చెల్లింపు, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ వంటి సౌకర్యాలతో కూడిన ‘ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్’ అనే మొబైల్ యాప్‌ను సుష్మా ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశంలో 307 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్‌కే)లు పనిచేస్తున్నాయని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం ఒక పీఎస్‌కే లేదా (పోస్టాపీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఓపీఎస్‌కే)ను ఏర్పాటుచేస్తామని సుష్మా చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాస్‌పోర్టు దరఖాస్తుకు కొత్త విధానం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి
మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారత్
ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారత్ అని మహిళల రక్షణపై థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే జూన్ 26న వెల్లడించింది. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్, సిరియా, సోమాలియా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమెన్ , నైజీరియా, అమెరికా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అత్యాచారాలు, లైంగిక హింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, లైంగిక బానిసలుగా మార్చడం, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, ఇళ్లల్లో వెట్టిచాకిరీ, భ్రూణ హత్యలు, అమానవీయమైన సంప్రదాయాల కారణంగా భారత్ మహిళలకు చాలా ప్రమాదకరంగా మారిందని సర్వే తెలిపింది. సర్వేలో భాగంగా మహిళా సమస్యలపై అధ్యయనం చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 548 మంది అభిప్రాయాలను నిపుణులు తెలుసుకున్నారు. ఈ జాబితాలో భారత్ 2011లో నాలుగోస్థానంలో ఉంది. ఈ సర్వేను జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఖండించింది. సర్వేలో భారత్ కంటే మెరుగైన ర్యాంకు పొందిన దేశాల్లో మహిళలకు కనీసం బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదనీ, అలాంటప్పుడు భారతే అత్యంత ప్రమాదకరమని ఎలా చెప్తుందని ప్రశ్నించింది.
ఇప్పటికే లైంగిక హింస, అక్రమ రవాణా, సంప్రదాయంగా వస్తున్న అనాచారాలలో మొదటి స్థానం, లింగవివక్ష , గృహ హింస, ఇతర శారీరక, మానసిక హింసల్లో మూడో స్థానం, మహిళల ఆరోగ్య పరిస్థితుల్లో నాలుగో స్థానంలో భారత్ ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
‘ఆనకట్టల భద్రత’ బిల్లుకు ఆమోదం
డ్యాములు, నీటి రిజర్వాయర్ల రక్షణ కోసం ఉద్దేశించిన ఆనకట్టల భద్రత బిల్లు -2018కి కేంద్ర మంత్రివర్గం జూన్ 13న ఆమోదం తెలిపింది. దీంతో ఆనకట్టల భద్రతకు పాటించాల్పిన విధానాలపై సిఫారసులు చేయడానికి ఓ కమిటీ, మార్గదర్శకాలు జారీ చేసి నిబంధనలు అమలు చేసేందుకు జాతీయ ఆనకట్టల రక్షణ సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)ను ఏర్పాటు చేయవచ్చు. అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే రకమైన భద్రతా విధానాలను పాటించేందుకు కూడా బిల్లు తోడ్పడుతుంది.
ఉన్నత వ్యవసాయ విద్య కోసం రూ. 2,225.46 కోట్లను 2020 వరకు ఖర్చుపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర హోం మంత్రి ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా, ఇప్పటివరకు ఈ మండలికి అధ్యక్షుడిగా ఉన్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఆనకట్టల భద్రత’ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కేంద్ర మంత్రివర్గం
ఎందుకు : డ్యాములు, నీటి రిజర్వాయర్ల రక్షణ కోసం
త్వరలో సోలార్ చరఖా మిషన్ ప్రారంభం
ఐదు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ చరఖా మిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూన్ 27న ప్రారంభించనున్నారు. ఈ మిషన్‌ను మొదటి రెండేళ్లలో 50 క్లస్టర్లలో ప్రారంభిస్తామని, కేంద్రం రూ. 550 కోట్ల రాయితీని అందిస్తుందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ జూన్ 13న తెలిపింది. సోలార్ చరఖా మిషన్ ద్వారా మొదటి రెండేళ్లలో లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ మిషన్‌లో భాగంగా దేశంలో 15 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 2019 మార్చి నాటికి 10 కేంద్రాల్లో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ పదింటిలో విశాఖపట్నం, పుదుచ్చేరి, బెంగళూరు కూడా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సోలార్ చరఖా మిషన్ ప్రారంభం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు
ఎల్‌పీయూలో 106వ సైన్స్ కాంగ్రెస్
106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను జలంధర్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్‌పీయూ)లో నిర్వహించనున్నారు. 2019 జనవరి 3 నుంచి 7 వరకు జరిగే సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సులో నోబెల్ గ్రహీతలు, 300 మంది శాస్త్రవేత్తలు, 15 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో భాగంగా వైద్యం, పర్యావరణం, రసాయన శాస్త్రం వంటి అంశాలపై 18 ప్లీనరీ సెషన్‌లు జరుగుతాయి. ప్రస్తుతం ఎల్‌పీయూ చాన్స్ లర్‌గా అశోక్ మిట్టల్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్
ఎప్పుడు : 2019 జనవరి 3-7
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్
ఏడు రోజుల్లో ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్
భారత్‌లో జరిగే ఎన్నారై వివాహాలను ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ జూన్ 14న తెలిపింది. వారంలో రిజిస్టర్ చేసుకోకపోతే పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది. ప్రస్తుతం ఎన్నారై వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి సమయ పరిమితి లేదు. మరోవైపు వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం(ఎస్క్రో కేసు) వంటి అంశాలపై మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ చర్చించారు. వివాహాల్లోని పలు సమస్యల పరిష్కారానికి నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రుల బృందం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్
ఎప్పుడు : వివాహం అయిన ఏడు రోజుల్లోపు
ఎవరు : కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ
భారత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి
భారత్ చరిత్రలోనే తొలిసారిగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్ జూన్ 14న వెల్లడించింది. ఈ మేరకు ‘కంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 60 కోట్ల మంది తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటుండగా, సరైన తాగునీరు లేనికారణంగా ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారని పేర్కొంది.
ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు దేశంలో జలవనరులు, వాటి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసింది. దేశంలో 2030 నాటికి నీటి సరఫరాకు రెట్టింపుగా డిమాండ్ ఉండొచ్చని దీని కారణంగా జీడీపీ 6 శాతానికి పడిపోతుందని చెప్పింది. అలాగే 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా 21 నగరాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల 10 కోట్ల మందిపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నీటి నాణ్యత సూచీలో భారత్ 120 స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : ‘కంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్’
కశ్మీర్‌పై నివేదిక విడుదల చేసిన ఐరాస
జమ్మూకశ్మీర్ (కశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ ప్రాంతాలు), పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్ (ఆజాద్ జమ్ముకశ్మీర్, గిల్‌గిట్-బల్టిస్తాన్)లపై ఐక్యరాజ్యసమితి జూన్ 14న తొలిసారిగా ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎదురవుతున్న సవాళ్లని యూఎన్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తన నివేదికలో పేర్కొంది. అలాగే ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేసే చర్యలను నిలిపివేయాలని పాకిస్తాన్‌ను ఐరాస కోరింది. 2016 నుంచి జమ్మూ కశ్మీర్‌లో చెలరేగిన ఆందోళనలు, భద్రతాదళాల చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది.
ఐరాస నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను ఉల్లంఘించేలా ఉందని భారత్ వ్యతిరేకించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు బదులుగా ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్‌గిట్ బల్టిస్తాన్ అనే పదాలను ఐరాస ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని అసలు ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిత్ బల్టిస్తాన్ అనేవి లేనేలేవని భారత్ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగమని, పాక్ చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కులపై నివేదిక
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ఐక్యరాజ్యసమితి
చత్తీస్‌గడ్‌లో 22 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం
ఛత్తీస్‌గఢ్‌లో రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులని ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 14న ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్, నయా రాయ్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. అలాగే జగదల్‌పూర్-రాయ్‌పూర్ మధ్య విమాన సేవల్ని ప్రధాని ప్రారంభించడంతో బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి.
72 వేల కోట్లతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టిన ఆధునీకరణ, విస్తరణలో భాగంగా భిలాయ్ ప్లాంట్‌ను అభివృద్ధి చేశారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 13 మిలియన్ టన్నుల నుంచి 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 22 వేల కోట్ల ప్రాజెక్టులని ప్రారంభించిన మోదీ
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఛత్తీస్‌గ ఢ్
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నతాధికారుల్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ఆదేశించింది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు జూన్ 5న తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ప్రభుత్వ ఉద్యోగాల్లో
‘వలస’ సంపన్నుల్లో భారత్‌కు రెండో స్థానం
స్వదేశాల నుంచి విదేశాలకు వలస వెళుతున్న సంపన్నుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆఫ్రో ఆసియా బ్యాంకు ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ పేరుతో జూన్ 16న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. వలస వెళ్లే సంపన్నులు అత్యధికంగా ఆస్ట్రేలియాకు వెళుతుండగా తర్వాతి స్థానాల్లో అమెరికా, కెనడా, న్యూజిలాండ్, అరబ్ దేశాలు ఉన్నాయి.
2014 నుంచి మొత్తం 23 వేల మంది కోటీశ్వరులు భారత్ నుంచి వలస వెళ్లారు. వీరిలో అత్యధికంగా బ్రిటన్, దుబాయి, సింగపూర్‌లలో శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,45,000 మంది కోటీశ్వరులు ఉండగా ఈ సంఖ్య 2022 నాటికి 3,72,000కు చేరుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని మిలియనీర్లలో 2 శాతం, బిలియనీర్లలో 5 శాతం మంది భారత్‌లో ఉన్నారు.
ఎన్‌డబ్ల్యూ వరల్డ్ నివేదిక ప్రకారం 2017లో 95,000 మంది కోటీశ్వరులు తమ దేశాలను వీడి ఇతర దేశాలకు వలసవెళ్లారు. ఈ సంఖ్య 2016లో 82,000, 2015లో 64,000గా ఉంది. 2016లో ప్రపంచంలోని మొత్తం సంపద 192 లక్షల కోట్ల డాలర్లు ఉండగా 2017కి 2 శాతం పెరిగి 215 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల వలసలపై ఆఫ్రో ఆసియా బ్యాంకు అధ్యయనం చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘వలస’సంపన్నుల్లో భారత్‌కు రెండో స్థానం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ ఆఫ్రో ఆసియా బ్యాంకు
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
పార్లమెంటు సభ్యుడు కూడా పీఐవోనే: సీఐసీ
పార్లమెంటు సభ్యుడిని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (పీఐవో)గా పరిగణిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల(ఎంపీల్యాడ్‌స) పథకం అమలు స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సంబంధిత సమాచారం సదరు ఎంపీ ఇవ్వాలని పేర్కొంది.
గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రశాంత్ జైన్ అనే వ్యక్తి తన నియోజకవర్గంలో 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు ఎంపీల్యాడ్‌స నిధుల వినియోగం వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీ కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారే
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)
రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నీతి ఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశం జూన్ 17న జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అభివృద్ధి, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు వంటి అంశాలపై మోదీ మాట్లాడారు.
‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఇప్పటికే మూడేళ్లు, ఏడేళ్లు, 15 ఏళ్ల లక్ష్యాలను ఏర్పర్చుకుని వీటిని చేరుకునేందుకు దార్శనిక పత్రాల (విజన్ డాక్యుమెంట్) రూపకల్పన ప్రణాళికలను నీతి ఆయోగ్ రూపొందిస్తుంది. 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు) దేశం ఆరు ప్రధాన సమస్యల (పేదరికం, చెత్త, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం) నుంచి విముక్తమయ్యేలా పనిచేయాలని గతేడాది ప్రజెంటేషన్‌లో నీతి ఆయోగ్ పేర్కొంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్, సీఈవోగా అమితాబ్ కాంత్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశం
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : నీతి ఆయోగ్ చైర్మన్, ప్రదాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
విశ్వవిద్యాలయాల్లో ఏటా స్నాతకోత్సవాలు
విశ్వవిద్యాలయాల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జూన్ 17న ఆదే శించింది. దేశంలోని కొన్ని వర్సిటీలు స్నాతకోత్సవాలను వాయిదా వేయడంపై కేంద్రం ఈ మేరకు స్పందించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీ స్నాతకోత్సవానికి విద్యార్థులంతా ధరించే ప్రత్యేకమైన గౌనుకు బదులుగా కుర్తా పైజామా, విద్యార్థినులు సల్వార్‌కమీజ్ లేదా తెలుపు రంగు చీర ధరించాలని ఆదేశించింది. అలాగే స్నాతకోత్సవం సమయంలో చేసే ప్రతిజ్ఞను ఇంగ్లిష్‌తో పాటు సంస్కృతంలో చేసే వెసులుబాటు కల్పించింది.
పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి వర్సిటీ గత ఐదేళ్లలో ఓసారి, త్రిపురలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం గత నాలుగేళ్లలో ఓసారి స్నాతకోత్సవాలను నిర్వహించాయి. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 46 ఏళ్ల తర్వాత ఈ ఏడాది రెండో స్నాతకోత్సవాన్ని నిర్వహించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వవిద్యాలయాల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించాలి
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
లక్ష సీట్లకు బీపీవో స్కీమ్ పరిధి పెంపు
చిన్న పట్టణాల్లోనూ బీపీవో కార్యాలయాలు ఏర్పాటు చేసేలా సంస్థలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బీపీవో స్కీమ్ పరిధిని లక్ష సీట్లకు పెంచారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ జూన్ 18న తెలిపారు. ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పడే ఈ స్కీమ్ పరిధి ప్రస్తుతం 48,000 సీట్లుగా ఉంది.
దేశంలోనే అతి పెద్ద జాతీయ డేటా సెంటర్‌ను దాదాపు 5 లక్షల వర్చువల్ సర్వర్స్ సామర్థ్యంతో భోపాల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, పుణె, ఢిల్లీ, భువనేశ్వర్‌లో మొత్తం 4 జాతీయ డేటా సెంటర్స్ ఉన్నాయి. ప్రభుత్వ వెబ్‌సైట్లు, సర్వీసులు, యాప్స్ మొదలైన వాటిని జాతీయ డేటా సెంటర్స్ ద్వారా నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్ష సీట్లకు బీపీవో స్కీమ్ పరిధి పెంపు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్
ఎందుకు : ఉపాధి అవకాశాలు పెంచేందుకు
జమ్మూకశ్మీర్ సీఎం రాజీనామా
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి జూన్ 19న రాజీనామా చేశారు. కశ్మీర్‌లో పీడీపీ-బీజేపీల కూటమితో కూడిన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగా ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో మెహబూబా ముఫ్తీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), కాంగ్రెస్‌లు స్పష్టం చేయడంతో గవర్నర్ పాలన విధించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ నివేదిక పంపారు. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించడం 1977 నుంచి ఇది ఎనిమిదోసారి. 2008 నుంచి నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు.
మొత్తం 89(ఇద్దరు నామినేటెడ్‌తో కలిపి) అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో 2014 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు, పీడీపీ 28, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు దక్కించుకోగా ఇతరులు ఏడు స్థానాల్లో గెలిచారు.
2015 మార్చి 1న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బీజేపీ, పీడీపీలతో కూడిన ప్రభుత్వాని ఏర్పాటు చేశారు. 2016 జనవరి 7న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అనారోగ్యంతో మృతి చెందగా 2016 జనవరి 8న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. తర్వాత 2016 ఏప్రిల్ 4న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ మొదటి మహిళా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 17న రంజాన్‌ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నెల పాటు కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే కాల్పుల విరమణను పొడిగించాలని ముఫ్తీ ప్రభుత్వాన్ని కోరగా జూన్ 17న పొడిగించబోమని కేంద్రం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ సీఎం రాజీనామా
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : మెహబూబా ముఫ్తీ
ఎందుకు : ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో
ఉమ్మడి నీటి నిర్వహణ సూచీ విడుదల
రాష్ట్రాలకు ఉమ్మడి జల యాజమాన్య సూచీ (సీడబ్ల్యూఎంఐ)లను కేటాయిస్తూ నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. భూగర్భ జలనిర్వహణ, జల వనరుల పరిరక్షణ, వ్యవసాయం, తాగునీరు, విధానాల రూపకల్పన- అమలు వంటి 28 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఈ ర్యాంకులు కేటాయించారు. ఈశాన్య-హిమాలయ, ఇతరాలుగా రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుని వివిధ అంశాలను మదింపు చేశారు. అయితే కొన్ని కారణాలతో పశ్చిమ బంగా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ము- కశ్మీర్, మణిపూర్, మిజోరాంలను మినహాయించారు. ఇతర రాష్ట్రాల విభాగంలో అత్యంత సమర్థంగా నీటి నిర్వహణ చేపట్టిన గుజరాత్ ప్రథమ స్థానం దక్కించుకోగా, ఏపీ- మూడు, తెలంగాణ- ఎనిమిదో స్థానాలను దక్కించుకున్నాయి.
పూరీ ఆలయంలో కానుకలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథస్వామి ఆలయంలో భక్తుల నుంచి విరాళాలు, కానుకలు స్వీకరించవద్దని ఆలయ సేవకులకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కానుకలు ఇవ్వని భక్తుల పట్ల సేవకులు వివక్ష చూపుతున్నారంటూ వచ్చిన వార్తలపై జూన్ 9న స్పందించింది. భక్తుల నుంచి కానుకలు స్వీకరించకుండా ఏపీలోని తిరుపతి, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి, గుజరాత్‌లోని సోమనాథ్, పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో అమల్లో ఉన్న వివిధ విధానాలను అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పూరీ ఆలయంలో కానుకలు స్వీకరించవద్దని సూచన
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : ఒడిశా
దేశంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్ భగీరథి-2పై యోగాసనాలు వేసి భారత మహిళా సైనికులు ప్రపంచ రికార్డు సృష్టించారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 19,022 అడుగుల ఎత్తై భగీరథి-2 పై కల్నల్ ఓమెందర్ కే పవార్ నేతృత్వంలోని బృందం యోగాసనాలను వేసింది. ఇటీవల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధ ప్రాంతం దాదాపు 18,800 అడుగుల ఎత్తయిన సియాచిన్‌పై భారత సైనికులు యోగాసనాలు వేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యోగాసనాల్లో మహిళా సైనికుల రికార్డు
ఎప్పుడు : జూన్ 10
ఎక్కడ : మౌంట్ భగీరథి-2
పాటియాలాలో క్రీడా విశ్వవిద్యాలయం
పంజాబ్‌లోని పాటియాలా శివారులోని సిధువల్ గ్రామంలో క్రీడావిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌సింగ్ జూన్ 10 ప్రకటించారు. ఈ వర్శిటీలో స్పోర్‌ట్స సైన్స్, సైకాలజీ, క్రీడల్లో అధునాతన విధానాలపై కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం బ్రిటన్‌కు చెందిన లోఫ్ బోరోఫ్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలన్నీ వర్సిటీ అనుబంధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ వర్సిటీకి వైస్-చాన్సలర్‌గా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్‌ట్స మాజీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాణావత్ వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాటియాలాలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : పంజాబ్ ప్రభుత్వం
ఎక్కడ : సిధువల్ గ్రామం, పాటియాలా
సాక్షుల రక్షణ కోసం ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’
కీలక కేసుల్లో సాక్షుల రక్షణ కోసం ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’ పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర హోం శాఖ జూన్ 12న నిర్ణయించింది. ఈ మేరకు నల్సార్ యూనివర్సిటీ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లు సంయుక్తంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాయి. ఈ చట్టం ద్వారా సాక్షులకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటారు.
విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అమలుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, స్వచ్ఛంద సంస్థలు, కోర్టులకు డిపాజిట్ రూపంలో వచ్చే నిధుల నుంచి కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమచేస్తారు.
కేటగిరీల వారీగా సాక్షులకు భద్రత
సాక్షులను మూడు కేటగిరీలుగా విభజించి భద్రత కల్పిస్తారు.
- కేటగిరీ-ఏ కింద ఏదైనా కేసులో సాక్ష్యం చెబుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబంలో జీవితాంతం ప్రమాదం ఉన్నవారు ఉంటారు.
- కేటగిరీ-బీలో కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో హాని ఉండే సాక్షులు ఉంటారు.
- కేటగిరీ-సీ కింద పోలీసుల దర్యాప్తు జరుగుతున్నప్పుడే బెదిరింపులు, హాని, సమాజంలో తిరగనీయకుండా చేయడం వంటి సమస్యలను ఎదుర్కొన్న సాక్షులను చేరుస్తారు.
ఏమిటి : ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’ పేరిట ప్రత్యేక చట్టం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర హోం శాఖ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : కీలక కేసుల్లో సాక్షుల భద్రతకు
3 వేల స్కూళ్లలో టింకరింగ్ ల్యాబ్స్
అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎమ్) కింద దేశంలోని మరో మూడు వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) ఏర్పాటు చేయనున్నట్లు నీతి ఆయోగ్ జూన్ 12న ప్రకటించింది. దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో కనీసం ఒక టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎంచుకున్న 3 వేల స్కూళ్లతో మొత్తం ఏటీఎల్‌లసంఖ్య 5,441 కి చేరుకుందని నీతిఆయోగ్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశంలోని మూడు వేల స్కూళ్లలో
ఎందుకు : అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎమ్) కింద
శాంతి సూచీలో భారత్‌కు 136వ స్థానం
ప్రపంచ శాంతి సూచీ-2018లో భారత్‌కు 136వ స్థానం దక్కింది. లండన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) నివేదిక ప్రకారం ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలకు తొలి మూడు స్థానాలు దక్కాయి. మొత్తం 163 దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించగా సిరియా శాంతిలేని దేశంగా చివరి స్థానంలో నిలిచింది.
‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ పుస్తకావిష్కరణ
‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జూన్ 7న ఆవిష్కరించారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తై సందర్భంగా సమావేశం నిర్వహించారు. దక్షిణాఫ్రికా డిప్యూటీ విదేశాంగ మంత్రి లాండర్స్‌తో కలిసి పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వర్ణవివక్షతపై పోరాడిన ప్రముఖ నేత ఒలివర్ టాంబోల పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేయడంతోపాటు మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియంను సుష్మా ప్రారంభించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయినందుకు సుష్మా స్వరాజ్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
ఎక్కడ : పీటర్‌మారిట్జ్‌బర్గ్, దక్షిణాఫ్రికా
ఎందుకు : గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తై సందర్భంగా
చైల్డ్‌హుడ్ ఇండెక్స్‌లో భారత్‌కు 113వ స్థానం
ప్రపంచ బాల్యసూచీ 2018లో భారత్ 113 స్థానంలో నిలిచింది. 2017లో భారత్ ర్యాంక్ 116 కాగా తాజాగా మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. అయితే పౌష్టికాహారం, శిశు మరణాలు, బాలకార్మికులు వంటి అంశాలు భారత్‌లో తీవ్ర సమస్యగా పరిణమించాయని గ్లోబల్ చైల్డ్ రైట్స్ గ్రూప్ మే 31న తెలిపింది. 2016లో భారత్‌లో శిశు మరణాల రేటు 39 గా నమోదైంది. 30 శాతం మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బాల్యసూచీలో భారత్‌కు 113వ ర్యాంక్
ఎప్పుడు : మే 31
ఎవరు : గ్లోబల్ చైల్డ్ రైట్స్ గ్రూప్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
‘కావేరీ’ యాజమాన్య సంస్థ ఏర్పాటు
కావేరీ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు కావేరీ నదీజలాల యాజమాన్య సంస్థ (సీఎంఏ)ను కేంద్ర ప్రభుత్వం జూన్ 1న ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో చైర్మన్, సెక్రటరీతో పాటు మొత్తం ఎనిమిది మంది సభ్యులుంటారు. వీరిలో కేంద్రం తరపున ఇద్దరు శాశ్వత, ఇద్దరు తాత్కాలిక సభ్యులు ఉండగా కావేరి నది భాగస్వామ్య రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల నుంచి నలుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు. కమిటీ నదీ జలాల నిల్వ, పంపకం, వివాదాల పరిష్కారం తదితర వివాదాలను సమీక్షించి ఆదేశాలిస్తుంది. కావేరీ జలాల్లో కర్ణాటక వాటాను పెంచి.. తమిళనాడు వాటాను సుప్రీంకోర్టు ఇటీవల స్వల్పంగా తగ్గించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘కావేరీ’ యాజమాన్య సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కావేరీ నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం
తొలి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పరిశీలించిన మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను మే 30న తిరస్కరించారు. 2006లో బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఉండే రాఘోపూర్ మండలంలో జగత్ రాయ్ అనే వ్యక్తి ఏడుగురిని సజీవదహనం చేశాడు. ఈ కేసులో అతనికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చేప్పడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్నాడు.
2006లో రాఘోపూర్ మండలంలో తన గేదెను దొంగిలించారని జగత్ రాయ్, వాజిర్ రాయ్, అజయ్ రాయ్ అనే ముగ్గురిపై విజేంద్ర మహతో కేసు పెట్టాడు. కేసు ఉపసంహరించుకోవాలన్న నిందితుల ఒత్తిడికి మహతో తలొగ్గకపోవడంతో ఆయన ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆయన భార్య, ఐదుగురు పిల్లలు మంటల్లో చిక్కుకుని మరణించగా మహతో చికిత్స పొందుతూ చనిపోయాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి
ఎప్పుడు : మే 30
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
నో హోంవర్క్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇంటి పని ఇవ్వకూడదనే ‘నో హోంవర్క్’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం జూన్ 3న తెలిపింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009కు అనుగుణంగా ఈ బిల్లును ప్రవేశపెడతారు.
1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు ఎలాంటి హోంవర్క్ ఇవ్వకుండా, వీరికి భాష, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టులు బోధించకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు మే 30న కేంద్రాన్ని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నో హోంవర్క్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు : జూన్ 3
ఎక్కడ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో
ఎందుకు : 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటిపని ఇవ్వకుండా
రాష్ట్రపతి భవన్‌లో 49వ గవర్నర్‌ల సదుస్సు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 49వ గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌ల సదస్సు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జూన్ 4న ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన రాష్ట్రపతి ‘భారత్‌లో 10 కోట్ల మంది ఆదివాసీలున్నారని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గవర్నర్‌లు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘భారతదేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పాత్ర చాలా కీలకం’ అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 49వ గవర్నర్‌ల సదస్సు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
ఈ-చెత్త ఉత్పత్తిలో భారత్ కు ఐదోస్థానం
ఈ-చెత్త (ఎలక్ట్రానిక్ చెత్త)ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా అమెరికా, జపాన్, జర్మనీలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా అసోచామ్, ఎన్‌ఈసీ లు ఈ వివరాలను వెల్లడించాయి.
అదే విధంగా దేశంలో అత్యధిక ఈ-చెత్తను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో 19.8 శాతం ఈ-చెత్తతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 13 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి.
2016లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 శాతం ఈ-చెత్తను మాత్రమే రీసైక్లింగ్ చేశారు. ఈ-చెత్తలో 95 శాతం అసంఘటిత రంగాలకు సంబంధించినది కాగా ఇందులో 70 శాతం కంప్యూటర్, సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా వస్తోంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 52.2 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ పేరుకుపోనుందని కొన్ని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ-చెత్త ఉత్పత్తిలో భారత్ కు ఐదోస్థానం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : అసోచామ్, ఎన్‌ఈసీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
గ్రామ్ బంద్ ఆందోళన చేపట్టిన రైతులు
రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు 10 రోజులపాటు గ్రామ్ బంద్ ఆందోళన చేపట్టారు. ఆందోళన మొదటి రోజు అయిన జూన్ 1 నుంచి రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతోపాటు కేంద్రానికి వ్యతిరే కంగా నినదిస్తున్నారు. మరో వైపు ఆందోళన చివరి రోజైన జూన్ 10న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామ్ బంద్ ఆందోళన
ఎప్పుడు : జూన్ 1 నుంచి 10
ఎవరు : రైతులు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర కల్పించాలని
ఢిల్లీలో పర్యావరణ దినోత్సవ ప్లీనరీ
న్యూఢిల్లీలో 43వ అంతర్జాతీయ పర్యావరణ దినోవత్సవ ప్లీనరీ కార్యక్రమం జూన్ 5న జరిగింది. ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ ప్లీనరీకి చెర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ అభివృద్ధి పర్యావరణహితంగా ఉండాలని, ప్రకృతిని పణంగా పెట్టి దాన్ని సాధించకూడదని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 43వ అంతర్జాతీయ పర్యావరణ దినోవత్సవ ప్లీనరీ
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు జూన్ 5న స్పష్టం చేసింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 16 (4ఏ) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పదోన్నతులు కల్పించే అధికారం ఉందని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌ల వెకేషన్ బెంచ్ (సెలవుకాల బెంచ్) పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొడిగిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు 2017లో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : ప్రభుత్వం ఉద్యోగాల్లో
తాజ్ డిక్లరేషన్‌కు ఆమోదం
ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ చుట్టూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిషేధించడానికి ఉద్దేశించిన తాజ్ డిక్లరేషన్ ఈ నెల 3న ఆమోదం పొందింది. దీని ప్రకారం తాజ్ చుట్టూ 500 మీటర్ల మేర చెత్తాచెదారం లేకుండా చూడటంతో పాటు వాడిపారేసే ప్లాస్టిక్‌ను క్రమంగా విడనాడాలి. ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) సుహృద్భావ రాయబారి దియా మీర్జా ఈ తాజ్ డిక్లరేషన్‌ను ప్రకటించారు.