జనవరి 2021 జాతీయం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం జనవరి 23న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా.. నేతాజీ లేఖలతో కూడిన పుస్తకాన్ని, ఆయన స్మారకంగా స్టాంపు, నాణెంను ప్రధాని విడుదల చేశారు.
కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్‌ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు.
మూడు దీవుల పేర్లు మార్పు
ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ దీవులను 2018, డిసెంబర్ 30న సందర్శించారు. ఆ సందర్భంగా ఇక్కడి మూడు దీవుల పేర్లను మార్చారు. రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాస్ చంద్రబోస్ ద్వీప్గా, నీల్ ఐలాండ్‌ను షహీద్ ద్వీప్‌గా, హావెలాక్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్‌గా మారుస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మూడు దీవులు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరాక్రమ్ దివస్ వేడుకలు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఎక్కడ : విక్టోరియా మెమోరియల్ హాల్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా..
ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో పేరు?
మొబైల్ ఫోన్లలో, పర్సనల్ కంప్యూటర్లలలో డౌన్‌లోడ్ చేసుకునే ‘‘డిజిటల్ ఓటర్స్ ఫొటో ఐడెంటిటీ కార్డు’’ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆవిష్కరించింది. నేషనల్ ఓటర్స్ డే(జనవరి 25) సందర్భంగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎలక్టోర్ ఫొటో ఐడెంటిటీ కార్డుని లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. అలాగే ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో ‘‘హెలో వోటర్స్’’ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ ఓటర్ కార్డుని మార్చే అవకాశం లేకుండా ఈ-ఓటర్ కార్డు పీడీఎఫ్ ఫాంలో ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో హెలో వోటర్స్ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఎన్నికల సంబంధిత విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు
డిజిటల్ వినియోగంలో లింగ వివక్ష
భారత్‌లో ఆడపిల్లలు మొబైల్ ఫోన్ వాడకంపై అంతర్లీనంగా నిషేధం కొనసాగుతోందని సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ చేంజ్(సీ3) అనే స్వచ్ఛంద సంస్థ డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్తో కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలోని బాలికలకు ఉన్న డిజిటల్ యాక్సెస్‌ని అంచనా వేసేందుకు 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో 4,100 మందిని ఈ అధ్యయనంలో భాగస్వాములను చేశారు. జనవరి 23న సర్వేను విడుదల చేశారు.
సర్వేలోని ముఖ్యాంశాలు...
- దేశంలో 42 శాతం మంది కిశోర బాలికలకు కేవలం రోజుకి గంటకన్నా తక్కువ సమయం మొబైల్ ఫోన్‌ని వాడే అవకాశం ఇస్తున్నారు.
- అత్యధిక మంది తల్లిదండ్రులు ఆడపిల్లల మొబైల్ వాడకాన్ని సురక్షితం కాదని భావిస్తున్నారు.
- బాలబాలికల మధ్య మొబైల్ వినియోగం విషయంలో వ్యత్యాసం జెండర్ వివక్ష కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది.
- ప్రధానంగా హరియాణా రాష్ట్రంలో బాలురకి మొబైల్ వాడకంలో ఉన్నంత వెసులుబాటు ఆడపిల్లలకి లేదు.
- కర్నాటకలో బాలికలకు మిగిలిన రాష్ట్రాలకంటే కొంత ఎక్కువగా మొబైల్ వాడే అవకాశం లభిస్తోంది.
- 71 శాతం మంది బాలికలకు అసలు మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. అందుకు ఆర్థిక స్థోమత లేకపోవడమే కారణం.
సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్(స్మార్ట్) పథకం ఉద్దేశం?
రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ ‘‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్ (స్మార్ట్)’’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. రైలు టెర్మినళ్ల వద్ద గూడ్‌స షెడ్లను ఎంచుకుని సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్‌స షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో...
ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్... ఐదు చోట్ల గూడ్‌స షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్‌స షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. 2020 ఏడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్ (స్మార్ట్) పేరుతో నూతన పథకం రూపకల్పన
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : రైల్వే శాఖ
ఎందుకు : దేశంలోని రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు
భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారత రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రతీ ఏడాది మాదిరిగా ఆర్భాటంగా సంబరాలు నిర్వహించలేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, దేశ సామాజిక, ఆర్థిక పురోగతి, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే విన్యాసాలతో రాజ్‌పథ్‌లో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథి లేకుండానే...
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్-19 ముప్పుతో ముఖ్య అతిథి లేకుండానే నిర్వహించారు. గతంలో 1952, 1953, 1966 సంవత్సరాలలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి.
విశేషాలు...
- భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన లేపాక్షి కట్టడం స్ఫూర్తిగా రూపుదిద్దిన శకటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరేడ్‌లో ప్రదర్శించింది.
- రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా 2021 ఏడాది పెరేడ్‌లో ప్రదర్శించారు.
- యుద్ధవిమానాలను నడిపే మొదటి మహిళా పెలైట్లలో ఒకరైన లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ ఈ పెరేడ్‌లో పాల్గొన్నారు. మహిళా యుద్ధ పెలైట్ పెరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.
- వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిధ్యం వహించింది. లద్దాఖ్ సంస్కృతిని ప్రతిబింబించే థిక్సే మఠం శకటాన్ని ప్రదర్శించింది.
- పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొంది 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ దళాలు ఈ సారి పెరేడ్‌ను ముందుండి నడిపించాయి.
- భారత నౌకాదళం తన శకటంలో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నమూనాను ప్రదర్శించింది. అలాగే 1971 భారత్-పాక్ యుద్ధంలో నేవీ నిర్వహించిన పోరాటాన్ని కళ్లకు కట్టింది.
- ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమిచ్చింది.
- కోవిడ్-19 ముప్పుతో ఈ సారి రిపబ్లిక్ డే కవాతుని 8.5 కి.మీ. నుంచి 3.5కి.మీకి కుదించారు. కవాతుకు లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్ర నేతృత్వం వహించారు.
ఎర్రకోట ముట్టడి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న ఢిల్లీలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు.
ఏ పక్షి ఆకారంలో జయలలిత స్మారక మండపాన్ని నిర్మించారు?
చెన్నై మెరీనాబీచ్‌లో నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి జనవరి 27న ప్రారంభించారు. ఫినిక్స్ పక్షి ఆకారంలో రూ.80 కోట్లతో ఈ సమాధి స్మారాక మండపాన్ని నిర్మించారు. ఈ మండప రూపకల్పన(డిజైన్)ను ఐఐటీ మద్రాసు తయారు చేసింది. నిర్మాణానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది. జయలలిత సమాధిపై తమిళంలో, ఇంగ్లీషులో ‘బై ద పీపుల్-ఫర్ ద పీపుల్’ అని అమర్చారు.
2016 డిసెంబర్ 5న... జయలలిత కన్నుమూయగా ఆమె పార్థివదేహాన్ని చెన్నై మెరీనాబీచ్‌లో ఎంజీ రామచంద్రన్ స్మారక మండపం వెనుకవైపున ఖననం చేసి సమాధి నిర్మించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె. పళనిస్వామి
ఎక్కడ : మెరీనాబీచ్, చెన్నై, తమిళనాడు
దేశంలోనే మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించిన రాష్ట్రం?
దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్‌లో ప్రారంభమయి్యంది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. రెండో దశలో హిసార్ నుంచి డెహ్రాడూన్ వరకు మరో ఎయిర్ ట్యాక్సీని వచ్చేవారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మూడో దశలో చండీగఢ్ నుంచి డెహ్రాడూన్, హిసార్ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిమ్లా, కులూతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం ఇందులో చేర్చాలని యోచిస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ కోసం టెక్నామ్ పీ2006టీ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రయాణ చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది. మెట్రో 2 టైర్, 3 టైర్ నగరాలను ఎయిర్ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి పేరు?
ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జనవరి 16న ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో ‘‘కోవిషీల్డ్, కోవాగ్జిన్’’ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జనవరి 16న దేశవ్యాప్తంగా 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు.
మొట్టమొదటి వ్యక్తిగా మనీశ్...
దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్‌కు భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను ఇచ్చారు.
తొలిరోజు ఏ రాష్ట్రంలో ఎంతమందికి టీకా..
రాష్ట్రం | టీకా తీసుకున్నవారు |
ఉత్తరప్రదేశ్ | 21,291 |
ఆంధ్రప్రదేశ్ | 19,108 |
మహారాష్ట్ర | 18,328 |
బిహార్ | 18,169 |
ఒడిశా | 13,746 |
కర్ణాటక | 13,594 |
గుజరాత్ | 10,787 |
పశ్చిమ బెంగాల్ | 9,730 |
తెలంగాణ | 3,962 |
తమిళనాడు | 2,945 |
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 16న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. తొలి టీకాను ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి ఇచ్చారు.
తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు జనవరి 16న టీకాల కార్యక్రమం విజయవంతమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు వైద్యులు తొలి టీకా వేశారు. అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్‌లో తొలి టీకాను ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రకళ, తిలక్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఆయాగా పని చేస్తున్న రేణుక తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : భారత్
ఎందుకు : కోవిడ్-19ను నిరోధించేందుకు
ఆర్‌ఏఎఫ్ స్థావరం ఏర్పాటుకు హోం మంత్రి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా బుళ్లాపురలో ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) నూతన స్థావరం ఏర్పాటు కానుంది. ఈ ఆర్‌ఏఎఫ్ క్యాంప్‌కి జనవరి 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు. సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో ఈ ఆర్‌ఏఎఫ్ 97వ బెటాలియన్ క్యాంప్ ఏర్పాటు కానుంది. ఇందులో సిబ్బందికి శిక్షణనివ్వడంతో పాటు క్వార్టర్లు, ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయి. దాదాపు 50 ఎకరాల్లో నిర్మిస్తారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది సీఆర్‌పీఎఫ్కి చెందిన ఒక విభాగం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) నూతన స్థావరం ఏర్పాటు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఎక్కడ : బుళ్లాపుర, భద్రావతి తాలూకా, శివమొగ్గ జిల్లా, కర్ణాటక
ఇటీవల కొత్తగా ఎనిమిది రైళ్లను ఎక్కడ ప్రారంభించారు?
అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మరోవైపు దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి-చందోడ్, చందోడ్-కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్-కేవాడియా సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు.
జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్...
ప్రధాని తాజాగా ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్-కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్‌లో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారు.
- గిరిజన ప్రాంతమైన కేవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహాన్ని ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారు.
- రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలింది.
- ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొత్తగా ఎనిమిది రైళ్లు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న కేవాడియాతో అనుసంధానించేందుకుగాను
సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ, సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగించారు. ఈ రెండు మైట్రోరైల్ ప్రాజెక్టుల కోసం రూ.17,000 వ్యయం చేయనున్నారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు.
- దేశంలో 27 నగరాల్లో 1,000 కిలోమీటర్లకు పైగా మెట్రోరైల్ నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయి.
- ప్రస్తుతం వేర్వేరు రవాణా విధానాలైన బస్సులు, రైళ్లను అనుసంధానిస్తున్నాం.
- 2014 కంటే ముందు 10-12 ఏళ్లలో 225 కిలోమీటర్ల మేర మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది.
- 2014 తర్వాత ఆరేళ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్‌ను ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అహ్మదాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ, సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఎవరి జయంతిని పరాక్రమ దివస్ పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?
భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తేదీన ఇకనుంచి ‘‘పరాక్రమ దివస్’’గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పరాక్రమ దివస్ సందర్భంగా 2021, జనవరి 23న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ జనవరి 19న వెల్లడించారు.
మంత్రి ప్రహ్లాద్ తెలిపిన వివరాల ప్రకారం...
- - బోస్ 125వ జయంతి(2021, జనవరి 23)ని పురస్కరించుకుని కోల్‌కతా నేషనల్ లైబ్రరీ గ్రౌండ్‌సలో ప్రధాని మోదీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.
- బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్(ఇండియన్ నేషనల్ ఆర్మీ,, ఐఎన్‌ఏ)లోని ప్రముఖులు, వారి కుటుంబీకులను ప్రధాని సన్మానిస్తారు.
- 1938లో జాతీయ కాంగ్రెస్‌కు నేతాజీ అధ్యక్షుడిగా ఎన్నికైన గుజరాత్‌లోని సూరత్ జిల్లా హరిపురా గ్రామంలో కూడా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
- నేతాజీ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రధాని మోదీ అధ్యక్షతన 85 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది.
- ఐఎన్‌ఏ రెజిమెంటల్ మార్చ్ నినాదం ముందుకు సాగిపోదాం(కదమ్ కదమ్ బధాయే జా)ను బీటింగ్ రిట్రీట్ ఉత్సవంలో భాగంగా చేస్తారు.
- ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో నేతాజీ ఫొటోలను ఉంచుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తేదీన ఇకనుంచి ‘‘పరాక్రమ దివస్’’గా పాటించాలి
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తిని ప్రేరేపించడమే లక్ష్యంగా
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రంతో ఎంవోయూ చేసుకున్న సంస్థ?
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ (టీకేఎం) కేంద్ర ప్రభుత్వంతో సులభ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఈ విషయాన్ని జనవరి 18న టీకేఎం ప్రకటించింది. టయోటా కౌశల్య కార్యక్రమం కింద కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాల యువతకు టయోటా టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తామని తెలిపింది.
ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన ఎండీగా....
ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (వీసీ అండ్ ఎండీ)గా ఆర్పీ ఠాకూర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రిగా పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) ఉన్నారు.
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ నూతన చైర్మన్‌గా...
ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) చైర్మన్‌గా పి.గౌతమ్‌రెడ్డి జనవరి 18న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వంతో సులభ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ(టీకేఎం)
ఎందుకు : యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు
రాష్ట్ర హోదా కోసం తీర్మానం చేసిన కేంద్రపాలిత ప్రాంతం
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని పుదుచ్చేరి అసెంబ్లీలో జనవరి 18న తీర్మానం చేశారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే తీర్మానానికి కూడా పుదుచ్చేరి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ, ముఖ్యమంత్రిగా వి. నారాయణ స్వామి ఉన్నారు.
ఏపీ ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘‘అంత్రిక్ సురక్ష సేవ పతకం-2020’’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను కేంద్రం ఈ మెడల్స్‌కు ఎంపిక చేసింది. వీటిని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జనవరి 19న అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని తీర్మానం
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : పుదుచ్చేరి అసెంబ్లీ
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
భారత్ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 విడుదలైంది. జనవరి 20న ఢిల్లీ జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ ఈ ఇండెక్స్‌ను విడుదల చేశారు. నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ సంయుక్తంగా ఈ సూచీని రూపొందించాయి. ఈ సూచీ తొలి ఎడిషన్ 2019, అక్టోబర్ 17న విడుదలైంది. అంటే 2020 ఏడాది విడుదలైన సూచీ రెండో ఎడిషన్.
మూడు కేటగిరీలుగా...
నూతన ఆవిష్కరణలకు అందించిన సహకారం, ఆవిష్కరణల పాలసీలను మెరుగుపరచడం వంటి విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును పరిగణనలోకి తీసుకుని 36 సూచికల ఆధారంగా సూచీలో ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రాలను 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు, 9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు.
సూచీలో ఏపీ, తెలంగాణ...
ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓవరాల్‌గా 24.19 స్కోరు సాధించి... పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రం 33.23 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. 2019 సూచీలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉన్నాయి.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020: ర్యాంకులు
17 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో...
ర్యాంకు | రాష్ట్రం | స్కోరు |
1 | కర్ణాటక | 42.50 |
2 | మహారాష్ట్ర | 38.03 |
3 | తమిళనాడు | 37.91 |
4 | తెలంగాణ | 33.23 |
5 | కేరళ | 30.58 |
6 | హరియాణా | 25.81 |
7 | ఆంధ్రప్రదేశ్ | 24.19 |
8 | గుజరాత్ | 23.63 |
9 | ఉత్తరప్రదేశ్ | 22.85 |
10 | పంజాబ్ | 22.54 |
11 | పశ్చిమ బెంగాల్ | 21.69 |
12 | రాజస్తాన్ | 20.83 |
13 | మధ్యప్రదేశ్ | 20.82 |
14 | ఒడిశా | 18.94 |
15 | జార్ఖండ్ | 17.12 |
16 | చత్తీస్‌గఢ్ | 15.77 |
17 | బిహార్ | 14.48 |
ర్యాంకు | రాష్ట్రం | స్కోరు |
1 | హిమాచల్ ప్రదేశ్ | 25.06 |
2 | ఉత్తరాఖండ్ | 23.50 |
3 | మణిపూర్ | 22.78 |
4 | సిక్కిం | 20.28 |
5 | మిజోరం | 16.93 |
6 | అస్సాం | 16.38 |
7 | అరుణాచల్ ప్రదేశ్ | 14.90 |
8 | నాగాలాండ్ | 14.11 |
9 | త్రిపుర | 12.84 |
10 | మేఘాలయ | 12.15 |
ర్యాంకు | రాష్ట్రం | స్కోరు |
1 | ఢిల్లీ | 46.60 |
2 | చండీగఢ్ | 38.57 |
3 | డామన్&డయ్యూ | 26.76 |
4 | పుదుచ్చేరి | 25.23 |
5 | గోవా | 24.92 |
6 | దాద్రా&నగర్ హవేలీ | 22.74 |
7 | అండమాన్&నికోబార్ దీవులు | 18.89 |
8 | జమ్మూ&కశ్మీర్ | 18.62 |
9 | లక్షద్వీప్ | 11.71 |
ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
న్యూ రెవారీ(హరియాణా)-న్యూ మదార్(రాజస్థాన్) రైలు మార్గంలో 306 కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 7న జాతికి అంకితం చేశారు. అలాగే ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మోదీ ప్రసంగించారు. విద్యుత్‌తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హరియాణాలోని న్యూ అటేలీ నుంచి రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ వరకు ప్రయాణిస్తుంది.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించే మహాయజ్ఞం(మిషన్) వేగం పుంజుకుంది.
- దేశంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడానికి రైల్వే సరుకు రవాణా కారిడార్లు ఎంతగానో దోహదపడతాయి.
- న్యూ రెవారీ-న్యూ మదార్ పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్ 9 రాష్ట్రాల్లోని 133 రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తుంది.
- పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్‌తో హరియాణా, రాజస్తాన్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరియాణాలోని న్యూ అటేలీ, రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ మధ్య
కరోనా టీకా పంపిణీ కోసం భారత రూపొందించిన యాప్ పేరు?
దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం భారత ప్రభుత్వం ‘‘కోవిన్(Cowin)’’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. టీకా పంపిణీలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర ప్రభుత్వం జనవరి 10న ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ, అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఈ ఆన్‌లైన్ వేదిక వీలు కల్పిస్తుందని పేర్కొంది.
జనవరి 16న...
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో జనవరి 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 10న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ టు కంబాట్ కోవిడ్-19’ చైర్మన్ రామ్ సేవక్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిన్(CoWin) పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పన
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం
భారత్‌లో కోవిషీల్డ్‌ను తయారు చేస్తున్న సంస్థ పేరు?
దేశ వ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో... అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన ‘‘కోవిషీల్డ్, కోవాగ్జిన్’’ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 11న ఆర్డర్ ఇచ్చింది. కోవిషీల్డ్‌ను తొలి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే కోవాగ్జిన్‌ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రెండు టీకాల కోసం మొత్తం రూ.1,300 కోట్ల వ్యయం చేయనున్నారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో తయారీ...
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆ్ట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
టీకా ఖర్చు కేంద్రానిదే...
కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. జనవరి 11న రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని ఈ మేరకు తెలిపారు.
సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుపై జనవరి 12న భారత సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
నలుగురు సభ్యులతో ఒక కమిటీ...
పది రోజుల్లోగా ఈ కమిటీ తొలి సమావేశం జరుగుతుందని, తొలి భేటీ నుంచి రెండు నెలల్లోగా సుప్రీంకోర్టుకు సిఫారసులతో కూడిన నివేదికను అందిస్తుందని ధర్మాసనం వివరించింది.
కమిటీ సభ్యులు...
- ఇద్దరు రైతు నేతలు: భారతీయ కిసాన్ యూనియన్, ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మన్, షెట్కారీ సంఘటన్(మహారాష్ట్ర) అధ్యక్షుడు అనిల్ ఘన్వత్.
- ఇద్దరు వ్యవసాయ రంగ నిపుణులు: ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దక్షిణాసియా విభాగం డెరైక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, వ్యవసాయ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రెసైస్ కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : సాగు చట్టాల విషయంలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు
ఖాదీ ప్రాకృతిక్ పెయింట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి (కేవీఐసీ).. ఆవు పేడతో పెయింట్‌ను అభివృద్ధి చేసింది. ఈ వాల్ పెయింట్‌కు ‘‘ఖాదీ ప్రాకృతిక్ పెయింట్’’గా నామకరణం చేశారు. కేంద్ర జాతీయ రవాణా, ఖాదీ, పరిశ్రమల మండలి, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ జనవరి 12న న్యూఢిల్లీలో ఈ పెయింట్‌ను ఆవిష్కరించారు.
పర్యావరణ అనుకూలం...
పర్యావరణ అనుకూల, హాని చేయని, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఖాదీ ప్రాకృతిక్ రంగుల తయారీలో గోవుల పేడను ప్రధాన పదార్థంగా ఉపయోగించారు. భారతీయ ప్రమాణాల మండలి ధ్రువీకరణను కూడా ఈ ఉత్పత్తి పొందింది.
రూ.6,000 కోట్లు...
కార్యక్రమంలో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ... ప్రాకృతిక్ పెయింట్ రూ.6,000 కోట్ల స్థాయి పరిశ్రమగా అవతరిస్తుందన్నారు. అలాగే కేవీఐసీ ఆదాయాన్ని ప్రస్తుత రూ.80,000 కోట్ల నుంచి రానున్న ఐదేళ్లలో రూ.5లక్షల కోట్లకు చేర్చాలనుకుంటున్నట్టు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : కేంద్ర జాతీయ రవాణా, ఖాదీ, పరిశ్రమల మండలి, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఆలయాల శుభ్రతకు దేశంలోని ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
పరిశుభ్రత ఉత్పత్తులను తయారు చేసే నేచర్ ప్రొటెక్ట్ సంస్థ దేశంలో ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందాన్ని ఏర్పరుచుకుంది. పండుగల వేళలో దేవాలయాల ప్రాంగణాలను శుభ్రంగా ఉంచటంతో పాటు భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కంపెనీ ప్రత్యేకమైన చర్యలను చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, కర్నాటకలోని శ్రీ చాముండేశ్వరీ దేవాలయం, కేరళలోని గురువయార్ దేవాలయం, తమిళనాడులోని మీనాక్షీ అమ్మన్ దేవాలయాలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ఐఏఎఫ్ కోసం ఎన్ని ‘తేజస్’ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ. 48 వేల కోట్లతో 83 ‘తేజస్’ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తేలిక పాటి యుద్ధ విమానమైన తేజస్‌ను స్వదేశీ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందిస్తోంది. తేజస్ చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐఏఎఫ్‌లో 40 తేజస్ యుద్ధ విమానాలున్నాయి. ఈ తాజా డీల్‌కు సంబంధించి వైమానిక దళం, హెచ్‌ఏఎల్ మధ్య ఈ మార్చ్‌లో సంతకాలు జరుగుతాయని, 2024లో హెచ్‌ఏఎల్ నుంచి యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏర్పాటు చేయనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు డిసెంబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి దేశం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలందరికీ స్వదేశీ టీకాయే లభిస్తుందని చెప్పారు. 2020 చివరి రోజైన డిసెంబర్ 31ని ఫ్రంట్‌లైన్ వర్కర్లకి అంకితమిస్తున్నట్టుగా చెప్పారు.
గుజరాత్ రాజధాని: గాంధీనగర్
గుజరాత్ ప్రస్తుత గవర్నర్: ఆచార్య దేవ్ వ్రత్
గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి: విజయ్ రూపానీ
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాజ్‌కోట్, గుజరాత్
దేశంలోని ఏ నగరాల్లో లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది?
అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం(గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్(జీహెచ్‌టీసీ)- ఇండియా) కింద ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 1న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు(ఎల్‌హెచ్‌పీ) శంకుస్థాపన చేశారు. అలాగే పీఎంఏవై (అర్బన్), ఆశా-ఇండియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్నారు.
లైట్ హౌసింగ్ ప్రాజెక్టులు...
ఇండోర్(మధ్యప్రదేశ్), రాజ్‌కోట్(గుజరాత్), చెన్నై (తమిళనాడు), రాంచీ(జార్ఖండ్), అగర్తల(త్రిపుర), లక్నో(ఉత్తరప్రదేశ్) నగరాల్లో లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ (జీహెచ్‌టీసీ)తో ఈ ఆరు నగరాల్లో 12 నెలల్లో వెయి్య చొప్పున ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మోదీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు 3 జాతీయ అవార్డులు..
పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెస్ట్ ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక విభాగంలో 2 అవార్డులు, ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో విశాఖకు మొదటి ర్యాంకు, అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరు లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు(ఎల్‌హెచ్‌పీ) శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఇండోర్, రాజ్‌కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నో
ఎందుకు : ఆరు నగరాల్లో 12 నెలల్లో వెయి్య చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు
సంబల్‌పూర్ ఐఐఎం భవనానికి శంకుస్థాపన
ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి జనవరి 2న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయన్నారు.
ఒడిశా రాజధాని: భువనేశ్వర్
ఒడిశా ప్రస్తుత గవర్నర్: గణేశి లాల్
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్
డ్రై రన్ విజయవంతం...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి జనవరి 2న డ్రై రన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో మొదలు కానున్న భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఎక్కడ : సంబల్‌పూర్, ఒడిశా
ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు?
దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జనవరి 3న ఆమోదం తెలిపింది. స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, విదేశీ టీకా కోవిషీల్డ్’ల వినియోగానికి షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కోవాగ్జిన్, కోవిషీల్డ్...
- భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ను అభివృద్ధి చేసింది. కోవిషీల్డ్ సమర్ధత 70.42 శాతంగా డీసీజీఐ ప్రకటించింది.
- బ్రిటన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది.
దేశంలో మొత్తం చిరుత పులుల సంఖ్య?
చిరుత పులులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రూపొందించిన నివేదిక ‘‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018’’ను కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 2020, డిసెంబర్ 21న న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం... దేశంలో మొత్తం 12,852 చిరుత పులులు ఉన్నాయి. అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలున్నాయి. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే చిరుతల మనుగడ కొనసాగుతోంది. మిగతా ఖండాల్లో ఇవి క్రమంగా కనుమరుగైపోయాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- భారత్‌లో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3,421 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక 1,783 చిరుతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది.
- సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతపులులతో తృతీయస్థానంలో నిలిచింది.
- సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్ల విభాగంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నాయి.
- 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలుండగా 2018 కల్లా వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం పెరుగుదల) పెరిగింది.
స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018 నివేదిక విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 21, 2020
ఎవరు : కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో చిరుత పులులకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి
నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’’కు భారత సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. పరిధిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2-1 ఓట్ల తేడాతో జనవరి 5న సుప్రీంకోర్టు బెంచ్ ఆమోద ముద్ర వేసింది. ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కేంద్రం చేసిన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు ఏకీభవించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించాలని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
ఏ రెండు ప్రాంతాలను అనుసంధానించే గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని ప్రారంభించారు?
కేరళలోని కోచి నుంచి కర్ణాటకలోని మంగళూరును అనుసంధానించే 450 కిలోమీటర్ల సహజవాయువు గ్యాస్ పైపులైన్‌ను జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... యావత్ దేశాన్ని ఒకే గ్యాస్ పైపులైన్ గ్రిడ్‌తో అనుసంధానించనున్నట్టు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- గుజరాత్‌లో పవన, సౌర విద్యుత్‌తో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ పనులు మొదలు కాగా.. 5-6 ఏళ్లలో సహజవాయువు పైపులైన్‌ను 32,000 కిలోమీటర్లకు విస్తరించనున్నాం.
- సహజవాయువు వల్ల అధిక కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు, ఇతర ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది.
- ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో 58 శాతం వాటా బొగ్గుదే. పెట్రోలియం, ఇతర వనరుల వాటా 26 శాతంగా ఉంది. సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వాటా 6, 2 శాతంగానే ఉన్నాయి.
- 2030 నాటికి సహజవాయువు వాటాను 15 శాతానికి చేర్చనున్నాము.
- చెరకు, ఇతర సాగు ఉత్పత్తుల నుంచి తీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో 20 శాతం వినియోగించనున్నాము.
- 14 కోట్ల కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆరేళ్లలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్యను రెట్టింపు చేశాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 450 కిలోమీటర్ల సహజవాయువు గ్యాస్ పైపులైన్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : కేరళలోని కోచి నుంచి కర్ణాటకలోని మంగళూరును అనుసంధానించేందుకు
భారత ప్రభుత్వం ప్రారంభించిన టాయ్‌కథాన్ కార్యక్రమం ఉద్దేశం?
భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసే గేమ్స్, వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘టాయ్‌కథాన్-2021’ పేరుతో జనవరి 5న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, స్టార్టప్‌లు కలసి తమ ఆలోచనలను పంచుకోవడం ద్వారా వినూత్నమైన ఆట బొమ్మలు, గేమ్స్ రూపకల్పనకు వీలు కల్పించే కార్యక్రమమే టాయ్‌కథాన్.
భారత ఆట వస్తువుల మార్కెట్ బిలియన్ డాలర్లు ఉంటుందని, దురదృష్టవశాత్తూ 80 శాతం ఆటబొమ్మలు దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాయ్‌కథాన్-2021 పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసే గేమ్స్, వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం
ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
న్యూ రెవారీ(హరియాణా)-న్యూ మదార్(రాజస్థాన్) రైలు మార్గంలో 306 కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 7న జాతికి అంకితం చేశారు. అలాగే ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మోదీ ప్రసంగించారు. విద్యుత్‌తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హరియాణాలోని న్యూ అటేలీ నుంచి రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ వరకు ప్రయాణిస్తుంది.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించే మహాయజ్ఞం(మిషన్) వేగం పుంజుకుంది.
- దేశంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడానికి రైల్వే సరుకు రవాణా కారిడార్లు ఎంతగానో దోహదపడతాయి.
- న్యూ రెవారీ-న్యూ మదార్ పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్ 9 రాష్ట్రాల్లోని 133 రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తుంది.
- పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్‌తో హరియాణా, రాజస్తాన్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరియాణాలోని న్యూ అటేలీ, రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ మధ్య