Skip to main content

జనవరి 2019 జాతీయం

అయోధ్యపై కొత్త రాజ్యాంగ ధర్మాసనం
Current Affairs అయోధ్యలోని రామమందిరం-బాబ్రీమసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు జనవరి 25న ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్యంలోని ఈ ధర్మాసనంలో సహా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. 2019, జనవరి 29 నుంచి ధర్మాసనం కేసును విచారించనుంది. ఇంతకుముందు ఏర్పాటు చేసిన ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ వైదొలగడంతో కొత్త ధర్మసనాన్ని ఏర్పాటు చేశారు.
2010లో ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారాకు, రామ్ లల్లాకు సమానంగా పంచాలని తీర్పు వెలువరించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య వివాదంపై కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : సుప్రీంకోర్టు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా ట్రైన్ 18
దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’కు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ జనవరి 27న తెలిపారు. వారణాసి-ఢిల్లీ మధ్య ఈ రైలును నడపనున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
16 బోగీలున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్ల వ్యయంతో నిర్మించింది. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత ఇంజనీర్లు 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారు. లోకోమోటివ్‌ల అవసరం లేకుండా నడిచే తొలి రైలుగా ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రికార్డు నెలకొల్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా ట్రైన్ 18 నామకరణం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్

ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ వ్యాప్తంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పరాక్రమ పురస్కారం అశోకచక్రను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..అమర జవాను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు.
ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆదర్శాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 22 శకటాలు పరేడ్‌లో పాల్గొనగా, అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి 16 కాగా, మిగిలిన ఆరు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
రాజ్‌పథ్ విశేషాలు..
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత 21 తుపాకుల సెల్యూట్‌తో జాతీయ గీతాలాపాన జరిగింది. ఆ తరువాత కవాతు బృందాల నుంచి కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు.
  • పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ బృందం తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన, 183 ఏళ్ల చరిత్ర గల అస్సాం రైఫిల్స్‌కు మేజర్ కుష్బూ కన్వర్(30) నేతృత్వం వహించారు.
  • సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ)లో సభ్యులైన నలుగురు ఈసారి పరేడ్‌లో పాల్గొనడం విశేషం. వారందరి వయసు 90 ఏళ్లకు పైనే.
  • నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్, సిగ్నల్స్ యూనిట్ కోర్ బృందాలకు మహిళా అధికారులే నేతృత్వం వహించారు.
  • గణతంత్ర వేడుకల్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది రెండోసారి. 1995లో మొదటిసారి నల్ల సూరీడు నెల్సన్ మండేలా హాజరయ్యారు.
  • భారత వైమానిక దళ విమానాలు మొట్టమొదటిసారిగా సంప్రదాయ, జీవ ఇంధనాలతో కూడిన మిశ్రమాన్ని ఉపయోగించి కవాతులో పాల్గొన్నాయి.

 

కొచ్చిలో బీపీసీఎల్ కాంప్లెక్స్ జాతికి అంకితం
కేరళలోని కొచ్చిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 27న జాతికి అంకితమిచ్చారు. ఈ కర్మాగారంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, ఎట్టుమనూర్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన ఎల్పీజీ సిలిండర్లను నింపే ప్లాంటులో కొత్త నిల్వ సదుపాయాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొచ్చి, కేరళ

మదురైలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన
తమిళనాడులోని మదురై సమీపంలోని థోప్పూర్‌లో రూ. 1,264 కోట్లతో నిర్మించ తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్-ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)కు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 25న శంకుస్థాపన చేశారు. 750 పడకలతో నిర్మిస్తున్న ఈ వైద్యశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల కూడా ఉండనుంది. ప్రస్తుతం దేశంలో ఏడు ఎయిమ్స్ వైద్యశాలలు పనిచేస్తుండగా మరో 14 ఎయిమ్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.
ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మదురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌తో తమిళనాడు ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. తమిళనాడును రక్షణ ఉత్పత్తుల, విమాన రంగ హబ్‌గా మార్చడమే కేంద్రం లక్ష్యమని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిమ్స్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : థోప్పూర్, మదురై, తమిళనాడు

ప్రధాని కానుకల వేలం ప్రారంభం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకలుగా వచ్చిన వస్తువుల వేలం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్‌జీఎంఏ) మ్యూజియంలో జనవరి 27న ప్రారంభమైంది. తొలిరోజు రూ.1,000 ప్రారంభ ధర కలిగిన ఛత్రపతి శివాజీ విగ్రహం రూ.22 వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు. దేశవిదేశాల్లో మోదీ కానుకలుగా స్వీకరించిన శాలువాలు, టోపీలు, చిత్రపటాలు, జాకెట్లు, జ్ఞాపికలను వేలానికి ఉంచారు. ఈ వస్తువుల ప్రారంభ ధరల్ని రూ.100 నుంచి రూ.30 వేల మధ్య నిర్ధారించినట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని కానుకల వేలం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత సాంస్కృతిక శాఖ
ఎక్కడ : నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్‌జీఎంఏ) మ్యూజియం, ఢిల్లీ

ఎన్‌సీసీ గణతంత్ర దినత్సోవ కార్యక్రమంలో మోదీ
భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ (నేషనల్ కాడెట్ కాప్స్) ఢిల్లీలో జనవరి 28న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... భారత్ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని తేల్చి చెప్పారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్- ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీసీ గణతంత్ర దినత్సోవ కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

ఛండీగఢ్‌లో స్ట్రాటెజిక్ హెచ్‌ఆర్ కోర్సు ప్రారంభం
సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్(ఎస్‌హెచ్‌ఆర్‌ఎం), ఛండీగఢ్ యూనివర్సిటీలు సంయుక్తంగా రెండేళ్ల కాల వ్యవధి కలిగిన స్ట్రాటెజిక్ హెచ్‌ఆర్ కోర్సును ప్రారంభించాయి. ఛండీగఢ్‌లోని సీఐఐ ప్రధానకార్యాలయంలో జనవరి 28న జరిగిన కార్యక్రమంలో ఛండీగడ్ వర్సిటీ వైస్‌చాన్స్ లర్ డా.ఆర్.ఎస్. బవా, ఎస్‌హెచ్‌ఆర్‌ఎం సీఈఓ అచల్ ఖన్నా ఈ మేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఉత్తరభారత్‌లో ఎంబీఏలో ఇలాంటి ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్ట్రాటెజిక్ హెచ్‌ఆర్ కోర్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్(ఎస్‌హెచ్‌ఆర్‌ఎం), ఛండీగఢ్ యూనివర్సిటీ
ఎక్కడ : ఛండీగఢ్ యూనివర్సిటీ, ఛండీగఢ్

ఆక్స్‌ఫర్డ్ హిందీ పదంగా నారీ శక్తి
2018 ఏడాది హిందీ పదంగా ‘నారీ శక్తి’ ని ఆక్స్‌ఫర్డ్ ప్రక టించింది. జైపూర్‌లో జరిగిన ‘జైపూర్ సాహితీ వేడుక’లో ఆక్స్‌ఫర్డ్ జనవరి 26న ఈ ప్రకటన చేసింది. సంస్కృతం నుంచి నారీ శక్తి అనే పదం ఆవిర్భవించింది. మహిళలు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ 2018 హిందీ పదం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : నారీ శక్తి

లోకాయుక్త పరిధిలోకి మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్ష నేతలను లోకాయుక్త పరిధిలోకి తేవాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన జనవరి 29న జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అవినీతిని విచారించేందుకు రాష్ట్రస్థాయిలో లోకాయుక్త అనే స్వతంత్ర నిర్ణయాక వ్యవస్థను ఏర్పాటుచేశారు. సీఎంపై అవినీతి ఆరోపణలు ఉంటే లోకాయుక్త రహస్య పద్ధతిలో విచారణ జరుపుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోకాయుక్త పరిధిలోకి మహారాష్ట్ర సీఎం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : మహారాష్ట్ర కేబినెట్

పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ
దేశంలో వివిధ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని థాల్కాటోరా స్టేడియంలో జనవరి 29న నిర్వహించిన ‘పరీక్షా-పే చర్చ 2.0’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దాదాపు 2 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దవద్దని సూచించారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించే రీతిలో తల్లిదండ్రులు వ్యవహరించాలన్నారు. పిల్లల రిపోర్టు కార్డులను తమ విజిటింగ్ కార్డుల్లా పరిగణించవద్దని పేర్కొన్నారు. విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని ప్రధాని మోదీ రచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘పరీక్షా-పే చర్చ 2.0’ కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : థాల్కాటోరా స్టేడియం, న్యూఢిల్లీ

లోక్‌పాల్ అన్వేషణ కమిటీ భేటీ
లోక్‌పాల్ చైర్మన్, సభ్యులను ఎన్నుకునే సెలక్షన్ కమిటీకి పేర్లను ప్రతిపాదించేందుకు ఏర్పాటైన ‘అన్వేషణ’ కమిటీ తొలిసారిగా భేటీ అయి్యంది. న్యూఢిల్లీలో జనవరి 29న జరిగిన ఈ భేటీలో లోక్‌పాల్ చీఫ్, సభ్యుల అన్వేషణ, ఎంపిక విధానంపైనే చర్చ జరిగిందని కమిటీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 8మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటుచేసి నాలుగు నెలలు గడిచాక తొలిసారి సమావేశమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌పాల్ అన్వేషణ కమిటీ భేటీ
ఎప్పుడు : జనవరి 29
ఎక్కడ : న్యూఢిల్లీ

ఉప్పు సత్యాగ్రహ సార్మకం ప్రారంభం
జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలోని దండిలో ఏర్పాటుచేసిన ‘జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియం’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు. ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ..‘మహాత్మా గాంధీ దండియాత్ర (ఉప్పు సత్యాగ్రహం) సందర్భంగా ఇది సాధ్యమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఉప్పుకున్న శక్తి, సమాజంలో వేర్వేరు వర్గాలతో దానికున్న అనుబంధం గాంధీకి తెలుసు. అందువల్లే బాపూ ముందుకు సాగారు’ అని అన్నారు. మరోవైపు గుజరాత్‌లోని సూరత్‌లో విమానాశ్రయం విస్తరణ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దండి, నవ్‌సరి జిల్లా,, గుజరాత్

అవినీతి సూచిలో భారత్‌కు 78వ స్థానం
ప్రపంచ అవినీతి సూచి - కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)-2018లో భారత్‌కు 78వ స్థానం దక్కింది. ఈ మేరకు 180 దేశాలతో కూడిన జాబితాను ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ జనవరి 30న విడుదల చేసింది. 100కి 41 పాయింట్ల స్కోర్‌తో భారత్ ఈ జాబితాలో 78వ స్థానం పొందింది. 88 పాయింట్ల స్కోర్‌తో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉండగా, 87 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. 10 పాయింట్ల స్కోరుతో సోమాలియా చివరి స్థానంలో ఉంది. సిరియా, దక్షిణ సూడాన్ చెరో 13 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాయి. ఇక చైనా, 87వ స్థానంలో ఉంటే, పాకిస్తాన్ 117వ స్థానంలో ఉంది. 2017లో భారత్ 40 పాయింట్ల స్కోర్‌తో 81 స్థానం పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)లో భారత్‌కు 78వ స్థానం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

పటేల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి ప్రారంభం
Current Affairs గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి’ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న ప్రారంభించారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఆ ఆస్పత్రి పేపర్ వినియోగం లేకుండా సేవలందించనుంది. మరోవైపు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రేరణతో నిర్వహిస్తున్న అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్- 2019ను మోదీ ప్రారంభించారు. అలాగే గాంధీనగర్‌లో వైబ్రెంట్ గుజరాత్‌లో భాగంగా మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను కూడా మోదీ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్

అగ్రివిజన్ సదస్సు ప్రారంభం
హైదరాబాద్‌లో ‘అగ్రివిజన్-2019 సదస్సు’ను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్రివిజన్-2019 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్

టాప్ 50లో నిలవడమే భారత్ లక్ష్యం
సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన సులభతర వాణిజ్య దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఈ జాబితాలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేయాల్సిందిగా తన జట్టును కోరానని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నిబంధనలు భారత్‌లో ఉండాలని, వ్యాపారం చేయడం చౌకగా ఉండే ప్రయత్నాలు కూడా చేయనున్నామని తెలిపారు. జనవరి 18న ఇక్కడ 9వ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తూ... దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, వ్యాపార వేత్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యురేనియం సరఫరాపై ఒప్పందం
వైబ్రాంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగపడే యురేనియం సరఫరా కోసం భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్ లక్ష్యం
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ: గాంధీనగర్

కే9 వజ్ర యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం
ప్రైవేట్ రంగంలో దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టీ కంపెనీ ఏర్పాటు చేసిన కే9 వజ్ర-హొవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 19న ప్రారంభించారు. 2017లో కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన రూ.4,500 కోట్ల ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థ 42 నెలల్లో 100 కే9 యుద్ధట్యాంకులను అందించాల్సి ఉంది. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఆ సంస్థ దక్షిణ కొరియా హన్‌‌వహా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
నేషనల్ మ్యూజియం ఆఫ్ సినిమా ప్రారంభం
ముంబైలో ఏర్పాటుచేసిన ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 19న ప్రారంభించారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సాలో వైద్య కళాశాల భవన నిర్మాణానికి కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కే9 వజ్ర యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హజీరా, గుజరాత్

తమిళనాడు రక్షణ పరిశ్రమల కారిడార్ ప్రారంభం
తమిళనాడులోనితిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన ‘తమిళనాడు రక్షణ పరిశ్రమల కారిడార్’ (డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్)ను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 20న ప్రారంభించారు. ఈ కారిడార్‌లో చెన్నై, హోస్సూర్, సేలం, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి సహా నాలుగు నోడల్ నగరాలు ఉంటాయి. తమిళనాడు డిఫెన్స్ ప్రొడక్షన్ క్వాడ్ అని కూడా పిలిచే ఈ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 3,038 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి.
దేశంలో రెండు రణ ఉత్పత్తుల పారిశ్రామిక కారిడార్లను ప్రారంభిస్తామని 2018, ఫిబ్రవరి 2న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అందులోభాగంగా ఒక కారిడార్‌ను ఉత్తరప్రదేశ్‌లో, మరొకటి తమిళనాడులో మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2018, ఆగస్టు 11న ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తమిళనాడు రక్షణ పరిశ్రమల కారిడార్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : తిరుచిరాపల్లి, తమిళనాడు

కళింగ విద్యాసంస్థల్లో ప్రపంచ కవుల సమ్మేళనం
భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ), కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(కేఐఎస్‌ఎస్)లో 39వ ప్రపంచ కవుల సమ్మేళనం (వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్స్-డబ్ల్యూసీపీ)ను నిర్వహించనున్నారు. కోల్‌కతాలో జనవరి20న జరిగిన సమావేశంలో డబ్ల్యూసీపీ అధ్యక్షుడు, కేఐఐటీ, కేఐఎస్‌ఎస్‌ల వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అచ్యుత సమంత ఈ విషయం వెల్లడించారు. 2019, అక్టోబర్‌లో జరిగే ఈ సమ్మేళనంలో దాదాపు 100 దేశాలకు చెందిన 500 మందికిపైగా కవులు, రచయితలతోపాటు నోబెల్ పురస్కార గ్రహీతలు పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 39వ ప్రపంచ కవుల సమ్మేళనం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ప్రొఫెసర్ అచ్యుత సమంత
ఎక్కడ : కళింగ విద్యాసంస్థలు, భువనేశ్వర్, ఒడిశా

కోచిలో ఐఏఏ ప్రపంచ కాంగ్రెస్
కేరళలోని కోచిలో అంతర్జాతీయ ప్రకటనల అసోసియేషన్ (ఐఏఏ) 44వ ప్రపంచ కాంగ్రెస్ (సభ) జరగనుంది. ఫిబ్రవరి 20 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కాంగ్రెస్‌లో దాదాపు 2,000 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, యూనిలీవర్ సీఈవో పౌల్ పోల్‌మ్యాన్, క్వాల్‌కామ్ సీఈవో స్టీవెన్, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఏఏ 44వ ప్రపంచ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : కోచి, కేరళ

అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని 2019 ఎడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రభుత్వం, వ్యాపారం, స్వచ్చంద సేవా సంస్థలు, మీడియా అంశాల పరంగా చూస్తే, అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. భారత్ బ్రాండ్లు మాత్రం అత్యంత స్వల్ప విశ్వసనీయ బ్రాండ్లుగా నిలిచాయి.
మరోవైపు గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్-2019లో భారత్ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది. ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్, టాటా కమ్యూనికేషన్స్, ఏడెక్కో గ్రూప్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఎడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా శతాబ్ది
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా సికింద్రాబాద్ - పుణే మధ్య నడుస్తోన్న పుణే- సికింద్రాబాద్ శతాబ్ది రైలు నిలచింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ఈ రైలు సెంట్రల్ రైల్వే జోన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే కేంద్రాల మధ్య నడుస్తోంది. ఈ రైలు బయల్దేరేటప్పుడు తీసుకుంటున్న పరిశుభ్రతా చర్యలే దీనికి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ఘనత సాధించడం వెనుక దక్షిణమధ్య రైల్వే పాత్ర కూడా ఉంది. రైలు పుణే నుంచి బయల్దేరినా.. సికింద్రాబాద్ చేరుకున్నాక కూడా రెండో నిర్వహణలో భాగంగా గంట పాటు రైలును మరోసారి శుభ్రపరిచి ప్రయాణానికి సిద్ధం చేస్తారు. దేశంలో నడుస్తున్న మొత్తం 26 ప్రీమియం రైళ్లలో ఈ రైలు పరిశుభ్రతకే అధిక శాతం మంది ప్రయాణికులు ఓటేయడం విశేషం. మొత్తం 1,000 పాయింట్లకు గాను ఈ రైలు 916 పాయింట్లు సాధించింది.
దక్షిణ మధ్య రైల్వేకు ఆఖరు స్థానం..
స్వచ్ఛ్‌రైల్ స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా పురోగతి తెలుసుకునేందుకు, పరిశుభ్రత విషయంలో రైళ్ల మధ్య పోటీ పెంచేందుకు ఐఆర్‌సీటీసీ టోటల్ క్లీన్‌లైన్స్ పేరిట ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 209 రైళ్లలో ప్రయాణికుల వద్ద అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో జైపూర్ కేంద్రంగా నడిచే వాయవ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,000 పాయింట్లకు 860 పాయింట్లు సాధించింది. ఈ సర్వేలో దక్షిణమధ్య రైల్వేకు 658 పాయింట్లతో ఆఖరు స్థానం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా శతాబ్ది రైలు
ఎందుకు: అత్యంత పరిశుభ్రత పాటించినందుకు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు అరుదైన గౌరవం కల్పించింది. ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 23న ఆవిష్కరించారు. అలాగే జలియన్ వాలాబాగ్ ఊచకోత, మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృత్యర్థం ‘యాదే జలియన్ మ్యూజియం’, భారత కళలకు సంబంధించి ‘దృశ్యకళ’ మ్యూజియం, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను గుర్తుకుతెచ్చేలా మరో మ్యూజియాన్ని ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ నాలుగు మ్యూజియాలను కలిపి ‘క్రాంతి మందిర్’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ వాడిన టోపీని ఆయన కుటుంబ సభ్యులు మోదీకి బహూకరించగా, ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ టోపీని మ్యూజియంకు ఇచ్చేశారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా బోస్‌వాడిన కుర్చీ, యూనిఫాం, మెడల్స్‌తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన పలు వస్తువులను బోస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సుభాష్ చంద్రబోస్ జీవితంపై తీసిన డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన 15 లక్షలమంది భారతీయ జవాన్ల వీరోచిత పోరాటం, త్యాగాన్ని యాదే జలియన్ మ్యూజియంలో ఫొటోల రూపంలో తీర్చిదిద్దారు. భారత సైనికుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సరోజినీ నాయుడు రాసిన ‘గిఫ్ట్’ పద్యాన్నీ ప్రదర్శనకు ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు: జనవరి 23
ఎందుకు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా

ప్రపంచంలో టాప్-3 స్థానంలో టీసీఎస్
ఐటీ సేవల్లో భారత కంపెనీలు ప్రతిభ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ రంగంలో టీసీఎస్ ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను యాక్సెంచర్, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలవగా, టీసీఎస్ మూడో స్థానంలో ఉన్నట్టు ‘బ్రాండ్ ఫైనాన్స్’ రిపోర్ట్ తెలియజేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో సైతం టాప్-10లో చోటు సంపాదించుకోవడం గమనార్హం. 26.3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలిచింది. క్రితం ఆర్థిక సంవత్సరం నివేదికలో ఐబీఎం మొదటి స్థానంలో ఉండగా, దాన్ని వెనక్కి నెట్టి యాక్సెంచర్ మొదటి స్థానానికి చేరుకుంది. 20.4 బిలియన్ డాలర్లతో ఐబీఎం రెండో స్థానానికి పరిమితమైంది. 12.8 బిలియన్ డాలర్లతో టీసీఎస్ మూడో స్థానం దక్కించుకుంది. సంస్థ మార్కెట్ విలువ క్రితం నివేదికతో పోలిస్తే 23 శాతం పెరిగినట్టు బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక తెలిపింది. జపాన్ మార్కెట్లో విజయం సాధించిన తొలి భారత ఐటీ కంపెనీ టీసీఎస్ అని ప్రస్తావించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆటోమేషన్ సహా అన్ని రకాల కస్టమర్ సేవలను అందించడంలో లీడర్‌గా నిలిచినట్టు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐటీ సేవల్లో ప్రపంచంలో టాప్-3 స్థానంలో టీసీఎస్
ఎందుకు: ఐటీ సేవలకు

అయోధ్య దర్మాసనం నుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్
Current Affairs అయోధ్య భూ వివాద కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ తనంతట తానుగా వైదొలిగారు. దీంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి జనవరి 29న విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు జనవరి 10న ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అయోధ్య ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌తో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య దర్మాసనం నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : జస్టిస్ యూయూ లలిత్

తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో హంపీ
ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక జనవరి 10న ప్రకటించిన తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల జాబితాలో కర్ణాటకలోని ‘హంపీ’ నగరానికి రెండో స్థానం లభించింది. వివిధ దేశాలకు చెందిన 52 పర్యాటక ప్రాంతాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి హంపీకి మాత్రమే చోటు లభించింది. 2016-17 సంవత్సరంలో సుమారు 5.35 లక్షల మంది హంపీని సందర్శించగా వీరిలో 38 వేల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.
ఒకనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరుబయలు పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. తుంగభద్ర తీరంలో దాదాపు 26 కిలోమీటర్ల పొడవునా ఈ చారిత్రక నగరం విస్తరించి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో హంపీకి రెండో స్థానం
ఎప్పుడు : జనవరి 10
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జనవరి 21 నుంచి 23 వరకు 15వ ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించనున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ జనవరి 11న వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. కార్యక్రమం చివరి రోజున రాష్ట్రపతి కోవింద్ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5వ ప్రవాసీ భారతీయ దివస్
ఎప్పుడు : 2019, జనవరి 21 నుంచి 23 వరకు
ఎవరు : విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్

అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ప్రభుత్వం ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. ఈ చట్టం ద్వారా మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.
ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే...
  • వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు.
  • 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు.
  • నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు
  • నాన్ నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

గురు గోబింద్ సింగ్ స్మారక రూ. 350 వెండి నాణెం విడుదల
సిక్కుల 10వ గురువు గోబింద్ సింగ్ 350వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో జనవరి 13న జరిగిన కార్యక్రమంలో రూ.350 విలువైన వెండి స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. గురునానక్ 550వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గురు గోబింద్ సింగ్ స్మారక రూ. 350 వెండి నాణెం విడుదల
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

లడఖ్‌లో అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారం
జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటుచేయనున్నట్లు భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) జనవరి 13న వెల్లడించింది. 25వేల ఎకరాల్లో ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈ విద్యుత్ కర్మాగారంను నెలకొల్పనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లోనే ఉన్న కార్గిల్‌లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరొక విద్యుత్ కర్మాగారంను ఎస్‌ఈసీఐ ఏర్పాటుచేయనుంది. మొత్తం రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో 2023 కల్లా ఈ రెండు కర్మాగారాలను నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ)
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో త్రివేణీ సంగమం వద్ద అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ‘అర్థ కుంభమేళా’ జనవరి 15న ప్రారంభమైంది. మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో 12 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.4,200 కోట్లను కేటాయించింది. కుంభమేళా సందర్భంగా గంగా-యమున నదీ తీరాన 32 వేల హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్‌నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు కెక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అర్థ కుంభమేళా ప్రారంభం
ఎప్పుడు : జనవరి 15
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్

అగ్రవర్ణాల రిజర్వేషన్ చట్టం అమలు
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ చట్టం జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్రవర్ణాల రిజర్వేషన్ చట్టం అమలు
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

టైమ్స్ ఎడ్యుకేషన్‌లో 49 భారత వర్సిటీలు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) 2019 సంవత్సరానికిగాను విశ్వవిద్యాలయాలకు జనవరి 16న ర్యాంకింగ్‌లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 వర్సిటీలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు మొదటి 200లో స్థానం సంపాదించాయి. ఈ ర్యాంకింగ్‌‌సలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం పొందాయి.
మరోవైపు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం దక్కించుకున్నాయి. మొత్తంగా టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకిగ్‌లో చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానం పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో 49 భారత వర్సిటీలు
ఎప్పుడు : జనవరి 16
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

106వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోదీ
Current Affairs
పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో ‘106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పిలుపినిచ్చారు. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ అని నినాదం ఇచ్చారనీ, దానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేరుు జై విజ్ఞాన్‌ను జోడించారనీ.. తాజాగా తాను దీనికి జై అనుసంధాన్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న డీఆర్‌డీవో చైర్మన్ డా.జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్

ఆధార్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్ట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ జనవరి 4న ఆమోదం తెలిపింది. దీంతో ఆధార్ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు పౌరులు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

విమానాల్లో మొబైల్ సేవలపై కమిటీ
విమానాల్లోనూ, నౌకల్లోనూ మొబైల్ సేవలను (ఐఎఫ్‌ఎంసీ) మూడు నెలల వ్యవధిలోగా అందుబాటులోకి తెచ్చే అంశంపై అంతర్-మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 4న నిర్ణయించింది. సర్వీసులు సజావుగా అమలయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ ప్రతి 15 రోజులకోసారి సమావేశం అవనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : లోక్‌సభ

కోయెల్ కరో ప్రాజెక్టుకు శంకుస్థాపన
జార్ఖండ్‌లో నిర్మించనున్న కోయెల్ కరో మండల్ ప్రాజెక్టు సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని 19.6 వేల హెక్టార్ల భూమికి సాగు నీరు అందించనున్నారు. కోయెల్ కరో ప్రాజెక్టును బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోయెల్ కరో మండల్ ప్రాజెక్టుకు శ ంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జార్ఖండ్

అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనవరి 7న అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్రం జనవరి 8న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు కావడం గమనార్హం. ఈ బిల్లును ఉభయసభలూ మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఆమోదించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్‌పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: బీజేపీ ప్రభుత్వం
ఎందుకు: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం జనవరి 7న కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లు-2018కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మిత్రపక్షం అస్సాం గణపరిషత్(ఏజీపీ) సహా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు విద్యార్థి సంఘాలు, నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కేంద్రం ముందుకు వెళ్లేందుకే నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పౌరసత్వ ముసాయిదా బిల్లు-2018కు కేంద్రం ఆమోదం
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: నరేంద్ర మోదీ
ఎందుకు: పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు

అయోధ్య వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం
రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉంటారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో 2019, జనవరి 10న ఈ ధర్మాసనం వివిధ వర్గాల వాదనలు విననుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య వివాదంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పౌరసత్య బిల్లు’కు జనవరి 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివాసం ఏర్పర్చుకోవచ్చు. ఈ మూడు దేశాల్లో వేధింపులు, హింసకు గురై భారత్‌కు వలసొచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఇందులో ప్రతిపాదించారు. అలాగే పౌరసత్వం పొందేందుకు భారత్‌లో కనీస నివాస కాలాన్ని 12 ఏళ్ల నుంచి ఆరేళ్లకు కుదిస్తూ బిల్లులో ప్రతిపాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పౌరసత్వ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : లోక్‌సభ

నాగపూర్ కారాగారంలో ఫోన్ ఇన్ రేడియో ప్రారంభం
నాగపూర్ కేంద్ర కారాగారంలో ‘మీడియేటెడ్ ఫోన్ ఇన్ రేడియో కౌన్సిలింగ్’ కార్యక్రమంను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) రీజినల్ డెరైక్టర్ శివస్వరూప్ జనవరి 8న ప్రారంభించారు. ఆ కార్యక్రమం ద్వారా కారాగారంలో విద్యాభ్యాసం చేస్తున్న ఖైదీలు పాఠాలు వినడమే కాకుండా తమకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇగ్నో జ్ఞాన్‌వాణి రేడియో చానల్ ద్వారా ఖైదీలకు ప్రశ్నలు, అనుమానాలకు జవాబులు లభించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మీడియేటెడ్ ఫోన్ ఇన్ రేడియో కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 8
ఎక్కడ : కేంద్ర కారాగారం, నాగపూర్, మహారాష్ట్ర

అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభకు హాజరైన వారిలో 323 మంది బిల్లుకు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ 10 శాతం రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్‌పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : లోక్‌సభ

అగ్రవ ర్ణాల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ మాట్లాడుతూ... జనరల్ కేటగిరిలో పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా తాజా బిల్లు గొప్ప ముందడుగు అని అన్నారు. జనవరి 8న లోక్‌సభలో ఈ బిల్లు 323-3 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్రవ ర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : రాజ్యసభ

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2018కు డిసెంబర్ 27న లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్లనుంది.
2018, సెప్టెంబర్ 19న ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ప్రస్తుతం అమలవుతున్న ఈ ఆర్డినెన్స్ స్థానంలో ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2018ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధంగా పేర్కొంటారు. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను విధిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2018కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : లోక్‌సభ

మోదీ విదేశీయానం ఖర్చు రెండు వేల కోట్లు
2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయానానికి రూ.2,021 కోట్లు ఖర్చయిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ డిసెంబర్ 28న వెల్లడించారు. ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను ప్రధాని సందర్శించారని వివరించారు. మోదీ పర్యటనల ఫలితంగా 2014లో 30,930.5 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2017 నాటికి 43,478.27 మిలియన్ డాలర్లకు చేరాయని చెప్పారు. యూపీఏ-2 హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు 2009-14 సంవత్సరాల మధ్య రూ.1,346 కోట్లని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయానానికి రూ.2,021 కోట్లు ఖర్చు
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్

పోక్సో చట్టం సవరణలకు కేబినెట్ ఆమోదం
18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదం తెలిపింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 5, 6(18 ఏళ్లలోపువారిపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష) సెక్షన్ 9(ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నారులపై లైంగికదాడి నుంచి రక్షణ) సెక్షన్ 14, 15(చిన్నారుల అశ్లీలచిత్రాల నియంత్రణ)లను సవరించారు. దీంతో చిన్నారుల అశ్లీల చిత్రాలను కలిగిఉన్న వ్యక్తులకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధిస్తారు. చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రప్రభుత్వం పోక్సో చట్టం-2012ను తెచ్చింది.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు..
- గుండు కొబ్బరి పంటకు అందిస్తున్న మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,170 మేర కేబినేట్ పెంచింది. దీంతో గుండు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.9,920కు చేరుకుంది. అలాగే మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ ధరను రూ.2,010 పెంచింది. దీని మద్దతుధర రూ.9,521కు పెరిగింది.
- ఉల్లి ఎగుమతులపై అందిస్తున్న 5 శాతం ప్రోత్సాహకాలను 10 శాతానికి పెంచింది.
- జాతీయ హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.
- సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) స్థానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎం) ముసాయిదా బిల్లు-2018కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోక్సో చట్టం-2012 సవరణలకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : కేంద్ర కేబినెట్

ఐఎస్‌ఏఆర్‌సీ క్యాంపస్ ప్రారంభం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ సౌత్ ఏసియా రీజినల్ సెంటర్(ఐఎస్‌ఏఆర్‌సీ) క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 29న ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దక్షిణాసియాలో వరి పంటపై పరిశోధనలకు, శాస్త్రవేత్తల శిక్షణకు ఐఎస్‌ఏఆర్‌సీ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహేల్‌దేవ్ స్టాంప్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. మొత్తంగా ఘాజీపూర్, వారణాసిలో రూ.98 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఏఆర్‌సీ క్యాంపస్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్

అండమాన్ దీవుల్లో ప్రధాని మోదీ పర్యటన
అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న పర్యటించారు. పర్యటనలో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న హిందుత్వవాది వీర సావార్కర్‌ను బంధించిన పోర్ట్‌బ్లెయర్‌లోని సెల్యూలర్ జైలును సందర్శించారు. కాలాపానీగా పిలిచే ఈ జైలును 1896-1906లో నిర్మించారు.
పర్యటన సందర్భంగా ప్రధాని మాట్లడుతూ... చెన్నై-పోర్ట్‌బ్లెయర్ మధ్య ఫైబర్ కేబుల్, 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ మోడల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే అండమాన్ దీవుల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రితో పాటు 50 మెగావాట్ల ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్‌ను స్థాపిస్తామని తెలిపారు.
మూడు దీవుల పేరు మార్పు...
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం మూడు దీవుల పేర్లను మార్పు చేసింది. ఈ మేరకు పోర్ట్‌బ్లెయర్‌లోని నేతాజీ స్టేడియంలో డిసెంబర్ 30న జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని మోదీ ఆవిష్కరించారు. అనంతరం మెరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎక్కడ : అండమాన్ నికోబార్ దీవులు

పశ్చిమబెంగాల్‌లో క్రిషక్ బంధు పథకం

తెలంగాణలోని రైతుబంధు పథకం తరహాలో పశ్చిమబెంగాల్‌లలో ‘క్రిషక్ బంధు’ను ప్రవేశపెట్టనున్నట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డిసెంబర్ 31న ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా ఎకరానికి ఐదువేల ఆర్థికసాయం(రెండు విడతల్లో) చేయనున్నారు. మరోవైపు రైతుబీమా పథకం ద్వారా రైతులకు రూ. 2 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు మమతా తెలిపారు. అలాగే పంట బీమా ప్రీమీయంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం కలియా పేరుతో రైతుబంధు తరహా పథకాన్ని ప్రారంభించగా, జార్ఖండ్‌లోనూ ఈ తరహా పథకాన్ని అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతుబంధు తరహాలో క్రిషక్ బంధు పథకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ : పశ్చిమబెంగాల్

సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు

సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ డిసెంబర్ 30న పదవీ విరమణ చేయడంతో జస్టిస్ అరుణ్ మిశ్రా కొలిజియంలోకి వచ్చారు. 2018, నవంబర్ 30న జస్టిస్ కురియన్ జోసెఫ్ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ ఎన్‌వీ రమణ కొలీజియంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ ప్రకారం తొలి ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలిజియంలో ఉంటారు.

106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీ)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించనున్నారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరిగే ఈ కాంగ్రెస్‌కు దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది పాల్గొననున్నారు. వీరిలో నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే ఉద్దేశంతో ఏటా జనవరిలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్

ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు

చమురు, గ్యాస్, ఇంధన రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (పరిశోధనలు, ప్రమాణాల వేదిక) ఏర్పాటుచేయనున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు జనవరి 2న ఏడు చమురు కంపెనీలు, ఐఐటీ బాంబే మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని తెలిపారు. ఒప్పందం చేసుకున్న కంపెనీలలో ఐవోసీ, ఓఎన్‌జీసీ, గెయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఆయిల్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా ఉన్నాయి. ఇంధన రంగంలో పరిశోధనలతోపాటు నాణ్యత, ఉత్పత్తి, సామర్థ్యం పెంచే టెక్నాలజీల విషయంలో ఈ సెంటర్ సహకారం అందించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Published date : 28 Jan 2019 12:04PM

Photo Stories