Skip to main content

Telangana: ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌–1

ఆరోగ్యరంగానికి సంబంధించి జాతీయస్థాయి గణాంకాల్లో తెలంగాణ మెరుగైనస్థితిని సాధించింది. ‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్‌ ఇండియా–హెల్త్‌ ఇండెక్స్‌’ర్యాంకింగ్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మంచి స్కోర్‌ను సొంతం చేసుకున్నాయి.
Telangana
Telangana

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్యరంగంలో మెరుగుపరిచే దిశగా, ప్రోత్సహించే హెల్త్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌(2019–20)ను నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, సీఈవో అమితాబ్‌ కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేశ్‌ సర్వాల్, ప్రపంచ బ్యాంక్‌ సీనియర్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ షీనా ఛబ్రాక్ష డిసెంబర్‌ 27వ తేదీన ఇక్కడ విడుదల చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనే మూడు గ్రూపులుగా వర్గీకరించారు. ఇందులో పెద్దరాష్ట్రాల గ్రూప్‌లో ఉన్న తెలంగాణ స్కోర్‌ 2018–19లో 65.74 ఉండగా, 2019– 20లో 4.22 మేర మెరుగుపర్చుకొని 69.96 స్కోర్‌ సాధించింది. దీంతో ర్యాంకింగ్స్‌లో తెలంగాణ నాలుగోస్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. హెల్త్‌ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ సైతం 68.88 నుంచి 69.95తో తమ స్కోర్‌ను మెరుగుపరుచుకున్నప్పటికీ ర్యాంకింగ్స్‌లో మాత్రం మూడోస్థానం నుంచి నాలుగోస్థానానికి చేరింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు వరుసగా 82.20, 72.42 స్కోర్‌లతో మొదటి, రెండవ ర్యాంక్‌ల్లో నిలిచాయి. కేరళ మొత్తం పనితీరు స్కోరు 82.20తో పెద్ద రాష్ట్రాల్లో చాంపియన్‌గా కొనసాగితే, 30.57 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌ అత్యల్ప పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అట్టడుగున ఉంది.  
ఆరోగ్యరంగ పనితీరులో ముందంజ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఆరోగ్య రంగ పనితీరులో పెద్ద రాష్ట్రాల జాబితాలో ముందంజలో ఉన్నాయి. నవజాత శిశు మరణాలరేటు(ఎన్‌ఎంఆర్‌), ఐదేళ్లలోపు మరణాల రేటు(యూ5ఎంఆర్‌), ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్‌), పుట్టినప్పుడు లింగ నిష్పత్తి(ఎస్‌ఆర్‌బీ) అనే నాలుగు ముఖ్య ఆరోగ్య ఫలితాల సూచికల్లో రాష్ట్రాల మధ్య వైవిధ్యం ఎక్కువగా నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే లక్ష జననాలకు 70 కంటే తక్కువ ప్రసూతి మరణాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాయి.  
తెలంగాణలో 100%› చిన్నారులకు వ్యాక్సినేషన్‌ : 
పెద్ద రాష్ట్రాల్లోని చిన్నారులకు అందించే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌(బీసీజీ, 3 డోస్‌ డీపీటీ, 3 డోస్‌ ఓపీవీ, మీజిల్స్‌)లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2019–20లో ఆసుపత్రుల్లో జరిగిన అత్యధిక శాతం ప్రసూతుల్లో తెలంగాణ (96.3 శాతం) అగ్రస్థానంలో ఉండగా, 2014–15లో కేరళ (96.0 శాతం) తర్వాతి స్థానంలో నిలిచింది. 2014–15 నుంచి 2019–20 మధ్య కాలంలో ఆసుపత్రుల్లో జరిగిన ప్రసూతుల్లో తెలంగాణ అత్యధిక పెరుగుదల (62.8 శాతం), గుజరాత్‌ (–5.2 శాతం) అత్యధిక క్షీణతను నమోదు చేశాయి. కాగా, తెలంగాణలో ఉన్న ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 100% హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా పనిచేస్తున్నాయి. అయితే అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల కొరత ఉందని నీతి ఆయోగ్‌ హెల్త్‌ ఇండెక్స్‌ తెలిపింది. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ సహా ఎనిమిది రాష్ట్రాలు తమ మొత్తం సిబ్బందిని ఐటీ ఆధారిత హెచ్‌ఆర్‌ఎంఐఎస్‌ కింద కవర్‌ చేశాయి. తెలంగాణ సహా ఐదు పెద్ద రాష్ట్రాల్లో అవసరమైన ఫంక్షనల్‌ ఫస్ట్‌ రెఫరల్‌ యూనిట్ల (ఎఫ్‌ఆర్‌యూ) లభ్యత 100 శాతం ఉంది. పెద్ద రాష్ట్రాల జాబితాలో 2014–15 నుంచి 2019–20 వరకు సార్వత్రిక జనన నమోదును కొనసాగించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాగా, పెద్దరాష్ట్రాల్లో జనన నమోదులో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర పెరుగుదలను నమోదు చేయగా, మిగిలిన 13 రాష్ట్రాలు క్షీణతను చూపించాయి. 

ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌ : 
నీతి ఆయోగ్‌ డిసెంబర్‌ 27వ తేదీన విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరీలో తెలంగాణలో మొదటి స్థానం, ఆరోగ్య సూచిలో టాప్‌ 3లో నిలవడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేయడంతోపాటు మీడియా ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రం లోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజా వైద్యంపై ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, తలసరి ఖర్చు రూ.1,698గా ఉందన్నారు.

Published date : 28 Dec 2021 06:40PM

Photo Stories