Skip to main content

Govt: ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు అందుబాటులోకి రానున్న హెల్ప్‌లైన్‌?

Helpline

షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు(వేధింపుల నిరోధక) చట్టం–1989 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా టోల్‌–ఫ్రీ నంబర్‌ 14566 దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని డిసెంబర్‌ 12న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ వెల్లడించింది. ప్రతి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌గా రిజిస్టర్‌ చేస్తామని, బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది.

ఇటీవల ఏ దేశ ప్రధాని ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది?

ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా డిసెంబర్‌ 12న కొద్ది సమయం హ్యాక్‌ అయింది. వెంటనే ట్విట్టర్‌ స్పందించి ఖాతాను పరిరక్షించిందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బిట్‌కాయిన్‌ను భారత్‌ లీగల్‌ టెండర్‌గా స్వీకరించిందని హ్యాకర్లు ప్రధాని ఖాతా నుంచి ట్వీట్‌ చేశారు.

పీపీఓ చీఫ్‌గా నియమితులైన భారతీయ అమెరికన్‌?

మరో భారతీయ అమెరికన్‌ను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కీలక పదవి వరించింది. రాజకీయ సలహాదారు అయిన గౌతమ్‌ రాఘవన్‌ను వైట్‌హౌస్‌లోని ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ ఆఫీస్‌(పీపీఓ) చీఫ్‌గా నియమిస్తూ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో పుట్టిన గౌతమ్‌ అమెరికాలోని సియాటెల్‌లో పెరిగి, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.

అమెరికాలో టోర్నడోలు..

అమెరికాలోని ఆరు రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటకీ, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, మిస్సోరి, అర్కాన్సస్, మిస్సిసిపీ రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. డిసెంబర్‌ 12వ తేదీ నాటికి మృతుల సంఖ్య 94కు చేరింది.

ఆపరేషన్‌ దేవి శక్తి అంటే?

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక మొదటిసారిగా భారత ప్రభుత్వం అక్కడి ప్రజలకు మానవతాసాయం అందించింది. డిసెంబర్‌ 11న 1.6 మెట్రిక్‌ టన్నుల ప్రాణాధార ఔషధాలతో కూడిన ఒక విమానం కాబూల్‌ వెళ్లింది. ‘ఆపరేషన్‌ దేవి శక్తి’ కింద ఈ విమానాన్ని పంపారు.

యోగాలో గిన్నిస్‌ రికార్డ్‌

విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్‌ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగస్టు 4న అష్ట వక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్‌ భార్య జ్యోతి కూడా కొద్ది నెలల క్రితం గిన్నిస్‌బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

 

సెలవిక.. సైనికా!

Saiteja Army

తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ అంత్యక్రియలు డిసెంబర్‌ 12న పూర్తయ్యాయి. సాయితేజ స్వగ్రామం చిత్తూరు జిల్లా, కురబలకోట మండలం, ఎగువరేగడి గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Published date : 13 Dec 2021 03:51PM

Photo Stories