Skip to main content

అక్టోబర్ 2019 జాతీయం

మేయో క్లినిక్‌తో ఏఐజీ ఒప్పందం
Current Affairs అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరల్లో భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాలోని మేయో క్లినిక్‌తో ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాో్ట్ర ఎంట్రాలజీ(ఏఐజీ) ఒప్పందం కుదుర్చుకుంది. మేయో క్లినిక్ కేర్ నెట్‌వర్క్‌లో భాగమైన తొలి భారతీయ ఆస్పత్రి ఏఐజీనే అని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి అక్టోబర్ 24న తెలిపారు. వైద్యంతోపాటు పరిశోధన రంగంలోనూ ఇరు సంస్థలు కలసి పనిచేస్తాయని తెలిపారు. కాలేయ మూలకణ పరిశోధనల్లో ఏఐజీకి ఎంతో ప్రావీణ్యముంటే.. గుండె మూలకణాలపై మేయో క్లినిక్ ఎన్నో పరిశోధనలు చేపట్టిందని వివరించారు. సుమారు 155 ఏళ్లుగా వైద్య రంగంలో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మేయో క్లినిక్‌లో 5 వేల మంది నిపుణులైన వైద్యులు ఉన్నారని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాలోని మేయో క్లినిక్‌తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాో్ట్ర ఎంట్రాలజీ(ఏఐజీ)
ఎందుకు : వైద్యంతోపాటు పరిశోధన రంగంలోనూ ఇరు సంస్థలు కలసి పనిచేసేందుకు

అత్యంత కాలుష్యభరిత నగరంగా వారణాసి
దేశంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(కాశీ) నిలిచింది. ఈ మేరకు దేశంలోని 500ల నగరాలతో రూపొందించిన వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) అక్టోబర్ 23న విడుదల చేసింది. ఈ వాయు నాణ్యత సూచీలో 276 పాయింట్లతో వారణాసి అగ్రస్థానంలో నిలిచింది. వారణాసి తర్వాతి స్థానాల్లో వరుసగా లక్నో-269 పాయింట్లు(యూపీ), ముజఫర్‌నగర్-266 పాయింట్లు(యూపీ), యమునానగర్-264 పాయింట్లు(హరియాణ) మొరాదాబాద్- 256 పాయింట్లు(యూపీ) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత కాలుష్యభరిత నగరంగా వారణాసి(కాశీ)
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)
ఎక్కడ : దేశంలో

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. ఈ మేరకు అక్టోబర్ 24న మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 24 సీట్లలో విజయం సాధించారు. బీజేపీ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయి. కాంగ్రెస్ 45, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకున్నాయి. నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • మొత్తం స్థానాలు 288
  • కావాల్సిన మెజారీటి 145

పార్టీ

2019

2014

మార్పు

బీజేపీ

105

122

-17

శివసేన

56

63

-7

ఎన్సీపీ

54

41

+13

కాంగ్రెస్

45

42

+3

సమాజ్‌వాదీ

02

01

+1

ఎస్‌డబ్ల్యూపీ 01

00

+1

 

సీపీఎం

01

01

0

ఎంఐఎం

2

2

0

ఇతరులు

10

9

+1

స్వతంత్రులు

12

07

+5



హరియాణాలో సంకీర్ణ ప్రభుత్వం
హరియాణాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. అక్టోబర్ 24న వెల్లడైన హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ రాజకీయ పార్టీ సాధించలేకపోయింది. మొత్తం 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
హరియాణా ఎన్నికల ఫలితాలు
  • మొత్తం స్థానాలు 90
  • కావాల్సిన మెజారిటీ 46

పార్టీ

2019

2014

మార్పు

బీజేపీ

40

47

-7

కాంగ్రెస్

31

15

+16

ఐఎన్‌ఎల్‌డీ

1

20

-19

జేజేపీ

10

0

+10

స్వతంత్రులు

7

5

+2

హెచ్‌ఎల్పీ

1

0

+1

ఇతరులు

0

3

-3



డెంగీ కేసుల్లో కర్ణాటకకు అగ్రస్థానం
డెంగీ కేసుల్లో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2019 ఏడాదిలో ఇప్పటివరకు 13,200 డెంగీ కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉన్నాయి. డెంగీ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పరిశీలించడానికి అక్టోబర్ 25న హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం ఈ విషయాలను వెల్లడించింది. కేంద్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2019 ఏడాది 78 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. అందులో 58 మంది మరణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డెంగీ కేసుల్లో కర్ణాటకకు అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం
ఎక్కడ : దేశంలో

ప్రధాని మోదీ జ్ఞాపికల వేలం ముగింపు
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న జ్ఞాపికల ప్రదర్శన, ఈ-వేలం అక్టోబర్ 25న ముగిసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో 2019, సెప్టెంబరు 14 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ ప్రదర్శన, వేలం నిర్వహించారు. దీని ద్వారా 2,772 జ్ఞాపికలు అమ్ముడైనట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రదర్శన వేలంలో అతి తక్కువ ధరకు గణేశ్ విగ్రహం రూ.500కు అమ్ముడు పోగా, అత్యంత ఎక్కువ ధరకు గాంధీ చిత్రం రూ.25 లక్షలకు అమ్ముడు పోయింది. ఈ వేలం, ప్రదర్శన ద్వారా వచ్చిన మొత్తాన్ని గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన ‘నమామి గంగా’మిషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.

వరదల కారణంగా 2,155 మంది మృతి
2019 ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల కారణంగా 2,155 మంది మృత్యువాతపడ్డారని, మరో 45 మంది గల్లంతయ్యారని కేంద్ర హోం శాఖ అక్టోబర్ 25న వెల్లడించింది. మొత్తంగా 22 రాష్ట్రాలలో 26 లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారని తెలిపింది. దేశవ్యాప్తంగా 351 జిల్లాల్లో వరద ప్రభావం ఉందని, మహారాష్ట్రలో అత్యధికంగా 430 మంది, ఆ తర్వాత బెంగాల్‌లో 227 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది.

ఆర్‌టీఐ కమిషనర్ల పదవీకాలం మూడేళ్లకు కుదింపు
దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రప్రభుత్వం అక్టోబర్ 25న ఆమోదం తెలిపింది. దీంతో వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కేంద్రానికి లభించింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. సమాచార హక్కు చట్టం-2005లో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించారు. తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌టీఐ కమిషనర్ల పదవీకాలం మూడేళ్లకు కుదింపు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : కేంద్రప్రభుత్వం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే(జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే) నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 29న ఆమోదం తెలిపారు. 2019, నవంబరు 18న జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. 2018, అక్టోబర్ 3న 46వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం 2019, నవంబర్ 17తో ముగియనుంది. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.
జస్టిస్ బాబ్డే 1956, ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. నాగపూర్ యూనివర్సిటీలో లా చదువుకున్న ఆయన 1978, సెప్టెంబర్ 13న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2013 ఏప్రిల్ నుంచి సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో కీలక కేసులను సమర్ధవంతంగా నిర్వహించిన జస్టిస్ బాబ్డే...ఇటీవలే ముగిసిన బాబ్రీ మసీదు భూవివాదం విచారణకు సంబంధించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే(జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే)

ఢిల్లీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం
మహిళల భద్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం’ అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఢిల్లీలోని మహిళలు డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చు. భాయ్ దూజ్‌ను పురస్కరించుకుని ఈ పథకాన్ని అక్టోబర్ 29 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ, క్లస్టర్ బస్సులు ఎక్కే మహిళలకు రూ .10 ముఖ విలువ కలిగిన పింక్ టికెట్లు ఇస్తారు. ఇందుకు మహిళల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. పింక్ టికెట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్‌కు చెల్లిస్తుంది.
మరోవైపు మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్‌ను 13వేలకు పెంచుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉచిత రవాణా పథకాన్ని త్వరలో వృద్ధులకు, విద్యార్థులకు వర్తింపజేస్తామని ప్రకటించారు.

ఎన్‌ఐఎన్ పేరిట తపాలా బిళ్ల ఆవిష్కరణ
Current Affairs పోషకాహార రంగ పరిశోధనల్లో వందేళ్లు పూర్తి చేసుకున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) పేరిట ఓ తపాలా బిళ్ల విడుదలైంది. న్యూఢిల్లీలో అక్టోబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ తపాలా బిళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.గోపాలన్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ఆయన కుమారుడు డాక్టర్ శరత్ గోపాలన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎన్‌ఐఎన్ డెరైక్టర్ డాక్టర్ ఆర్ హేమలత పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఐఎన్ పేరిట తపాలా బిళ్ల ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : న్యూఢిల్లీ

నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ విడుదల
భారత ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలియజేసే ఇన్నోవేషన్ ఇండెక్స్-2019ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ న్యూఢిల్లీలో అక్టోబర్ 17న విడుదల చేశారు. ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ, నీతి ఆయోగ్ సంయుక్తంగా రూపొందించిన ఈ ఇండెక్స్‌లో పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ర్యాంకులను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కర్ణాటక తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో సిక్కిం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ తొలి స్థానాలను చేజిక్కించుకున్నాయి. సశక్తపరచడం, పనితీరు చూపడం అంశాల్లో వచ్చిన సగటు స్కోరు ఆధారంగా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను తయారు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్నోవేషన్ ఇండెక్స్-2019 విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : న్యూఢిల్లీ

20వ పశుగణన నివేదిక విడుదల
దేశవ్యాప్తంగా 535.78 మిలియన్ల పశు సంపద ఉందని కేంద్ర పశు సంవర్థక శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 17న ‘20వ పశుగణన నివేదిక’ను విడుదల చేసింది. 2012లో విడుదలైన 19వ పశుగణన నివేదికతో పోల్చితే 20వ పశుగణన నివేదికలో పశు సంపద 4.6 శాతం పెరిగిందని వెల్లడైంది. 20వ పశుగణన నివేదిక ప్రకారం గో సంపద 18 శాతం, గొర్రెల సంఖ్య 14.1 శాతం, మేకల సంఖ్య 10.1 శాతం, కోళ్ల సంఖ్య 16.8 శాతం పెరిగింది. అదేసమయంలో అశ్వసంపద 45.6 శాతం తగ్గి 3.4 లక్షలకు పడిపోయింది. అలాగే గాడిదల సంఖ్య 61.23 శాతం మేర తగ్గి 1.2 లక్షలకు, ఒంటెల సంఖ్య 37.1 శాతం తగ్గి 2.5 లక్షలకు పడిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 20వ పశుగణన నివేదిక విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : కేంద్ర పశు సంవర్థక శాఖ

తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు అక్టోబర్ 18న కేంద్ర చట్టం, న్యాయ శాఖకు ఆయన లేఖ రాశారు. 2018, అక్టోబర్ 3న 46వ సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. 2019, నవంబర్ 17తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే పేరును గొగోయ్ ప్రతిపాదించారు. ఒకవేళ జస్టిస్ బాబ్డే పేరు సీజేఐగా ఖరారైతే ఆయన 2021 ఏప్రిల్ 3 వరకు అంటే 17 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.

బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని భేటీ
ప్రముఖ బాలీవుడ్ నటులు, నిర్మాతలతో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 19న తన అధికార నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ.. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపై చర్చించారు. 1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం, 1947-2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించి స్ఫూర్తిదాయక కథనాలపై సినీ, టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని వారిని కోరారు. కళారంగంలో చూపిసున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటకరంగ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. మహాత్మగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు. ప్రధాని మోదీతో భేటీ అయిన వారిలో ఆమిర్‌ఖాన్, షారూఖ్ ఖాన్, కంగనా రనౌత్, బోనీ కపూర్, ఆనంద్ ఎల్ రాయ్ తదితరులు ఉన్నారు.

ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీంకోర్టు
ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల కూల్చొద్దని, కూల్చివేతపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరే కాలనీలో ఇప్పటి వరకు జరిగిన చెట్ల కూల్చివేత, ప్రాజెక్టు పనులపై నివేదిక ఇవ్వాలని, నరికివేతకు గురైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను అక్టోబర్ 21న ఆదేశించింది. ముంబైలో పచ్చదనానికి నెలవైన ఆరే కాలనీలో మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం పెద్ద సంఖ్యలో చెట్లను నేలకూల్చడంపై న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : ఆరే కాలనీ, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం

కోల్ చెవాంగ్ రించేన్ వంతెన ప్రారంభం
జమ్మూకశ్మీర్‌లో శ్యోక్ నది సమీపంలోని తూర్పు లదాఖ్‌లో నిర్మించిన 1,400 అడుగుల కోల్ చెవాంగ్ రించేన్ వంతెనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... సరిహద్దుల వద్ద చొరబాట్లకు భారత ఆర్మీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పిందని అన్నారు. పాక్ చొరబాట్లను ఆపని పక్షంలో ఇలాంటి చర్యలే కొనసాగుతాయని హెచ్చరించారు. భారతదేశ సమగ్రతను అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి పాక్ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోల్ చెవాంగ్ రించేన్ వంతెన ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : శ్యోక్ నది సమీపం, తూర్పు లదాఖ్, జమ్మూకశ్మీర్

సియాచిన్ పర్యటనకు అనుమతి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుగాంచిన జమ్మూకశ్మీర్‌లోని సియాచిన్‌పైకి పర్యాటకులను అనుమతినిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21న వెల్లడించారు. కునార్ బేస్ క్యాంప్ నుంచి కునార్ పోస్ట్ వరకు ఉన్న మార్గాలను తెరవనున్నట్లు తెలిపారు. లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సియాచిన్ విశేషాలు
  • సియాచిన్ అంటే ‘గులాబీ నేల’ అని అర్థం.
  • వ్యూహాత్మకంగా కీలకమైన సియాచిన్ ప్రాంతం నిజానికి ఒక హిమనీనదం.
  • సియాచిన్ సముద్రమట్టానికి దాదాపు 20వేల అడుగుల ఎత్తులో ఉంది. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఇక్కడ మంచు చరియలు విరిగిపడుతుంటాయి.
  • ఈ ప్రాంతంపై పట్టు కోసం భారత్, పాకిస్తాన్‌లు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’ పేరుతో సైనిక చర్య నిర్వహించిన భారత్ దీన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. దానికి ముందు వరకూ పర్వతారోహణ బృందాలను అక్కడ అనుమతించారు.
  • తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైనికులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. గత పదేళ్లలో భారత్ ఇక్కడ 163 మంది సైనికులను కోల్పోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియాచిన్ పర్యటనకు అనుమతి
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : సియాచిన్ యుద్ధక్షేత్రం, జమ్మూకశ్మీర్
ఎందుకు : లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో

బీఎస్‌ఎన్‌ఎల్‌తో యప్ టీవీ ఒప్పందం
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో యప్ టీవీ ఒక అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. న్యూఢిల్లీలో అక్టోబర్ 21న జరిగిన కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పీకే పుర్వార్, యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో 250 లైవ్ టీవీ ఛానల్స్, 5 వేలకుపైగా సినిమాలు, వందకుపైగా టీవీ షోలు, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, ఒరిజినల్ సిరిస్, ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి సేవలను అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : యప్ టీవీ
ఎందుకు : బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందించేందుకు

క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబేకు అగ్రస్థానం
క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్‌‌స-2020లో ఐఐటీ-బాంబే అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 22న విడుదలైన ఈ ర్యాంకింగ్‌‌స జాబితాలో ఐఐఎస్‌సీ-బెంగళూరు రెండోస్థానం, ఐఐటీ-ఢిల్లీ-మూడోస్థానం పొందగా హెచ్‌సీయూ 8వ స్థానం సాధించింది. టాప్‌టెన్ ర్యాంకింగ్‌‌సలో ఇతర విద్యాసంస్థలే ఉండగా కేవలం 2 మాత్రమే యూనివర్సిటీలున్నాయి. అందులో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 7వ స్థానం, హెచ్‌సీయూ 8వ స్థానం పొందాయి. దేశంలోని 100 విద్యాసంస్థలను పరిశీలించి ఈ ర్యాంకింగ్‌‌స ఇచ్చారు. క్యూఎస్ గ్లోబల్ వరల్డ్ ర్యాంకింగ్‌‌సలో హెచ్‌సీయూ 601-650 ర్యాంకింగ్ పొందిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్‌‌స-2020లో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ఐఐటీ-బాంబే

అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త నిబంధన
ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదన్న ‘కొత్త నిబంధన’ను అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అస్సాం ముఖ్యమంత్రి సర్బోనందా సోనోవాల్ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధన ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా గుర్తిస్తారు. అలాగే ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వారికి వర్తించవు. ఎవరైనా ఉద్యోగంలో చేరిన తర్వాత మూడో బిడ్డను కంటే వారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి ఈ నిబంధన వర్తిస్తుంది.
ఈ కొత్త నిబంధనకు సంబంధించిన తీర్మానం అసోం జనాభా, మహిళా సాధికారిత విధానం పేరిట 2017లోనే అసెంబ్లీ ఆమోదం పొందింది. జనాభా నియంత్రణలో భాగంగానే కొత్త నిబంధన అమలు నిర్ణయం తీసుకున్నామని అసోం కేబినెట్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : అస్సాం ప్రభుత్వం
ఎక్కడ : అస్సాం
ఎందుకు : జనాభా నియంత్రణలో భాగంగా

భారత్‌కీ లక్ష్మి రాయబారులుగా సింధు, దీపిక
సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులను ‘భారత్ కీ లక్ష్మి’రాయబారులుగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న ప్రకటించారు. వేర్వేరు రంగాల్లో మహిళా సాధికారతకు తోడ్పడిన స్త్రీ మూర్తులను 2019 దీపావళి సందర్భంగా ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుతో గౌరవించుకుందామంటూ ఇటీవలి ‘మన్‌కీ బాత్’లో ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని ఉద్యమానికి ట్విట్టర్‌లో సింధు, దీపిక మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ... మహిళా సాధికారితకు పాటుపడటం భారత సంస్కృతిలోనే ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ కీ లక్ష్మి రాయబారులుగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

ప్రధాని మోదీతో నోబెల్ విజేత అభిజిత్ భేటీ
ప్రవాస భారతీయుడు, 2019 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చలు జరిగాయని మోదీ వెల్లడించారు. భారత్ అభివృద్ధి కోసం మోదీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయని అభిజిత్ తెలిపారు. కోల్‌కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ ప్రస్తుతం అమెరికాలో మసాచూసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : 2019 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ
ఎక్కడ : న్యూఢిల్లీ

సుప్రీంకోర్టుకు సామాజిక మాధ్యమాల పిటిషన్లు
ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించడంపై వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో రెండు, బోంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ చేసిన వినతిని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం అక్టోబర్ 22న విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని నిరోధించడంపై చర్యలకు సంబంధించి 2020, జనవరి 15వ తేదీలోగా ఒక నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

భారతీయ రైల్వేతో అమెజాన్ ఒప్పందం
భారతీయ రైల్వేతో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ కస్టమర్లకు ప్యాకేజీలను అందించడం కోసం రైల్వే సేవలను అమెజాన్ వినియోగించుకోనుంది. ఈ ఒప్పంద విషయాన్ని అమెజాన్ ఇండియా డెరైక్టర్ (మిడిల్ మైల్ ట్రాన్స్ పోర్టేషన్) అభినవ్ సింగ్ అక్టోబర్ 22న వెల్లడించారు. ఈ విధంగా ఒక ఈ-కామర్స్ సంస్థ రైల్వే సేవలను అందిపుచ్చుకోవడం దేశంలోనే తొలిసారని అభినవ్ చెప్పారు. తొలుత న్యూఢిల్లీ నుండి ముంబై, ముంబై నుండి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుండి కోల్‌కతాకు ఈసేవలు ఉండనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ రైల్వేతో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : అమెజాన్ ఇండియా
ఎందుకు : కస్టమర్లకు ప్యాకేజీలను అందించడం కోసం రైల్వే సేవలను వినియోగించుకోవడానికి

రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు
రబీ పంటలైన గోధుమలు, శనగలు, బార్లీ, మసూర్ పప్పు, ఆవాలు, కుసుమల మద్దతు ధరలను కేంద్రప్రభుత్వం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అక్టోబర్ 23న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది.
పంటల కనీస మద్దతు ధర-కేబినెట్ నిర్ణయాలు
  • 2020-21కి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.1,925గా కేబినేట్ నిర్ణయించింది. గత సీజన్‌లో ఇది రూ.1.840గా ఉండగా.. ఈసారి రూ.85 పెంచింది.
  • బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.85 మేర పెంచుతూ రూ.1,525గా నిర్దేశించింది. గత సీజన్‌లో ఇది రూ.1,440గా ఉండేది.
  • శనగలకు క్వింటాల్‌కు రూ.255 చొప్పున పెంచుతూ రూ.4,875గా నిర్ణయించింది.
  • మసూర్ (కేసరి) పప్పు క్వింటాల్ ధర రూ.4,800గా నిర్ణయించింది. గత సీజన్‌లో ఇది రూ.4,475 ఉండగా ఈసారి రూ.325 పెంచింది.
  • ఆవాలు క్వింటాలు ధర గత సీజన్‌లో రూ.4,200 ఉండగా.. ఈసారి రూ.255 పెంచింది. ప్రస్తుత సీజన్‌లో క్వింటాల్ ఆవాలు కనీస మద్దతు ధర రూ.4,425గా నిర్ణయించింది.
  • కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ రూ.5,215గా నిర్దేశించింది. గత సీజన్‌లో కుసుమ ధర క్వింటాల్‌కు రూ.4,945గా ఉంది.

బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం
భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్(ఎంటీఎన్‌ఎల్)ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అక్టోబర్ 22న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
టెలికం సంస్థల విలీనం-కేబినెట్ నిర్ణయాలు
  • బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్‌ఎల్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది.
  • పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించుకోవచ్చు.
  • రెండు సంస్థల్లోని దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్‌ఎస్ పథకం అమలు.
  • ఈ రెండు సంస్థలకు రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కోసం రూ. 3,674 కోట్లు కేటాయింపు.
  • రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయడం.
బీఎస్‌ఎన్‌ఎల్‌లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే.

కియా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
Current Affairs దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత్‌లో తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అక్టోబర్ 10న ప్రారంభించింది. హరియాణలోని గురుగ్రామ్‌లో ‘బీట్ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కియా ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ మాట్లాడుతూ.. ‘ఈ సెంటర్ పేరులోని మొదటి పదం బీటింగ్ ఆఫ్ హార్డ్‌కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలోనే దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి సెంటర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కియా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : కియా మోటార్స్
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణ

ధ్రువ్ కార్యక్రమం ప్రారంభం
ప్రధానమంత్రి సృజనాత్మక అభ్యసన కార్యక్రమం ధ్రువ్(DHRUV)ను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ అక్టోబర్ 10న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మెరికల్లాంటి 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో 14 రోజులపాటు శిక్షణ అందిస్తామని చెప్పారు. దేశానికి దిశానిర్దేశం చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి ప్రతిరూపంగా ఈ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధ్రువ్(DHRUV) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొక్రియాల్
ఎక్కడ : ఇస్రో ప్రధాన కార్యలయం, బెంగళూరు

మొబైల్ కాంగ్రెస్‌లో కేంద్ర టెలికం మంత్రి
దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 14న ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2019 సదస్సులో కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. 5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) 2018లో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
మూడు రోజుల(అక్టోబర్ 16 వరకు) పాటు జరగనున్న ఐఎంసీ సదస్సులో 500లకు పైగా కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2019 సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ

సెరావీక్ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర
న్యూఢిల్లీలో అక్టోబర్ 14న జరిగిన భారత ఇంధన ఫోరమ్ ‘సెరావీక్’ సదస్సులో కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2023 నాటికి ఆయిల్, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి విభాగంలోకి 58 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. అలాగే, 2024 నాటికి సహజ వాయువు మౌలిక సదుపాయాలైన పైపులైన్లు, దిగుమతి టర్మినళ్లు, పట్టణ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లోకి మరో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఈ సదస్సుకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ హాజర య్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఇంధన ఫోరమ్ ‘సెరావీక్’ సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : న్యూఢిల్లీ

చేతక్ ఈ-స్కూటర్ ఆవిష్కరణ
బజాజ్ చేతక్ ఈ-స్కూటర్‌ను కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో అక్టోబర్ 16న ఆవిష్కరించారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ... చేతక్ ఈ-స్కూటర్ అమ్మకాలు 2020, జనవరి నుంచి మొదలవుతాయని తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామన్నారు. మహారాష్ట్రలోని చకన్ ప్లాంటులో చేతక్ ఈ-స్కూటర్స్‌ను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ-స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : న్యూఢిల్లీ

అక్టోబర్ 19 నుంచి బుద్దిస్ట్ రైలు ప్రారంభం
భారత్, నేపాల్‌లో ఉన్న బుద్ధునికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించేలా భారతీయ రైల్వే మొదటిసారిగా ‘బుద్దిస్ట్ సర్క్యూట్’రైలును నడపనుంది. 2019, అక్టోబర్ 19 నుంచి 26 వరకు ఈ రైలు పరుగులు తీయనుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. బుద్ధుడు జన్మించిన లుంబిని, అతడు జ్ఞానోదయం పొందిన బోధ్‌గయ, మొదటి ఉపన్యాసం చేసిన సారనాథ్, బుద్ధుడు నిర్యాణం పొందిన కుషినగర్ తదితర ప్రాంతాలను ఈ ప్యాకేజీలో భాగంగా సందర్శించవచ్చని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్టోబర్ 19 నుంచి బుద్దిస్ట్ సర్క్యూట్’రైలు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : భారతీయ రైల్వే

వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా సూరత్
Current Affairs దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా గుజరాత్‌లోని సూరత్ నిలిచింది. ఆగ్రా, బెంగళూరు, హైదరాబాద్‌లు వరుసగా సూరత్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అక్టోబర్ 3న ఈ సర్వేను విడుదల చేశారు. ప్రపంచంలోని మొత్తం 780 నగరాలను పరిశీలించి ఆక్స్‌ఫర్డ్ సర్వేను రూపొందించారు.
దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలు

ర్యాంకు

నగరం

వృద్ధిరేటు(2019-35)

జీడీపీ 2018

జీడీపీ 2035

1

సూరత్

9.17

28.5

126.8

2

ఆగ్రా

8.58

3.9

15.6

3

బెంగళూరు

8.50

70.8

283.3

4

హైదరాబాద్

8.47

50.6

201.4

5

నాగ్‌పూర్

8.41

12.3

48.6

6

తిరుపూర్

8.36

4.3

17.0

7

రాజ్‌కోట్

8.33

6.8

26.7

8

తిరుచిరాపల్లి

8.29

4.9

19.0

9

చెన్నై

8.17

36.0

136.8

10

విజయవాడ

8.16

5.6

21.3

నోట్: జీడీపీ గణాంకాలు బిలియన్ డాలర్లలో. ఒక బిలియన్ రూ.100 కోట్లకు సమానం
ప్రపంచ నగరాలలో 2018 జీడీపీ (ట్రిలియన్ డాలర్లలో)

న్యూయార్క్

2.5

టోక్యో

1.9

లాస్‌ఏంజెల్స్

1.5

లండన్

1.3

షాంఘై

1.3

బీజింగ్

1.1

పారిస్

1.1

చికాగో

1.0

గుహాంగ్‌జో

0.9

షెన్‌ఝన్

0.9

నోట్: ఒక ట్రిలియన్ డాలర్లు లక్ష కోట్ల డాలర్లకు సమానం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా సూరత్
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ సర్వే

ఢిల్లీ-కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఢిల్లీ-కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో అక్టోబర్ 3న కేంద్ర రెల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలందిస్తుంది. అధునాతనమైన సాంకేతికతతో తయారైన ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. వందే భారత్‌కు మార్గమధ్యలో అంబాలా, లూథియానా స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు నిలిచిన కశ్మీర్ అభివృద్ధి ప్రస్థానం, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి మొదలయిందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ-కత్రా (జమ్మూకశ్మీర్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ

ప్రపంచ స్మార్ట్ సిటీల్లో హైదరాబాద్‌కు 67వ స్థానం
ప్రపంచ స్మార్ట్ సిటీల(ఆకర్షణీయ నగరాలు)-100 జాబితాలో గ్రేటర్ హైదరాబాద్‌కు 67వ స్థానం లభించింది. ఈ జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కగా వాటిల్లో హైదరాబాద్ ముందుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ 68వ స్థానం, ముంబై 78వ స్థానం దక్కించుకున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సంస్థలు 102 నగరాలపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ జాబితాను అక్టోబర్ 4న విడుదల చేశారు.
ప్రపంచ స్మార్ట్ సిటీల-100 జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా... రెండోస్థానంలో జూరిచ్, మూడోస్థానంలో ఓస్లో, నాలుగోస్థానంలో జెనీవా, ఐదో స్థానంలో కొపెన్‌హెగెన్ నగరాలు ఉన్నాయి.

దేశంలో తొలి ప్రైవేట్ రైలు ప్రారంభం
దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ అక్టోబర్ 4న ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపి, రైలును ప్రారంభించారు. లక్నో-న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ ప్రైవేట్ రైలును రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది. ఈ రైలుకు రెండు హాల్టులు (కాన్పూరు, ఘజియాబాద్) మాత్రమే ఉన్నాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగించనుంది. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇందులో ప్రయాణించేవారు రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్

గూగుల్‌తో ఎన్‌హెచ్‌ఏ ఒప్పందం
దిగ్గజ సంస్థ గూగుల్‌తో నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) అక్టోబర్ 4న ఒక ఒప్పందం కుదుర్చకుంది. ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి ప్రాచుర్యం కల్పించడంతోపాటు దీన్ని మరింత బలోపేతం చేయడానికి గూగుల్ సహకరించనుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద వచ్చే లక్షలాది దరఖాస్తులను వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరిష్కరించడానికి తోడ్పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్‌తో ఎన్‌హెచ్‌ఏ ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎందుకు : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి ప్రాచుర్యం కల్పించడానికి

డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో జైశంకర్ భేటీ
దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 4న జరిగిన భారత ఆర్థిక సదస్సు సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత్ పొరుగు దేశాల్లో ఒక్కటి(పాకిస్తాన్) మినహా అన్ని దేశాలు ప్రాంతీయ సహకారం విషయంలో కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని ఈ సందర్భంగా జైశంకర్ చెప్పారు. ప్రాంతీయ సహకారం విషయంలో ఆ ఒక్క దేశం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో జాతీయవాదాన్ని ప్రతికూల అంశంగా చూడొద్దని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
ఎక్కడ : న్యూఢిల్లీ

సైనికుల ఆర్థిక సాయం 4రెట్లు పెంపు
యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 5న సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని రక్షణ శాఖ పేర్కొంది. సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్‌గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైనికుల ఆర్థిక సాయం 4రెట్లు పెంపు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

విశ్వ కవి సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న 39వ ‘విశ్వ కవి సమ్మేళనం’లో అక్టోబర్ 6న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. సమాజంలో పరివర్తన కవిత్వంతో సాధ్యమవుతుందని, విశ్వశాంతికి బాటలు వేసేది సాహిత్యమని పేర్కొన్నారు. ఈ కవి సమ్మేళనం సందర్భంగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ జరిగింది.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ విశ్వ కవి సమ్మేళనాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. కళింగ సంస్థల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ సమ్మేళనంలో 82 దేశాల నుంచి 1,300 మంది కవులు పాల్గొన్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్కృతిక మరియు కళల సంస్థలో భాగమైన ఈ విశ్వ కవుల వేదిక (WCP) 1969లో ప్రారంభమైంది. ప్రస్తుతం వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పొయెట్రీ అధ్యక్షుడిగా డాక్టర్ మారస్ యంగ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వ కవి సమ్మేళనానికి హాజరు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ, భువనేశ్వర్, ఒడిశా

తాలిబన్ చెర నుంచి భారతీయుల విడుదల
గత సంవత్సర కాలంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను అఫ్గాన్ తాలిబన్లు అక్టోబర్ 7న విడుదల చేశారు. అఫ్గాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి అయిన జల్మే ఖలిల్జాద్ ఇస్లామాబాద్‌లో తాలిబన్ నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ముగ్గురు భారతీయ బందీలను తాలిబన్లు విడుదల చేశారు. ఇందుకు ప్రతిగా అఫ్గాన్ జైళ్లలో ఉన్న 11 మంది ముఖ్య నాయకులను తాలిబన్లు విడిపించుకున్నారు. అయితే ఈ పరిణామాలపై అఫ్గాన్ ప్రభుత్వం నుంచి గానీ, భారత ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు.
2018 మే నెలలో అఫ్గానిస్తాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ పవర్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయ ఇంజనీర్లను, వారి డ్రైవర్‌ను తాలిబన్లు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడుగురిలో ఒకరిని 2019, మార్చిలో విడుదల చేశారు.

వాహన నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం
మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రెండూ చట్టాలు వాటి పరిధుల్లో చక్కగా పనిచేస్తున్నాయని పేర్కొంది. మోటారు వాహన చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు అక్టోబర్ 6న ఈ వ్యాఖ్యలు చేసింది. గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాహన నేరాలకూ ఐపీసీ వర్తింపు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని

-దంత్‌సేవ వెబ్‌సైట్ ప్రారంభం
నోటి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచేందుకు ‘ఈ-దంత్‌సేవ’ పేరుతో రూపొందించిన వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీలో అక్టోబర్ 7న ప్రారంభించారు. అలాగే అంధుల కోసం బ్రెయిలీ బుక్‌లెట్‌నూ మంత్రి ఆవిష్కరించారు. ఒక్క క్లిక్‌తో నోటి ఆరోగ్యం గురించి సమస్త సమాచారం తెలిపేందుకు వీలుగా ఈ-దంత్‌సేవను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దంత వైద్య సేవలు అందించే సంస్థలు, కళాశాలల వివరాలను జీపీఆర్‌ఎస్‌తో సహా యాప్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ-దంత్‌సేవ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : నోటి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచేందుకు
Published date : 30 Oct 2019 06:01PM

Photo Stories