ఆగస్టు 2018 జాతీయం
గుజరాత్‌లోని జునాగఢ్‌లో నిర్మించిన గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న ప్రారంభించారు. అలాగే గుజరాత్ వల్సాద్ జిల్లాలోని జుజ్వాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్‌లైన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇళ్లు కలిగి ఉండేలా చూడటమే తన స్వప్నమని అన్నారు. మరోవైపు వల్సాద్ జిల్లా కొండ ప్రాంతాల్లోని సుమారు 175 గ్రామాలకు తాగునీరు అందించే రూ.586 కోట్ల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. అనంతరం గాంధీ నగర్‌లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రి ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జూనాగఢ్, గుజరాత్
111 హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణశాఖ ఆమోదం
భారత నౌకాదళం కోసం రూ.21,000 కోట్లతో 111 యుటిలిటీ హెలికాప్టర్ల కొనుగోలుకు, మరో రూ.25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఆగస్టు 25న జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శత్రు స్థావరాలపై దాడి, నిఘా, గాలింపు, సహాయక చర్యలో పాల్గొనే ఈ హెలికాప్టర్లను వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ-స్వదేశీ సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే తయారు చేయనున్నారు. సైన్యం కోసం రూ.3,364.78 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 150 అత్యాధునిక 155 ఎంఎం అర్టిలరీ గన్స్, సబ్ మెరైన్లపై దాడిచేయగల 24 నేవల్ మల్టీరోల్ హెలికాప్టర్ల కోనుగోలుకు డీఏసీ అంగీకరించింది. అలాగే 14 స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన రక్షణశాఖ, వీటిలో 10 వ్యవస్థలు దేశీయంగా అభివృద్ధి చేసినవి అయ్యుండాలని షరతు పెట్టింది.
2017 మే నెలలో తీసుకొచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ ఆయుధ కంపెనీలతో జట్టుకట్టే భారత ప్రైవేటు కంపెనీలు.. యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను తయారుచేసేందుకు వీలుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 111 యుటిలిటీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : రక్షణ శాఖ
రైల్వే కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగో
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని రైలు కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగోతో పాటు జాతీయ జెండాను ముద్రించనున్నారు. ఈ మేరకు ఆగస్టు 26న రైల్వే బోర్డు తెలిపింది. అలాగే ‘స్వచ్ఛతా పక్వారా’పేరుతో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం మహాత్మాగాంధీకి ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రాంతాల్లోని 43 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని రైలు కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగో ముద్రికర ణ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : రైల్వే బోర్డు
ఎందుకు : మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
ముగిసిన అమర్‌నాథ్ యాత్ర
అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు జూన్ 28న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 26న ముగిసింది. యాత్రలో భాగంగా .85 లక్షల మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 25 వేలు ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జరిగిన యాత్రలో వాతావరణ, అనారోగ్య కారణాలతో మొత్తం 38 మంది మరణించారు. 2017లో యాత్రీకుల బస్సుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 8 మంది చనిపోయిన నేపథ్యంలో ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగిసిన అమర్‌నాథ్ యాత్ర
ఎప్పుడు : ఆగస్టు 26
ఎక్కడ : హిమాలయాలు, జమ్మూకశ్మీర్
రెండో వివాహం చెల్లుబాటు అవుతుంది: సుప్రీంకోర్టు
విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం ఆగస్టు 25న తెలిపింది. ఇరు వర్గాలు(భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15 వర్తించదని పేర్కొంది.
తన భార్యతో విడాకులు కోరుతూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్‌దారుడు మరో వివాహం చేసుకున్నాడు. ఈ కేసులో విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని ఢిల్లీ హెకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పిటిషన్‌దారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరిచింది.
హిందూ వివాహ చట్టంలోని అంశాలు....
సెక్షన్ 5(1) : జీవిత భాగస్వామి బతికి ఉండగా మరో వివాహం చేసుకోరాదు
సెక్షన్ 11 : అలాంటి వివాహాలు చెల్లుబాటు కావు
సెక్షన్ 15 : విడాకులు పొందిన వారు మళ్లీ ఎప్పుడు వివాహం చేసుకోవాలో చెబుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో వివాహం చెల్లుబాటు అవుతుంది
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో
వర్షాకాల మృతులు 1276
2018 సంవత్సరం వర్షాకాలంలో ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర వర్ష సంబంధిత కారణాల వల్ల 8 రాష్ట్రాల్లో 1,276 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అత్యధికంగా 443 మంది కేరళలో చనిపోయారు. ఈ మేరకు వర్ష ఘటనలకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ ఆగస్టు 27న ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం కేరళలో 54.11 లక్షల మంది వరద బాధితులుగా మారగా 47,727 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరదల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 218 మంది, పశ్చిమబెంగాల్‌లో 198, కర్ణాటకలో 166, మహారాష్ట్రలో 139, గుజరాత్‌లో 52, అస్సాంలో 49, నాగాలాండ్‌లో 11 మంది మరణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018 వర్షాకాల మృతులు 1276
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వర్ష సంబంధిత ఘటనల వల్ల
ఆయుష్మాన్ భారత్ అంబాసిడర్లుగా టీచర్లు
దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్కూల్ టీచర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రతి ప్రభుత్వ స్కూల్‌లో ఇద్దరు టీచర్లను ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ అంబాసిడర్లు’గా నియమిస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. అంబాసిడర్‌గా నియమితులైన టీచర్లు ఆయుష్మాన్ భారత్‌పై విద్యార్థుల్లో అవగాహన, ఆరోగ్యంపై చైతన్యం కల్పిస్తారు. ఇందుకోసం ముందుగా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖ సంయుక్తంగా అమలు చేయనున్న ఆయుష్మాన్ భారత్‌ను తొలి విడతగా 115 వెనుకబడిన జిల్లాల్లో అమలు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుష్మాన్ భారత్‌కి హెల్త్ అండ్ వెల్‌నెస్ అంబాసిడర్లు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ప్రతి ప్రభుత్వ స్కూల్‌లో ఇద్దరు టీచర్లు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : పథకంపై అవగాహన కల్పించేందుకు
అటల్ నగర్ గా నయా రాయ్‌పూర్ పేరు మార్పు
‘అటల్ నగర్’ గా ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్’ పేరును మార్పు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21న నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్ తెలిపారు. అలాగే కొత్త రాజధానిలో పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టడంతోపాటు స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
రాయ్‌పూర్‌లోని సెంట్రల్ పార్కుకు, బిలాస్‌పూర్ యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీకి, మార్వా థర్మల్ ప్లాంట్‌కు, రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు ‘వికాస్ యాత్ర’ రెండో దశకు ‘అటల్ వికాస్ యాత్ర’గా పేరుమార్చింది. ప్రతి సంవత్సరం వాజ్‌పేయి పేరుపై కవులకు జాతీయ స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంతోపాటు ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న ఉత్తమ పాలన అందించిన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ‘అటల్ బిహరీ వాజ్‌పేయి సుహాసన్ అవార్డు’ను అందించనున్నారు. భావితరాలు అటల్ జీవిత విశేషాలు తెలుసుకునేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఛత్తీస్‌గఢ్ కేబినెట్ నిర్ణయించింది.పోఖ్రాన్ అణు పరీక్షలకు గుర్తుగా రాష్ట్రంలోని ఓ బెటాలియన్‌కు ‘పోఖ్రాన్ బెటాలియన్’గా పేరు పెట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటల్ నగర్ గా నయా రాయ్‌పూర్ పేరు మార్పు
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
ఎక్కడ : ఛత్తీస్‌గఢ్
ఎందుకు : మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా
ఎస్సీ, ఎస్టీల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
దళితులపై వేధింపులను నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆగస్టు 9న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం కోర్టు ఆదేశించినప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చు. ఈ బిల్లుకు ఆగస్టు 6న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఈ చట్టంలో మార్పులు చేయడంతో సవరణ బిల్లును రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : పార్లమెంటు
ఎందుకు : ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పాత నిబంధనలు పునరుద్ధరించడానికి
త్రిపుల్ తలాక్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
త్రిపుల్ తలాక్‌కు సంబంధించి విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతోపాటు మరో రెండు రక్షణలు చేర్చుతూ తెచ్చిన త్రిపుల్ తలాక్ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆగస్టు 9న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం భార్య వాదనలు విన్న తరువాత భర్తకు బెయిల్‌ను మంజూరు చేస్తారు. నిందితుడికి పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ లభించదు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
-గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సుమారు 35 లక్షల టన్నుల పప్పుదినుసులను రాయితీపై రాష్ట్రాలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్ ధర కన్నా కిలోకు రూ.15 తక్కువకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం విక్రయించనుంది.
- ఓబీసీ కులాల ఉపవర్గీకరణకు జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పదవీకాలంను నవంబర్ వరకు పొడిగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్రిపుల్ తలాక్ సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర కేబినెట్
చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌దే: సుప్రీంకోర్టు
చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కే ఉందని, వాటిపై తీర్పులు ఇవ్వడం వరకే న్యాయస్థానాల బాధ్యత అని సుప్రీంకోర్టు ఆగస్టు 9న వ్యాఖ్యానించింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు స్పందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కే ఉంది
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : సుప్రీంకోర్టు
బీసీసీఐకి కొత్త నియమావళి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రూపొందించిన కొత్త నియమావళిని సుప్రీంకోర్టు ఆగస్టు 9న ఆమోదించింది. ఒక రాష్ట్రం- ఒకే ఓటుతోపాటు పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్), ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఏర్పాటు వంటి నియమాలను సరళీకరించింది.
ఒక రాష్ట్రం- ఒకే ఓటు
బీసీసీఐలో శాశ్వత, అనుబంధ అనే రెండు రకాల సంఘాలుండగా ప్రస్తుతం శాశ్వత సంఘాలకు మాత్రమే ఓటు హక్కు ఉంది. అయితే సుప్రీంకోర్టు అనుబంధ సంఘాలకు శాశ్వత హోదా ఇస్తూ, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు సిఫార్సును అమలు చేయాలంది. దీంతో మహారాష్ట్ర (ముంబై, విదర్భ), గుజరాత్ (సౌరాష్ట్ర, బరోడా)లలో ఉన్న మూడేసి సంఘాల్లో కేవలం ఒక సంఘానికే ఓటు హక్కు ఉటుంది. దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజాగా సుప్రీంకోర్టు అన్నింటికీ ఓటుహక్కును కల్పించింది.
పదవుల మధ్య విరామం
రాష్ట్ర సంఘమైనా, బీసీసీఐకైనా ఎన్నికైన ఆఫీస్ బేరర్ పదవికి, పదవికి మధ్య మూడేళ్ల విరామం ఉండాలని లోధా కమిటీ సిఫార్సులు చేయగా సుప్రీం కోర్టు దీనిని ఆరేళ్లకు పెంచింది. ఆఫీస్ బేరర్లు తమ పదవులను అప్రతిహతంగా కొనసాగించడానికి వీలు లేకుండా లోధా కమిటీ సిఫార్సు చేసిన పదవుల మధ్య విరామంను బోర్డు సభ్యులు వ్యతిరేకించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం వరుసగా రెండుసార్లు కొనసాగాక మూడేళ్ల విరామం తీసుకోవాలి.
ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ
బీసీసీఐ బోర్డులో ప్రధానంగా జాతీయ స్థాయిలో మూడు రకాల సెలక్షన్ కమిటీలు ఉన్నాయి. పురుషుల సీనియర్, జూనియర్, మహిళల కమిటీలు ఉండగా ఇందులో ప్రస్తుతం జోనళ్ల వారిగా ఐదుగురు సభ్యులున్నారు. అయితే లోధా కమిటీ ముగ్గురు మాత్రమే సభ్యులుగా ఉండాలని సిఫార్సు చేయగా పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులుండవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. వీరి పదవీకాలాన్ని ఐదేళ్లకు పరిమితం చేసింది.
సీనియర్ కమిటీ సభ్యులు కనీసం ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. లేదంటే పది వన్డేలతో పాటు 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడివుండాలి. జూనియర్ సెలక్టర్లయితే కనీసం 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవముండాలి. మహిళల కమిటీ సెలక్టర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే చాలు.
ఎందుకీ సంస్కరణలు- వాటి నేపథ్యం
2013 ఐపీఎల్ బెట్టింగ్‌పై దర్యాప్తు చేసిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నిందితులను తేల్చింది. అలాగే బోర్డులో సంస్కరణలు చేయాలని సుప్రీం కోర్టుకు సూచించింది. దీంతో 2015 జనవరిలో జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీని కోర్టు నియమించింది. ఈ కమిటీ సూచించిన సిఫార్సులను 2016 జూలైలో సుప్రీంకోర్టు అంగీకరించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని బీసీసీఐని కోర్టు ఆదేశించగా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అభ్యంతరాలను తెలపాలంటూ రాష్ట్ర సంఘాలను కోర్టు కోరింది. ఆయా సంఘాలు తమ నివేదికను ఇవ్వగా ఆగస్టు 9న తుది తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐకి కొత్త నియమావళికి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి
ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జూలై 18న మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 10న ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ 21, రాజ్యసభ 14 బిల్లులకు ఆమోదం తెలపగా, 21 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. లోక్‌సభలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు.
ఈ సమావేశాల్లోనే మొదటిసారిగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు కల్పించారు.
రాజీవ్‌గాంధీ కేసు దోషుల విడుదలకు అంగీకరించం : కేంద్రం
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరిని విడుదల చే స్తే ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని పేర్కొంది. ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు వీరిలో 19 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. 2014, ఫిబ్రవరి 18న మరోసారి ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను యావజ్జీవంగా మార్చింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దుచేసి విడుదల చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజీవ్‌గాంధీ కేసు దోషుల విడుదలకు అంగీకరించబోం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
కాలుష్యం తగ్గిస్తే మరో నాలుగేళ్ల ఆయుష్షు
భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకుంటే ప్రజల సగటు జీవితకాలాన్ని మరో నాలుగేళ్లు పెంచవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు దేశంలో వాయుకాలుష్యంపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను యూనివర్సిటీ ఆఫ్ షికాగో, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కి చెందిన పరిశోధకులు ఆగస్టు 13న విడుదల చేశారు. వాయు కాలుష్యం కారణంగా దేశం ప్రతి ఏటా రూ.35 లక్షల కోట్లు నష్టపోతుందని దేశవ్యాప్తంగా 66 కోట్ల మంది అధిక కాలుష్య ప్రాంతాల్లోనివసిస్తున్నారని నివేదిక తెలిపింది.
ఉద్గారాల పర్యవేక్షణ, కాలుష్యకారకాలపై ప్రజలకు సమాచారం ఇవ్వడం, అదనంగా విడుదలయ్యే ఉద్గారాలపై జరిమానా విధించటం, ఉద్గారాలపై ఎప్పటికప్పడు రెగ్యులేటర్లకు సమాచారం అందించటం, కాలుష్యాన్ని తగ్గించేందుకు యత్నించే పరిశ్రమలపై భారం తగ్గించడం వంటి చర్యల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాలుష్యం తగ్గిస్తే మరో ప్రజలకు నాలుగేళ్ల ఆయుష్షు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ షికాగో, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కి చెందిన పరిశోధకులు
ఎక్కడ : భారత్‌లో
అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా జోధ్‌పూర్
దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నిలిచింది. జోధ్‌పూర్ తర్వాత జైపూర్, తిరుపతి రైల్వే స్టేషన్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే అత్యంత పరిశభ్రమైన రైల్వే జోన్‌గా వాయువ్య రైల్వే (జైపూర్) అగ్రస్థానం కైవసం చేసుకుంది. వాయువ్య రైల్వే జోన్ తర్వాత దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్), తూర్పు తీర రైల్వే (భువనేశ్వర్ )లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు దేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లకు పరిశుభ్రత ఆధారంగా ఏటా ఇచ్చే ‘స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్’ ర్యాంకుల వివరాలను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 13న వెల్లడించారు. దేశంలోని రైల్వేలపై సర్వే చేసి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను రూపొందించింది.
స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్-2018 జాబితా
స్టేషన్ల వారీగా... | ||
ర్యాంకు | కేటగిరి ఏ1 | కేటగిరి ఏ |
1 | జోధ్‌పూర్ | మార్వార్ |
2 | జైపూర్ | పులేరా |
3 | తిరుపతి | వరంగల్ |
4 | విజయవాడ | ఉదయ్‌పూర్ |
5 | ఆన్‌ంద్ విహార్ టెర్మినల్ | జైసల్మేర్ |
6 | సికింద్రాబాద్ | నిజామాబాద్ |
7 | బాంద్రా | బార్మర్ |
8 | హైదరాబాద్ | మంచిర్యాల |
9 | భువనేశ్వర్ | మైసూర్ |
10 | విశాఖపట్నం | భిల్వారా |
|
|
|
జోన్‌ల వారీగా... | ||
ర్యాంకు | జోన్ | ప్రధాన కేంద్రం |
1 | వాయువ్య రైల్వే | జైపూర్ |
2 | దక్షిణ మధ్య రైల్వే | సికింద్రాబాద్ |
3 | తూర్పు తీర రైల్వే | భువనేశ్వర్ |
4 | ఆగ్నేయ మధ్య రైల్వే | బిలాస్‌పూర్ |
5 | పశ్చిమ రైల్వే | ముంబై |
6 | నైరుతి రైల్వే | హుబ్లీ |
7 | దక్షిణ రైల్వే | చెన్నై |
8 | మధ్య రైల్వే | ముంబై |
9 | పశ్చిమ మధ్య రైల్వే | జబల్‌పూర్ |
10 | ఈశాన్య సరిహద్దు రైల్వే | గువహతి |
11 | ఆగ్నేయ రైల్వే | కోల్‌కతా |
12 | ఈశాన్య రైల్వే | గోరఖ్‌పూర్ |
13 | తూర్పు | కోల్‌కతా |
14 | ఉత్తర రైల్వే | న్యూఢిల్లీ |
15 | తూర్పు మధ్య రైల్వే | హాజీపూర్ |
16 | ఉత్తర మధ్య రైల్వే | అలహాబాద్ |
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా జోధ్‌పూర్
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్-2018 జాబితా
అత్యంత నివాస యోగ్యమైన నగరంగా పుణే
దేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పుణే నిలిచింది. పుణే తర్వాత నవీ ముంబై, గ్రేటర్ ముంబై, తిరుపతి నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది. దేశంలోని 111 నగరాలను పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్ 27వ స్థానం సంపాదించగా బెంగళూరు 58వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలోఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంపూర్ చివరి స్థానంలో నిలవగా కోహిమా, పట్నా నగరాలు కూడా అట్టడుగున నిలిచాయి.
సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018
ర్యాంకు | నగరం | రాష్ట్రం |
1 | పుణే | మహారాష్ట్ర |
2 | నవీ ముంబై | మహారాష్ట్ర |
3 | గ్రేటర్ ముంబై | మహారాష్ట్ర |
4 | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ |
5 | చండీఘర్ | కేంద్రపాలిత ప్రాంతం |
6 | థానే | మహారాష్ట్ర |
7 | రాయ్‌పూర్ | ఛత్తీస్‌గఢ్ |
8 | ఇండోర్ | మధ్యప్రదేశ్ |
9 | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ |
10 | భోపాల్ | మధ్యప్రదేశ్ |
106 | ఈటానగర్ | అరుణాచల్‌ప్రదేశ్ |
107 | భాగల్‌పూర్ | బిహార్ |
108 | బిహార్ షరీఫ్ | బిహార్ |
109 | పాట్నా | బిహార్ |
110 | కోహి మా | నాగాలాండ్ |
111 | రాంపూర్ | ఉత్తరప్రదేశ్ |
ఏమిటి : దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా పుణే
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ
ఎక్కడ : సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018
సెప్టెంబర్ 25న ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించనున్నారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ పథ కం ద్వారా మొత్తం 50 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. తొలి విడతలో 10 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ప్రపంచంలోప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్ నిలిచింది.
మరోవైపు మహిళలపై అత్యాచారాలను అణిచివేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ అన్నారు. అలాగే గగన్‌యాన్’లో భాగంగా 2022 నాటికి భారతీయులను అంతరిక్షంలోకి పంపిస్తామని, ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. సైనిక శాశ్వత నియామకాల్లో మహిళలకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వె ల్లడించారు.
మోదీ సుదీర్ఘ ప్రసంగం...
72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 80 నిమిషాలకుపైగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2016లో 96 నిమిషాల పాటు మాట్లాడారు. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడిన ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. 2015 వరకు ఈ రికార్డు మాజీ ప్రధాని జవ హర్‌లాల్ నెహ్రు (1947లో 72 నిమిషాలు) పేరిట ఉండేది.
శ్రీకాకుళంలో చంద్రబాబు...
శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 72వ స్వాతంత్య్ర వేడకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గోల్కొండలో కేసీఆర్...
72వ స్వాతంత్య్ర దినొత్సవం సందర్భంగా గొల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎస్సీ, ఎస్టీ చట్టం పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఈ మేరకు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ప్రకారం దళితులపై దాడులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చే నిబంధనను తొలగించడంతోపాటు నిందితుల అరెస్ట్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరంలేదు. అలాగే కేసు నమోదుకు కూడా ప్రాథమిక విచారణ చేయాల్సిన అవసరం లేదు.
నిందితులకు పలు రక్షణలు కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దుచేస్తూ పాత నిబంధనలను పునరుద్ధరించాలని దళితులు కోరుతున్న నేపథ్యంలో కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కుష్టు వ్యాధి బిల్లుకు ఆమోదం
కుష్టు వ్యాధి సోకిందని భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా ఉండేందుకు కుష్టు వ్యాధి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అధునాతన చికిత్సతో కుష్టును నివారించడం సాధ్యమౌతున్నందున కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత చట్టం ప్రకారం కుష్టు వ్యాధితో బాధపడుతున్న జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ చట్టం పునరుద్ధరణకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర కేబినెట్
దేశంలో 42 శాతం మహిళా అధ్యాపకులు
బోధన రంగంలో 2017-18 నాటికి దేశవ్యాప్తంగా 42 శాతం మహిళా అధ్యాపకులు ఉండగా 58 శాతం మంది పురుషులు ఉన్నారు. ఈ మేరకు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పని చేస్తున్న అధ్యాపకుల సమగ్ర వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆగస్టు 3న వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 12,84,755 మంది అధ్యాపకులు ఉండగా వారిలో 12,68,597 మంది అధ్యాపకుల సమగ్ర వివరాలను ఎంహెచ్‌ఆర్‌డీ సేకరించింది. ఇందులో 7,45,158 మంది పురుషులు 5,39,597 మంది మహిళలు ఉన్నారు.
మహిళా అధ్యాపకుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు
| 2017-18 | 2014-15 | ||
రాష్ట్రం | పురుషులు | మహిళలు | పురుషులు | మహిళలు |
బీహార్ | 79.1 | 20.9 | 82.9 | 17.1 |
జార్ఖండ్ | 70.1 | 29.9 | 74.2 | 25.8 |
ఉత్తరప్రదేశ్ | 67.2 | 32.8 | - | - |
కేరళ | పంజాబ్ | హరియాణా |
చండీగఢ్ | మేఘాలయ | నాగాలాండ్ |
ఢిల్లీ | గోవా |
|
బోధన రంగంలో రిజర్వేషన్ కాకుండా జనరల్ కేటగిరీ అధ్యాపకులు అత్యధికంగా ఉన్నారు. మొత్తం అధ్యాపకుల్లో 56 శాతం జనరల్ కేటగిరీ, 32.3 శాతం బీసీలు, 8.6 శాతం ఎస్సీలు, 2.27 శాతం ఎస్టీలు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో 13.48 శాతం ఎస్సీ అధ్యాపకులు, 1.6 శాతం ఎస్టీ అధ్యాపకులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మహారాష్ట్ర (11.04 శాతం ఎస్సీలు, 0.41 శాతం ఎస్టీలు) రెండో స్థానం, తెలంగాణ (10.77 శాతం ఎస్సీ, 3.4 శాతం ఎస్టీ) మూడో స్థానంలో ఉంది.
అత్యధిక ప్రైవేటు విద్యాసంస్థలు కలిగిన రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా అత్యధిక ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మొదటి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో సగటున 78 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలో ఉండగా తెలంగాణ, ఏపీల్లో 82 శాతం ఉన్నాయి. ఆ తర్వాత 76.2 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అలాగే తక్కువగా చండీగఢ్‌లో 8 శాతం, అసోంలో 12 శాతం ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 42 శాతం మహిళా అధ్యాపకులు
ఎప్పుడు : 2017-18
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు-2018ను లోక్‌సభ ఆగస్టు 6న ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : లోక్‌సభ
ఎన్‌సీబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ (123వ) బిల్లు-2017కు పార్లమెంటు ఆగస్టు 6న ఆమోదం తెలిపింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్‌సీబీసీకి లభించనున్నాయి. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం-1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
రేప్‌లకు ఉరి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆగస్టు 6న మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు జూలై 30న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : పార్లమెంటు
అత్యాచారాలపై సుప్రీంకోర్టు ఆందోళన
ఉత్తర, దక్షిణ, మధ్య భారతం అని తేడా లేకుండా దేశంలోని అన్నిచోట్లా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని సుప్రీం కోర్టు ఆగస్టు 7న తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం రోజుకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మీడియాలో వాడొద్దు
అత్యాచార బాధితుల ఫొటోలను బ్లర్ చేసి గాని, మార్చి గాని, ఏ రూపంలోనూ మీడియాలో వాడొద్దంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలను సుప్రీంకోర్టు ఆగస్టు 7న ఆదేశించింది. అలాగే అత్యాచారానికి గురైన మైనర్ బాధితులను నిపుణులైన కౌన్సిలర్ల సమక్షంలో జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్), రాష్ట్ర బాలల హక్కుల రక్షణ సంఘం (ఎస్‌సీపీసీఆర్) సభ్యులు మాత్రమే ఇంటర్వ్యూ చేయాలని మీడియా ఇంటర్వ్యూ చేయవద్దని పేర్కొంది. ఇంటర్వ్యూ వారి మానసిక ఆరోగ్యం, సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది.
రేప్‌లలో మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ టాప్
ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం మహిళలపై అత్యాచారాలకు సంబంధించి మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో ప్రతీ ఆరు గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోందని వీటికి అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒ వసతి గృహంలో 30 మంది బాలికలపై అత్యాచారం జరిగినట్లు పట్నాకు చెందిన వ్యక్తి సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యాచారాలపై ఆందోళన
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : దేశవ్యాప్తంగా