Skip to main content

మే 2018 అంతర్జాతీయం

అబార్షన్ చట్టాల రద్దు దిశగా ఐర్లాండ్
Current Affairs ఐర్లాండ్‌లో గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని (అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దు) కోరుతూ నిర్వహించిన రిఫరెండంలో 66.4 శాతం మంది అనుకూలంగా, 33.6 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్)కి సంబంధించి కఠిన నిబంధనలున్నాయి. కడుపులో ఉన్న పిండానికి, తల్లికి జీవించే హక్కును ఇక్కడి రాజ్యాంగం సమాన స్థాయిలో కల్పిస్తోంది. తాజా ప్రజాభిప్రాయ సేకరణకు ఐర్లాండ్‌లో భారతీయ మహిళ అయిన సవితా హాలప్పనవర్ (31) మృతి ప్రధాన కారణం కావడం గమనార్హం.

వెనెజులా ఎన్నికల్లో మదురో విజయం
Current Affairs వెనెజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యునెటైడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజులా కి చెందిన నేత నికోలస్ మదురో విజయం సాధించారు. దీంతో ఆయన మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదుకాగా మదురో 58 లక్షలు (68 శాతం) ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్ 18 లక్షల ఓట్లను దక్కించుకున్నారని జాతీయ ఎన్నికల కౌన్సిల్ మే 20న ప్రకటించింది. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
కాగా ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నిక లు సరైన పద్ధతిలో జరగలేదని ఈ ప్రభుత్వాన్ని గుర్తించమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెనిజువెలా ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికలు
ఎప్పుడు : మే 20
ఎవరు : నికోలస్ మదురో

అత్యధిక బిలీయనీర్లు కలిగిన దేశంగా అమెరికా
2027 నాటికి 884 మంది బిలీయనీర్లతో ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా నిలవనుంది. ఈ జాబితాలో 448 మంది బిలియనీర్లతో చైనా 357 మంది బిలియనీర్లతో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే రష్యా సమాఖ్య 142, బ్రిటన్ 113, జర్మనీ 90, హాంగ్‌కాంగ్ 78 మంది బిలీయనర్లతో తర్వాతి స్థానాల్లో నిలవనున్నాయి.
ఈ మేరకు ఏఎఫ్‌ఆర్ ఏసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ఇండియా సంస్థ నిర్వహించిన అద్యయనంలో మే 23న వెల్లడించింది.
ప్రస్తుతం భారత్‌లో 119 మంది బిలీయనీర్లు ఉండగా ప్రపంచవ్యాప్తంగా 2,252 మంది ఉన్నారు. 2027 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,444 మంది బిలీయనీర్లు ఉంటారని ఏఎఫ్‌ఆర్ ఏసియా సంస్థ అంచనా వేసింది. రానున్న పదేళ్లలో భారత్ సంపద 200 శాతం, ప్రపంచ సంపద 50 శాతం పెరిగి 2027 నాటికి మొత్తం ప్రపంచ సంపద 321 ట్రిలియన్లకు చేరుకుంటుందని సంస్థ వెల్లడించింది.
ఒక బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ అమెరికన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తిని బిలియనీర్ అని అంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక బిలీయనీర్లు కలిగిన దేశం
ఎప్పుడు : మే 23
ఎవరు : అమెరికా
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

మలేసియా ప్రధానిగా మహతీర్
Current Affairs మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్ బిన్ మహమ్మద్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో ప్రపంచంలో అత్యంత పెద్ద వయసులో (92 ఏళ్ల వయసులో) ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తం 222 సీట్లున్న పార్లమెంట్‌లో ‘పకటన్ హరపన్’ కూటమికి 113 సీట్లు గెలుచుకోడంతో రాజధానిలోని ఇస్తానా నెగర ప్రాసాదంలో మే 10న మహతీర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బరిసాన్ నేషనల్(బీఎన్) కూటమికి చైర్మన్‌గా ఉన్న సమయంలో 1981-2003 వరకు దాదాపు 22 ఏళ్లపాటు మహతీర్ ప్రధానిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలేసియా ప్రధాని ఎన్నిక
ఎప్పుడు : మే 10
ఎవరు : మహతీర్ బిన్ మహమ్మద్

భారతీయులకు 93 శాతం హెచ్-4 వీసాలు
అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 (స్పౌస్) వీసాలను పొందిన వారిలో అత్యధికంగా 93 శాతం మంది భారతీయులు ఉన్నారు. భారతీయుల తర్వాత 5 శాతం మంది చైనీయులు ఈ వీసాలను పొందారు. ఈ మేరకు అమెరికన్ సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) మే 12న వెల్లడించింది. హెచ్-4 వీసాలు పొందిన వారు కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలో ఎక్కువగా పనిచేస్తున్నారు. 2017, డిసెంబర్ 25 నాటికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 1,26,853 హెచ్-4 వీసా దరఖాస్తులను ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయులకు 93 శాతం హెచ్-4 వీసాలు
ఎప్పుడు : మే 12
ఎవరు : కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్
ఎక్కడ : అమెరికా

అర్మేనియా ప్రధానిగా పషిన్యాన్
అర్మేనియా ప్రధానిగా నికోల్ పషిన్యాన్ ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటులో మే 8న జరిగిన ఎన్నికలో పషిన్యాన్‌కు అనుకూలంగా 59 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా పషిన్యాన్ పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. ఇదే తాజా ఎన్నికలకు కారణం.

కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
ఫేస్‌బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం మే 3న ప్రకటించింది.
8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు అనలిటికాపై ఆరోపణలు వచ్చాయి. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు, భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగులోకి రావడంతో ఆ సంస్థ వివాదాల్లో చిక్కుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
ఎప్పుడు : మే 3
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల

ఉభయ కొరియాల్లో ఒకే ప్రామాణిక సమయం
ఉభయ కొరియా దేశాల్లో ఒకే ప్రామాణిక సమయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని మే 4న 30 నిమిషాలు ముందుకు జరిపింది. ఇటీవల ఉభయ కొరియాల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇరు దేశాల ప్రామాణిక సమయం ఒకేలా ఉండేలా మార్పులు చేస్తామని తెలిపాడు.

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణస్వీకారం
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మే 7న అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్‌లో బాధ్యతలు స్వీకరించిన పుతిన్ 2024 వరకు పదవిలో కొనసాగుతారు. 2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 77 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో జోసెఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువకాలం రష్యా అధ్యక్షుడిగా కొనసాగిన రికార్డు పుతిన్ సొంతం కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మే 7
ఎవరు : వ్లాదిమిర్ పుతిన్
ఎక్కడ : క్రెమ్లిన్ ప్యాలెస్

ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
ఏడు సభ్యదేశాలతో ఏర్పాటైన ఇరాన్ అణు ఒప్పందం నుంచి వెదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 8న ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో వియన్నాలో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ) ఒప్పందం కుదిరింది. అయితే అమెరికాతో సంబంధం లేకుండా ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఫ్రాన్‌‌స, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ, ఇరాన్ లు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
ఎప్పుడు : మే 8
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

బ్రిటన్ హోం మంత్రిగా పాక్ సంతతి వ్యక్తి
Current Affairs బ్రిటన్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి సాజిద్ జావెద్ హోం మంత్రిగా నియమితులయ్యారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపే విషయంలో పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు అంబర్ రూడ్ పదవి నుంచి వైదొలగడంతో ఏప్రిల్ 30న సాజిద్‌ను హోంమంత్రిగా నియమించారు. సాజిద్ 2010 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్నాడు.
పాకిస్తాన్‌కు చెందిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాజిద్ కుటుంబం 1960 ల్లో బ్రిటన్‌కు వలస వచ్చింది. బ్రిటన్ చరిత్రలో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించే మొదటి దక్షిణాసియా వ్యక్తి సాజిదే. ఇప్పటికే పాక్ మూలాలున్న సాదిక్ ఖాన్ లండన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ హోం మంత్రిగా పాక్ సంతతి వ్యక్తి
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : సాజిద్ జావెద్

ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షుల భేటీ
ఉత్తర, దక్షణ కొరియా అధ్యక్షుల చారిత్రక భేటీ ఏప్రిల్ 27న జరిగింది. రెండు దేశాలను వేరు చేసే సైనిక విభజన రేఖ వద్ద ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేసుకున్నారు. అనంతరం కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్‌ను తమ దేశంలోకి ఆహ్వానించారు. తర్వాత ఇద్దరూ కలసి దక్షిణ కొరియాలోకి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. తర్వాత జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడాన్ని ఉమ్మడి లక్ష్యంగా పేర్కొన్నారు.

రష్యాలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రం
రష్యా ‘అకడమిక్ లోమనోసోవ్’ అనే సముద్రంలో తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం కావడం గమనార్హం. దీన్ని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డ్‌లో నిర్మించి.. చుకోట్కా పోర్ట్ ఆఫ్ పెవెక్‌కు తరలిస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఇంధనం నింపి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇది ఉత్పత్తి ప్రారంభిస్తే ఏటా 50 వేల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించొచ్చని అంచనా.
Published date : 23 May 2018 03:25PM

Photo Stories