Skip to main content

మార్చి 2020 అంతర్జాతీయం

కోవిడ్ కట్టడికి స్వచ్ఛంద యుద్ధం: యూనిసెఫ్
Current Affairs
కోవిడ్-19 నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధ వీరులు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రెడ్‌క్రాస్ సొసైటీలు పిలుపునిచ్చాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆ తర్వాతి స్థాయిల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇతరులకు దీనిపై అవగాహన కల్పించాలని కోరాయి. ఈ మేరకు మార్చి 19న 13 పేజీల బులెటిన్‌ను విడుదల చేశాయి. శుభ్రత, అవగాహన, విసృ్తత ప్రచారం, స్వచ్ఛంద సేవ ద్వారా ప్రపంచాన్ని కరోనా గండం నుంచి బయటపడేసే బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని పేర్కొన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్ కట్టడికి విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రెడ్‌క్రాస్ సొసైటీ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

కోవిడ్-19 ఫండ్‌కు నేపాల్ 10 లక్షల డాలర్లు విరాళం
సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు నేపాల్ ప్రభుత్వం సుమారు 10 లక్షల డాలర్ల(10 కోట్ల నేపాలీ రూపాయలు) విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు సార్క్ దేశాలు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చలు
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. మార్చి 20న వీడియో లింక్ ద్వారా జరిపిన ఈ చర్చలు సందర్భంగా మోదీ మాట్లాడుతూ... కరోనా కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రులకు సూచించారు. చర్చల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు 10 లక్షల డాలర్ల విరాళం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : నేపాల్ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్‌పై పోరుకు

క్రొయేసియాలో భారీ భూకంపం
క్రొయేసియాను భారీ భూకంపం కుదిపేసింది. దేశ రాజధాని జగ్రెబ్‌లో మార్చి 22న సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అలాగే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ‘రిక్టరు స్కేలుపై 5.3 తీవ్రతతో జగ్రెబ్‌లో మార్చి 22న ఉదయం 6.23 గంటలకు భూకంపం సంభవించింది. 140 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం’ అని ఆ దేశ ప్రధాని అంద్రేజ్ ప్లెన్‌కోవిక్ తెలిపారు. కరోనా కారణంగా జగ్రెబ్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు.
కోవిడ్ మరణాలు 13 వేలు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,130 మందికి వ్యాధి సోకగా మార్చి 22న ఒక్కరోజే 1,702 మృతి చెందడంతో మొత్తం మరణాలు 13,444కు చేరుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రొయేసియాలో భారీ భూకంపం
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : జగ్రెబ్, క్రొయేసియా

కరోనా ఫండ్‌కు అఫ్గాన్ మిలియన్ డాలర్ల విరాళం
సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు అఫ్గాన్ ప్రభుత్వం ఒక మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించింది. అలాగే మాల్దీవుల ప్రభుత్వం రెండు లక్షల డాలర్ల నిధులు విరాళంగా ప్రకటించింది. కరోనాపై పోరుకు సార్క్ దేశాలు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
క్వారంటైన్లుగా సాయ్ సెంటర్లు: కేంద్ర క్రీడా శాఖ
కోవిడ్-19 ప్రభావంతో ఖాళీ అయిన భారత స్పోర్‌‌ట్స అథారిటీ (సాయ్) కేంద్రాలను కరోనా అనుమానిత, బాధిత కేసులకు క్వారంటైన్లుగా (నిర్బంధ వసతులు) వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ‘సాయ్’ రీజినల్ సెంటర్లు, స్టేడియాలు, హాస్టళ్లను క్వారంటైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు ఒక మిలియన్ డాలర్ల విరాళం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : అఫ్గాన్ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్-19పై పోరుకు

అఫ్గానిస్తాన్‌లో గురుద్వారాపై దాడి
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న ఓ గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేశారు. మార్చి 25న జరిగిన ఈ ఘటనలో 25 మంది మరణించగా, 8 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అఫ్గాన్ బలగాలు గురుద్వారా వద్దకు వచ్చి దాదాపు 80 మంది మహిళలు, పిల్లలను కాపాడారు. ఉగ్రవాదులు చేసిన ఈ దుశ్చర్యను అఫ్గాన్ దేశాధినేతలతో పాటు భారత ప్రధాని మోదీ కూడా ఖండించారు.

 

కరోనా కోసం 2 బిలియన్ డాలర్ల నిధి : ఐక్యరాజ్య సమితి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించింది. ‘ఊహించని ముప్పును ప్రపంచం ఎదుర్కొంటోంది. కోట్లాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. ఇది ప్రపంచ మానవాళి అంతటికీ ఎదురైన సమస్య. కాబట్టి మానవాళి అంతా కలసి దీంతో పోరాడాలి. దీని కోసం మేము రెండు బిలియన్ డాలర్ల ప్రపంచ మానవత్వ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలోని పేద దేశాలకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే పెనుముప్పుగా మారుతుంది. అన్ని దేశాలకు మేము చెప్పేది ఒక్కటే. ఈ హెచ్చరికను ఆలకించండి’ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.


కోవిడ్
-19పై పోరుకు 5 ట్రిలియన్ డాలర్లు సాయం
కోవిడ్-19పై ప్రపంచదేశాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జీ-20 దేశాలు 5 ట్రిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఈ నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు సల్మాన్ అధ్యక్షతన మార్చి 26న జీ-20 దేశాల అత్యవసర వీడియోకాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జీ-20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉమ్మడి సంక్షోభంపై ఐక్యంగా పోరాడతామని పేర్కొన్నాయి.
సరైన విధానం రూపొందించాలి: మోదీ
జీ-20 దేశాల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... కోవిడ్ తరహా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన నియమావళి, విధానాల రూపకల్పనపై దృష్టి సారించాలని జీ-20 దేశాలను కోరారు. సమయంలో ఆర్థిక లక్ష్యాలు కాకుండా మానవతా దృక్పథంతో అంతర్జాతీయ సమన్వయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు కృషి చేయాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5 ట్రిలియన్ డాలర్లు సాయం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : జీ-20 దేశాలు
ఎందుకు : కోవిడ్-19పై పోరుకు

కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ
Current Affairs
దాదాపు 125 దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్-19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్చి 11న ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రెస్ అధానొమ్ గెబ్రియేసుస్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు.
భారత ప్రధానికి బ్రిటన్ పీఎం ఫోన్‌కాల్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మార్చి 12న భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కరోనా వైరస్ విసృ్తతిని అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు కలసికట్టుగా తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు.
యూరప్ దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్
కరోనా కల్లోలం నేపథ్యంలో యూకే మినహా ఇతర యూరప్ దేశాల నుంచి అమెరికాలోకి ఎవరూ అడుగుపెట్టవద్దని మార్చి 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 13 నుంచి 30 రోజుల పాటు యూకేయేతర యూరప్ దేశాల వారిపై ఈ నిషేధం ఉంటుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్-19 ప్రపంచవ్యాప్త మహమ్మారి
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : దాదాపు 125 దేశాల్లో వేగంగా విస్తరించినందున

కోవిడ్‌పై ఉమ్మడిగా పోరాడదాం: భారత ప్రధాని
కోవిడ్-19 కట్టడికి కలసికట్టుగా పోరాటం చేద్దామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం సభ్య దేశాలు ఉమ్మడిగా బలమైన వ్యూహాన్ని రచించాలని మార్చి 13న ట్వీట్ చేశారు. ఆ ప్రణాళిక ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ ప్రతిపాదనలను శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్, నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ స్వాగతించారు.

దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలి(SAARC)
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియాహుర్ రెహ్మాన్ సార్‌‌కను మొదట ప్రతిపాదించారు. ఆర్థికంగా సాంఘికంగా, సాంస్కృతిక రంగాల్లో కలిసి కట్టుగా అభివృద్ధి సాధించడానికి దక్షిణాసియాలో ఒక స్వతంత్ర సంస్థ ఉండాలని సూచిచారు. వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, ఆర్థికంగా, పేదరిక నిర్మూలన, ప్రజల మధ్య సత్సంబంధాలు, పర్యాటక రంగాలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్ వంటి దాదాపు 16 విభాగాల్లో పరస్పర సహకారం అందించుకోవడానికి భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు 1985 డిసెంబర్ 8న సార్‌‌కను ఏర్పరుచుకొన్నాయి. 2005లో అఫ్గనిస్తాన్ సభ్యత్వం తీసుకోడంతో సార్క్ సభ్యదేశాల సంఖ్య 8కి చేరింది. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది.
దక్షిణాసియ దేశాల ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచడం, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో అభివృద్ధి సాధించడ ద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో జీవన ప్రమాణం కలిగి ఉండటం కోసం సార్‌‌క కృషి చేస్తుంది.

కోవిడ్‌పై పోరుకు సార్క్ అత్యవసర నిధి ఏర్పాటు
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19(కరోనా వైరస్)పై యుద్ధానికి సార్క్ దేశాలు నడుం బిగించాయి. కరోనాను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు సార్క్ దేశాల నేతలు మార్చి 15న వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు. కరోనాపై పోరుకు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపారు. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు. ‘మన దేశాల్లో మొత్తంగా 150 కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. అయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని హెచ్చరించారు.
వీడియో కాన్ఫెరెన్స్ లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, పాకిస్తాన్ ప్రధానికి ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారు జాఫర్ మీర్జా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్‌పై పోరుకు సార్క్ అత్యవసర నిధి ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : కోవిడ్ 19 విజృంభణ కారణంగా

85 కోట్ల మంది విద్యాలయాలకు దూరం: యునెస్కో
కోవిడ్-19 ప్రభావంతో ప్రపంచంలోని విద్యార్థి జనాభాలో దాదాపు 85 కోట్ల మంది విద్యాలయాలకు దూరమయినట్లు యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజషన్ (యునెస్కో) మార్చి 18న వెల్లడించింది. కరోనా వైరస్ కనీవినీ ఎరుగని పెను సవాలు అంటూ పేర్కొంది. మరోవైపు బడుల మూసివేత నేపథ్యంలో విద్యార్థులకు ‘స్వయంప్రభ డీటీహెచ్’ ఛానళ్ల ద్వారా ఈ-తరగతులను ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం తెలిపింది.
భారత సైన్యంలో తొలి కేసు నమోదు
భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మార్చి 18 నాటికి 158కి చేరింది. మార్చి 17 నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది.
ఎనిమిది వేల మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. మార్చి 18 ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు. మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ దాటింది. కోవిడ్‌తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్‌లో 3,422 మంది మరణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 85 కోట్ల మంది విద్యాలయాలకు దూరం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజషన్ (యునెస్కో)
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్-19 ప్రభావంతో

అత్యధిక సంపద కలిగిన నగరంగా న్యూయార్క్
Current Affairs ఫ్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరంగా అమెరికాలోని న్యూయార్క్ నిలిచిందని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్, పారిస్ నగరాలు ఉన్నాయని పేర్కొంది. భారత్ నుంచి ముంబై 44వ స్థానంలో, ఢిల్లీ 58, బెంగళూరు 89వ స్థానంలో ఉన్నామని వివరించింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్-2020 పేరుతో మార్చి 5న ఒక నివేదిక విడుదల చేసింది.
నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌లోని అంశాలు
  • 2024 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంపద కలిగిన కేంద్రంగా ఆసియా నిలుస్తుంది.. ఐదేళ్ల వృద్ధి అంచనా 44 శాతం ఉంటుంది.
  • ఆసియాలో చూస్తే.. 73 శాతం వృద్ధితో ఇండియా మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో 64 శాతంతో వియత్నాం, 58 శాతంతో చైనా, 57 శాతం వృద్ధితో ఇండోనేషియా దేశాలుంటాయి.
  • ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య వేగంగా పెరుగుతోంది.
  • ప్రస్తుతం భారత్‌లో 5,986లుగా ఉన్న యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య.. 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,354లకు చేరుతుంది. రూ.220 కోట్లకు పైగా నికర సంపద ఉన్న వాళ్లని యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా పరిగణించారు.
  • ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అల్ట్రా శ్రీమంతులున్న దేశం అమెరికా. ఇక్కడ 2,40,575 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలుంటే.. చైనాలో 61,587 మంది, జర్మనీలో 23,078 మంది ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక సంపద కలిగిన నగరంగా న్యూయార్క్
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్
ఎక్కడ : ప్రపంచంలో

29 కోట్ల మంది పిల్లలు బడికి దూరం: యునెస్కో
కోవిడ్ -19 (కరోనా వైరస్) ప్రభావంతో మొత్తంగా 13 దేశ్లాలో 29 కోట్ల మంది పిల్లలు బడికి దూరమయ్యారని యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజషన్ (యునెస్కో) మార్చి 6న వెల్లడించింది. పిల్లలకి వైరస్ సోకకుండా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కోట్లాదిమంది చదువులపై ప్రభావం చూపించిందని తెలిపింది. ఆరోగ్యపరంగా ఇలా బడికి సెలవులు ఇవ్వడం సాధారణమే అయినా ఎక్కువ కాలం కొనసాగితే విద్యాహక్కుకి భంగం వాటిల్లుతుందని యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే అన్నారు.
పకడ్బందీ చర్యలు అవసరం: డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇంచుమించుగా లక్షకి చేరుకుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ మార్చి 6న హెచ్చరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 13 దేశ్లాలో 29 కోట్ల మంది పిల్లలు బడికి దూరం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజషన్ (యునెస్కో)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్ -19 (కరోనా వైరస్) ప్రభావంతో

అఫ్గాన్ అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు
అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, అతడి మాజీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య విబేధాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. మార్చి 9న ఘనీ, అబ్దుల్లాలు తామే అధ్యక్షులం అంటూ ప్రమాణ స్వీకారోత్సవాలు జరుపుకున్నారు. దశాబ్దకాలం యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి నిష్ర్కమిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి.
2019, సెప్టెంబరులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. అయితే ఘనీ, అబ్దుల్లా వర్గాలు రెండు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపణలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఫలితాల వెల్లడిలో ఆలస్యమైంది. చివరకు 2020, ఫిబ్రవరిలో ఘనీ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఘనీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలను అబ్దుల్లా అబ్దుల్లా ఖాతరు చేయలేదు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సరిహద్దులను కాపాడతానని ప్రమాణం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఫ్గాన్ అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : అష్రాఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దులా

హజ్ యాత్రపై కోవిడ్ వైరస్ ప్రభావం
Current Affairs
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ 19 వైరస్ ప్రభావం హజ్ యాత్రపై పడింది. కోవిడ్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని 2020 ఏడాది జరగబోయే హజ్ యాత్రకు అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ ఫిబ్రవరి 27న తెలిపింది. వారిని మక్కాలోకి అనుమతించబోమని పేర్కొంది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని వివరించింది. అయితే ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై మాత్రం సౌదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

అమెరికా- తాలిబన్ మధ్య శాంతి ఒప్పందం
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు దారులు తెరుచుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఫిబ్రవరి 29న ఖతార్ రాజధాని దోహాలోని ఓ హోటల్‌లో ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్‌జాద్, తాలిబన్ నేత ముల్లా బరాదర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమానికి భారత్, పాక్ సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
భారత్ నంచి కుమరన్...
అఫ్గాన్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న భారత్, మొదటిసారిగా దోహా చర్చలకు తన రాయబారి పి.కుమరన్‌ను పంపింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా కూడా అఫ్గాన్‌లో రెండు రోజులు(ఫిబ్రవరి 28,29) పర్యటించారు.
శాంతి ఒప్పందం ప్రకారం..
  • ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న 13 వేల మంది తమ సైనికులను వచ్చే 3-4 నెలల్లో 8,600కు అమెరికా తగ్గించుకోనుంది. మిగతా బలగాలను కూడా 14 నెలల్లో దఫాలుగా ఉపసంహరించు కుంటుంది. అయితే, ఒప్పందంలో అంగీకరించిన షరతులను తాలిబన్లు అమలు చేసే తీరును బట్టి మాత్రమే ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.
  • తాలిబన్లు అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలపై అఫ్గాన్ కేంద్రంగా చేసుకుని ఎలాంటి దాడులకు ప్రయత్నించరాదు.
  • అఫ్గాన్ ప్రభుత్వ జైళ్లలో ఉన్న సుమారు 5 వేల మంది తాలిబన్లను విడుదల చేయాలి.
  • తాలిబన్, అఫ్గాన్ ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా దోహాలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలోని అంశాల అమలుకు ఈ విభాగమే జవాబుదారీగా ఉంటుంది.
మార్చి 10న ఓస్లో చర్చలు..
2020, మార్చి 10వ తేదీ నుంచి నార్వే రాజధాని ఓస్లోలో జరిగే చర్చల్లో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్, ఇతర గ్రూపులు, మహిళా ప్రతినిధులు ముఖాముఖి పాల్గొననున్నారు. 2001 తర్వాత తాలిబన్లతో అఫ్గాన్‌లోని ఎన్నికై న ప్రభుత్వం చర్చలు జరపడం ఇదే ప్రథమం కానుంది. చర్చల్లో అమెరికా ప్రతినిధులు ఉన్నప్పటికీ అఫ్గాన్ పక్షాల మధ్య చర్చలు సాగేందుకు సాయపడటమే వారి లక్ష్యంగా ఉండనుంది.
తాలిబన్లను విడుదల చేయం: ఘనీ
అమెరికా-తాలిబన్ల శాంతి ఒప్పందంపై మార్చి 1న అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ స్పందించారు. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని తేల్చి చెప్పారు. ఓస్లో చర్చల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని స్పష్టం చేశారు. అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని ప్రశ్నించారు.

శ్రీలంక పార్లమెంటు రద్దు
శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు మార్చి 2న ప్రకటించారు. పార్లమెంట్‌కు 2020, ఏప్రిల్ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2020, మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే గొతబయ ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక పార్లమెంటు రద్దు
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స

లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానం
ఐరోపా దేశమైన లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానంను ప్రవేశపెట్టారు. 2020, ఫిబ్రవరి 29 నుంచి లక్సంబర్గ్‌లో ఉచిత ప్రజా రవాణా అమల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా లక్సంబర్గ్ నిలిచింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2018, డిసెంబర్ 6న లక్సంబర్గ్ ప్రభుత్వం ఉచిత రవాణా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తాజాగా అమల్లోకి వచ్చింది. 2013లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉచిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజా రవాణా ఉచితం చేయడం వల్ల ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమల్లోకి ఉచిత ప్రజా రవాణా విధానం
ఎప్పుడు : ఫిబ్రవరి 29
ఎవరు : లక్సంబర్గ్ ప్రభుత్వం
ఎక్కడ : లక్సంబర్గ్
ఎందుకు : వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు

తాలిబన్ అగ్రనేత బరాదర్‌తో ట్రంప్ చర్చలు
తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 4న ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా మార్చి 4న తాలిబన్‌పై వైమానిక దాడులకు దిగడంతో 2020, మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్‌లో వైమానిక దాడులు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో ఫోన్‌లో చర్చలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు

Published date : 10 Apr 2020 04:00PM

Photo Stories