Skip to main content

జూన్ 2018 అంతర్జాతీయం

యూఎన్ హెచ్‌ఆర్సీ నుంచి వైదొలిగిన అమెరికా
Current Affairs ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్-హెచ్‌ఆర్సీ) నుంచి అమెరికా జూన్ 20న వైదొలిగింది. హెచ్‌ఆర్సీ ఇజ్రాయెల్‌పై పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రాయబారి నిక్కీహేలీ, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. తాజాగా మెక్సికో అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం సరైంది కాదని యూఎన్-హెచ్‌ఆర్సీ పేర్కొంది. దీంతో ట్రంప్ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తుందని ఆరోపిస్తూ అమెరికా ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నుంచి 2017లో బయటకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఏర్పడిన యూఎన్ హెచ్‌ఆర్సీలో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్-హెచ్‌ఆర్సీ నుంచి వైదొలిగిన దేశం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : అమెరికా
ఎందుకు : ఇజ్రాయెల్‌పై యూఎన్-హెచ్‌ఆర్సీ పక్షపాత వైఖరిని అవలంబిస్తుందని ఆరోపిస్తూ

ముగిసిన గ్రీస్ సంక్షోభం
ఎనిమిదేళ్లుగా బెయిలవుట్ ప్యాకేజీలపై నెగ్గుకొస్తున్న గ్రీస్ సంక్షోభం నుంచి గట్టెక్కనుంది. ఈ మేరకు రుణాల చెల్లింపుపై గ్రీస్‌తో ఒప్పందం కుదిరిందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. దీంతో రుణాల చెల్లింపు గడువును 10 ఏళ్లు పొడిగించడంతో పాటు మరో 15 బిలియన్ యూరోలు గ్రీస్‌కు అందనున్నాయి.
ఒప్పంద షరతుల కింద 2019లో పింఛన్లలో కోత విధించడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని తగ్గించేందుకు గ్రీస్ అంగీకరించింది. 2010 నుంచి గ్రీస్ 273.7 బిలియన్ యూరోల మేర నిధులను బెయిలవుట్ కింద పొందింది. ఈ సంక్షోభం ధాటికి గీస్‌లో 4 ప్రభుత్వాలు మారాయి. ఎకానమీ 25% క్షీణించింది. నిరుద్యోగిత 20% పెరిగింది.

సౌదీలో మహిళల డ్రైవింగ్ ఉత్తర్వులు అమలు
సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో మహిళలు జూన్ 24న వాహనాలతో రోడ్లపైకొచ్చారు. కార్లతో సందడి చేస్తూ, సంబరాలు చేసుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేశాడు. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి రావడంతో మహిళందరు రోడ్లపై వాహనాలతో కన్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీలో మహిళల డ్రైవింగ్ ఉత్తర్వులు అమలు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయడంతో

టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగన్ గెలుపు

టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ అభ్యర్థి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ (64) మరోసారి విజయం సాధించారు. జూన్ 24 న జరిగిన ఓట్ల లెక్కింపులో ఎర్డోగన్‌కు 52.5 శాతం, ఆయన ప్రత్యర్థి ముహర్రెమ్ ఇన్సేకు 30.6 శాతం ఓట్లు దక్కాయి. తాజా ఫలితాలతో ఎర్డోగన్ మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
అధ్యక్ష ఎన్నికలతో పాటు 600 సీట్లున్న టర్కీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఎర్డోగన్‌కు చెందిన ఏకేపీ పార్టీ 293 స్థానాలను దక్కించుకోగా, మిత్రపక్షం ఎంహెచ్‌పీ 50 సీట్లు గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టర్కీ అధ్యక్ష ఎన్నికలు 2018
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్
ఎక్కడ : టర్కీ

జర్మనీలో ప్రపంచ ఆహార సదస్సు-2018
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ప్రపంచ ఆహార సదస్సు-2018ను జూన్ 26న నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేశవులు, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రి జూలియా క్లోవిక్నర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎద్దుమైలారంలో 100 ఎకరాల్లో సీడ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి సహాకారం అందిస్తామని, అలాగే గ్లోబల్ సీడ్ అడ్వయిజరీ బాడీ, ఇండో-జర్మన్ నాలెడ్‌‌జ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు జర్మనీ-తెలంగాణ మధ్య ఉన్న ఇండో-జర్మన్ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగిస్తున్నామని క్లోవిక్నర్ అన్నారు.
2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ విత్తన పరిశోధన సంస్థ కాంగ్రెస్‌కు హాజరుకావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్లోవిక్నర్‌కు లేఖ పంపారు. ఆసియాలోనే మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పలు దేశాల నుంచి విత్తన నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జర్మనీలో ప్రపంచ ఆహార సదస్సు-2018
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేశవులు, ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్
ఎక్కడ : బెర్లిన్, జర్మనీ

అమెరికా వలసల చట్టానికి సుప్రీంకోర్టు ఆమోదం
అమెరికాలోకి పలు ముస్లిం దేశాల నుంచి ప్రవేశాన్ని నిషేధిస్తూ 2017లో తీసుకొచ్చిన వలసల నియంత్రణ చట్టంను ఆ దేశ సుప్రీం కోర్టు ఆమోదిస్తూ జూన్ 26న తీర్పునిచ్చింది. ఈ మేరకు ముస్లింల పట్ల వివక్ష చూపుతున్న ఈ ఉత్తర్వును రద్దు చేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. వలసల్ని నియంత్రించేందుకు అధ్యక్షుడికి తగిన అధికారముందని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్‌‌ట్స పేర్కొన్నారు.
2017 సెప్టెంబర్‌లో చాడ్, ఇరాన్, ఇరాక్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమెన్ పౌరుల రాకపై అమెరికా నిషేధం విధించింది. అనంతరం ఈ జాబితా నుంచి చాడ్, ఇరాక్‌లను తొలగించింది. దీంతో పలువురు కింది కోర్టుల్ని ఆశ్రయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా వలసల నియంత్రణ చట్టానికి ఆమోదం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : అమెరికా
ఎందుకు : వలసల్ని నియంత్రించేందుకు అధ్యక్షుడికి అధికారముందని

కుటుంబాలు కలుసుకునేందుకు ఉభయ కొరియాల అంగీకారం
1950-53లో జరిగిన కొరియా యుద్ధం వల్ల దూరమైన కుటుంబాలు తిరిగి కలుసుకోవడానికి ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు జూన్ 22న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరువైపులా 100 మందిని ఎంపిక చేసి ఆగస్టులో కలుసుకోవడానికి అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొన్నాయి. ఎంపికైన వారు తమ బంధువులతో 3 రోజులు గడిపేందుకు సమయమివ్వనున్నారు. విడిపోయిన తమ బంధువులను కలుసుకోవడానికి ద.కొరియాలో 57 వేల మంది రెడ్ క్రాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు.

వీడియో గేమ్స్ కూడా జూదం లాంటివే: డబ్ల్యూహెచ్‌వో
Current Affairs వీడియో గేమ్స్ కూడా కొకైన్, జూదం లాంటివే అని ప్రజలు వీటికి బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఈ మేరకు అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను జూన్ 18న విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్ డిజార్డర్’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డెరైక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు. దీంతో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జాబితాలో మార్పులు చేశారు. వీడియోగేమ్‌ను వదల్లేకపోవడం, తిండీతిప్పలు గుర్తురాకపోవడం, నిద్రపోకపోవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలుగా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వీడియో గేమ్ వ్యసనాన్ని ఓ వ్యాధిగా గుర్తించాలని గత జనవరిలోనే ఆ సంస్థ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వీడియో గేమ్స్ కూడా జూదం లాంటివే
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ప్రపంచ ఆరోగ్యసంస్థ
ఎందుకు : ప్రజలు వీటికి బానిసలుగా మారే ప్రమాదమున్నందున

ఆస్తానాలో 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు
కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు జూన్ 19న ప్రారంభమైంది. జూన్ 22 వరకు జరగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొనగా భారత్ నుంచి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌తోపాటు కోలిండియా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎండీసీ వంటి మైనింగ్ సంస్థల నుంచి సుమారు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
సదుస్సులో భాగంగా తొలిరోజు ‘భూగర్భ మైనింగ్-పెట్టుబడులకు అవకాశాలు, కొత్త టెక్నాలజీ’, బొగ్గు నుంచి ఇంధనం తయారీ, బొగ్గు వినియోగం, కజకిస్తాన్‌లో మైనింగ్, భూగర్భ బొగ్గు గనుల్లో అత్యాధునిక లాంగ్ వాల్ గేట్ రోడ్ సపోర్టు, బొగ్గు ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి వంటి అంశాలపై చర్చించారు. అలాగే 2030 నాటికి ప్రపంచ జనాభాకు కావాల్సిన ఖనిజాలను అందుబాటులో ఉంచడం, డిజిటలైజేషన్ 4 జీన్సు వంటి కీలకాంశాలపై ప్రపంచ మైనింగ్ మేధావులు తమ విశ్లేషణలు సమర్పించారు. తదుపరి కోల్ మైనింగ్ కాంగ్రెస్‌ను 2021లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 25వ ప్రపంచ మైనింగ్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : సింగరేణి ఎండీ శ్రీధర్ హాజరు
ఎక్కడ : ఆస్తానా, కజకిస్తాన్

చైనా పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. అణు నిరాయుధీకరణలో భాగంగా తదుపరి కార్యాచరణపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు కిమ్ జూన్ 19న చైనా వచ్చారు. 2017 మార్చి నుంచి కిమ్ చైనాలో పర్యటించడం మూడోసారి. అయితే గత రెండు పర్యటనలు రహస్యంగా సాగగా, ఈసారి కిమ్ అధికారికంగా పర్యటించారు.
ఇటీవల సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయి్య కొరియాలో అణు నిరాయుధీకరణకు కిమ్ అంగీకరించాడు. మరోవైపు చైనా వస్తువులపై అమెరికా, అమెరికా వస్తువులపై చైనా దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తర కొరియా అధినేత చైనా పర్యటన
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : కిమ్ జోంగ్ ఉన్
ఎందుకు : అణు నిరాయుధీకరణ అంశంపై చైనాతో చర్చించేందుకు

ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బిజోస్
ఫోర్బ్స్ 2018 ప్రపంచ కుబేరుడిగా 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బిజోస్ నిలిచాడు. అలాగే అమెరికాలోని అతిపెద్ద కంపెనీల్లో 177.87 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు టాప్ 100 బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ జూన్ 18న విడుదల చేసింది. జూన్ 1 నుంచి బిజోస్ సంపద దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ జాబితాలో 92.9 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానం, 82.2 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. 40.1 బిలియన్ డాలర్లతో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 19వ స్థానం, 18.8 బిలియన్ డాలర్లతో అజీమ్ ప్రేమ్ జీ 58వ స్థానం, 18.5 బిలియన్ డాలర్లతో లక్ష్మీ మిట్టల్ 62వ స్థానం, 14.6 బిలియన్ డాలర్లతో శివ నాడర్ 98వ స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా 2018
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : జెఫ్ బిజోస్

గ్రీన్‌కార్డ్ కోసం నిరీక్షిస్తున్న వారిలో అధికశాతం భారతీయులే
Current Affairs అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవడానికి ఇచ్చే గ్రీన్‌కార్డ్ కోసం నిరీక్షిస్తున్న వారిలో అత్యధికంగా 75 శాతం మంది భారతీయులు ఉన్నారు. భారత్ తర్వాత 67,031 మందితో చైనా రెండో స్థానంలో ఉండగా 7,252 మందితో ఎల్ సాల్వడార్, 6,027 మందితో గ్వాటెమాలా, 5,402 మందితో హోండురస్, 1,491 మందితో ఫిలిప్పైన్స్ దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) జూన్ 7న వెల్లడించింది.
2018 మే నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తుండగా వారిలో 3,06,601 మంది భారతీయులు ఉన్నారు. అమెరికా చట్టాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశానికి ఏడు శాతం కంటే ఎక్కువ గ్రీన్‌కార్డులు జారీ చేయకూడదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధికంగా గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారు
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : భారతీయులు
ఎక్కడ : అమెరికా
ఎందుకు : శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు

ఐరాస భద్రతా మండలి ఎన్నికలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాల ఎంపికకు జూన్ 8న ఎన్నికలు జరిగాయి. మొత్తం 193 సభ్యదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 184 ఓట్లతో జర్మనీ, డొమినికన్ రిపబ్లిక్‌లు, 183 ఓట్లతో దక్షిణాఫ్రికా, 181 ఓట్లతో బెల్జియం, 144 ఓట్లతో ఇండోనేషియా ఎన్నికయ్యాయి. దీంతో ఈ దేశాలు రెండేళ్ల పాటు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలుగా కొనసాగుతాయి. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలతో పాటు మరో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాల ఎన్నిక
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : జర్మనీ, డొమినికన్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, బెల్జియం, ఇండోనేషియా

చైనాలో 18వ ఎస్‌సీవో సదస్సు
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 18వ సదస్సు చైనాలోని క్వింగ్‌డావ్‌లో జూన్ 9 నుంచి 10 వరకు జరిగింది. ఈ సదస్సులో ఎస్‌సీవో సభ్యదేశాలైన భారత్, చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యదేశాలన్నీ చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ)కు ఆమోదం తెలపగా ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సదస్సులో ప్రసంగించిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారత్, పాక్‌లు ఎస్‌సీవోలో శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని, మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించి ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని పెంపోందించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్‌సీవో డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ కూటమిలో 2005 నుంచి పరిశీలక హోదా కలిగిన భారత్ పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చిన తర్వాత పాల్గొన్న తొలి సమావేశం ఇది.
సదస్సుకు ముందు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక బంధాలపై చర్చలు జరిపారు. బ్రహ్మపుత్ర నదిపై సమాచార మార్పిడి, బియ్యం ఎగుమతులు వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదే విధంగా ఎస్‌సీవో సెక్రటరీ జనరల్ రశీద్ అలిమోవ్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్, తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలీ రెహమాన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజింగ్‌లోని ఎస్‌సీవో ప్రధాన కార్యాలయంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని రశీద్ చెప్పారు.
బీఆర్‌ఐ అనగా...
ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చే శామని చైనా వెల్లడించింది. బీఆర్‌ఐలో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ను పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా నిర్మిస్తున్నారు. వివాదాస్పదమైన జమ్మూ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ దీనిని వ్యతిరేకిస్తుంది.

కెనడాలో జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు

జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు కెనడాలోని క్యూబెక్‌లో జూన్ 8 నుంచి 9 వరకు జరిగింది. ఈ సదస్సుకు కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వం వహించారు. ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచడం, వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ అణు ఒప్పందం వంటి అంశాలపై సభ్యదేశాధినేతలు సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా తిరస్కరించింది. 2014లో క్రిమియాను ఆక్రమించినందుకు రష్యాను జీ-8 కూటమి నుంచి తొలగించడంతో జీ-7గా మారింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు
ఎప్పుడు : జూన్ 8-9
ఎవరు : కెనడా ప్రధాని ట్రుడో
ఎక్కడ : క్యూబెక్, కెనడా

జోర్డాన్‌కు లక్షన్నర కోట్ల సాయం
కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జోర్డాన్ దేశానికి కువైట్, సౌదీ అరేబియా, అరబ్ దేశాలు కలిసి సుమారు రూ. లక్షన్నర కోట్ల సాయాన్ని అందించాయి. ఈ మేరకు ఆర్థిక సహాయంను జోర్డాన్ సెంట్రల్ బ్యాంక్‌కి జూన్ 11న బదిలీ చేశాయి. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు అబ్దులా-2 మాట్లాడుతూ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జోర్డాన్‌లో ఆర్థిక పురోగతి, అభివృద్ధి పథకాల కోసం ఈ డబ్బును ఉపయోగించనున్నారు. నైరుతి ఆసియాలో సిరియా ఎడారి దక్షిణ భాగం నుంచి అకాబా వరకు విస్తరించి ఉన్న జోర్డాన్ ఎక్కువ భాగం ఎడారితో నిండి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జోర్డాన్‌కు రూ. లక్షన్నర కోట్ల సాయం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : కువైట్, సౌదీ అరేబియా, అరబ్
ఎందుకు : ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నందుకు

ట్రంప్, కిమ్‌ల మధ్య శిఖరాగ్ర సదస్సు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య శిఖరాగ్ర సదస్సు సింగపూర్‌లోని (సెంటోసా ద్వీపం) కెపెల్లా హోటల్‌లో జూన్ 12న జరిగింది. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ లక్ష్యంగా ఈ సదస్సులో ఇరు దేశాధినేతలు చ ర్చలు జరిపారు. ఈ సందర్భంగా అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా అందుకు ప్రతిగా ఉత్తర కొరియా భద్రతకు అమెరికా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా దక్షిణ కొరియాతో చేస్తున్న ఉమ్మడి సైనిక విన్యాసాల్ని నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే కొరియా అణు నిరాయుధీకరణలో పురోగతి కనిపించేంత వరకు ఆ దేశంపై ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఇరువురు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
సంయుక్త ప్రకటనలోని అంశాలు
  • శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడే చర్యలకు కట్టుబడి ఉండడం.
  • కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం.
  • 2018 ఏప్రిల్ 27వ తేదీన ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండటం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం.
  • యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం.
  • ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగించటానికి విదేశాంగ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో వీలైనంత త్వరగా చర్చలు జరపడం.

సమావేశానికి దారితీసిన పరిణామాలు
ఉత్తర కొరియా 2017, మార్చి 6న జపాన్ వైపు నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో యూఎన్ సాధారణ అసెంబ్లీలో చేసిన తన తొలి ప్రసంగంలో ఉ.కొరియాను సర్వనాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరించాడు. దీనికి ప్రతిగా అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి అణు ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కిమ్ జోంగ్ ఉన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా జులై 4న అమెరికాలోని అలస్కాని లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి క్షిపణిని జపాన్ సముద్రంలోకి ప్రయోగించింది. తత్ఫలితంగా ఆ దేశంపై అమెరికా పలు ఆంక్షలు విధించింది. కొరియా ద్వీపకల్ప నిరాయుధీకరణపై చర్చించడానికి తమ నాయకులు జూన్ లో సమావేశమవుతారని ఇరు దేశాలు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య శిఖరాగ్ర సదస్సు
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్
ఎక్కడ : కెపెల్లా హోటల్, సింగపూర్
ఎందుకు : కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణకు

సూపర్ కంప్యూటర్ సమిట్’ ను ఆవిష్కరించిన అమెరికా
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ‘సమిట్’ ను అమెరికా జూన్ 8 న ఆవిష్కరించింది. చైనాకు చెందిన సన్వే తైహులైట్ (సెకనుకు 93 వేల ట్రిలియన్ల గణనలు చేయగలదు) రికార్డులను అధిగమించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఈ సమిట్ సెకనుకు రెండు లక్షల ట్రిలియన్ల గణనలు చేయగలదు.

అమెరికా పసిఫిక్ కమాండ్ పేరు మార్పు
Current Affairs అసియా, పసిఫిక్ ప్రాంత వ్యవహారాలనుపర్యవేక్షించే (హవాయి) సైనిక స్థావరం ‘అమెరికా పసిఫిక్ కమాండ్’ పేరును ‘అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్’గా మారుస్తూ అమెరికా మే 31న ఒక ప్రకటన విడుదల చేసింది. సైనికపరంగా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భారత్ పాత్రకు ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తమ అధికారిక పత్రాల్లో ఇండో-పసిఫిక్ అనే పదాన్ని ఉపయోగిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా పసిఫిక్ కమాండ్ పేరు మార్పు
ఎప్పుడు : మే 31
ఎవరు : అమెరికా

ఐరాస అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ జూన్ 5న ఎన్నికయ్యారు. 2018 సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగనున్న 73వ సెషన్‌కు ఆమె నేతృత్వం వహిస్తారు. దీంతో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళగా మరియా గుర్తింపు పొందారు. మొదటిసారిగా 1953లో భారత్‌కి చెందిన విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత 1969లో లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్‌కు చెందిన షేకా హయా రషెద్ అల్ ఖలీఫాలు అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఐరాసలో మొత్తం 198 సభ్య దేశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్ష ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్

స్పెయిన్ ప్రధాని రాజీనామా
అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే స్పెయిన్ ప్రధాని మరియానో రాజొయ్ ఈనెల 1న పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రతిపక్ష నేత పెడ్రో సాంచెజ్ బాధ్యతలు చేపట్టారు. రాజొయ్‌కు చెందిన పాపులర్ పార్టీపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష సోషలిస్టులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సోషలిస్టులను వ్యతిరేకించే ఇతర పార్టీలు కూడా మద్దతు పలకడంతో రాజొయ్ ఓటమి అనివార్యమైంది. పరిస్థితులను గమనించిన రాజొయ్ పదవి నుంచి తప్పుకున్నారు.

ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ
ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో 97% ఓట్లతో ఆయన విజయం సాధించారు. మహమ్మద్ మోర్సీని సైన్యం పదవీచ్యుతుడిని చేసిన అనంతరం 2014లో సీసీ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టారు.

గ్వాటెమాలాలో అగ్నిపర్వతం బద్దలు - 25 మంది మృతి
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో మరోమారు అగ్నిపర్వతం బద్దలు కావడంతో 25 మరణించారు. గ్వాటెమాలా సిటీకి 40 కి.మీ దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మడంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెలువడుతుండటంతో గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published date : 03 Jul 2018 05:33PM

Photo Stories