Skip to main content

జూలై 2018 అంతర్జాతీయం

పాకిస్థాన్ ఎన్నికలు - 2018
Current Affairs పాకిస్థాన్‌లో జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం జూలై 28న విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్థాన్ తెహ్రీకీ ఇన్సాఫ్’ (పీటీఐ) 115 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్(ఎన్) పార్టీ 64 సీట్లు గెలుపొందగా, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 సీట్లను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 13 స్థానాలు గెలుపొందారు. పాకిస్తాన్ పార్లమెంటు దిగువ సభలో మొత్తం 342 సీట్లు ఉండగా అందులో 272 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. తాజాగా 270 స్థానాలకే ఎన్నికలు జరిగాయి.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 సీట్లు ఉండాలి.అక్కడి చట్టాల ప్రకారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు 21 రోజుల సమయం ఇస్తారు. మరోైవె పు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీంతో ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందిన పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
తొలి హిందూ ఎంపీ
పాకిస్థాన్‌లో తొలిసారిగా ఒక హిందువు ఎంపీగా గెలిచాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్లోని థార్‌పార్కర్-2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20 వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003-08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు-2018
ఎప్పుడు : జూలై 25
ఎవరు : 115 స్థానాలతో అతి పెద్ద పార్టీగా పీటీఐ
ఎక్కడ : పాకిస్థాన్

హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ సదస్సు
Current Affairs వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు 2019 అక్టోబర్‌లో నిర్వహించే ఈ సదుస్సుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) జూలై 24న వెల్లడించింది. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులపాటు నిర్వహించే ఈ సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వామ్యం వహించనుంది. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. డబ్ల్యూడీఓ ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషి చేస్తుంది.
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉన్నందున నగరాన్ని సదస్సుకు ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ అంతర్జాతీయ సదస్సు
ఎప్పుడు : 2019, అక్టోబర్
ఎవరు : వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ)
ఎక్కడ : హైదరాబాద్

అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్‌గా హాంకాంగ్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్ (ప్రైమ్ ఆఫీస్ మార్కెట్)గా హాంకాంగ్ నిలిచింది. హాంకాంగ్ సెంట్రల్‌లో చదరపు అడుగు కు వార్షిక అద్దె రూ.21,067 గా ఉంది. హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్ (రూ.16,149), బీజింగ్‌లోని ఫైనాన్స్ స్ట్రీట్ (రూ.13,806), హాంకాంగ్‌లోని కౌవ్‌లూన్ (రూ.13,026), చైనాలోని సీబీడీ (రూ.13,018), న్యూయార్క్‌లోని మన్‌హటన్ (రూ.12,629), మిడ్‌టౌన్ (రూ.11,789), టోక్యోలోని మరూంచీ (రూ.11,784) ప్రాంతాలు నిలిచాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సీబీఆర్‌ఈ నివేదిక జూలై 11న విడుదలైంది.
Current Affairs ఈ జాబితాలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ (రూ.10,532) 9వ స్థానంలో నిలవగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) (రూ.6,632) 26, ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) (రూ.5,002) లు 37వ స్థానంలో నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా 120 నగరాల్లో ఆక్యుపెన్సీ స్థాయి, ధరలపై ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ సర్వే చేసింది. గత ఏడాది కాలంలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఆక్యుపెన్సీ వ్యయ వృద్ధి అన్ని రీజియన్లలోనూ స్థిరంగా ఉందని నివేదికలో తేలింది. అద్దెలు, పన్నులు, సర్వీస్ చార్జీలు ఇతరత్రా ఆఫీస్ వ్యయాలను కలిపిన ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఏటా 2.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్
ఎప్పుడు : జూలై 12
ఎవరు : రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సీబీఆర్‌ఈ నివేదిక
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

బ్రిటన్ పర్యటనలో ట్రంప్
నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 13న తొలిసారిగా బ్రిటన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని థెరిసా మేతో బ్రెగ్జిట్‌తో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికా-బ్రిటన్‌ల బంధం విడదీయరానిదనీ, చాలా ప్రత్యేకమైనదని ట్రంప్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు
ఎప్పుడు : జూలై 13
ఎవరు : డొనాల్డ్ ట్రంప్

ట్రంప్, పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ తొలిసారిగా ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో ఉన్న అధ్యక్ష భవనంలో జూలై 16న జరిగింది. ఈ సందర్భంగా అమెరికా, రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామని ట్రంప్, పుతిన్‌లు ప్రకంటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా, రష్యా అధ్యక్షుల శిఖరాగ్ర భేటీ
ఎప్పుడు : జూలై 16
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్
ఎక్కడ : ఫిన్లాండ్ అధ్యక్ష భవనం, హెల్సింకి, ఫిన్లాండ్
ఎందుకు : ద్వైపాక్షిక బంధం బలోపేతం కోసం

పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ
Current Affairs పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న హిందూ మహిళగా సింధ్ ప్రావిన్సుకు చెందిన సునీతా పర్మార్ (31) రికార్డు సృష్టించారు. జూలై 25న పాక్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, థార్పార్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి సునీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పాక్‌లో అల్ప సంఖ్యాకవర్గమైన హిందువులు అత్యధికంగా ఉండేది థార్పార్కర్ జిల్లాలోనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ
ఎప్పుడు : జూలై 25
ఎవరు : సునీత పర్మార్
ఎక్కడ : పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు

ట్విటర్‌లో ట్రంప్‌కు అగ్ర స్థానం
ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడిగా 5.2 కోట్ల అనుచరులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రస్థానంలో నిలిచారు. ట్రంప్ తర్వాత పోప్ ఫ్రాన్సిస్, ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ మేరకు జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బుర్సన్ కోన్ అండ్ వోల్ఫ్(బీసీడబ్ల్యూ) నిర్వహించిన అధ్యయన వివరాలను జూలై 10న తెలిపింది. రీట్వీట్‌ల పరంగా చూస్తే సౌదీ రాజు సల్మాన్ ట్రంప్ కన్నా ఆధిక్యంలో ఉన్నారు. 2017 మే-2018 మే మధ్య కాలంలో సల్మాన్ 11 సార్లు ట్వీట్ చేయగా, ప్రతి ట్వీట్‌కు 1.5 లక్షల రీట్వీట్లు రాగా ట్రంప్ చేసిన ప్రతి ట్వీట్‌కు 20 వేల రీట్వీట్లు వచ్చాయి.
అసత్యపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలు వ్యాపించకుండా నకిలీ ఖాతాలను తొలగించే ప్రక్రియను ట్విటర్ చేపట్టింది. ప్రతి రోజు 50 వేలకు పైగా నకిలీ అకౌంట్లు క్రియేట్ కాకుండా అడ్డుకుంటున్నట్టు ట్విటర్ ఆడిట్ రిపోర్ట్ తెలిపింది.
నకిలీ ఫాలోవర్లు

సెలబ్రిటీ

మొత్తం ఫాలోవర్లు

నకిలీల శాతం

విరాట్ కోహ్లి

2.5 కోట్లు

56

అమితాబ్

3 కోట్లకుపైగా

38

రాహుల్ గాంధీ

70 లక్షలు

36

నరేంద్ర మోదీ

4.3 కోట్లు

33

దీపిక పదుకొణె

2.5 కోట్లు

33

డొనాల్డ్ ట్రంప్

5.1 కోట్లు

14

క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడు
ఎప్పుడు : జూలై 10
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

అమెరికా డ్రగ్స్ నియంత్రణ అధికారిగా ఉత్తమ్ ధిల్లాన్
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి న్యాయవాది ఉత్తమ్ ధిల్లాన్ మాదక ద్రవ్యాల రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న ‘డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ’ నూతన యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంపికయ్యారు. గతంలో ధిల్లాన్ శ్వేతసౌధంలో అధ్యకుడు ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. న్యాయ విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ, కాంగ్రెస్‌ల్లో వేర్వేరు హోదాల్లో పనిచేశారు.

జిన్‌పింగ్‌తో అమెరికా రక్షణ మంత్రి సమావేశం
Current Affairs అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో జూన్ 27న బీజింగ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలోని భూభాగాలను తాము వదులుకోబోమని, అదే సమయంలో అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులను సృష్టించే ఉద్దేశం తమకు లేదని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అలాగే ఆగ్నేయాసియా దేశాల సమీపంలోని చిన్న దీవులను ఆక్రమించడం, వాటిలో ఆధునిక ఆయుధ సంపత్తిని మోహరించడాన్ని సమర్థించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా అధ్యక్షుడితో అమెరికా రక్షణ మంత్రి సమావేశం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : మాటిస్, షి జిన్‌పింగ్
ఎక్కడ : బీజింగ్

చిన్నారులను ఆయుధాలుగా వినియోగిస్తున్నారు: ఐరాస
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులు చిన్నారులను ఆయుధాలుగా వినియోగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు ఈ కార్యకలాపాలను చేస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి తయారు చేసిన ఐరాస వార్షిక నివేదికను జూన్ 28న విడుదల చేసింది.
2017లో ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అలాగే అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను ఉగ్ర సంస్థలు నియమించుకున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అలాగే చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్నారులను ఆయుధాలుగా వాడుకుంటున్న ఉగ్రవాదులు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎక్కడ : జమ్మూకశ్మీర్, భారత్
ఎందుకు : భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు

ఫిన్‌లాండ్‌లో ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర సమావేశం
ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీలో అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు జూలై 16న సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు అమెరికా, రష్యాలు జూన్ 28న తెలిపాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, పుతిన్‌లు మాస్కోలో జూన్ 27న సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా, రష్యా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం
ఎప్పుడు : జూలై 16
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్
ఎక్కడ : హెల్సింకీ, ఫిన్‌లాండ్
ఎందుకు : ద్వైపాక్షిక బంధాల బలోపేతం చే సుకునేందుకు

ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్’లో పాకిస్థాన్
అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) పాకిస్థాన్‌ను ‘గ్రే లిస్ట్’లో పెట్టింది. ఈ మేరకు పారిస్‌లో జూన్ 27న జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీలో నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆ దేశ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు విదేశీ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఈ నిర్ణయం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. ఇప్టటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలు గ్రే లిస్ట్‌లో ఉన్నాయి.
1989లో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్ గ్రూపులో 37 దేశాలుండగా మనీ లాండరింగ్ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’లో పాకిస్థాన్
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్

ఇంధనం దిగుమతిపై అమెరికా హెచ్చరిక
ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడాన్ని భారత్, చైనా సహా అన్నీ దేశాలు నవంబర్ 4 నాటికి పూర్తిగా నిలిపివేయాలని అమెరికా హెచ్చరించింది. ఆ తర్వాత కూడా ఇరాన్ నుంచి ముడిచమురును పొందే దేశాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత భారత్ అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది. 2017, ఏప్రిల్- 2018, జనవరి మధ్య కాలంలో 1.84 కోట్ల టన్నుల ముడి చమురును ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.
Published date : 03 Aug 2018 05:16PM

Photo Stories