Skip to main content

ఏప్రిల్ 2017 అంతర్జాతీయం

మెటల్ మైనింగ్‌పై నిషేధం విధించిన ఎల్ సాల్వడోర్
ఎల్ సాల్వడోర్ దేశం మెటల్ మైనింగ్‌పై నిషేధం విధించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు సాంచెజ్ సెరెన్ ఏప్రిల్ 28న సంతకం చేశారు. తద్వారా ప్రపంచంలో మెటల్ మైనింగ్‌ని నిషేధించిన తొలి దేశంగా ఎల్ సాల్వడోర్ గుర్తింపు పొందింది.
దేశంలో మెటల్ మైనింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందంటూ కొన్నేళ్లుగా ఉద్యమాలు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మెటల్ మైనింగ్‌పై నిషేధం విధించిన తొలి దేశం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : ఎల్ సాల్వడోర్ అధ్యక్షుడు సాంచెజ్ సెరెన్
ఎక్కడ : ఎల్ సాల్వడోర్‌లో
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం


కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా
భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా వెల్లడించింది. ఈ మేరకు దక్షిణాసియా ప్రాంతంలో కీలక పాత్ర పోషించేందుకు చైనా ఆసక్తిగా ఉందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో తమ దేశం 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, అందువల్ల కశ్మీర్ సమస్య పరిష్కారం కావడం తమ దేశానికీ అవసరమేనని పేర్కొంది. ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం చైనా అభిమతం కాదని అయితే విదేశాల్లోని తమ పెట్టుబడులకు రక్షణ కోసం మధ్యవర్తిత్వం చేస్తామని తెలిపింది. కశ్మీర్ వివాదంలో చైనా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి చైనా సిద్ధం
ఎప్పుడు : మే 2
ఎవరు : చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్
ఎందుకు : విదేశాల్లో చైనా పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు

నేపాల్ స్థానిక సంస్థల్లో భారతీయులకు పోటీ చేసే హక్కు
నేపాల్ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం భారతీయులను ఏప్రిల్ 27న అనుమతించింది. ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్‌తో సరిహద్దు ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాలను కలిపి టరాయి ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసించే భారతీయులకు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం ఇకపై దక్కనుంది. ఈ అవకాశం కోసం నేపాల్‌లోని భారతీయులు గత ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. 

ఉత్తర కొరియాలో తొలిసారిగా మానవ హక్కుల బృందం పర్యటన
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల బృందం తమ దేశంలో పర్యటించేందుకు ఉత్తర కొరియా ఏప్రిల్ 26న అంగీకారం తెలిపింది. కేటలినా డివన్‌డాస్ అగిలర్ నేతృత్వంలోని హక్కుల బృందం ఆ దేశంలో వైకల్యం పొందిన పౌరుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఓ పౌర హక్కుల సంఘాన్ని ఉత్తర కొరియా ఇప్పటివరకు దేశ పర్యటనకు అనుమతించలేదు.

హెచ్-1బీ వీసా మార్పుల ఉత్తర్వుపై ట్రంప్ సంతకం
Current Affairs
‘అమెరికా ఉత్పత్తులనే కొనండి.. అమెరికన్‌లకే ఉద్యోగాలు ఇవ్వండి’ అనే నినాదంతో తయారైన వీసా నిబంధనల మార్పుల ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న సంతకం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుంచి అత్యున్నత స్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తారు. అలాగే అధిక జీతం పొందే వారికే హెచ్-1బీ వీసాలు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హెచ్-1బీ వీసా ఉత్తర్వులు జారీ
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఎక్కడ : అమెరికాలో

ఆస్ట్రేలియా పౌరసత్వానికి నాలుగేళ్ల నిబంధన
ఆస్ట్రేలియా ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఇకపై ఆసీస్ పౌరసత్వం పొందాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు కనీసం నాలుగేళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని పేర్కొంటూ సరికొత్త చట్టాన్ని ఏప్రిల్ 20న ప్రవేశపెట్టింది. అలాగే ఈ చట్టం ప్రకారం ఆ దేశ పౌరసత్వం పొందేందుకు మూడు సార్లకు మించి పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఇంతక ముందు నివాస నిబంధన 12 నెలలు ఉండగా ఎన్ని సార్లయినా పరీక్ష రాసే వెసులుబాటు ఉండేది.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు ప్రాచుర్యం పొందిన 457 వర్క్ వీసాను ఆస్ట్రేలియా రెండు రోజుల క్రితం రద్దు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా పౌరసత్వం నిబంధనలు కఠినతరం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ఆస్ట్రేలియా ప్రభుత్వం
ఎందుకు : విద్య, ఉద్యోగాల్లో ఆస్ట్రేలియా పౌరులకు ప్రాధాన్యత కోసం

ఐరాసకు 2.5 లక్షల డాలర్లు అందజేసిన భారత్
ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తున్న ఐరాస ఎన్నికల విభాగానికి భారత్ 2 లక్షల 50 వేల డాలర్లు విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఐరాసలోని భారత్ మిషన్ తొలి సెక్రెటరీ ఈనమ్ గంభీర్ ఐరాసకు ఏప్రిల్ 20న చెక్ అందజేశారు. 2012లోనూ భారత్ ఇంతే మొత్తంలో నిధులను ఐరాస ఎన్నికల విభాగానికి ఇచ్చింది.
1991లో ఐరాస స్థాపించిన ఎన్నికల సహాయ విభాగం 100కు పైగా దేశాల్లో ఎన్నికల నిర్వహణకు సహాయపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస ఎన్నికల విభాగానికి 2.5 లక్షల డాలర్ల సహాయం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : భారత్
ఎందుకు : వివిధ దేశాల్లో ఎన్నికల నిర్వహణకు సహకరించేందుకు

3 ఆఫ్రికన్ దేశాలకు తొలి మలేరియా వ్యాక్సిన్
మలేరియా నియంత్రణ కోసం రూపొందించిన తొలి వ్యాక్సిన్‌ను ఆఫ్రికన్ దేశాలైన ఘనా, కెన్యా, మాల్వీ దేశాలకు 2018 నాటికి అందజేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 24న వెల్లడించింది. ఆర్టీఎస్, ఎస్ పేరుతో తయారుచేసిన ఈ వ్యాక్సిన్ మానవుడిలోని రోగనిరోధక వ్యవస్థకు మలేరియా పరాన్నజీవిపై పోరాడే శక్తిని కల్పిస్తుంది. దీన్ని వరుసగా మూడు నెలలపాటు నెలకో డోసు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగో డోసును 18 నెలల తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మలేరియా వ్యాక్సిన్
ఎప్పుడు : 2018 నాటికి
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ : ఘనా, కెన్యా, మాల్వీ దేశాలకు
ఎందుకు : మలేరియా నియంత్రణకు

బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు!
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఏప్రిల్ 18న ప్రకటించారు. బ్రిటన్‌లో సాధారణ షెడ్యూల్ ప్రకారం 2020లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

457 వీసాను రద్దు చేయనున్న ఆస్ట్రేలియా
Current Affairs
ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యత కల్పించి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు వర్క్ వీసా పాలసీ 457 వీసాను రద్దు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీని స్థానంలో ఇంగ్లిషులో మెరుగైన సామర్థ్యం, వృత్తి నైపుణ్యానికి ప్రాముఖ్యతలను ఇచ్చే కొత్త పాలసీని తీసుకురానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వీసా ద్వారా భారతీయులు సహా 95 వేల మంది విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో ఉపాధి పొందుతున్నారు. కొత్త విధానంలో ఉన్నతమైన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం, క్రిమినల్ హిస్టరీ చెక్, లేబర్ మార్కెట్ టెస్టింగ్, నాన్ డిస్క్రిమినేషన్ వర్క్‌ఫోర్స్ టెస్ట్, మార్కెట్ శాలరీ రేట్ అసెస్‌మెంట్ వంటి నిబంధనలతో పాటు కొత్తగా రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్‌‌సను తప్పనిసరి చేయనున్నారు.
457 వీసా అంటే?
ఆస్ట్రేలియాలో విదేశీయులను నైపుణ్య ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఉపయోగించే విధానమే 457 వీసా. దీనిపై వచ్చిన వాళ్లు నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియాలో పని చేయవచ్చు. 1990ల్లో వ్యాపారులకు, అత్యున్నత నిపుణత కలిగిన వలసదారుల కోసం తెచ్చిన ఈ విధానాన్ని ఆ తర్వాత మరింత విస్తరించారు. ఈ వీసాలను తీసుకునే భారతీయుల సంఖ్య 19.5% కాగా ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనా ఉన్నాయి.
అమెరికాలో హెచ్1బి వీసా నిబంధనలపై ట్రంప్ కఠిన నిబంధనలువిధించిన నేపథ్యంలో పలు దేశాలు ట్రంప్‌నే అనుసరిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో పాటు 2016 నవంబర్‌లో బ్రిటన్ కూడా అంతర్గత బదిలీలపై ఆంక్షలు విధించింది. దీని ప్రకారం భారత్ నుంచి అంతర్గత బదిలీ ద్వారా బ్రిటన్ వచ్చే ఉద్యోగికి కనిష్ట వేతన పరిమితిని 30 వేల పౌండ్లకు పెంచింది. ఇదే దారిలో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సమీక్షించే విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో సింగపూర్ కూడా తమ ఉద్యోగాలు భారతీయులకు దక్కకుండా చూస్తోంది. ఇందుకోసం 2016 జనవరి నుంచి భారతీయ ఐటీ కంపెనీలకు వీసాల జారీని నామమాత్రం చేసింది. ఇదిలా ఉండగా చమురు ధరలు పడిపోవడంతో ఆయిల్‌పైనే ఆధారపడ్డ సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో పలు పెద్దా, చిన్న కంపెనీలు మూతపడటంతో ఏడాదిలో 80 వేల మంది భారతీయులు తిరిగివచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
వర్క్ వీసా పాలసీ 457 రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : ఆస్ట్రేలియా ప్రభుత్వం
ఎందుకు : ఆస్ట్రేలియా ఉద్యోగాలు స్థానికులకే దక్కేందుకు

అఫ్గాన్‌పై అతిపెద్ద బాంబును ప్రయోగించిన అమెరికా
‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(ఎంఓఏబీ- Massive Ordnance Air Blast)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును అమెరికా అఫ్గనిస్తాన్‌పై ప్రయోగించింది. ఈ మేరకు ఏప్రిల్ 13న అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ సొరంగాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా నంగర్‌హర్ రాష్ట్రం అచిన్ ప్రాంతంలో ఖొరాసన్ సొరంగంపై 9,720 కిలోల బాంబును అమెరికా యుద్ధ విమానం (ఎంసీ-130) జారవిడిచింది. 2003లో తయారు చేసిన ఈ ఎంఓఏబీ (జీబీయూ-43బీ )ని యుద్ధ కేత్రంలో ప్రయోగించడం ఇదే మొదటిసారి.
ఈ బాంబు తయారుచేసిన కొద్ది కాలానికే ఎంఓఏబీ కంటే శక్తివంతమైన ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్’ను రష్యా తయారుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఓఏబీ బాంబును ప్రయోగించిన అమెరికా
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : అమెరికా సైన్యం
ఎక్కడ : అఫ్గనిస్తాన్‌లోని ఐసీసీ స్థావరాలపై
ఎందుకు : ఐసీసీ ఉగ్రవాదులను అంతమొందించేందుకు

టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు
టర్కీ అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఆ దేశంలో చేపట్టిన రెఫరెండంలో అధ్యక్షుడు రిసెవ్ ఎర్డొగన్ విజయం సాధించారు. ఈ మేరకు ఏప్రిల్ 17న వెలువడిన ఫలితాల్లో రెఫరెండంకు అనుకూలంగా 51.41 శాతం మంది ఓటు వేయగా 48.59 శాతం మంది వ్యతిరేకించారు.
టర్కీ కొత్త రాజ్యాంగం ప్రకారం 2019 నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. దేశాధ్యక్ష పదవికి ఒకరు రెండు సార్లు పోటీపడే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టర్కీ రెఫరెండం
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అధ్యక్షుడు రిసెవ్ ఎర్డొగన్‌కు అనుకూలంగా 51.41 శాతం ఓట్లు
ఎక్కడ : టర్కీలో
ఎందుకు : దేశాధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించేందుకు

భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా శాంసంగ్
Current Affairs
దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ డ్యూరబుల్స్ సంస్థ శాంసంగ్ భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. ఈ మేరకు టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ - 2017 నివేదికను ఏప్రిల్ 5న విడుదల చేసింది. దీని ప్రకారం విశ్వసనీయతలో శాంసంగ్ తొలి స్థానంలో ఉండగా సోనీ, ఎల్‌జీ సంస్థలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ సంస్థ 4, టాటా గ్రూప్ 5 స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ శాంసంగ్
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : టీఆర్‌ఏ రీసెర్చ్ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ - 2017
ఎక్కడ : భారత్‌లో

అబుదాబిలో భారత్-యూఏఈ సాంస్కృతిక ఉత్సవాలు
భారత్ - యూఏఈ సాంస్కృతిక ఉత్సవాలు అబుదాబిలో జరిగాయి. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఉత్సవాల్లో మొదట భారత జాతి పిత మహాత్మ గాంధీ, యూఏఈ జాతి పిత షేక్ జయీద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వీడియోలను ప్రదర్శించారు. రెండు దేశాల సంస్కృతీ, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
భారత్ - యూఏఈ సాంస్కృతిక ఉత్సవాలు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : భారత్ - యూఏఈ
ఎక్కడ : అబుదాబి

సౌదీ అరేబియాలో ఆదాయ పన్ను రద్దు
సౌదీ అరేబియా తమ దేశ ప్రజలు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతోపాటు కంపెనీలు కూడా వారి లాభాలపై ఎలాంటి పన్నులూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆ దేశ ఆర్థిక మంత్రి ఏప్రిల్ 8న వెల్లడించారు.

మరణ శిక్షలను అమలు చేస్తున్న దేశాల్లో చైనా టాప్
మరణ శిక్షలు అమలు చేయడంలో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 11న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2016లో ప్రపంచ వ్యాప్తంగా 1,032 మందిని ఉరితీయగా అందులో అత్యధికంగా చైనాలోనే (వెయ్యికి పైగా అంచనా) అమలయ్యాయి.
ఈ నివేదిక ప్రకారం 2016లో భారత్‌లో 136 మందికి ఉరిశిక్ష విధించారు. గతేడాది దేశంలో ఉరిశిక్షను అమలు చేయలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
2016లో ఉరిశిక్షలపై నివేదిక
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

భారతీయుడికి ఉరిశిక్ష విధించిన పాకిస్తాన్ మిలటరీ కోర్టు
భారతకు చెందిన కుల్ భూషణ్ జాధవ్ (46)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఏప్రిల్ 10న ఉరిశిక్ష విధించింది. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.
2016 మార్చి 3న బలూచిస్తాన్ ప్రావిన్‌‌సలో కుల్ భూషణ్ జాధవ్‌ను అరెస్టు చేసిన పాక్ బలగాలు అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశాయి. అయితే జాధవ్ గతంలో నేవీలో పనిచేశారని తెలిపిన భారత్ అరెస్టుకు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతనికి సంబంధం లేదని ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్ భూషణ్ జాధవ్‌కు ఉరిశిక్ష
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : పాకిస్తాన్ మిలటరీ కోర్టు
ఎక్కడ : పాకిస్తాన్
ఎందుకు : గూఢచర్యం ఆరోపణలతో

బ్రిటన్ నుంచి చైనా బయలుదేరిన సిల్క్ రోడ్ రైలు
బ్రిటన్ నుంచి తొలి సరుకు రవాణా రైలు సిల్క్ రోడ్ మార్గం మీదుగా ఏప్రిల్ 10న చైనాకు బయలుదేరింది. ఈ రైలు 18 రోజుల పాటు 12 వేల కిలోమీటర్లు (7,500 మైళ్లు) ప్రయాణించి చైనా చేరుకోనుంది.
చైనా నుంచి బ్రిటన్‌కు తొలి సరుకు రవాణా రైలు 2017 జనవరి 18న చేరుకుంది.
ఈ రైలు ద్వారా బ్రిటన్ - చైనాల మధ్య ఉన్న వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని రెండు దేశాలు భావిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
చైనా బయలుదేరిన సిల్క్ రోడ్ రైలు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎక్కడ : బ్రిటన్ నుంచి
ఎందుకు : రెండు దేశాల మధ్య సరుకు రవాణా కోసం

హుజీ చీఫ్ అబ్దుల్ హన్నన్‌ను ఉరి తీసిన బంగ్లాదేశ్
నిషేధిత హర్కత్-ఉల్-జిహాద్ అల్ ఇస్లామిక్(హుజీ) ఉగ్రవాద సంస్థ చీఫ్ ముఫ్తీ అబ్దుల్ హన్నన్, అతడి ఇద్దరు అనుచరులను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 12న ఉరితీసింది. ఈశాన్య బంగ్లాదేశ్‌లోని సెల్హైట్‌లోని హజ్రత్ షాజలాల్ దర్గా వద్ద 2004లో వీరు ఉగ్రదాడికి పాల్పడి ముగ్గురి మృతికి కారణమయ్యారు. ఈ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు వీరికి మరణశిక్ష విధించగా, ఇటీవలే దేశాధ్యక్షుడు అబ్దుల్ హమీద్ వీరి క్షమాభిక్ష దరఖాస్తులను తిరస్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హుజీ చీఫ్ అబ్దుల్ హన్నన్‌కు ఉరిశిక్ష అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : బంగ్లాదేశ్
ఎందుకు : 2004 హజ్రత్ షాజలాల్ దర్గా ఉగ్రదాడి కేసులో

సిరియాపై అమెరికా క్షిపణి దాడులు
సిరియాలోని షాయరత్ వైమానిక స్థావరం, పరిసరాలపై తోమహాక్ క్షిపణులతో ఏప్రిల్ 7న అమెరికా దాడి చేసింది. ఏప్రిల్ 5న సిరియాలోని ఖాన్‌షేఖున్‌లో జరిగిన రసాయనిక దాడిలో 58 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి ఈ ఎయిర్‌బేస్ నుంచే కార్యాచరణ జరిగిందనే ఉద్దేశంతో అమెరికా దాడికి దిగింది.

భారత్-మంగోలియా సంయుక్త సైనిక విన్యాసాలు
నొమాడిక్ ఎలిఫెంట్ పేరుతో భారత్, మంగోలియా మధ్య రెండు వారాల పాటు జరిగే సైనిక విన్యాసాలు ఏప్రిల్ 5న మిజోరాంలోని వెరైంగేలో ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలో 30 కోట్ల మందికి డిప్రెషన్
డిప్రెషన్ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)వెల్లడించింది. 2005 నుంచి 2015 నాటికి ఈ కేసులు ఏకంగా 18 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో డిప్రెషన్‌కు గురవుతున్నవారిలో 50 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ఏప్రిల్ 2న తెలిపారు.

వాతావరణ ఒప్పందాలను రద్దు చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా కాలంలో వాతావరణ మార్పులపై రూపొందించిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై మార్చి 28న సంతకం చేశారు. దీంతో ఇంధన వెలికితీత, బొగ్గు తవ్వకానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్న పాత విధానాలు రద్దయినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరికా ఇంధన రంగంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిలువరించామన్నారు. విద్యుచ్ఛక్తి ఉద్గారాల నియమాలను సమీక్షించాలని, శిలాజ ఇంధనాల వెలికితీతకు ప్రతిబంధకాలుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని అధికార యంత్రాంగాన్ని ట్రంప్ ఆదేశించారు.

బ్రెగ్జిట్ ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని సంతకం
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు(బ్రెగ్జిట్) ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే మార్చి 29న సంతకం చేశారు. దీని ప్రకారం ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 దేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూలోని బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు అందించారు. ఈ రెండేళ్లలో ఈయూ సభ్య దేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. కాగా, ఈయా దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ - 2017
Current Affairs బ్లూమ్ బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా - 2017లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. మార్చి 30న ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం బిల్‌గేట్స్ సంపద విలువ 86 బిలియన్ డాలర్లు. 75.7 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ డాట్ కాం స్థాపకుడు జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ రెండో స్థానంలో ఉండగా 75.7 బిలియన్ డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 25వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ సంపద విలువ 27.7 బిలియన్ డాలర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : బ్లూమ్‌బర్గ్

5 మిలియన్లు దాటిన సిరియా శరణార్థులు
సిరియా శరణార్థుల సంఖ్య ఐదు మిలియన్లు దాటిందని ఐక్యరాజ్య సమితి మార్చి 30న ప్రకటించింది. వీరిలో స్త్రీలు, పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉందని వెల్లడించింది. 2015 లో శరణార్థులు 4.6 మిలియన్లుండగా, 2016లో ఈ సంఖ్య 4.85 మిలియన్లకు చేరింది. 2017లో ఇప్పటికే 5 మిలియన్లు దాటింది.
గత ఆరు సంవత్సరాలుగా సిరియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
5 మిలియన్‌లకు చేరిన సిరియా శరణార్థులు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : సిరియా
ఎందుకు : అంతర్యుద్ధం కారణంగా

కంప్యూటర్ ప్రోగ్రామర్ల హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం
కంప్యూటర్ ప్రాగ్రామర్ ఉద్యోగం కోసం హెచ్1 బీ వీసాతో వచ్చే విదేశీయుల వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించి మార్చి 31న కొత్త నియమావళిని జారీ చేసింది. దీని ప్రకారం ప్రత్యేక వృత్తి నిపుణుడిగా పరిగణించేందుకు ప్రారంభ స్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ అర్హుడు కాదని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) మార్గదర్శకాల్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఆ ఉద్యోగం ప్రత్యేక వృత్తి నిపుణత కోవకు చెందినదేనని రుజువు చేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హెచ్1 బీ వీసా నిబంధనలు కఠినతరం
ఎప్పుడు : మార్చి 31
ఎక్కడ : అమెరికా

యూఎన్‌ఎఫ్‌పీఏ సహాయ నిధులను వెనక్కి తీసుకున్న అమెరికా
ఐక్యరాజ్య సమితి కుటుంబ నియంత్రణ ఫండ్ ( UNFPA )కి ఇచ్చే సహాయ నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏప్రిల్ 4న అమెరికా ప్రకటించింది. చైనాలో ఈ సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు తమ దేశ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న అమెరికా 2017 సంవత్సరంలో 32.5 బిలియన్ డాలర్ల నిధులను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది.పపంచంలో జనాభా నియంత్రణ కోసం యూఎన్‌ఎఫ్‌పీఏ 150కి పైగా దేశాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
యూఎన్‌ఎఫ్‌పీఏ సహాయ నిధులను వెనక్కి తీసుకున్న అమెరికా
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎక్కడ : ఐరాస అనుబంధ సంస్థ
Published date : 08 Apr 2017 12:30PM

Photo Stories