Skip to main content

మే 2017 ఎకానమీ

భారత్‌లోకి రూ.3.99 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
Current Affairs
ప్రపంచంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న దేశంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ మేరకు 2016వ సంవత్సరంలో 62.3 బిలియన్ డాలర్ల (రూ.3.99 లక్షల కోట్లు సుమారు) ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెందిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్‌‌స విభాగం ‘ఎఫ్‌డీఐ 2017’ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం ఎఫ్‌డీలను రాబట్టడంలో చైనా, అమెరికాలు భారత్ వెనుకనే నిలిచాయి. గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నదని, చైనా అమెరికాల కంటే ముందు నిలిచిందని నివేదిక స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోకి ఎఫ్‌డీఐలు 62.3 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : 2016లో
ఎవరు : ఎఫ్‌డీఐ - 2017 నివేదిక, ఫైనాన్షియల్ టైమ్స్

చందా కొచర్ వేతనం రూ. 7.85 కోట్లు
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ అధిపతి చందా కొచర్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.85 కోట్ల వేతనం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 64 శాతం అధికం. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఆమె మూలవేతనం 15 శాతం పెరిగి రూ. 2.67 కోట్లకు చేరింది. రోజువారీగా చూస్తే కొచర్ రోజుకు.. రూ. 2.18 లక్షల వేతనం అందుకుంటున్నారు. అలాగే 2016-17లో ఆమె రూ. 2.2 కోట్ల బోనస్ పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చందా కొచర్ వేతనం రూ.7.85 కోట్లు
ఎప్పుడు : 2016-17 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో

అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐఓసీ
దేశంలో అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ కంపెనీగా (పీఎస్‌యూ) పెట్రో మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆవిర్భవించింది. టర్నోవర్‌కు సంబంధించి అతిపెద్ద కంపెనీగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఐఓసీ నికరలాభం 2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 70 శాతం వృద్ధితో రూ. 19,106 కోట్లకు చేరింది. దీంతో లాభాల విషయంలో చమురు ఉత్పాదక దిగ్గజం ఓఎన్‌జీసీని ఐఓసీ అధిగమించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ రూ. 17,900 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ నికరలాభం రూ. 16,140 కోట్లుకాగా, ఐఓసీ నికరలాభం రూ. 11,242 కోట్లు మాత్రమే.
ప్రైవేటు రంగ కంపెనీల్లో అత్యధిక లాభదాయక కంపెనీగా రిలయన్‌‌స ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాది నిలిచింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 29,901 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. తర్వాతి స్థానంలో రూ.26,357 కోట్ల లాభంతో టీసీఎస్ ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో లాభదాయక సంస్థలు
ఎప్పుడు : మే 25
ఎవరు : పీఎస్‌యూ - ఐఓసీ, ప్రైవేటులో రిలియన్స్

2017-18లో భారత వృద్ధి రేటు 7.2 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే 2019-20 నాటికి 7.7 శాతం వృద్ధి రేటుకు చేరుకుంటుందని వివరించింది. ఈ మేరకు మే 29న ‘ఇండియా డెవలప్‌మెంట్ రిపోర్ట్’ను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : ప్రపంచ బ్యాంకు

జీఎస్టీ పన్ను రేట్లు ఖరారు
జీఎస్టీ అమలులో భాగంగా వస్తువులు, సేవలపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి ఖరారు చేసింది. విద్య, వైద్యం వంటి సేవల్ని పన్ను పరిధి నుంచి పూర్తిగా మినహాయించగా.. మిగతా సేవల్ని 5%, 12%, 18%, 28% పన్ను శ్లాబుల్లోకి చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శ్రీనగర్‌లో రెండు రోజుల పాటు (మే 18 - 19) భేటీ అయిన జీఎస్టీ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో జూలై 1 నుంచి టెలికం, బ్యాంకింగ్, బీమా సేవలు ప్రియం కానున్నాయి. బంగారంపై రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు.
ఏ ఏ వస్తువలపై ఎంత పన్ను..
ప్రస్తుతం కొబ్బరినూనె, సబ్బులు, టూత్ పేస్టులపై 22 నుంచి 24 శాతం పన్ను వసూలు చేస్తుండగా వాటిని 18 శాతం శ్లాబులో చేర్చారు. బొగ్గుపై ప్రస్తుతం వసూలు చేస్తోన్న 11.69 శాతం పన్నుకు బదులు జీఎస్టీ అమల్లోకి వస్తే 5 శాతమే వసూలు చేస్తారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి చవకై వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రాణాల్ని కాపాడే మందుల్ని 5 శాతం పరిధిలో.. కేపిటల్ గూడ్‌‌స(ఇతర వస్తువుల తయారీకి వాడే యంత్రాలు, భవనాలు వంటివి) ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్‌లను 18% పరిధిలో చేర్చారు. ప్రస్తుతం వీటిపై 28% పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నట్లే పాలు, పెరుగుపై ఎలాంటి పన్ను ఉండదు. స్వీట్లపై మాత్రం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. రోజువాడే పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై 5 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. గోధుమలు, వరిని పన్ను పరిధి నుంచి మినహాయించారు. ప్రస్తుతం వీటిపై కొన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న వ్యాట్ కూడా రద్దయితే ధరలు మరింత తగ్గే అవకాశముంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై ప్రస్తుతం 32 శాతం పన్ను ఉండగా... వాటిని 28% శ్లాబులోకి చేర్చారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్స్‌ను 28% పన్ను శ్రేణిలో చేర్చారు.
ఏఏ సేవలపై ఎంత పన్ను..
  • రవాణా రంగం(రైల్వేలు, విమాన ప్రయాణం)పై 5 శాతం జీఎస్టీ.. వీటి ప్రధాన ఇంధనమైన పెట్రోలియంను ఇంకా జీఎస్టీ పరిధిలోకి తేనందున 5 శాతం శ్లాబులో చేర్చారు.
  • విమాన ప్రయాణంలో ఎకానమీ క్లాస్‌పై 5 శాతం, బిజినెస్ క్లాస్‌పై 12 శాతం పన్ను వసూలు. ఏసీ రైలు ప్రయాణంపై 5 శాతం పన్ను.
  • నాన్ ఏసీ హోటల్స్‌పై 12 శాతం.
  • ఏసీ హోటల్స్, మద్యం సరఫరా చేసే ఏసీ హోటల్స్‌పై 18 శాతం ఏడాదికి రూ. 50 లక్షలు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లపై 5 శాతం జీఎస్టీ.
  • హోటల్స్, లాడ్జిల్లో రోజువారీ టారిఫ్ రూ.1000 కంటే తక్కువ ఉంటే పన్ను ఉండదు. రూ.2500-5000 మధ్య టారిఫ్‌కు 18 శాతం, విలాసవంతమైన, ఐదు నక్షత్రాల హోటల్స్‌పై 28 శాతం
  • రేస్ క్లబ్బుల్లో బెట్టింగ్‌లు, సినిమాలపై 28 శాతం(ప్రస్తుతం సినిమాలపై చాలా రాష్ట్రాల్లో 40-45 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను తగ్గించడం వల్ల సినిమా టికెట్ల ధరలు తగ్గే అవకాశముంది)
  • టెలికంపై 18 శాతం(ప్రస్తుతం ఫోన్ బిల్లు చెల్లింపులపై 15 శాతం వసూలు), ఆర్థిక సేవలపై(బ్యాంకింగ్, బీమా) 18 శాతం(ప్రస్తుతం వీటిపై 15 శాతం పన్ను వసూలు చేస్తున్నారు).
  • ఈ కామర్స్ వెబ్‌సైట్లు(ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటివి) సప్లయిర్స్‌కు నగదు చెల్లించకముందే 1 శాతం పన్ను ముందుగానే వసూలు చేయాలి.
  • క్యాబ్ అగ్రిగేటర్స్ (ఒలా, ఉబెర్) సేవలపై 5 శాతం.. ప్రస్తుతం 6 శాతం పన్ను చెల్లిస్తున్నాయి.
  • వర్క్ కాంట్రాక్టులపై 12 శాతం
  • వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం స్థలాన్ని అమ్మితే 5 శాతం పన్ను (ప్రస్తుతం ఎలాంటి పన్ను వసూలు చేయడం లేదు).
మినహాయింపు
విద్య, వైద్యం, మెట్రో, లోకల్, రైళ్లలో ప్రయాణం, తీర్థయాత్రలు, హజ్‌యాత్రలు
28 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
శీతల పానీయాలు, చూయింగ్ గమ్స్, వైట్ చాకొలెట్స్, చాకొలెట్స్, కోకో చాకొలెట్స్, వేఫర్ చాకొలెట్స్, ఇన్‌స్టంట్ కాఫీ, కస్టర్డ్ పౌడర్, విద్యార్థులు వాడే రంగులు, పెయింట్స్, వార్నిష్‌లు, పెర్‌ఫ్యూమ్స్, సౌందర్య ఉత్పత్తులు, సన్‌స్క్రీన్స్, షాంపూలు, హెయిర్ డైలు, షేవింగ్ లోషన్‌‌స, డియోడరంట్స్, బాణాసంచా, వాష్ బేసిన్‌‌స, కృత్రిమ ఫర్ ఉత్పత్తులు, కృత్రిమ పువ్వులు, విగ్గులు, రేజర్ బ్లేడ్‌లు, వంటకు వాడే కత్తులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్స్, ఫొటోకాపీ యంత్రాలు, ఫ్యాక్స్ యంత్రాలు, ఇన్సులేటెడ్ కాపర్ తీగ, వాచీలు, రివాల్వర్లు, పిస్టల్స్, సిగరెట్ లైటర్లు, బెట్టింగ్, సినిమా హాళ్లు, పరిమళ ద్రవ్యాలు, ఉన్ని మొదలైనవి.
18 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్‌లు, అణు రియాక్టర్లు, గడియారాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్లాస్టిక్ బటన్లు, వెన్న, జున్ను, కండెన్‌‌సడ్ మిల్క్, మద్యం లెసైన్సు ఉన్న ఏసీ రెస్టారెంట్లు, టెలికం, ఆర్థిక సేవలు
12 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
మొబైల్ ఫోన్లు, ఫౌంటేన్ పెన్ ఇంకు, టూత్ పౌడర్, అగరవత్తులు, పాల సీసా, బ్రెయిలీ పేపర్, రంగులేసే పుస్తకాలు, గొడుగులు, పెన్సిల్ షార్ప్‌నర్, ట్రాక్టర్లు, సైకిళ్లు, కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు, వంటపాత్రలు, క్రీడా సామగ్రి, ఫిషింగ్ రాడ్లు, దువ్వెనలు, పెన్సిళ్లు, పెయింటింగ్‌లు, పండ్ల రసాలు, మాంసం, ఏసీ లేని రెస్టారెంట్లు
5 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
టీ, కాఫీ(ఇన్‌స్టంట్ కానిది), వేరుశనగ, చేపలు, కిరోసిన్ లాంతరు, బయో గ్యాస్ ప్లాంట్, పవన విద్యుత్, కేన్ షుగర్, బీట్ షుగర్, రవాణా సేవలు, రూ.50లక్షల టర్నోవర్ గల రెస్టారెంట్లు, ఓలా, ఉబర్
పన్ను రేట్లపై మరిన్ని వివరాలు..
  • కార్లను 28 శాతం పన్ను రేటులో ఉంచగా.. నాలుగు మీటర్ల పొడవు కంటే తక్కువ ఉండే చిన్నకార్లు, 1200సీసీ పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీ కార్లపై 1% సెస్సు. చిన్న డీజిల్ కార్లు, 1500సీసీ కంటే తక్కువ ఇంజిన్ కార్లపై 3% సెస్సు విధిస్తారు. మధ్యతరహా కార్లు, ఎస్‌యూవీ, ఖరీదైన కార్లపై 15% సెస్సు. 1500సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న విలాసవంతమైన కార్లపై 15% సెస్సు.
  • నిమ్మరసం, ఎరేటెడ్ డ్రింక్స్‌పై 28 శాతం పన్నుతో పాటు 12% సెస్సు,
  • 350సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న మోటార్‌సైకిళ్లపై 28 శాతం పన్నుతో పాటు 3% సెస్సు అదనం. ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్, ఖరీదైన పడవలపైనా అదే పన్ను రేటు.
  • పొగాకు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్నుతో పాటు 61 నుంచి 204 శాతం వరకూ సెస్సు విధిస్తారు. ఇక పైప్స్, సిగరెట్స్ కోసం వాడే పొగాకు పదార్థాలపై 290 శాతం పన్ను. 65ఎంఎం పొడవు మించని ఫిల్టర్, నాన్ ఫిల్టర్ సిగరెట్లపై 5% సెస్సు, ఒక్కోదానిపై రూ.1.59 అదనం. 65ఎంఎం నుంచి 70 ఎంఎం పొడవు మించని నాన్‌ఫిల్టర్ సిగరెట్లపై 5% సెస్సు, రూ.2.87అదనం, ఫిల్టర్ సిగరెట్లపై 5% సెస్సు, రూ.2.12 అదనం. బ్రాండెడ్ గుట్కాలపై 72% సెస్సు (వీటన్నింటిని 28 శాతం పన్ను జాబితాలో చేర్చారు).

సీబీఈసీ స్థానంలో సీబీఐసీ ఏర్పాటు
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్‌ అండ్ కస్టమ్స్’(సీబీఈసీ) స్థానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ను తీసుకువస్తున్నారు. 2017 జూన్ 1 లోగా ఇది ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్రంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ హెచ్‌ఆర్‌డీ మే 17న కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఐసీలో ఛైర్మన్‌తో పాటు జీఎస్టీ అండ్ సెంట్రల్ ట్యాక్స్, ఐటీ లీగల్, ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ పాలసీ, కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్‌‌స విభాగాలకు చెందిన ఆరుగురు కీలక సభ్యులుగా ఉంటారు. దీని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 21 జీఎస్‌టీ జోన్‌లు, 102 జీఎస్‌టీ పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లు ఉంటాయి. వీటితో పాటు 14 జీఎస్‌టీ సబ్ కమిషనరేట్లు, 768 డివిజన్లు, 3969 రేంజి కార్యాలయాలు, 49 జీఎస్‌టీ ఆడిట్ కమిషనరేట్లు, 50 జీఎస్‌టీ అప్పీల్ కమిషనరేట్లు, 11 కస్టమ్స్ జోన్లు, 60 కస్టమ్స్ కమిషనరేట్లు, 10 కస్టమ్స్ అప్పీల్లు కస్టమ్స్ కమిషనరేట్లు సీబీఐసీ పరిధిలోనే ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సీబీఈసీ స్థానంలో సీబీఐసీ
ఎప్పుడు : మే 17
ఎవరు : డెరైక్టర్ జనరల్ ఆఫ్ హెచ్‌ఆర్‌డీ
ఎందుకు : జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో

ఎమ్మెస్పీపై నీతి ఆయోగ్ ప్రతిపాదనలు
పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేసే విధానంలో నూతన విధానాలను నీతి ఆయోగ్ కేంద్రానికి ప్రతిపాదించింది. మూడేళ్ల కార్యాచరణ ముసాయిదాలో భాగంగా ఏప్రిల్ 23న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ ముసాయిదాను చర్చకు పెట్టింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్కరణలు తేవాలని సిఫారసు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యానవన పంటలు, పాడి, పౌల్ట్రీ, చేపలు, పందుల పెంపకం తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు సాగునీటిని అందించే కార్యక్రమాలను విసృ్తతంగా అమలుచేయాలని పేర్కొంది. వీటన్నింటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం (ఏఎంసీ)లో మార్పులు తేవాలని పేర్కొంది.
రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు అమ్ముకునేలా తగిన హక్కులు కల్పించడం, కొనుగోలుదారులు రైతుల ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసేలా వీలుకల్పించటం, ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావటం, కాంట్రాక్టు సేద్యాన్ని విసృ్తతపరిచేందుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడం వంటి నూతన విధానాలు అవలంబించాలని నీతి ఆయోగ్ పేర్కొంది.
సిఫారసులు
  • ఎమ్మెస్పీ విధానంలో పంటల సాగు నమూనా దెబ్బతినకుండా ఉండేందుకు ధరల కొరత చెల్లింపు విధానం (ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్-పీడీపీ) అమలు చేయాలి.
  • అవసరాల ఆధారంగా ధాన్య సేకరణకు ఎమ్మెస్పీ విధానం అమలు చేస్తూనే కొత్త విధానం అమలులో భాగంగా నిర్దిష్ట పంటలపై రైతులకు సరైన ధర రానప్పుడు ఆ మేరకు నష్టాన్ని భర్తీ చేయాలి. దీనిని నేరుగా రైతుకు అందజేయాలి.
  • గిట్టుబాటు ధర రానప్పుడు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ విధానంలో ఆయా పంటలను సేకరించాలి.
  • ప్రస్తుతం ఉన్న కౌలు చట్టాల వల్ల రైతులు తమ భూములను కౌలుకు ఇవ్వకుండా అలాగే వదిలేస్తున్నారు. కొత్త కౌలు చట్టాలు తేవడం ద్వారా కౌలుదారులు, భూయజమానుల హక్కులను పరిరక్షిస్తూ ఆయా భూములను సాగులోకి తేవచ్చు.
  • ఈ నూతన విధానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని రానున్న మూడేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది.

లాన్సెట్ ఆరోగ్య సర్వేలో భారత్‌కు 154వ ర్యాంకు
వైద్య సదుపాయాల లభ్యత, నాణ్యతలో లక్ష్యాలను అందుకోవడంలో వెనకబడ్డ భారత్ 154వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు 195 దేశాల్లో నిర్వహించిన Global Burden of Disease study నివేదికను లాన్సెట్ జర్నల్ మే 18న ప్రచురించింది. గత 25 ఏళ్లలో వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినప్పటికీ లక్ష్యాలను అందుకోవడంలో భారత్ విఫలమైందని పేర్కొంది. ఈ సర్వేలో 32 రకాల నివారించదగ్గ వ్యాధుల్ని అరికట్టడంతో పాటు 1990 నుంచి వైద్య సదుపాయాల మెరుగుదలపై ర్యాంకులు కేటాయించారు.
జాబితాలో తొలి 3 స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే నిలవగా అమెరికా తొలిసారి 30వ స్థానానికి దిగజారింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆరోగ్య సర్వేలో భారత్‌కు 154వ ర్యాంకు
ఎప్పుడు : మే 18
ఎవరు : లాన్సెట్ జర్నల్

2016-17లో భారత్‌కు 60.08 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు
2016-17లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) విలువ 60.08 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ మేరకు మే 19న ప్రకటించిన కేంద్ర వాణి జ్య, పరిశ్రమల శాఖ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణ వల్లే ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. 2015-16లో ఈ మొత్తం 55.06 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఎఫ్‌డీఐల ప్రవాహానికి వీలు కల్పించేందుకు గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం 21 రంగాలకు సంబంధించిన 87 నిబంధనల్లో మార్పులు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
భారత్‌లోకి 60.08 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు
ఎప్పుడు : 2016 -17లో
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ

WTO ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 24వ స్థానం
2014, 2015 సంవత్సరాలకు గాను ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) మే 19న ప్రకటించిన సవరించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 24వ స్థానంలో నిలిచింది. ఇదే సంవత్సరాలకు గాను గతంలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 41, 40 ర్యాంకింగ్స్‌లో ఉన్న భారత్ తాజాగా జాబితాలో 16 స్థానాలు మెరుగుపరుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: పర్యాటక ర్యాంకింగ్స్‌లో 24వ స్థానంలో భారత్
ఎప్పుడు : 2014, 2015 సంవత్సరాలకు గాను
ఎవరు : యూఎన్ డబ్ల్యూటీఓ

రైతుల కోసం బీవోబీ ప్రత్యేక డెబిట్ కార్డులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇఫ్కో సంయుక్తంగా రైతుల కోసం కో-బ్రాండెడ్ డెబిట్ కార్డులను మే 23న ఆవిష్కరించాయి. వీటికి ఒక నెల వరకు వడ్డీ లేకుండా రూ.2,500 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. 30 రోజులు దాటిన తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్‌కు 8.60% వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. రైతుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను పెంచడానికి ఈ కార్డులను తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రెండు లక్షల కో-బ్రాండెడ్ కార్డులను జారీ చేస్తామని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ స్కీమ్ విజయవంతమైతే ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్‌ను మరింత పెంచుతామని పేర్కొన్నాయి.
రైతులు ఈ సౌలభ్యాన్ని పొందాలంటే ఆధార్ నెంబర్ ఇచ్చి, రూ.100 డిపాజిట్‌తో ‘బరోడా ఇఫ్కో కృషి సేవింగ్ బ్యాంక్ అకౌంట్’ను తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్‌‌స అవసరం లేదు. క్విక్ రివ్యూ:
ఏమిటి :
రైతుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ డెబిట్ కార్డులు
ఎప్పుడు : మే 23
ఎవరు : బీవోబీ, ఇఫ్కో

10 లక్షల ఈ-టోల్ ట్యాగ్‌‌స జారీ లక్ష్యం: ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2018 మార్చికి) 10 లక్షల ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్‌‌సను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్‌‌సను ఫాస్టాగ్‌లుగా పరిగణిస్తామని ప్రకటించింది. వాహనదారులు నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఆగి, ఫీజు కట్టే ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఫాస్టాగ్‌లను తీసుకొచ్చింది.
ఫాస్టాగ్‌‌స విధానం
రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ(ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారంగా ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వీటిని వాహన అద్దంపై అతికించుకుంటే చాలు.. వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. గేట్ చార్జీలు ఎలక్ట్రానిక్ విధానంలో ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి. ఈ ట్యాగ్‌‌సను తర్వాత డబ్బులతో నింపుకోవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 2016 ఏప్రిల్‌లో ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 360కుపైగా టోల్ ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
10 లక్షల ఈ టోల్ టాగ్స్ జారీ
ఎప్పుడు : 2018 మార్చి నాటికి
ఎవరు : ఎస్‌బీఐ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మే 23న పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. తమ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. కనీస బ్యాలెన్స్ నిబంధనలు, ఆన్‌లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది.
ఎయిర్‌టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. కస్టమరు ఖాతాలో రూ.25,000 డిపాజిట్లు దాటితే రూ. 250 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ప్రారంభం
ఎప్పుడు : మే 23
ఎవరు : పేటీఎం
ఎక్కడ : న్యూఢిల్లీ

2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులు
2050 నాటికి భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉంటారని పెన్షన్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించాయి. ఈ మేరకు మే 15న దేశ వయోజనుల ఆర్థిక భద్రత అంశంపై నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 8.9 శాతంగా ఉండగా.. 2050 నాటికి ఇది 19.4 శాతానికి పెరగనుంది. అలాగే ప్రస్తుతం జనాభాలో 0.9 శాతంగా ఉన్న 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి 2.8 శాతానికి పెరగనుంది.
దేశంలో ప్రస్తుతం ప్రతి పన్నెండు మందిలో ఒకరు అరవైలలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
దేశ వయోజనుల ఆర్థిక భద్రత నివేదిక
ఎప్పుడు : మే 15
ఎవరు : పీఎఫ్‌ఆర్‌డీఏ, క్రిసిల్

2018లో భారత్ వృద్ధి 8 శాతం: ఐరాస
2018లో భారత వృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై 2017 మధ్యంతర సమీక్షను మే 16న విడుదల చేసింది. 2017 జనవరిలో విడుదల చేసిన మొదటి నివేదికలో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.9 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐరాస.. మధ్యంతర సమీక్షలో దాన్ని సవరించి 7.3 శాతంగా పేర్కొంది.
ప్రపంచ వృద్ధి 2017లో 2.7 శాతంగా ఉంటే, ఇది వచ్చే ఏడాది 2.9 శాతంగా ఉండే వీలుందని ఐరాస పేర్కొంది. చైనా ప్రస్తుత, వచ్చే సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
భారత వృద్ధి రేటు 8 శాతం
ఎప్పుడు : 2018లో
ఎవరు : ఐరాస

100 జిల్లాల్లో తొలి దశ ఎన్‌సీడీ స్క్రీనింగ్
రక్తపోటు, మధుమేహం, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, దంత క్షయం వ్యాధుల గుర్తింపు, నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం మే 16న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి దశలో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్ల లోపు వారికి ఈ ఐదు వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. ఈ వ్యాధులపై దశలవారీగా 50 కోట్ల మందికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఎన్‌సీడీ గుర్తింపు, నివారణ కార్యక్రమం
ఎప్పుడు : మే 16
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో

విద్యుద్దీకరణలో భారత్‌కు 26వ ర్యాంకు
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన విద్యుద్దీకరణ ర్యాంకింగ్స్‌లో భారత్ 26వ స్థానంలో నిలిచింది. 2014 నివేదికలో 99వ స్థానంలో ఉన్న భారత్ ఈ సారి గణనీయమైన పురోగతి సాధించింది. మూడేళ్ల క్రితం దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాల సంఖ్య 18,452గా ఉంది. గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కోసం 2015లో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన (DDUGJY)ను ప్రారంభించిన కేంద్రం రెండేళ్ల కాలంలో 13 వేల గ్రామాలను విద్యుత్ వ్యవస్థతో అనుసంధానం చేసింది.
2022 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ఈ పథకం లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
విద్యుద్దీకరణలో 26వ స్థానంలో భారత్
ఎప్పుడు : మే 16
ఎవరు : ప్రపంచ బ్యాంకు

2030 నాటికి మలేరియా రహిత భారత్
దేశంలో మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్యతో పాటు మలేరియా మరణాలు కూడా గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో కనీసం 15 రాష్ట్రాల్లో మలేరియాను సమూలంగా నిర్మూలించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలోని 70 శాతం ప్రాంతాలు ఈ వ్యాధి నుంచి విముక్తి పొందాయని, 2030 నాటికి మిగిలిన 30 శాతం ప్రాంతాలను కూడా మలేరియా రహితం చేయనున్నట్లు జాతీయ క్రిమికారక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం సంచాలకులు ఏసీ ధరియావార్ మే 14న వెల్లడించారు.

2017-18లో భారత్ వృద్ధి 7.4 శాతం : ఏడీబీ
Current Affairs
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్ -2018 మార్చి)లో 7.4 శాతంగా ఉంటుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ఈ మేరకు మే 3న ఓ నివేదిక విడుదల చేసిన సంస్థ 2018-19లో వృద్ధి రేటు 7.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), దివాలా పన్ను దేశంలో వ్యాపార సానుకూల వాతావరణ సృష్టికి దోహదపడతాయని విశ్లేషించింది.
ఏడీబీ 50వ వార్షిక సమావేశం మే 4 నుంచి 7 వరకు జపాన్‌లోని యొకోహమాలో జరిగింది. దీనికి వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజర య్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి 7.4 శాతంగా అంచనా
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : ఏడీబీ

భారత్‌లోకి 50 లక్షల కోట్ల నల్లధనం
భారత దేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు 770 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 లక్షల కోట్లు) నల్లధనం వచ్చిందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) వెల్లడించింది. అదే సమయంలో 165 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) నగదు దేశం నుంచి అక్రమంగా వెళ్లిపోయినట్లు జీఎఫ్‌ఐ పేర్కొంది. ఈ మేరకు ‘illicit financial flows to and from developing countries 2005-2014’ అనే శీర్షికతో రూపొందించిన నివేదికను మే 3న విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోకి 50 లక్షల కోట్ల నల్లధనం
ఎప్పుడు : 2005 - 2014 మధ్య కాలంలో
ఎవరు : గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ

బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్‌‌సకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 5న ఆమోద ముద్ర వేశారు. దీని ద్వారా మొండి బకాయిల (ఎన్‌పీఏల) వసూలుకు సంబంధించి ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలు లభిస్తాయి. తద్వారా రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్‌బీఐ ఆదేశించగలదు.
కాగా దేశీయ బ్యాంకింగ్ రంగంలో 2016 డిసెంబర్ నాటికి మొత్తం ఎన్‌పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఎప్పుడు : మే 5
ఎవరు : రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీ
ఎందుకు : మొండి బకాయిల వసూళ్లపై ఆర్బీఐకి మరిన్ని అధికారాలు

7 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు
ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్తగా మేనేజింగ్ డెరైక్టర్లను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మే 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ వీరి నియామకాలకు ఆమోదం తెలిపింది.
నియామక వివరాలు
  • ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న రాజ్‌కిరణ్ రాయ్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం మూడేళ్లు.
  • కార్పొరేషన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న సునీల్ మెహతా తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ తాజాగా అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈమె 2018, ఆగస్ట్ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న సుబ్రమణియ కుమార్ అదే బ్యాంక్ ఎండీ, సీఈవోగా 2019 జూన్ 30 వరకూ పదవిలో కొనసాగనున్నారు.
  • కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న దీనబంధు మొహపత్ర ఇకపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారు.
  • సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఎం.ఒ.రెగో నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్నారు.
  • ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న ఆర్.ఎ.శంకర నారాయణన్ ఇకపై విజయా బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు
ఎప్పుడు : మే 5
ఎవరు : కేబినెట్ నియామకాల కమిటీ

372.73 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో 1.594 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 372.73 బిలియన్ డాలర్ల ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయి. దీనికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెరుగుదల బాగా దోహదపడింది. ఇవి 1.569 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 349.05 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఈ మేరకు ఆర్‌బీఐ మే 5న తాజా గణాంకాలను వెల్లడించింది.
ఇక బంగారం నిల్వలు స్థిరంగా 19.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఫారెక్స్ నిల్వలు @ 372.73 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : మే 5
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

2017లో 7.1 శాతంగా భారత్ వృద్ధి రేటు : ఐరాస
భారత వృద్ధి రేటు 2017లో 7.1 శాతంగా, 2018లో 7.5 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ మేరకు మే 8న ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి మౌలిక రంగంపై వ్యయాలు దోహదపడతాయని పేర్కొన్న సంస్థ దీనితోపాటు వినియోగంలో మెరుగుదల వృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషించింది.
2017లో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటే, 2018లో ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్‌బీఐ లక్ష్యం 4.5-5 శాతం శ్రేణికన్నా ఇది అధికం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017, 2018లో భారత వృద్ధిపై అంచనా
ఎప్పుడు : మే 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి

పోస్టాఫీసుల్లో నగదు రహిత సేవలకు ఎస్‌బీఐతో ఒప్పందం
అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లోనూ నగదు రహిత సేవలను అందించేందుకు తపాలా శాఖ ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి పోస్టాఫీసులను గుర్తించిన తపాలా శాఖ వీటిలో దశలవారీగా ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్ ( పీవోఎస్ ) మేషీన్లను ఏర్పాటు చేయనుంది.
తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారులు తొలి విడతగా సికింద్రాబాద్, వరంగల్ హెడ్ పోస్టాఫీసుల్లో పీవోఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సర్కిల్ అధికారులు వచ్చే రెండునెలల్లో 25 ప్రధాన పోస్టాఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సేవలను వేగవంతం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోస్టాఫీసుల్లో డిజిటల్ సేవలకు ఎస్‌బీఐతో ఒప్పందం
ఎవరు : భారత తపాలాశాఖ
ఎందుకు : సేవలను నగదు రహితంగా మార్చేందుకు
ఎక్కడ : దేశవ్యాప్తంగా వెయ్యి శాఖల్లో

2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 273 మిలియన్ టన్నులు
సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా 2016 - 17 పంటకాలంలో ( జూలై - జూన్) రికార్డు స్థాయిలో 273.38 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మే 9న పంట ఉత్పత్తులపై ముందస్తు అంచనాలను విడుదల చేసింది.
కేంద్రం అంచనాలు

పంట

ఉత్పత్తి (మిలియన్ టన్నుల్లో)

వరి

109.15

గోధుమ

97.44

పప్పు ధాన్యాలు

22.40

తృణ ధాన్యాలు

44.39


30వ ఆసియాన్ సదస్సు
30వ ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాల సదస్సు ఏప్రిల్ 30న మనీలాలో ముగిసింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షత వహించిన ఈ సదస్సును ‘పార్ట్నరింగ్ ఫర్ చేంజ్, ఎంగేజింగ్ ద వరల్డ్’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఆసియాన్ సభ్య దేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలు ఈ సదస్సులో పాల్గొన్నాయి.

‘ఒక ఐపీ- రెండు ఆస్పత్రులు’ పథకం ప్రారంభం
వలస కార్మికుల కోసం ‘ఒక ఐపీ (Insured Person)- రెండు ఆస్పత్రులు’(Two Dispensaries) పథకాన్ని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ మే 1న (కార్మిక దినోత్సవం) ప్రారంభించారు. ప్రస్తుతం బీమా తీసుకున్న వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం ఒక ఆస్పత్రినే ఎంచుకునే వీలుండగా ఈ పథకం కింద తన కోసం ఒక ఆస్పత్రిని, కుటుంబం కోసం మరో ఆస్పత్రిని ఎంచుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: ఒక ఐపీ- రెండు ఆస్పత్రులు’ పథకం
ఎప్పుడు : మే 1
ఎవరు : కేంద్ర కార్మిక శాఖ
ఎందుకు : బీమా ఉన్న వ్యక్తి, అతని కుటుంబం వేరు వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి

పారిశ్రామిక ఉత్పత్తి సూచీకి కొత్త బేస్ ఇయర్
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి కొత్త బేస్ ఇయర్ రానుంది. ఈ మేరకు 2011-12 బేస్ ఇయర్‌తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుంది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరనుంది. ప్రస్తుతం ఐఐపీకి 2004-05 బేస్ ఇయర్‌గా ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఇప్పటికే కొత్త బేస్ ఇయర్‌ను వినియోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: పారిశ్రామిక ఉత్పత్తి సూచీకి కొత్త బేస్ ఇయర్
ఎప్పుడు : మే 9
ఎందుకు : పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల్లో పారదర్శకత కోసం
Published date : 13 May 2017 02:35PM

Photo Stories