Skip to main content

మార్చి 2021 ఎకానమీ

పంజాబ్‌– సింద్‌ బ్యాంక్‌లో భారత ప్రభుత్వ వాటా?
Current Affairs
పీఎస్‌యూ సంస్థ పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 5,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చింది. ఇందుకు వీలుగా బ్యాంకు ప్రభుత్వానికి 335 కోట్లకుపైగా ప్రిఫరెన్స్‌ షేర్లను కేటాయించింది. తాజా కేటాయింపుల తదుపరి బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 83.06 శాతం నుంచి 97.07 శాతానికి ఎగసింది. పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

భారత్‌ బయోటెక్‌తో సీఎస్‌ఐఆర్‌ ఒప్పందం
కోవిడ్‌ వంటి మహమ్మారులను అత్యంత సమర్థంగా ఎదుర్కొనేందుకు, వ్యాధులకు టీకాలు, బయో థెరప్యూటిక్స్‌ను అభివృద్ధి చేసేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అత్యధిక ప్రాధాన్యమిస్తోందని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి.మాండే స్పష్టం చేశారు. భారత్‌లో వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్‌ రూపుదిద్దుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో భారత్‌ బయోటెక్‌తో పాటు బయోవెట్, సాపిజెన్‌ బయోలాజిక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలతో ఉన్నత స్థాయి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని మార్చి 29న తెలిపారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్‌ బయోటెక్‌తో పాటు బయోవెట్, సాపిజెన్‌ బయోలాజిక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)
ఎందుకు : కోవిడ్‌ వంటి మహమ్మారులను అత్యంత సమర్థంగా ఎదుర్కొనేందుకు, వ్యాధులకు టీకాలు, బయో థెరప్యూటిక్స్‌ను అభివృద్ధి చేసేందుకు

తొలిసారిగా విడుదలైన రూ. 20 నాణేలు ఏ రంగ ప్రాధాన్యతను తెలియజేస్తాయి?
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) 2020, మార్చి7న విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణేలు మార్కెట్‌లో చలామణిలోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.20 నాణేలను అందుబాటులోకి తెచ్చింది. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ 20 రూపాయల నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించారు. రూ.20 నాణెం బరువు సుమారు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. అంధులు కూడా సులువుగా గుర్తించగలిగే రీతిలో వీటిని రూపొందించారు.
ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ చక్రవర్తి కన్నుమూత
రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ కేసీ చక్రవర్తి(68) మార్చి 26న గుండెపోటుతో ముంబైలోని తన స్వగృహంలో మరణించారు. చక్రవర్తి 2009–14 మధ్య ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే రాజీనామా చేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మార్కెట్‌లోకి తొలిసారిగా రూ. 20 నాణేలు విడుదల
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)
ఎక్కడ : దేశ వ్యాప్తంగా

ఐరాస నివేదిక ప్రకారం 2021–22లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు?
2021–22 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్‌ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్‌ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) మార్చి 30న విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...
  • కరోనా మహమ్మారి వల్ల 2020–21లో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణిస్తుంది. బేస్‌ ఎఫెక్ట్‌సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7 శాతంగా ఉండే వీలుంది.
  • వర్ధమాన ఆసియా–పసిఫిక్‌ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.
  • మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2021–22 ఆర్థిక ఏడాదిలో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని అంచనా
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆసియా, పసిఫిక్‌ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్‌ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) నివేదిక
ఎందుకు : ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో

జపాన్‌ బ్యాంక్‌ నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు?
జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌(జేబీఐసీ) నుంచి తాజాగా పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ బిలియన్‌ డాలర్ల(రూ. 7,350 కోట్లు) రుణాన్ని పొందింది. ఈ నిధులను దేశీయంగా కోవిడ్‌–19 వల్ల సవాళ్లు ఎదుర్కొంటున్న జపనీస్‌ ఆటో రంగ కంపెనీలకు రుణాలుగా ఎస్‌బీఐ అందించనుంది. 2020 అక్టోబర్‌లోనూ జేబీఐసీ నుంచి ఎస్‌బీఐ బిలియన్‌ డాలర్ల రుణాన్ని సమకూర్చుకుంది. దీంతో 2 బిలియన్‌ డాలర్లను పొందినట్లయ్యింది. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా దినేష్‌ కుమార్‌ ఖారా ఉన్నారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్లు
ఆహారశుద్ధి పరిశ్రమ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) కు ఉత్పత్తి ఆధారిత పథకాన్ని (పీఎల్‌ఐ స్కీమ్‌) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలను ఆరేళ్ల పాటు 2026–27 నాటి వరకు అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జపాన్‌ బ్యాంక్‌ నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఎందుకు : దేశీయంగా కోవిడ్‌–19 వల్ల సవాళ్లు ఎదుర్కొంటున్న జపనీస్‌ ఆటో రంగ కంపెనీలకు రుణాలుగా అందించేందుకు

బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని కేంద్రం ఎంత శాతానికి పెంచింది?
Current Affairs
దేశీయంగా బీమా కంపెనీలకు పెట్టుబడులపరమైన తోడ్పాటు లభించేలా ఇన్సూరెన్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే బిల్లు ‘‘ఇన్సూరెన్స్‌ (సవరణ) బిల్లు 2021’’ కు పార్లమెంటు మార్చి 22న ఆమోదముద్ర వేసింది. వాయిస్‌ వోట్‌ ద్వారా లోక్‌సభలో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటిదాకా జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా చట్టం 1938ని సవరిస్తూ ప్రతిపాదించిన తాజా బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. గతంలో బీమా రంగంలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 2015లో 49 శాతానికి పెంచగా.. తాజాగా దాన్ని 74 శాతానికి పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇన్సూరెన్స్‌ (సవరణ) బిల్లు 2021కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత పార్లమెంటు
ఎందుకు : ఇన్సూరెన్స్‌ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు

ఏ ప్రభుత్వ రంగ సంస్థలో భారత్‌ గ్యాస్‌ విలీనం కానుంది?
ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో భారత్‌ గ్యాస్‌ రిసోర్సెస్‌ (బీజీఆర్‌ఎల్‌) విలీనం కానుంది. ఈ విలీన ప్రతిపాదనకు మార్చి 22న బీపీసీఎల్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా గ్యాస్‌ కొనుగోలు, రిటైలింగ్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే బీజీఆర్‌ఎల్‌ ప్రస్తుతం బీపీసీఎల్‌కు 100 శాతం అనుబంధ సంస్థగా ఉంది. ఈ విలీనంతో కార్పొరేట్‌ స్వరూపాన్ని క్రమబద్ధీకరించడానికి వీలవుతుందని స్టాక్‌ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్‌ తెలిపింది.
మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌
భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2031–32 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవర్భవిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్‌ పేర్కొంది. నిజానికి 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికే భారత్‌ ఈ స్థాయిని అందుకోవాల్సి ఉన్నప్పటికీ, కరోనా ప్రతికూలతలు భారత్‌ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది. 2024–25 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నది భారత్‌ లక్ష్యం.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో విలీనం కానున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత్‌ గ్యాస్‌ రిసోర్సెస్‌ (బీజీఆర్‌ఎల్‌)
ఎందుకు : కార్పొరేట్‌ స్వరూపాన్ని క్రమబద్ధీకరించడానికి వీలవుతుందని

భారీగా పెరిగిన టోకు ధరలు..ఇదే తొలిసారి !
Current Affairs
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.17 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఫిబ్రవరితో పోల్చితే 2021 ఫిబ్రవరిలో టోకు బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధర 4.17 శాతం పెరిగిందన్నమాట. గడచిన 27 నెలల్లో ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహారం, ఇంధనం, విద్యుత్‌ రంగాలు అన్నింటిలో ద్రవ్యోల్బణం పెరగడం గమనార్హం. 2021 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.03 శాతం ఉంటే, 2020 ఫిబ్రవరిలో 2.26 శాతంగా ఉంది.

గత రెండేళ్లుగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదు..ఎందుకంటే?
భారతదేశపు అత్యధిక విలువ కలిగిన కరెన్సీ రూ.2,000 నోటును గడచిన రెండు సంవత్సరాలుగా ముద్రించడంలేదని మార్చి 15వ తేదీన ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వివరాలు ఇవీ...
  • 2018 మార్చి 30 నాటికి వ్యవస్థలో 336.2 కోట్ల కరెన్సీ నోట్లు ఉన్నాయి. మొత్తం కరెన్సీ నోట్లలో ఇది 3.27 శాతంకాగా, విలువలో 37.26 శాతం.
  • 2021 ఫిబ్రవరి 26 నాటికి వ్యవస్థలో పెద్ద నోట్ల సంఖ్య 249.9 కోట్లకు తగ్గింది. నోట్ల సంఖ్యలో ఇది 2.01 శాతంకాగా, విలువలో 17.78 శాతం.
  • వ్యవస్థలో నగదు లావాదేవీల డిమాండ్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో సంప్రదింపుల ప్రాతిపదికన బ్యాంక్‌నోట్లను ఏ స్థాయిలో ముద్రించాలన్న అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది.
  • 2019–21 సంవత్సరాల్లో రూ.2,000 నోట్ల ముద్రణకు ఎటువంటి ఇండెంట్‌ను ఇవ్వలేదు.
  • 2016–17 (ఏప్రిల్‌ 2016– మార్చి 2017) మధ్య 354.29 కోట్ల రూ.2,000 కరెన్సీ నోట్లను ముద్రించినట్లు 2019లో ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో కేవలం 11.15 కోట్ల నోట్ల ముద్రణ మాత్రమే జరిగింది. 2018–19లో ఇది మరింత తగ్గి 4.66 కోట్లకు పడిపోయింది. 2019–20, 2020–21ల్లో రూ.2,000 నోట్ల ముద్రణే జరగలేదు.
  • అధిక విలువ కలిగిన నోట్లను పెద్ద ఎత్తున దాచిపెట్టడాన్ని నిరోధించడంతోపాటు, నల్లధనం ప్రవాహాన్ని అరికట్టడం లక్ష్యాలుగా రూ.2,000 నోటు ముద్రణను నిలిపివేయడం జరిగింది.
  • రూ.500, రూ.1,000 నోట్ల ఉపసంహరణ అనంతరం 2016 నవంబర్‌లో రూ.2,000 నోట్లను వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం రూ.2,000, రూ.500 నోటుతోపాటు రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు చెలామణీలో ఉన్నాయి.

సంపన్న కుటుంబాల విరాళాలు మూడింతలు...ఎలా?

కరోనా మహమ్మారితో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అత్యంత సంపన్న కుటుంబ (హెచ్‌ఎన్‌ఐ) విరాళాలు 2020 ఆర్థిక సంవత్సరంలో మూడింతలు పెరిగి.. రూ. 12,000 కోట్లకు చేరాయి. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రైవేట్‌ రంగం ఇచ్చిన విరాళాల్లో మూడింట రెండొంతుల వాటాకు చేరాయి. బెయిన్‌ అండ్‌ కంపెనీ, దస్రా సంస్థలు కలిపి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ రంగ (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అత్యంత సంపన్న వర్గాల (హెచ్‌ఎన్‌ఐ) కుటుంబాలు) విరాళాలు మొత్తం రూ. 64,000 కోట్లుగా ఉండగా.. ఇందులో కుటుంబాల వాటా దాదాపు 20 శాతంగా ఉంది. మొత్తం నిధుల్లో విదేశీ వనరుల నుంచి వచి్చనది 25 శాతంగా ఉండగా, దేశీ కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కేటాయించినది 28 శాతంగాను, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా మరో 28 శాతంగాను ఉంది. అయితే, దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నప్పటికీ సామాజిక సంక్షేమం మాత్రం కుంటినడకనే నడుస్తుండటం గమనార్హమని నివేదిక పేర్కొంది. ‘కుటుంబ దాతృత్వ కార్యకలాపాలు .. భారత అభివృద్ధి అజెండాను తీర్చిదిద్దేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వీటికి మరింత ప్రోత్సాహం లభిస్తే దేశ శ్రేయస్సుకు తోడ్పడగలవు‘ అని తెలిపింది. విరాళాల్లో అత్యధిక భాగం వాటా విద్య, ఆరోగ్య రంగాలదే ఉంటోందని నివేదిక పేర్కొంది. విద్యా రంగానికి 47 శాతం, ఆరోగ్య రంగానికి 27 శాతం వాటా ఉందని వివరించింది.

ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన మూడో దేశం?
Current Affairs
209 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన మూడో దేశంగా భారత్‌ నిలిచింది. మార్చి 3న విడుదలైన ‘హురూన్‌ గ్లోబల్‌ రిచ్‌లిస్ట్‌ 2021’లో ఈ విషయం వెల్లడైంది. హురున్‌ జాబితా ప్రకారం... 1058 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన దేశంగా చైనా తొలి స్థానంలో నిలిచింది. చైనా తర్వాత 696 మందితో అమెరికా రెండో స్థానంలో ఉంది. 2021, జనవరి 15 వరకూ ఉన్న ఆయా పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సంపదను కూడా హరూన్‌ పరిగణనలోకి తీసుకుంది.
హురూన్‌ రిచ్‌లిస్ట్‌–ముఖ్యాంశాలు
ప్రపంచంలో...
  • అంతర్జాతీయంగా చూస్తే హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో మొత్తం 3,228 బిలియనీర్లు ఉన్నారు.
  • ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 32 శాతం వృద్ధితో 14.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
  • టెస్లా ఎలాన్‌ మస్క్‌ సంపద 197 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌ సంపద 189 బిలియన్‌ డాలర్లు, బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ సంపద 114 బిలియన్‌ డాలర్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
భారత్‌లో...
  • 2020 ఏడాదిలో భారత్‌లో కొత్తగా 40 మంది సంపన్నులు (బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద) అవతరించారు.
  • భారత్‌లో ఉన్న 177 బిలియనీర్లలో 60 మంది ముంబై కేంద్రంగానే ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో 40 మంది, బెంగళూరులో 22 మంది కుబేరులు ఉన్నారు.
  • భారత కుబేరుల జాబితాలో అతిపిన్న వయస్కులుగా జెరోధాకు చెందిన నిఖిల్‌ కామత్‌(34); ఇన్‌స్టాకార్ట్‌కు చెందిన అపూర్వ మెహతా(34) నిలిచారు.
సంపన్నుడిగా ముకేశ్‌...
  • ముకేశ్‌ అంబానీ భారత్‌లో ధనాగ్రజుడిగా తన స్థానాన్ని కొనసాగించారు. ఆయన సంపద నికర విలువ 83 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో ఎనిమిదో సంపన్నుడిగా ముకేశ్‌ నిలిచారు.
  • దేశంలో రెండో కుబేరుడిగా గౌతమ్‌ అదానీ నిలిచారు. గౌతమ్‌ సంపద 2020లో రెట్టింపు అయ్యి 32 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రపంచ సంపన్నుల్లో 48వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
  • దేశంలో మూడో సంపదపరుడిగా ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ ప్రమోటర్‌ శివ్‌నాడార్‌ నిలిచారు. ఆయన సంపద విలువ 27 బిలియన్‌ డాలర్లుగా ఉంది.
  • ఆర్సెలర్‌ మిట్టల్‌కు చెందిన లక్ష్మీ నివాస్‌ మిట్టల్, సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనవాలా శివ్‌నాడార్‌ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన మూడో దేశం భారత్‌
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : హురూన్‌ గ్లోబల్‌ రిచ్‌లిస్ట్‌ 2021
ఎక్కడ : ప్రపంచంలో

అంబుడ్స్‌మన్‌ పరిధిలోకి బీమా బ్రోకింగ్‌ సంస్థలు
బీమా బ్రోకింగ్‌ సంస్థలను అంబుడ్స్‌మన్‌ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌ నిబంధనలు–2017కి సమగ్రమైన సవరణలు చేసింది. ఇన్సూరెన్స్‌ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మార్చి 3న తెలిపింది. పాలసీదారులు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించినట్లు పేర్కొంది.
  • భారతదేశ తొలి ఆర్థిక మంత్రి: ఆర్‌కే షణ్ముకం శెట్టి
  • భారతదేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి: నిర్మలా సీతారామన్‌
Published date : 27 Mar 2021 05:46PM

Photo Stories