Skip to main content

మార్చి 2020 ఎకానమీ

ఆర్‌బీఐ వ్యాపార విపత్తు ప్రణాళిక అమలు
Current Affairs
కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్చి 19 నుంచి వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐకు చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్ 70 మంది ఇందులో విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ వార్ రూమ్ .. ప్రత్యేకంగా డెట్ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలా పాలు పర్యవేక్షిస్తుంది.
విపత్తు ప్రణాళిక...
బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్‌‌స ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్), స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (ఎస్‌ఎఫ్‌ఎంఎస్) మొదలైనవి పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ-కుబేర్, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయి.
ప్రపంచంలోనే తొలిసారి..
‘ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటివి ఏర్పాటు కాలేదు‘ అని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ) అమలు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : కోవిడ్-19 కారణంగా

రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన
కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పేరుతో రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే మూడు నెలలపాటు ఈ ప్యాకేజీని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 26న వెల్లడించారు.
ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ చర్యలు...
  • దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల నిరుపేద రేషన్ కార్డు దారులకు 5 కిలోల చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పుధాన్యాలు అందజేత. వీటిని లబ్ధిదారులు రెండు విడతల్లో తీసుకోవచ్చు.
  • దేశవ్యాప్తంగా నిరుపేద మహిళల 20.4 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు అందుతాయి.
  • నిరుపేద మహిళల కోసం 2016 నుంచి అమలు చేస్తున్న ఉచిత వంటగ్యాస్ పథకంలో భాగంగా వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఎల్పీజీ. అదేవిధంగా, పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,000 పంపిణీ.
  • పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు ఏడాదికిచ్చే రూ.6 వేలను విడతలు వారీగా ముందుగానే అందజేత. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.2 వేలను ఏప్రిల్ మొదటి వారంలో అందజేస్తారు.
  • నెలకు రూ.15 వేల కంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులు 90 శాతం (100 మంది లోపు) ఉండే చిన్న సంస్థలకు వచ్చే మూడు నెలలపాటు వారి పీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనివల్ల 4.8 కోట్ల పీఎఫ్ అకౌంట్లు నిరాటంకంగా కొనసాగుతాయి.
  • దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ఉపాధి హామీ సిబ్బంది రోజువారీ కూలీ రూ.182 నుంచి రూ.202కు పెంపు
  • దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
  • చిన్న సంస్థల ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేదా మూడు నెలల వేతనం (ఏది తక్కువుంటే అది)లో 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే వీలు కల్పించింది.
  • ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటంలో ముందుండే వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య, పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆరోగ్య బీమా. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది.

ప్రభుత్వంపై పడే భారం:
ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 8.7 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున అందజేయడానికి ప్రభుత్వం రూ.16వేల కోట్లు.. ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీకి రూ.45 వేల కోట్లు.. జన్‌ధన్ అకౌంట్లలో డబ్బు జమ చేయడానికి రూ.31 వేల కోట్లు. ఉచిత వంటగ్యాస్ కోసం మరో రూ.13 వేల కోట్లు వెచ్చించనుంది.

యస్ బ్యాంకు షేర్ల కొనుగోలుకు ఎస్‌బీఐ ఆమోదం
Current Affairs
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు (ఈసీసీబీ) నుంచి అనుమతి వచ్చినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్చి 12న వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున మొత్తం రూ. 7,250 కోట్లు చెల్లించనుంది. యస్ బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్‌లో 49 శాతం లోపే ఎస్‌బీఐ వాటా ఉండనుంది.
మొండిబాకీలు, గవర్నెన్స్ లోపాలు, నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంకుపై 2020, ఏప్రిల్ 3 దాకా ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యస్ బ్యాంకులో 725 కోట్ల షేర్లను కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ఎస్‌బీఐ ఈసీసీబీ

మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 18 శాతానికి పెంపు
మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో న్యూఢిల్లీలో మార్చి 14న జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ మేరకు అంగీకరించింది. వినియోగదారుల సమస్యలను అధిగమించేలా జీఎస్టీ నెట్‌వర్క్ డిజైన్ మెరుగుపరిచే బాధ్యతను ఇన్ఫోసిస్‌కు అప్పగించాలని నిర్ణయించింది.
కౌన్సిల్ సమావేశం-ముఖ్యాంశాలు

  • మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక విడిభాగాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది. ఇది 2020, ఏప్రిల్ 1నుంచి అమలవనుంది.
  • విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపైర్, ఓవర్‌హౌల్(ఎంఆర్‌వో)సేవలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.
  • 2018-19 సంవత్సరంలో రూ.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి వ్యాపార సంస్థలకు జీఎస్‌టీఆర్-9సీ దాఖలు చేయనవసరం లేకుండా మినహాయింపు నిచ్చింది.
  • జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసునేందుకు వీలుగా త్వరలో ‘నో యువర్ సప్లయర్’ పేరుతో కొత్త సౌకర్యం.
  • జీఎస్టీ నెట్‌వర్క్ కొత్త వ్యవస్థ 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 18 శాతానికి పెంపు
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

2020లో భారత్ వృద్ధి 5.3 శాతమే: మూడీస్
భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 2020లో 5.3 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ.. మూడీస్ అంచనావేసింది. ఈ మేరకు 2020, ఫిబ్రవరిలో వేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావమే కారణమని మార్చి 17న వెల్లడించింది. 2021లో భారత వృద్ధి రేటు కాస్త పుంజుకుని 5.8 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది.
2020 భారత్ వృద్ధి అంచనాలను మూడీస్ తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తొలుత 6.6 శాతం అంచనాలను ఫిబ్రవరిలో 5.4 శాతానికి కుదించడం జరిగింది. తాజాగా దీనిని 5.3 శాతానికి తగ్గించింది. 2018లో భారత జీడీపీ రేటు 7.4 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020లో భారత్ వృద్ధి 5.3 శాతమే
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ.. మూడీస్
ఎందుకు : కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా

భారత్ వృద్ధి రేటు 5.2 శాతామే: ఎస్ అండ్ పీ
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్‌లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది.
చైనా వృద్ధి రేటు 2.9 శాతం
2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదిస్తున్నట్లు ఎస్ అండ్ పీ తెలిపింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని అభిప్రాయపడింది. మరోవైపు ఆసియా-పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020లో భారత్ వృద్ధి రేటు 5.2 శాతామే
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ
ఎందుకు : కోవిడ్-19 కారణంగా

2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ
కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతానికి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తెలిపింది. ఈ మేరకు మార్చి 18న ఒక నివేదికను విడుదల చేసింది. కోవిడ్-19 వ్యాప్తికి ముందు ప్రపంచ వృద్ధి 2.3 శాతంగా ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50 శాతం మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయని, 1-3 శాతం మరణాలు సంభవించవచ్చని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)
ఎందుకు : కరోనా వైరస్ ప్రభావంతో

కరోనాపై పోరుకు 650 కోట్ల డాలర్లు: ఏడీబీ
కోవిడ్-19(కరోనా వైరస్)పై పోరుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 650 కోట్ల డాలర్ల (రూ.48,100 కోట్లు)ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్-19 వైరస్ అతి పెద్ద ప్రపంచ ఉపద్రవంగా మారిపోయిందని ఏడీబీ ప్రెసిడెంట్ మస్సాత్సు అసకవ వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కొనడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉందని వివరించారు. తమ సభ్య దేశాల తక్షణ అవసరాల నిమిత్తం 650 కోట్ల డాలర్ల ప్యాకేజీని అందిస్తున్నామని మార్చి 18న తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 650 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటన
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)
ఎందుకు : కోవిడ్-19పై పోరుకు

యస్ బ్యాంకుపై మారటోరియం విధింపు
Current Affairs కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఖాతాదారులకు నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.
అడ్మినిస్ట్రేటర్‌గా ప్రశాంత్ కుమార్
యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్‌బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై మారటోరియం విధింపు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : యస్ బ్యాంకుకు విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళిక లేనందున

యస్ బ్యాంక్ పునర్నిర్మాణ స్కీమ్ రూపకల్పన
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదాను రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్ బ్యాంక్ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ 2020, ఏప్రిల్ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు.
అడ్మినిస్ట్రేటర్‌గా ప్రశాంత్
యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓ ప్రశాంత్ కుమార్ మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రశాంత్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదా రూపకల్పన
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు

భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే: ఫిచ్
Current Affairs
భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ మార్చి 2న ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, కరోనా వైరస్ కారణంగా సరఫరా పరంగా అడ్డంకులతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు ఫిచ్ పేర్కొంది.
5.1 శాతానికి కుదింపు: ఓఈసీడీ
కోవిడ్ 19(కరోనా వైరస్) రిస్క్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. గతంలో ఇది 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక మార్కెట్లు, పర్యాటక రంగం, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు మొదలైన అంశాల వల్ల జీ20 దేశాల వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ఫిచ్ సొల్యూషన్స్
ఎందుకు : తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నందున

మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు
స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో వారు రూ. 16,712 కోట్ల రుణాలు పొందినట్లు వివరించింది. ‘2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం తోడ్పడింది’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
2016 ఏప్రిల్ 5న ప్రారంభం..
ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళలకు రూ. 16,712 కోట్ల రుణాలు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
ఎక్కడ : స్టాండప్ ఇండియా పథకం కింద

బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మార్చి 4న ఆమోదముద్ర వేసింది. బ్యాంకుల విలీన నిర్ణయం 2020, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. తాజా విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్.. యునెటైడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకుల విలీన ప్రతిపాదనకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసేందుకు
Published date : 10 Apr 2020 08:01PM

Photo Stories