Skip to main content

జూన్ 2019 ఎకానమీ

భారత్ వృద్ధి 6.8 శాతం: డీబీఎస్ బ్యాంక్
Current Affairs ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది. ముందు 7 శాతంగా అంచనా వేసిన డీబీఎస్.. తాజాగా దాన్ని 6.8 శాతానికి తగ్గించింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను జూన్ 20న విడుదల చేసింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడిన డీబీఎస్ ఆర్‌బీఐ పరపతి విధానం వృద్ధికి కీలకం కానుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20లో భారత్ వృద్ధి 6.8 శాతం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : డీబీఎస్ బ్యాంక్

వాల్‌మార్ట్‌కు 282 మిలియన్ డాలర్ల జరిమానా
భారత్ సహా 4 దేశాల్లో అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలను సెటిల్ చేసుకునేందుకు గాను అమెరికన్ నియంత్రణ సంస్థలకు వాల్‌మార్ట్ 282 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. నిబంధనలకు విరుద్ధంగా వాల్‌మార్ట్ తరఫున థర్డ్ పార్టీ మధ్యవర్తులు విదేశాల ప్రభుత్వాధికారులకు చెల్లింపులు జరపడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడినట్లు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నిర్ధారించడమే ఇందుకు కారణం.

జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ జూన్ 21న ఢిల్లీలో జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలపై, ఎలక్ట్రిక్ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
జీఎస్టీ కౌన్సిల్ కౌన్సిల్ నిర్ణయాలు
  • అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని 2021 నవంబర్ వరకు రెండేళ్లపాటు పొడిగింపు.
  • జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా అక్రమంగా లాభాలు పోగేసుకుంటే ఆ మొత్తంలో 10% జరిమానా విధింపునకు నిర్ణయం. ప్రస్తుతం ఈ జరిమానా నిబంధనల మేరకు గరిష్టంగా రూ.25,000గానే ఉంది.
  • ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను ప్రస్తుతం 12 శాతం ఉండగా, దీన్ని 5 శాతానికి, ఎలక్ట్రిక్ చార్జర్లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించాలన్న ప్రతిపాదనలను ఫిట్‌మెంట్ కమిటీకి నివేదింపు.
  • ఆధార్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు అనుమతి.
  • 2020 జనవరి 1 నుంచి ప్రయోగాత్మక విధానంలో ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ విధానం ప్రారంభం. అప్పటి నుంచి జీఎస్టీ నమోదిత మల్టీప్లెక్స్‌లు ఈ టికెట్లనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే, రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలు ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇన్‌వాయిస్‌లను జారీ చేయాలి.
  • నూతన జీఎస్టీ రిటర్నుల దాఖలు వ్యవస్థ కూడా 2020 జనవరి 1 నుంచి అమల్లోకి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : న్యూఢిల్లీ

పీఎంకేవై కింద 12,305 కోట్ల పంపిణీ
అర్హులైన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం(పీఎంకేవై) కింద ఇప్పటి వరకూ రూ. 12,305 కోట్లు పంపిణీ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో జూన్ 21న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా పీఎంకేవై కింద అందించే రూ. 6,000 మూడు దఫాల్లో చెల్లించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 14.5కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని వివరించారు. భూపరిమితితో నిమిత్తం లేకుండా సహాయం అందిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 87,215.50 కోట్ల భారం పడనున్నదని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి కిసాన్ పథకం(పీఎంకేవై) కింద రూ. 12,305 కోట్ల పంపిణీ
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

బడ్జెట్ హల్వా తయారీలో నిర్మలా
కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో జూన్ 22న జరిగిన ‘బడ్జెట్ హల్వా’ఉత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాధారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణను హల్వా తయారీతో ఆరంభిస్తారు. ఈ ఆనవాయితీలో భాగంగానే జూలై 5న ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణను ప్రారంభించే కార్యక్రమానికి ముందు హల్వా ఉత్సవం చోటు చేసుకుంది.
హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బడ్జెట్ హల్వా ఉత్సవం
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీ

విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం
విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇదంతా కేవలం 1980-2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను జూన్ 24న లోక్‌సభ ముందుంచాయి.
దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని ఈ సంస్థలు పేర్కొన్నాయి. భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్‌మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది.
ఎన్‌సీఏఈఆర్ విశ్లేషణ: 1980-2010 మధ్య విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల అక్రమ సంపద రూ.26.65 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు.
ఎన్‌ఐఎఫ్‌ఎమ్ అంచనా: 1990-2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారు. లెక్కల్లోకి రాని ఆదాయంలో దేశం వెలుపలకు వెళ్తున్న అక్రమాదాయం సుమారు 10 శాతం ఉండొచ్చు.
ఎన్‌ఐపీఎఫ్‌పీ అంచనా: 1997 నుంచి 2009 మధ్య కాలంలో అక్రమంగా దేశం వెలుపలకు వెళ్లిన సొమ్ము స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.2 శాతం నుంచి 7.4 శాతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుంది
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎమ్, ఎన్‌ఐపీఎఫ్‌పీ
ఎక్కడ : విదేశాల్లో

పోలవరం అంచనా వ్యయం 55,548 కోట్లు
పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కటారియా జూన్ 24న ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
సభలో మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. 2018, జనవరిలో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను 2013-14, 2017-18 ధరల సూచీకి అనుగుణంగా వరుసగా రూ.57,941 కోట్లు, రూ.57,297.42 కోట్ల మేర కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించింది. జలవనరుల శాఖలోని సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల విభాగం సలహా కమిటీ.. ఫిబ్రవరి 11న జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. 2017-18 ధరల ప్రాతిపదికన సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోలవరం అంచనా వ్యయం 55,548 కోట్లు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా

చెల్లింపుల డేటా భారత్‌లోనే ఉండాలి: ఆర్‌బీఐ
పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్‌వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు జూన్ 26న డేటా లోకలైజేషన్ నిబంధనలపై ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. అవసరమైతే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేయొచ్చని... కానీ దాన్ని 24 గంటల్లోగా భారత్‌కు మార్చాల్సి ఉంటుందని, విదేశీ సర్వర్ల నుంచి తొలగించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చెల్లింపుల డేటా భారత్‌లోనే ఉండాలి
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అమెరికా నుంచి దిగుమతయ్యే 28 వస్తువులపై పన్ను పెంపు
Current Affairs న్యూఢిల్లీ: అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ భారీగా సుంకాలు పెంచింది. భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇటీవల అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్ అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్‌నట్ తదితర 28 వస్తువులపై పన్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్ 16 నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో తయారయ్యే, అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వాల్‌నట్‌పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. ఫలితంగా ఈ 28 వస్తువులపై పన్ను భారం పెరిగి, దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెంపుతో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల ఆదాయం అధికంగా సమకూరనుంది. కాగా, అమెరికా ప్రభుత్వం చర్యతో భారత్‌కు 2.4కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమెరికా నుంచి దిగుమతయ్యే 28 వస్తువులపై పన్ను పెంపు
ఎప్పుడు: జూన్ 16
ఎక్కడ: భారతదేశం
ఎందుకు: భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇటీవల అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచినందుకు..

భారత్ వృద్ధి రేటు 6.6 శాతమే : ఫిచ్
2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 6.6 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది. తొలుత 7 శాతంగా ఉన్న ఈ అంచనాలను మార్చిలో 6.8 శాతానికి తగ్గించిన ఫిచ్ తాజాగా 6.6 శాతానికి కుదించింది. గత ఏడాది కాలంగా తయారీ, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు తమ తాజా అంచనాలకు కారణమని జూన్ 17న విడుదల చేసిన తన తాజా నివేదికలో ఫిచ్ పేర్కొంది.
ఫిచ్ తాజా నివేదికలోని అంశాలు..
  • 2020-2021లో భారత్ వృద్ధి 7.1 శాతానికి చేరుతుంది. అయితే 2021-2022లో ఈ రేటు 7 శాతానికి దిగివస్తుంది.
  • అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయ పరిస్థితులూ భారత్ వృద్ధి మందగమనానికి కారణమవుతున్నాయి. ఎగుమతుల పెరుగుదలా ఇటీవలి కాలంలో పేలవంగా ఉంది.
  • అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ పెట్టుబడులపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇది ప్రతికూలాంశం.
  • 2020 వృద్ధి రేటును ఇంతక్రితం 2.8 శాతంగా అంచనావేసినా తాజాగా 2.7 శాతానికి కుదిస్తున్నాం.
  • చైనా వృద్ధి రేటు అంచనా కూడా 6.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నాం. అమెరికా వృద్ధి రేటు అంచనా కూడా 1.9 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గిస్తున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 6.6 శాతమే
ఎప్పుడు : 2019-2020లో
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్

రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లా
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లాను యూకో బ్యాంక్ ప్రకటించింది. బిర్లా సూర్య లిమిటెడ్ కంపెనీ కోసం యశోవర్థన్ బిర్లా రూ.67.55 కోట్ల రుణం తీసుకున్నారని, ఎన్ని నోటీసులిచ్చినా, ఈ రుణం చెల్లించకపోవడంతో అతన్ని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తున్నామని జూన్ 17న యూకో బ్యాంక్ తెలిపింది. ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తిని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తే, ఆ వ్యక్తికి ఇతర బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు ఎలాంటి రుణాన్ని మంజూరు చేయవు.
665 మంది రుణ ఎగవేత దారులు/ సంస్థల జాబితాను యూకో బ్యాంక్ తన వెట్‌సైట్లో ఉంచింది. ఈ జాబితాలో జూమ్ డెవలపర్స్ (రూ.310 కోట్ల రుణాలు), ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా(రూ.143 కోట్లు), మోజర్ బేయర్ ఇండియా(రూ.122 కోట్లు) సూర్య వినాయక్ ఇండస్ట్రీస్(రూ.108 కోట్లు) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లా
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : యూకో బ్యాంక్
ఎందుకు : రూ.67.55 రుణం చెల్లించకపోవడంతో

దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్‌లో కోర్టు ఫీజు
ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజులు చెల్లింపునకు వీలుగా తెలంగాణ హైకోర్టు-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ల మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని తెలంగాణ హైకోర్టులో అమలు చేయనున్నారు. డిజిటల్ సేవల్ని వినియోగంలోకి తెచ్చే క్రమంలో ఎస్‌బీఐతో కుదిరిన ఒప్పందం మేరకు జూన్ 19న సాయంత్రం హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ కుదిరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రాల సమక్షంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గీతా ఎస్.పిళ్లైలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజుల చెల్లింపులు
ఎవరు: హైకోర్టు-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)
ఎప్పుడు: జూన్ 19న
ఎక్కడ: తెలంగాణ

ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
Current Affairs డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్)పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్‌బీఐ జూన్ 6న అమలుపరిచింది. వీటిద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్‌టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1-5 వరకు, ఆర్‌టీజీఎస్‌పై రూ.5-50 వరకు చార్జ్ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా

ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ
ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని జూన్ 6న తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా మూడోసారి పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రెపో రేటు 5.75 శాతానికి, రివర్స్ రెపో 5.50 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో జూన్ 6న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. పాలసీ రేట్లు తగ్గడంతో వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గనుంది.
పాలసీ ప్రధానాంశాలు...
  • రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 5.75 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గింపు.
  • మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6 శాతం.
  • పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధంగా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు.
  • జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు.
  • ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4-3.7 శ్రేణిలో ఉంటుంది.
  • వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి
  • డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ చార్జీల రద్దు.
  • బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం.
  • చిన్న రుణ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు) నెలకొల్పేందుకు ‘ఆన్ ట్యాప్’ పద్ధతిలో లెసైన్సుల జారీకి ఆగస్టులో ముసాయిదా మార్గదర్శకాలు త్వరలో విడుదల.
  • పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన.
  • జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు.
  • దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు.
  • పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు.
  • తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7
  • 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా మూడుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి.
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కీలక వడ్డీ రేట్లు తగ్గింపు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)

భారత వృద్ధి 7.2 శాతం : గోల్డ్‌మ్యాన్ శాక్స్
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ వెల్లడించింది. చమురు ధరల్లో తగ్గుదల, రాజకీయ స్థిరత్వం, నిర్మాణ రంగంలో ఉన్న అవాంతరాలను తొలగించడం ఈ వృద్ధి రేటుకు దోహదపడతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి లిక్విడిటీ సమస్యలను తొలగించేందుకు ఆర్‌బీఐ చేపట్టాల్సిన చర్యలను ప్రతిపాదించిందని, ఆస్తులు, అప్పుల మధ్య ఉన్న అంతరం రుణాల వృద్ధిలో తగ్గుదలకు కారణమైందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్

మెక్సికోపై సుంకాల విధింపు రద్దు
మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 5శాతం సుంకం విధించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మధ్య అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాకను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మెక్సికో హామీ ఇవ్వడంతో ఆ దేశంపై సుంకం వడ్డించాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రకటించిన ప్రకారం జూన్ 10 నుంచి మెక్సికో ఉత్పత్తులపై సుంకం విధింపు అమల్లోకి రావలసి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెక్సికోపై సుంకాల విధింపు రద్దు
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : అమెరికా అధ్యక్షుడుడొనాల్డ్ ట్రంప్

హీరో మోటోకార్ప్‌కు బీఎస్-జుఖి గుర్తింపు
హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడల్‌కు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) బీఎస్-జుఖి గుర్తింపు దక్కింది. ఈ మేరకు హీరో సంస్థకు ఐసీఏటీ డెరైక్టర్ దినేశ్ త్యాగి గుర్తింపు పత్రాన్ని అందజేశారు. దీంతో దేశంలో ఈ గుర్తింపు పొందిన తొలి ద్విచక్రవాహన సంస్థగా హీరో మోటోకార్ప్ నిలిచింది. తాజా గుర్తింపుతో బీఎస్-జుఖి నిబంధనలతో స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడల్ ఉత్పత్తిని కంపెనీ ప్రారంభించుకోవచ్చు. జయపూర్‌లో కంపెనీ ఆర్‌అండ్‌డీ హబ్‌లో బీఎస్-జుఖి ఉద్గార నిబంధనలతో మోటార్‌సైకిల్ డిజైన్, అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) బీఎస్-జుఖి గుర్తింపు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడల్, హీరో మోటోకార్ప్
ఎక్కడ : భారత్

జూలై 1 నుంచి ఆర్‌టీజీఎస్ చార్జీలు ఎత్తివేత
ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్)లపై అన్ని రకాల చార్జీలను జూలై 1 నుంచి ఎత్తివేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. అదే రోజు నుంచి కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయాలని బ్యాంకులను కోరినట్టు జూన్ 11న తెలిపింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేస్తున్న నగదు బదిలీలపై ఆర్‌బీఐ నామమాత్రపు చార్జీలను బ్యాంకుల నుంచి వసూలు చేస్తోంది. దీంతో బ్యాంకులు సైతం కస్టమర్ల నుంచి చార్జీల రూపంలో ఆదాయాన్ని రాబట్టుకుంటున్నాయి. ఎస్‌బీఐ అయితే నెఫ్ట్ లావాదేవీలపై రూ.1-5 వరకు, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై రూ.5-50 మధ్యలో వసూలు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జూలై 1 నుంచి ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్)లపై ఛార్జీల ఎత్తివేత
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)

ఏటీఎం చార్జీల సమీక్షకు కన్నన్ కమిటీ
ఏటీఎం చార్జీలను పునఃసమీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వి.జి.కన్నన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని జూన్ 11న ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చార్టీలు, వ్యయాలను సమీక్షించి.. అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుందని పేర్కొంది. కమిటీ తొలి సమావేశమైననాటి నుంచి రెండు నెలల వ్యవధిలో తన నివేదికను అందించాల్సి ఉంటుంది. 2019, ఏప్రిల్ చివరినాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలు ఉండగా.. 88.47 కోట్ల డెబిట్ కార్డులు, 4.8 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 80.9 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్‌బీఐ వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వి.జి.కన్నన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : ఏటీఎం చార్జీల సమీక్షకు

డేవిడ్సన్ బైక్‌లపై భారీగా సుంకాలు : ట్రంప్
అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్ బైక్‌లపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్ బైక్ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్థిక దృష్టితో మాత్రమే చూసే డొనాల్ట్ ట్రంప్, భారత్‌ను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు. కాగా, జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28-29 మధ్య జీ20 సమావేశంలో మోదీతో ట్రంప్ సమావేశం కానున్నారు.

ఆరు బ్యాంకులకు ఫిచ్ స్థిరమైన రేటింగ్
Current Affairs ఫిచ్ రేటింగ్‌‌స సంస్థ ఎస్‌బీఐ సహా ఆరు బ్యాంకుల దీర్ఘకాలిక ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్‌లను (ఐడీఆర్‌లు) బీబీబీ మైనస్‌గా కొనసాగించింది. ఇది స్థిరమైన రేటింగ్‌ను సూచిస్తుంది. అలాగే, ఐడీబీఐ బ్యాంకు దీర్ఘకాల ఐడీఆర్‌ను బీబీప్లస్‌గా పేర్కొంది. ఎస్‌బీఐ, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంకు, బీవోఐల దీర్ఘకాల ఐడీఆర్‌లను స్థిరంగా కొనసాగించడం వెనుక ప్రభుత్వం నుంచి జాతీయ ప్రాధాన్యం కలిగిన ఈ బ్యాంకులకు అసాధారణ సహకారం ఉంటుందన్న అంచనాలే కారణమని ఫిచ్ తెలిపింది. అలాగే, వయబిలిటీ రేటింగ్‌ను కూడా ఈ బ్యాంకులకు సంబంధించి స్థిరంగా కొనసాగించింది. కెనరా బ్యాంకు వయబిలిటీ రేటింగ్‌ను మాత్రం బీబీ నుంచి బీబీ మైనస్‌కు తగ్గించింది.

2018-19లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) మే 31న గణాంకాలను విడుదల చేసింది. వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయి. ఇక 2018-19 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, రెండో క్వార్టర్‌లో 7.1 శాతంగాను, మూడో త్రైమాసికంలో 6.6 శాతంగాను నమోదైంది. 2017-18లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం నమోదైన విషయం విదితమే.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో నెలకొన్న సంక్షోభాలు మొదలైన తాత్కాలిక అంశాలు నాలుగో త్రైమాసికంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018-19లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో)

తలసరి ఆదాయం నెలకు రూ.10,534
2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం నెలకు రూ.10,534కు పెరిగిందని కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) మే 31న తెలిపింది. 2017-18లో నమోదైన నెలవారీ తలసరి ఆదాయం రూ.9,580తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం అధికం. ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 2018-19లో రూ.1,26,406గా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,14,958తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. దేశ ప్రజల అభ్యున్నతికి తలసరి ఆదాయాన్ని కొలమానంగా పరిగణిస్తారు. తాజా గణాంకాల ప్రకారం.. స్థూల దేశీయ సంపద 2018-19లో సుమారు 11.3 శాతం వృద్ధితో రూ. 188.17 లక్షల కోట్లుగా ఉంది. 2017-18లో ఇది రూ. 169.10 లక్షల కోట్లు.
ద్రవ్య లోటు 3.39 శాతం
2018-19లో ద్రవ్యలోటు జీడీపీలో 3.39 శాతంగా నమోదైంది. బడ్జెట్‌లో సవరించిన అంచనా అయిన 3.4 శాతంతో పోలిస్తే స్వల్పంగా తక్కువ. వ్యయాలు తగ్గడం, పన్నుయేతర ఆదాయం పెరగడం దోహదపడింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకారం.. విలువ పరంగా చూస్తే ద్రవ్యలోటు రూ.6.45 లక్షల కోట్లుగా నమోదైంది. దేశంలో నిరుద్యోగ రేటు 2017-18 సంవత్సరంలో 6.1 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇది 45 ఏళ్లలోనే అత్యధిక రేటు కావడం గమనార్హం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తలసరి ఆదాయం నెలకు రూ.10,534
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరం
ఎవరు : కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో)

ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్ డౌన్‌గ్రేడ్
ఐసీఐసీఐ బ్యాంకు రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఒక అంచె డౌన్‌గ్రేడ్ చేసింది. దీర్ఘకాలిక ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్) ‘BBB’ నుంచి ‘BB+’కి తగ్గించినట్లు వెల్లడించింది. అలాగే లాభదాయకత రేటింగ్‌ను ‘bbb-’ నుంచి ‘bb+’కి మార్చింది. ఐడీఆర్ భవిష్యత్ అంచనాలను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. రుణాల చెల్లింపులో మెరుగైన సామర్థ్యాలను BBB రేటింగ్ సూచిస్తుంది. మరోవైపు BB రేటింగ్.. స్పెక్యులేటివ్ ధోరణిని సూచిస్తుంది. ఇక దేశీ బ్యాంకింగ్ రంగం పనితీరు అంచనాలను ‘bbb-’ నుంచి ‘bb+’కి తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్ డౌన్‌గ్రేడ్
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్

రుణ ఎగవేతదారుగా దిఘి పోర్ట్ చీఫ్ విజయ్
ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా దిఘి పోర్ట్ చైర్మన్ విజయ్ గోవర్ధన్‌దాస్ కలాంత్రి, ఆయన కుమారుడు.. కంపెనీ డెరైక్టరు విశాల్ కలాంత్రిలను జూన్ 5న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. పోర్టు అభివృద్ధి పేరిట వీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని 16 బ్యాంకుల కన్సార్షియం నుంచి వీరు దాదాపు రూ. 3,334 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే దిఘి పోర్ట్‌పై దివాలా ప్రక్రియ పిటీషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ విచారణకు స్వీకరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రుణ ఎగవేతదారుగా దిఘి పోర్ట్ చీఫ్ విజయ్
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)

భారత్ వృద్ధి 7.5 శాతం :ప్రపంచ బ్యాంక్
2019-20 ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. దీంతో 2019-20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. భారత్‌లో పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వృద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు జూన్ 5న విడుదల చేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి భారత దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి 7.5 శాతం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : ప్రపంచ బ్యాంక్
Published date : 18 Jun 2019 04:05PM

Photo Stories