Skip to main content

ఏప్రిల్ 2018 ఎకానమీ

జన్‌ధన్ ఖాతాల్లో 80 వేల కోట్ల డిపాజిట్లు
Current Affairs జన్‌ధన్ యోజన కింద బ్యాంకుల్లో ప్రారంభమైన ఖాతాల్లో డిపాజిట్లు రూ.80,545 కోట్లకు చేరాయి. జీరో బ్యాలన్స్తో బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని 2014 ఆగస్ట్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో ఏప్రిల్ 11 నాటికి ఖాతాల సంఖ్య 31.45 కోట్లకు చేరుకోగా అందులో డిపాజిట్ అయిన మొత్తం రూ.80,545 కోట్లకు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జన్‌ధన్ ఖాతాల్లో రూ.80,545 కోట్లకు చేరిన డిపాజిట్లు
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎందుకు : జీరో బ్యాలన్స్తో ఖాతాలను ప్రారంభించేందుకు ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజనలో భాగంగా

వంద బిలియన్ డాలర్ల కంపెనీగా టీసీఎస్
వంద బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ (రూ.6,60,000 కోట్లు) సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కు అందుకున్న వాటిలో 64వ కంపెనీగా నిలిచింది. మొత్తం సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో టీసీఎస్ వాటా 11 శాతంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2007లో వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది.
1970లో కార్యకలాపాలు ప్రారంభించిన టీసీఎస్ 2004లో మొదటిసారిగా ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చింది. టాటా గ్రూప్ ఆదాయంలో 85 శాతం వాటా కలిగి ఉన్న ఈ సంస్థలో 130 దేశాలకు చెందిన 3,87,200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వంద బిలియన్ డాలర్ల కంపెనీగా టీసీఎస్
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎక్కడ : భారత్‌లో

రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం ప్రారంభం
పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ)’ పథకం ప్రారంభమైంది. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు వాటి స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి కృషిచేస్తారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు జన్ ధన్, వన్ ధన్, గో ధన్ (మానవ వనరుల, అటవీ సంపద, గో సంపద)పై దృష్టిపెట్టాలని మోదీ సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : రామ్‌నగర్, మధ్యప్రదేశ్
ఎందుకు : పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి

భారత్‌కు 8.1 మిలియన్ల ఉద్యోగాలు అవసరం
ప్రపంచ బ్యాంకు రెండేళ్లకోసారి విడుదల చేసే సౌ త్ ఏషియా ఎకనమిక్ ఫోకస్(ఎస్‌ఏఈఎఫ్) నివేదికను ‘ఉపాధిలేని వృద్ధి’ పేరుతో ఏప్రిల్ 16న విడుదల చేసింది. ఇందులో భారత్‌కు ఏటా 8.1 మిలియన్ల ఉద్యోగాలు అవసరమని వెల్లడించింది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేసింది.

వృద్ధి రేటును 7.4 శాతంగా పేర్కొన్న ఐఎంఎఫ్
భారత్ 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతం వృద్ధి రేటు ను నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు.. వరుసగా 6.6 శాతం, 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం: ఏడీబీ
Current Affairs భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఏప్రిల్ 11న తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటును 7.6 శాతంగా విశ్లేషించిన ఏడీబీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని వివరించింది.
ఏడీబీ 2018 అవుట్‌లుక్‌లో 2018లో భారత్‌లో ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం, 2019లో 5 శాతం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లో తొలుగుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ వంటి పలు సంస్కరణలు భారత్ వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. దీని వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా ఆకర్షించగలుగుతుందని వివరించింది. ఇటీవల వ్యాపార అవకాశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన గ్లోబల్ ర్యాంక్‌లో భారత్ 130 నుంచి 100కు చేరిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018-19లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)

రత్నగిరిలో సౌదీ ఆరామ్‌కో రిఫైనరీ
ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థ, సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. మహారాష్ట్రలోని రత్నగిరి (బాబుల్‌వాడి) లో నిర్మించనున్న ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కన్సార్షియమ్‌లో భాగస్వామ్యం దక్కించుకుంది. ఈ మేరకు 16వ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్ మినిస్టీరియల్ సమావేశంలో ఐవోసీ, బీపీసీఎల్ మరియు హెచ్‌పీసీఎల్ తో కుదిరిన ఒప్పందంపై సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఖలీద్ అల్- ఫలిహ్ సంతకాలు చేశారు. 14,000 ఎకరాల్లో 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించే ఈ రిఫైనరీని 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
4,400 కోట్ల డాలర్లతో నిర్మించనున్న ఈ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌పీసీఎల్) రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రాసెస్ చేస్తుంది. ఏడాదికి 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను అందించగలదు. ఈ కన్సార్షియమ్‌లో సౌదీ ఆరామ్‌కో కంపెనీకి 50 శాతం వాటా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియమ్ కంపెనీ, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్‌లకు కలపి 50 శాతం చొప్పున వాటాలుంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో అతిపెద్ద రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : సౌదీ అరేబియా కు చెందిన సౌదీ ఆరామ్‌కో కంపెనీ మరియు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్
ఎందుకు : బాబుల్‌వాడి, రత్నగిరి మహారాష్ర్ట

ఎఫ్‌డీఐలకు అనుకూల దేశాల్లో భారత్
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అత్యంత అనుకూల దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల సంస్థ, యూబీఎస్ ప్రకటించింది. కొనసాగుతున్న వ్యవస్థాగత సంస్కరణల కారణంగా భారత్‌లో ఎఫ్‌డీఐలు పెరుగుతున్నాయని తన తాజా నివేదికలో పేర్కొంది. 2017 అక్టోబర్, నవంబర్ లో అమెరికాలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు నాలుగో వంతు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. వీటి ద్వారా ఐదేళ్లలో 7,500 కోట్ల డాలర్ల మేర ఎఫ్‌డీఐలు భారత్‌లోకి రానున్నట్లు అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌డీఐలకు అనుకూల దేశాల్లో భారత్
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల సంస్థ, యూబీఎస్

భారత బ్యాంకుల్లో పాలనా వైఫల్యాలు: ఎస్ & పీ
భారత బ్యాంకుల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు బ్యాంకింగ్ వ్యవస్థలో పాలనా వైఫల్యాలను ఎత్తి చూపేలా ఉన్నాయని ఎస్‌అండ్ పీ గ్లోబల్ రేటింగ్‌‌స వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్ వ్యవస్థ రిస్క్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ విధానాలను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని తన నివేదికలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత బ్యాంకుల్లో పాలనా వైఫల్యాలు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : ఎస్ అండ్ పీ రేటింగ్ సంస్థ
ఎందుకు : భారత బ్యాంకుల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో

30 వేల కోట్లకు నాబార్డ్ అధీకృత మూలధనం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ అధీకృత మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచింది. దీంతో గ్రామీణాభివృద్ధి, సాగుకు మరిన్ని రుణాలు అందించడం ద్వారా తన కార్యకలాపాలు పెంచుకునేందుకు నాబార్డ్‌కు వీలు పడనుంది.

భారత్ వృద్ధి 7.4 శాతం: ఐఎంఎఫ్
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018-19లో ఇది 7.8 శాతానికి చేరుకుని భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక రంగంపై అంచనాలను ఐఎంఎఫ్ ఏప్రిల్ 17న వెలువరించింది. ఇదే కాలానికి చైనా వృద్ధి రేటు 6.6%, 6.4%గానే ఉంటుందని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018-19 లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా అంచనా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఐఎంఎఫ్

2018లో సాధారణ వర్షపాతం: ఐఎండీ
దేశంలో గత రెండేళ్ల మాదిరిగానే 2018లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతవరణ శాఖ (ఐఎండీ) ఏప్రిల్ 16న ప్రకటించింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే 2018లో 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ డెరైక్టర్ జనరల్ కేజే రమేశ్ వాతావరణ విభాగం తొలివిడత అంచనాలను విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018లో సాధారణ వర్షపాతం
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఐఎండీ

ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌కు 130వ స్థానం
అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ 180 దేశాలతో రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌కు 130వ స్థానం దక్కింది. కాగా, 2017తో పోల్చితే భారత్ 13 స్థానాలను మెరుగుపరుచుకోగా, చైనా ఒక స్థానం ఎగబాకి 110వ ర్యాంకు పొందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 43 దేశాల్లో భారత్‌కు 30వ స్థానం దక్కింది.

దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏప్రిల్ 10న దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బెరై గౌడ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. రాష్ట్రాలకు నిధుల పంపిణీకి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షపూరితంగా ఉన్నాయని.. వాటిని రద్దు చేసి కొత్త విధానాలను రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. తమిళనాడు, తెలంగాణ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

ఆర్‌బీఐ పాలసీరేట్లు యథాతథం
Current Affairs కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) ని 4 శాతంగా కొనసాగించింది. ఏప్రిల్ 5న జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ ఈ మేరకు నిర్ణయించింది.
ఎంపీసీ మొదటి ఆరు నెలల కాలానికి ద్రవ్యోల్బణ అంచనాలను 4.7-5.1 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరిలో జరిగిన పాలసీ సమీక్షలో దీనిని 5.1-5.6 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో ద్రవ్యోల్బణం 4.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.
వృద్ధి అంచనాల కొలమానానికి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విధానం నుంచి ఆర్‌బీఐ మళ్లీ పూర్వపు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) విధానానికి మళ్లింది. కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి నుంచి వృద్ధి అంచనాల విశ్లేషణకు జీవీఏ విధానాన్ని వినియోగిస్తోంది.
పాలసీ ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో రేటు 5.75%
2018 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ద్రవ్యోల్బణం అంచనా 4.7-5.1%
2019 మార్చి వరకు ద్రవ్యోల్బణం అంచనా 4.4%
జీడీపీ వృద్ధి అంచనాలు 7.4 శాతం
తదుపరి పాలసీ సమీక్ష జూన్ 6న.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కీలక పాలసీ రేట్లు యథాతథం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ

బిట్ కాయిన్ సంస్థలకు సేవలు వద్దు: ఆర్‌బీఐ
బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీలు జరిపే సంస్థలకు సేవలను కొనసాగించవద్దని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపు సేవల సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎండ్-టు-ఎండ్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సహా యూజర్ల నుంచి సేకరించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిట్ కాయిన్ సంస్థలకు సేవలు వద్దని ఆర్‌బీఐ ఆదేశం
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపు సేవల సంస్థలకు
ఎందుకు : బిట్‌కాయిన్ ధ్రువీకృత కరెన్సీ కాదు కాబట్టి

ఇండోర్‌లో ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ 3ఆర్ సదస్సు
ఆసియా, పసిఫిక్ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ సదస్సు ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభిస్తారు. జపాన్ పర్యావరణ శాఖ మంత్రి తదహికో ఇటోతో పాటు పలు దేశాల నుంచి 40 మంది మేయర్లు, భారత్ నుంచి 100 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరవుతారు.
ఈ సందర్భంగా ‘3ఆర్’ అనే అభివృద్ధి మంత్రాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 3ఆర్ అంటే తక్కువ వినియోగం (రెడ్యూస్), పునర్వినియోగం (రీయూజ్), శుద్ధి చేసి వినియోగించడం (రీసైకిల్). ఆసియా-పసిఫిక్ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ 3ఆర్ సదస్సు
ఎప్పుడు : ఏప్రిల్ 10 - 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఇండోర్, మధ్యప్రదేశ్

ఉదయ్ కోటక్ కమిటీ సిఫార్సులకు సెబీ ఆమోదం
కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను (గవర్నెన్‌‌స) కట్టుదిట్టం చేసేందుకు ఉదయ్ కోటక్ కమిటీ చేసిన సిఫార్సులను సెబీ మార్చి 28న ఆమోదించింది. కమిటీ మొత్తం 80 సిఫార్సులు చేయగా... వాటిలో 80 శాతాన్ని సెబీ ఆమోదించింది. ఇందులో లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్‌‌స మార్కెట్‌ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్ నిబంధనల్లో సవరణలు వంటి ప్రతిపాదనలున్నాయి.
సెబీ ఆమోదించిన సిఫార్సులు
  • లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును సీఈఓ/ఎండీ, చైర్మన్‌గా విభజించనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఆధారంగా టాప్- 500 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు.
  • 2019 ఏప్రిల్ 1 నాటికి టాప్-500 లిస్టెడ్ కంపెనీలన్నీ కచ్చితంగా కనీసం ఒక స్వతంత్ర మహిళా డెరైక్టర్‌ను నియమించాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి టాప్-1000 లిస్టెడ్ కంపెనీలకు దీన్ని అమలు చేస్తారు.
  • టాప్-1000 లిస్టెడ్ కంపెనీల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి కనీసం ఆరుగురు డెరైక్టర్లు ఉండాలి. 2020 ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనను టాప్-2000 లిస్టెడ్ కంపెనీలకు వర్తింపజేస్తారు.
  • ఒక వ్యక్తి ఎనిమిది లిస్టెడ్ కంపెనీల వరకూ మాత్రమే డెరైక్టర్‌గా ఉండొచ్చుననే నిబంధన ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి వస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఏడుకు తగ్గిస్తారు. ప్రస్తుతం ఒక వ్యక్తి 10 కంపెనీల్లో డెరైక్టర్ పదవిలో ఉండేందుకు అవకాశం ఉంది.
  • స్వతంత్ర డెరైక్టర్ల అర్హత, ఆడిట్, రెమ్యూనరేషన్ (పారితోషికం), రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీల్లో మరింత పాత్ర ఉండేవిధంగా నిబంధనల్లో మార్పు చేశారు.
  • స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ కు ప్రమోటర్ల వాటాలను ఫ్రీజ్ చేయనున్నారు. నిబంధనలను సరిగ్గా పాటించని కంపెనీల షేర్లలో ట్రేడింగ్ ను సస్పెండ్ చేస్తారు.
  • క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఎలా వినియోగించారనే సమాచారాన్ని కంపెనీలు ఇకపై కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది.
  • ఆడిటర్ల వివరాలు, వాళ్లకిచ్చే ఫీజు, రాజీనామా చేస్తే దానికి గల కారణాలతో పాటు డెరైక్టర్ల నైపుణ్యం, అనుభవం వంటి అంశాలన్నీ కంపెనీలు కచ్చితంగా బహిర్గతం చేయాలి.
  • లిస్టెడ్ కంపెనీలు, వాటికి సంబంధించిన అన్‌లిస్టెడ్ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ కూడా ఇకపై తప్పనిసరి. అదేవిధంగా లిస్టెడ్ కంపెనీలన్నీ 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి కన్సాలిడేటెడ్ త్రైమాసిక ఫలితాలను కచ్చితంగా ప్రకటించాలి.
  • దివాలా చట్టం (ఐబీసీ) ప్రకారం సంబంధిత కంపెనీల్లో కనీస పబ్లిక్ వాటా, ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్, ప్రమోటర్ల పునర్‌విభజన వంటి అంశాల్లో అదనంగా మరింత సమాచారాన్ని వెల్లడించాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉదయ్ కోటక్ కమిటీ సిఫార్సులకు సెబీ ఆమోదం
ఎప్పుడు : మార్చి 28
ఎందుకు : కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్‌‌స ను కట్టుదిట్టం చేసేందుకు

ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్విడ్ ప్రో కో దుమారం
దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ సీఈవో, ఎండీ చందా కొచర్ క్విడ్ ప్రో కో కు పాల్పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చందా కొచర్ భర్త దీపక్ కొచర్, మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... అనతికాలంలోనే కేవలం రూ.9 లక్షలకే న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్‌కి బదలాయించేశారు. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ఇదంతా జరిగింది. వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) మొండి బకాయిల్లో చేరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్విడ్ ప్రో కో దుమారం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : చందా కొచ్చర్, ఆమె కుటుంబం
ఎందుకు : వీడియోకాన్‌కు రుణం జారీ చేయడం వల్ల లబ్ధి పొందినందుకు

‘ఈ-వే బిల్లు’ ప్రారంభం
Current Affairs
రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారానికి సంబంధించిన ఈ వే బిల్లు వ్యవస్థ ఏప్రిల్ 1 వ తేది నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చింది. రూ.50 వేల విలువ దాటిన సరుకులు రవాణా చేయాలంటే ఈ-వే బిల్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే ఒకే రాష్ట్రంలో జరిగే వ్యాపారాల్లో ప్రస్తుతానికి ఈ-వే బిల్లు అవసరం లేదు. జూన్ 1 నుంచి దీనికి కూడా ఈ-వే బిల్లును వర్తింపచేయనున్నారు. ఈ-వే బిల్లుతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకులను రవాణా చేసుకునే వీలు కలుగుతుంది.
అయితే నాన్ మోటార్ వాహనాల ద్వారా రవాణా చేసే సరుకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రైలులో రవాణా చేసేవి, రక్షణ శాఖ, కస్టమ్స్‌లకు సంబంధించిన సరుకులు, ఖాళీ కంటెయినర్లను ఈ-వే బిల్లుల నుంచి మినహాయించారు. నేపాల్, భూటాన్ దేశాలకు సంబంధించిన ఎగుమతులు, దిగు మతులకు కూడా ఈ-వే బిల్లు అవసరం లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ వే బిల్లు వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : అంతరాష్ట్ర సరుకు రవాణా కోసం

ఉపాధి కూలీల వేతనం పెంపు
ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడున్న రూ.197ల వేతనాన్ని రూ.205లకు పెంచుతున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అపరాజిత సారంగి పేర్కొన్నారు. రేట్ల పెంపు తర్వాత అత్యధికంగా రోజువారీ కూలీని హర్యానాలో రూ. 281, అత్యల్పంగా బిహార్, జార్ఖండ్ రూ.168 చొప్పున చెల్లిస్తున్నారు. పెరిగిన వేతనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉపాధి కూలీల వేతనం పెంపు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

నీతి ఆయోగ్ జిల్లా ర్యాంకుల్లో అట్టడుగున మెవత్
దేశంలో అత్యంత వెనుకబడిన 101 జిల్లాల ర్యాంకులను నీతి ఆయోగ్ మార్చి 28న విడుదల చేసింది. ఈ జిల్లాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్’ కార్యక్ర మంలో ఉన్నాయి. కాగా, తాజా ర్యాంకుల్లో హరియాణలోని మెవత్ అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం అత్యుత్తమ పనితీరు కనబరచింది. మెవత్ తర్వాత మధ్యప్రదే శ్‌లోని సింగురౌలి, తెలంగాణలోని కుమ్రంభీమ్ అసిఫాబాద్ అత్యంత వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల ప్రాజెక్టులకు రూ.4,500 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టే రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మార్చి 28న సమావేశమైన కేబినెట్ 2020 వరకు ‘ఈశాన్య రాష్ట్రాల మండలి’ కింద చేపట్టబోయే వివిధ రకాల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Published date : 04 May 2018 02:46PM

Photo Stories