Skip to main content

డిసెంబరు 2018 ఎకానమీ

భారత్ వృద్ధి రేటు 7.2 శాతం : ఐసీఐసీఐ Edu news
భారత్ జీడీపీ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా, 2019-20లో 7.4 శాతం వరకు నమోదవుతుందని ఐసీఐసీఐ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు డిసెంబర్ 21న ఒక నివేదికను విడుదల చేసింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రభావాల నుంచి రియల్ ఎస్టేట్, చిన్న స్థాయి పరిశ్రమలు ఇంకా బయటపడకపోవడం వంటి కారణాలు వృద్ధి రేటుకు ప్రధాన అవరోధాలని ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్ వృద్ధి రేటు 7.2 శాతం
ఎప్పుడు : 2018-19లో
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంకు

మూడు బ్యాంకుల విలీనానికి ఆమోదం
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోదం తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిసెంబర్ 21న ఈ విషయం వెల్లడించింది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉండనుంది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీనానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ

23 వస్తు, సేవలపై జీఎస్టీ తగ్గింపు
మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే 23 వస్తువులు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో డిసెంబర్ 22న జరిగిన జీఎస్టీ మండలి 31వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు 2019, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని జీఎస్టీ మండలి తెలిపింది. ధరలు తగ్గనున్న వాటిలో సినిమా టికెట్లు, టీవీ, కంప్యూటర్ తెరలు, పవర్ బ్యాంకులు ఉన్నాయి. పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చిన వాటిలో శీతలీకరించిన, నిల్వ చేసిన కూరగాయలు ఉన్నాయి.
జీఎస్టీలో గరిష్ట పన్ను శాతం అయిన 28 శాతం శ్లాబులో ఉన్న ఏడు వస్తువులు, సేవలపై పన్నును కుదించడంతో ఆ శ్లాబులో 28 వస్తువులు, సేవలే మిగిలాయి. 99 శాతం వస్తువులపై పన్నును 18 శాతం లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
జీఎస్టీ త గ్గింపు వస్తువులు, సేవలు
28 శాతం నుంచి 18 శాతానికి...
32 అంగుళాల వరకున్న టీవీ తెరలు, కంప్యూటర్, రూ.100కు పైనున్న సినిమా టికెట్లు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, కప్పీ, ట్రాన్స్‌మిషన్ షాఫ్ట్‌లు, గేర్ బాక్సులు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, వీడియో గేమ్ పరికరాలు, పునర్వినియోగ టైర్లు.
28 శాతం నుంచి 5 శాతానికి...
దివ్యాంగులను మోసుకెళ్లే వాహనాల విడి భాగాలు
12 శాతం నుంచి 0 శాతానికి...
మ్యూజిక్ బుక్స్
18 శాతం నుంచి 5 శాతానికి...
చలువ రాయి ముక్కలు
5 శాతం నుంచి 0 శాతానికి...
శీతలీకరించిన, ప్యాకింగ్ చేసిన కూరగాయలు
18 శాతం నుంచి 12 శాతానికి...
రూ.100 లోపున్న సినిమా టికెట్లు, సహజ బెరడుతో తయారైన వస్తువులు తదితరాలు
12 శాతం నుంచి 5 శాతానికి...
సహజ బెరడు, ఊతకర్ర, ఫ్లైయాష్ ఇటుకలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 23 వస్తు, సేవలపై జీఎస్టీ తగ్గింపు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : జీఎస్టీ మండలి

త్వరలో కొత్త రూ. 20 నోటు
అదనపు ఫీచర్లతో కూడిన కొత్త 20 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో తీసుకురానుంది. 2018 మార్చి నాటికి వ్యవస్థలో చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.20 నోట్ల వాటా 9.8 శాతంగా ఉన్నట్లు ఆర్‌బీఐ సమాచారం తెలియజేస్తోంది. 2016 మార్చి నాటికి వ్యవస్థలో 492 కోట్ల రూ.20 నోట్లు చలామణిలో ఉండగా 2018 మార్చి నాటికి ఈ సంఖ్య 1,000 కోట్లకు పెరిగింది.
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ అప్పటి వరకు వ్యవస్థలో లేని రూ.2,000, రూ.200 నోట్లతోపాటు, కొత్త రూపంలో రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 కరెన్సీ నోట్లను మహాత్మాగాంధీ సిరీస్ కింద తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
త్వరలో కొత్త రూ. 20 నోటు
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

నీతి ఆయోగ్ వ్యూహపత్రం విడుదల
దేశ జీడీపీలో 9-10 శాతం వృద్ధి రేటును సాధించడంతోపాటు 2022-23నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 4 లక్షల కోట్ల డాలర్లకు పెంచే లక్ష్యంతో రూపొందించిన వ్యూహపత్రంను నీతిఆయోగ్ డిసెంబర్ 19న విడుదల చేసింది. ‘‘స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా @ 75’’ పేరుతో ఈ వ్యూహపత్రాన్ని రూపొందించారు. భారత్ ముందుగా వచ్చే ఐదేళ్లు (2018-23) 8-9 శాతం జీడీపీ సాధించాలని నీతి ఆయోగ్ ఈ పత్రంలో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 2.7 లక్షలకోట్ల డాలర్లున్న దేశ ఎకానమీ 2022-23 నాటికి 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని వివరించింది.
భారత్ ప్రాథమిక రంగంపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం కాబట్టి రైతులను పరిపుష్టం చేయాలని నీతిఆయోగ్ ఈ పత్రంలో సూచించింది. అయితే రైతు కష్టాలు తీర్చేందుకు రుణమాఫీ సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడింది. అధిక వృద్ధి సాధనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన 41 రంగాల గుర్తించి, వీటిపై తీసుకోవాల్సిన విసృ్తత చర్యలను వ్యూహపత్రంలో పొందుపరిచింది. భారత్ 2022నాటికి స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవం) అవుతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా @ 75 పేరుతో వ్యూహపత్రం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : నీతి ఆయోగ్

518 లక్షల కోట్లకు వ్యక్తిగత సంపద : కార్వీ
Current Affairs
2023 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో వ్యక్తుల దగ్గరుండే మొత్తం సంపద రూ.518 లక్షల కోట్లకు చేరనుందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ‘ఇండియా వెల్త్ రిపోర్ట్ 2018’ పేరుతో రూపొందించిన నివేదికను డిసెంబర్ 7న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం వ్యక్తుల సంపద ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. డెరైక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్‌‌స ఈ సంపద వృద్ధికి తోడ్పడనుండగా వచ్చే అయిదేళ్లలో ఈ రెండూ 24.41 శాతం, 21.04 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత సంపద 14 శాతం పెరిగి రూ. 392 లక్షల కోట్లకు చేరింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే నేరుగా షేర్లలో చేసే పెట్టుబడులకు ప్రాధాన్యం పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2023 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.518 లక్షల కోట్లకు వ్యక్తిగత సంపద
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ
ఎక్కడ : భారత్

భారత్ వృద్ధి రేటును తగ్గించిన ఫిచ్
2018-19 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటుకు సంబంధించి ముందుగా వెలువరించిన అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తగ్గించింది. ఈ మేరకు వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి కుదిస్తున్నట్లు డిసెంబర్ 7న పేర్కొంది. అధిక వ డ్డీ రేట్ల భారం, రుణ లభ్యత తగ్గుమఖం పట్టడం వంటి అంశాల కారణంగా వృద్ధి అంచనాలను తగ్గించినట్లు వివరించింది. 2018 జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనావేసిన ఫిచ్ 2018 సెప్టెంబర్‌లో దానిని 7.8 శాతానికి పెంచింది. ప్రస్తుతం 7.2 శాతానికి తగ్గించింది.
ఫిచ్ తాజా అంచనాల ప్రకారం భారత్ వృద్ధి రేటు 2019-20లో 7 శాతంగా, 2020-21లో 7.1 శాతంగా ఉంటుంది. 2017-18లో భారత్ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు 2019 చివరినాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 75 స్థాయికి పడిపోవచ్చని (ప్రస్తుతం 71 స్థాయిలో కదలాడుతోంది) ఫిచ్ లెక్కగట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటును 7.2 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరానికి
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్

రెమిటెన్స్ లో భారత్‌కు అగ్రస్థానం
ప్రవాసులు స్వదేశాలకు పంపే నగదు(రెమిటెన్స్)లో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు వలసలు, అభివృద్ధి వార్షిక నివేదికను డిసెంబర్ 8న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు 2018లో అత్యధికంగా రూ.5.7 లక్షల కోట్ల (8,000 కోట్ల డాలర్లు) నగదును స్వదేశానికి పంపారు. భారత్ తర్వాతి స్థానాల్లో రూ.4.78 లక్షల కోట్లతో చైనా, రూ.2.42 లక్షల కోట్లు చొప్పున మెక్సికో, ఫిలిప్పీన్స్, రూ.1.85 లక్షల కోట్లతో ఈజిప్టు ఉన్నాయి. 2018లో అభివృద్ధి చెందుతున్న దేశాల రెమిటెన్స్ లు అత్యధిక స్థాయిలో 10.8 శాతం మేర పెరిగి రూ.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే అధిక ఆదాయం ఉన్న దేశాల రెమిటెన్స్ లు 10.3 శాతం పెరిగి రూ.49 లక్షల కోట్లకు చేరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెమిటెన్స్-2018లో భారత్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ చందా పెంపు
జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ డిసెంబర్ 10న ప్రకటించారు. అలాగే ఎన్‌పీఎస్ నుంచి రిటైర్మెంట్ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్, ఈపీఎఫ్ పథకాల మాదిరే ఎన్‌పీఎస్‌కు కూడా ఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది.
ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ చందా పెంచటం వల్ల 8 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు ఎన్‌పీఎస్‌లో డెట్, ఈక్వీటీల్లోనూ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించనుంది. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ పథకంగా ఎన్‌పీఎస్ అమలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో ప్రభుత్వ చందా పెంపు
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ఏడీబీ
భారత్ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా, 2019-20లో 7.6 శాతంగా నమోదవుతుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) వెల్లడించింది. ఈ మేరకు ‘ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2018 అప్‌డేట్’ పేరుతో డిసెంబర్ 12న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత జీడీపీ 2018-19లో క్యూ1లో 8.2 శాతం, క్యూ2లో 7.1 శాతంగా నమోదైంది. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో వృద్ధి సగటున 7.6 శాతంగా ఉంది.
మరోవైపు చైనా 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని, 2019-20లో 6.3 శాతం వృద్ధిని సాధిస్తుందని ఏడీబీ అంచనావేసింది. దేశీయంగా అధిక డిమాండ్ కారణంగా ఆసియా దేశాలు విదేశీ ప్రతికూలతలను తట్టుకోగలవని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరం
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)

యథాతథంగా వడ్డీరేట్లు : ఆర్‌బీఐ
Current Affairs కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) డిసెంబర్ 5న ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో రేటు 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. 2018లో ఇప్పటివరకు రెండుసార్లు(జూన్, ఆగస్ట్ నెలల్లో) రెపో రేటును పావు శాతం చొప్పున పెంచారు.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం(2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి నాటికి) రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. గత పాలసీ సమీక్షలో 3.9-4.5 శాతంగా అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 2.7-3.2 శాతానికి కోత విధించింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయి (రెండు శాతం అటుఇటుగా)లో కట్టడి చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకొంది.
వృద్ధి రేటు 7.4 శాతం...
2018-19 ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 7.4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యథాతథంగా రెపోరేటు, రివర్స్ రెపోరేటు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా
Published date : 15 Dec 2018 11:54AM

Photo Stories