Skip to main content

అక్టోబర్ 2017 ఎకానమీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 2018
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ - 2018లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది ఇదే ర్యాంకింగ్స్‌లో 130వ స్థానంలో భారత్ ఈసారి 30 స్థానాలు మెరుగుపరుచుకుంది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. పన్నులు, లెసైన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...
  • 2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది.
  • ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.
  • భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది.
  • గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142.

న్యూజిలాండ్ టాప్..
సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికా 6వ స్థానం, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచాయి. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణల నివేదిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : 100వ ర్యాంకులో భారత్

దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ ‘గూగుల్’
Current Affairs
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్.. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మారుతీ సుజుకీ, యాపిల్ ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనికేషన్‌‌స సంస్థ ‘కొహ్న్ - వోల్ఫ్’ ఈ విషయాలను వెల్లడించింది. సోనీ, యూట్యూబ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి బ్రాండ్‌‌స టాప్-10లో స్థానం పొందాయి. దాదాపు 67 శాతం మంది వినియోగదారులు వారి కొనుగోళ్లలో బ్రాండ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే.. అమెజాన్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఉంది. దీని తర్వాతి స్థానంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్ వంటి సంస్థలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ - గూగుల్
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కోహ్న్ - వోల్ఫ్ సంస్థ

ఆర్‌కామ్-సిస్టెమా డీల్‌కు డాట్ అంగీకారం
రిలయన్‌‌స కమ్యూనికేషన్‌‌సతో (ఆర్‌కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్‌ఎస్‌టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సిస్టెమా శ్యామ్ వైర్‌లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్‌లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్‌కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌కామ్ - సిస్టెమో(ఎస్‌ఎస్‌టీఎల్) డీల్‌కు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : టెలికం విభాగం (డాట్)

జాతీయ రహదారుల నిర్మాణానికి 7 లక్షల కోట్లు
ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్టు, ఇతర జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 7 లక్షల కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది.
భారత్ మాల
భారత్‌మాల ప్రాజెక్టులో దేశ సరిహద్దులతోపాటుగా కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ (దాదాపు 50 వేల కిలోమీటర్లు) జాతీయ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కలుపుకుని ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. భారత్‌మాల ప్రాజెక్టుల తొలి దశలో 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 10 లక్షల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేసింది. 2021-22 నాటికి ఈ ప్రతిపాదిత భారత్‌మాల ప్రాజెక్టు పనులను ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, మోర్త్, రాష్ట్రాల పీడబ్ల్యూడీ శాఖల సహకారంతో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి
కేబినెట్ ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కార్గోలు వేగవంతంగా చేరేలా ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి కూడా ఉంది. ఈ ఎకనమిక్ కారిడార్లలో ముంబై-కొచ్చిన్-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పణజీ, సంబల్‌పూర్-రాంచీ వంటి 44 ప్రాజెక్టులున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 7 లక్షల కోట్లు
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : భారత్ మాల, ఎకనమిక్ కారిడార్ల అభివృద్ధి పథకంలో భాగంగా

పీఎస్‌బీ బ్యాంకులకు 2 ఏళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు
మొండిబకాయిలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ. 1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రానుండగా, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రూ. 18,139 కోట్లు, ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా మరో రూ. 58,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మేరకు మూలధనం సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అక్టోబర్ 24న వెల్లడించారు. ఉపాధి కల్పించే చిన్న, మధ్య స్థాయి సంస్థల రంగానికి ఊతమిచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థలో పీఎస్‌బీలు కీలకపాత్ర పోషించేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.
బ్యాంకింగ్ రంగంలో 2015 మార్చి నాటికి రూ. 2.75 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు 2017 జూన్ నాటికి రూ.7.33 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఇందులో 12 సంస్థలు కట్టాల్సినదే రూ.1.75 లక్షల కోట్ల మేర ఉంది. ఈ కేసులు ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు మూలధనంగా ఇవ్వాలని నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

2017లో భారత్ వృద్ధి రేటు 7 శాతం : ప్రపంచబ్యాంక్
Current Affairs
ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2017-18)ంలో భారత్ వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణమని వెల్లడించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక.. తయారీ, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతర్గతంగా అడ్డంకుల కారణంగా ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని, ఇది దేశ వృద్ధి అవకాశాలపై మరింతగా ఒత్తిడి పెంచగలదని హెచ్చరించింది. అయితే, ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల మధ్య సమతౌల్యత ఉండేలా తగు విధానాలు పాటిస్తే 2018లో వృద్ధి కొంత మెరుగుపడి 7.3 శాతం స్థాయికి చేరగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 6.7 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది.
2017-18లో వృద్ధికి కోత ఇలా..

సంస్థ

తాజా అంచనా

గత అంచనా

ఏడీబీ

7%

7.4%

ఓఈసీడీ

6.7%

7.3%

ఐఎంఎఫ్

6.7%

7.2%

ప్రపంచబ్యాంకు

7%

7.2%

ఆర్‌బీఐ

6.7%

7.3%

క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7 శాతంగా అంచనా
ఎప్పుడు : 2017-18లో
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎందుకు : పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యల కారణంగా

ఎయిర్‌టెల్ చేతికి టాటా టెలీ సర్వీసెస్
రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్ 12న ప్రకటించింది. తద్వారా.. నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలీ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. ఈ మేరకు ‘‘ఇది పూర్తిగా రుణ రహిత, నగదురహిత డీల్‌గా ఉంటుంది’’ అని ఇరు సంస్థలు వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో వెల్లడించాయి.
అయితే, టాటా సంస్థ స్పెక్ట్రమ్‌కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో దాదాపు 20% (సుమారు రూ.1,500-2,000 కోట్లు) బాధ్యత మాత్రమే ఎయిర్‌టెల్ తీసుకుంటుంది. సుమారు రూ. 31,000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన టాటా టెలీ రుణాలను టాటా సన్‌‌స తీరుస్తుంది. తాజా ఒప్పందంతో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌టెల్‌లో విలీనం కానున్న టాటా టెలీసర్వీసెస్
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎందుకు : రుణభారం కారణంగా

రెపో రేటు యథాతథం
Current Affairs
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో అక్టోబర్ 4న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు యథాతథంగా ఉండటంతో పాటు రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉండనుంది. అలాగే వృద్ధి రేటును 7.3% నుంచి 6.7%కి ఆర్‌బీఐ పరిమితం చేసింది. ద్రవ్యోల్బణాన్ని గతంలో 4 శాతం నుంచి 4.5 శాతంగా అంచనా వేసిన ఆర్‌బీఐ దీనిని 4.2-4.6 శాతం శ్రేణికి పెంచింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్‌ఎల్‌ఆర్)ను 20% నుంచి 19.5%కి తగ్గించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తమే ఎస్‌ఎల్‌ఆర్.
పాలసీ ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతంగా యథాతథం
రివర్స్ రెపో 5.75 శాతంగా కొనసాగింపు
వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 6.7 శాతానికి కోత
ద్రవ్యోల్బణం ద్వితీయార్ధంలో 4.2-4.6% శ్రేణిలో ఉంటుందని అంచనా
తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5-6 న ఉంటుందని సూచన
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెపో రేటు యథాతథం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లు తగ్గాయి. ఈ మేరకు అక్టోబర్ 6న జరిగిన జీఎస్టీ మండలి 22వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలు ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్ను చెల్లింపుతో పాటు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇప్పటి వరకు కాంపోజిషన్ పథకంలో చేరేందుకు రూ.75 లక్షల టర్నోవర్ కలిగిన సంస్థలను అనుమతిస్తుండగా, ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు.
సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు

వస్తువు

పాత పన్నురేటు

సవరించిన రేటు

బ్రాండెడ్ కాని నమ్‌కీన్

12 శాతం

5 శాతం

ఆయుర్వేద ఔషధాలు

12 శాతం

5 శాతం

ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు

12 శాతం

5 శాతం

ఖాఖ్రా ఆహార పదార్థం (గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రసిద్ధి)

12 శాతం

5 శాతం

ICDSకింద పాఠశాలలకు ఇచ్చే ఆహార పొట్లాలు

12 శాతం

5 శాతం

జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్

12 శాతం

5 శాతం

ప్రభుత్వ కాంట్రాక్టులు(ఎక్కువ మంది కార్మికులు అవసరం)

12 శాతం

5 శాతం

మనుషులు తయారుచేసే నూలు

18 శాతం

12 శాతం

స్టేషనరీ వస్తువులు

18 శాతం

12 శాతం

నేలపై పరిచే బండలు(గ్రానైట్, మార్బుల్ మినహా)

18 శాతం

12 శాతం

నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు

28 శాతం

18 శాతం

ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వేస్ట్)

28 శాతం

5 శాతం

క్విక్ రివ్యూ:
ఏమిటి :
27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : జీఎస్టీ మండలి
ఎందుకు : వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు

కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి అక్టోబర్ 9న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. అలాగే.. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు

బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
Current Affairs
కెనడాకు చెందిన బంబార్డియర్.. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది. అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎందుకు : రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాల సరఫరా కోసం

భారత రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు
భారత విదేశీ రుణ భారం ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 485.5 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం ముగింపు(మార్చి నెలాంతంలో 472 బిలియన్ డాలర్లు) పోల్చితే 3 శాతం మేర ఈ భారం పెరిగిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ డెట్ విభాగంలోకి భారీగా రావడం.. త్రైమాసికంలో విదేశీ రుణం 3 శాతం పెరగడానికి కారణమని వివరించింది. జీడీపీ నిష్పత్తిలో విదేశీ రుణం 20.3 శాతంగా ఉందని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ విదేశీ రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : 2017 జూన్ నాటికి
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ‘ఎక్సైజ్’ సుంకం తగ్గింపు
లీటర్ డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 3న కేంద్ర ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.2 చొప్పున తగ్గాయి. ఈ ధరలు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.26 వేల కోట్లు లోటు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

భారత వృద్ధి రేటును తగ్గించిన ఏడీబీ
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తగ్గించింది. జూలైతో పోల్చితే 0.4 శాతం తగ్గించి ఏడు శాతానికి పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ వృద్ధి అంచనాలను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఆసియా అభివృద్ధి అంచనాలపై సెప్టెంబర్ 25న నివేదికను విడుదల చేసింది.
Published date : 14 Oct 2017 12:54PM

Photo Stories