Skip to main content

ఆగస్టు 2020 ఎకానమీ

నెట్‌మెడ్స్‌లో రిలయన్స్ కు వాటాలు
Current Affairs
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలోని నెట్‌మెడ్స్‌ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 620 కోట్లు అని రిలయన్స్ తెలిపింది. తాజా కొనుగోలుతో వైటలిక్‌ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్‌ఐఎల్‌కు దక్కుతాయి. ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్‌ఐఎల్‌ 2019 ఏడాదే సి– స్వ్కేర్‌ అనే సంస్థను కొనుగోలు చేసింది.
670 పట్టణాల్లో ...
నెట్‌మెడ్స్‌ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్‌ ది కౌంటర్‌), ఆరోగ్యం, వెల్‌నెస్‌ ఉత్పత్తులను ఆన్లైన్‌ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నెట్‌మెడ్స్‌ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)

ఆర్‌బీఐ ఎడ్యుకేషన్‌ డాక్యుమెంట్‌ విడుదల
ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ఐదు ప్రధాన అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముందుకు వచ్చింది. ఈ మేరకు నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ 2020– 2025’ (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ) పేరుతో ఆర్‌బీఐ ఆగస్టు 20న డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఆర్‌బీఐకి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీఎఫ్‌ఈ) సంస్థ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ 2020–25ని రూపొందించింది.
ఐదు ప్రధాన అంశాలు...
తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు.. కంటెంట్‌ (విషయాలు), కెపాసిటీ (సామర్థ్యం), కమ్యూనిటీ (సంఘం), కమ్యూనికేషన్‌ (సమాచారం), కొలాబరేషన్‌ (సహకారం)ను ప్రధానంగా ఆర్‌బీఐ ప్రస్తావించింది. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆర్థిక నియంత్రణ సంస్థలు ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్‌ఆర్డీఏ ప్రధాన ఎజెండాగా ఉంది. దేశ ప్రజ ల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు, సాధికార భారత్‌ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు వేటికవే విడిగా కాకుండా, కలసికట్టుగా (బహుళ భాగస్వాములతో) పనిచేసే విధానం అవసరమని సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ 2020– 2025’ (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ) డాక్యుమెంట్ విడుదల
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు :ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు

రిలయన్స్‌, అల్లానలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఆగస్టు 20న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రిలయన్స్‌ రిటైల్, జియో, అల్లాన కంపెనీల ప్రతినిధులు, సెర్ప్‌ సీఈఓ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌తోఅవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు రిలయన్స్, అల్లానా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయి. తద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది మా ప్రయత్నం’’ అని పేర్కొన్నారు.
రిలయన్స్‌ రిటైల్‌...
 
  • మహిళల కిరాణా వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తుంది.
  • దుకాణాల నిర్వహణ, ఆధునికీకరణ, వ్యాపార సమర్థతను పెంచడంలో మహిళలకు శిక్షణ ఇస్తుంది.
  • సరసమైన ధరలకే ఉత్పత్తులను అందిస్తుంది. పండ్లు, కూరగాయల సాగుకు సహకరిస్తుంది.
జియో...
  • ఈ కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తుంది.
  • ప్రభుత్వం, లబ్ధిదారులైన మహిళల మధ్య నేరుగా అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది.
  • జియో చాట్‌ ద్వారా నేరుగా 20 లక్షల మంది లబ్ధిదారులతో ఆడియో, వీడియో సందేశాలు పంపడం, ఇతరత్రా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తుంది.
అల్లాన...
  • ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎగుమతి రంగంలో విశేష అనుభవం ఉంది. 1865 నుంచి కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
  • గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో సాంకేతిక సహకారం అందిస్తుంది. వాటిని తిరిగి కొనుగోలు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రిలయన్స్‌ రిటైల్, జియో, అల్లాన కంపెనీలతో ఎంఓయూ
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు:మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా

కేంద్రానికి రూ.57,128 కోట్ల ఆర్‌బీఐ డివిడెండ్‌
Current Affairs
2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్‌ ఆగస్టు 14న ఆమోదముద్ర వేసింది. సెంట్రల్‌ బోర్డ్‌ 584వ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే 2019–20 ఆర్‌బీఐ అకౌంట్స్‌ను, వార్షిక నివేదికనూ ఆమోదించింది.
సీఆర్‌బీ 5.5 శాతం...
ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్‌ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్‌లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్‌ బఫర్‌ (సీఆర్‌బీ)ను కొనసాగించాలని ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు ఆమోదం
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌లో చైనా బ్యాంకుకు వాటాలు
ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీసీ) స్వల్ప వాటాలు కొనుగోలు చేసింది. సుమారు రూ. 15 కోట్ల విలువ చేసే షేర్లను చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 15,000 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ మార్గంలో ఇన్వెస్ట్‌ చేసిన 357 సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో పీబీసీ కూడా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకులో పీబీసీకి సుమారు 0.0065 శాతం వాటాలు ఉన్నట్లవుతుంది.
సాధారణంగా సెంట్రల్‌ బ్యాంకులు .. బంగారం, విదేశీ కరెన్సీలు, ప్రభుత్వ.. ప్రైవేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అదే క్రమంలో పీబీసీ కొన్నాళ్లుగా భారత్‌లోని పలు బ్లూచిప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తోంది. మార్చి త్రైమాసికంలో గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలోనూ వాటాలను 1 శాతం పైగా స్థాయికి పెంచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :ఐసీఐసీఐ బ్యాంక్‌లోవాటాల కొనుగోలు
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీసీ)

నెట్‌మెడ్స్‌లో రిలయన్స్ కు వాటాలు
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలోని నెట్‌మెడ్స్‌ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 620 కోట్లు అని రిలయన్స్ తెలిపింది. తాజా కొనుగోలుతో వైటలిక్‌ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్‌ఐఎల్‌కు దక్కుతాయి. ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్‌ఐఎల్‌ 2019 ఏడాదే సి– స్వ్కేర్‌ అనే సంస్థను కొనుగోలు చేసింది.
670 పట్టణాల్లో ...
నెట్‌మెడ్స్‌ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్‌ ది కౌంటర్‌), ఆరోగ్యం, వెల్‌నెస్‌ ఉత్పత్తులను ఆన్ లైన్‌ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నెట్‌మెడ్స్‌ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటన
Current Affairs కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం ఆగస్టు 6న నిర్ణయించింది. అయితే వృద్ధికి ఊపును అందించే క్రమంలో సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లూ ప్రకటించింది. 2020, జూన్‌లో ద్రవ్యోల్బణం 6.09 శాతం నమోదయ్యింది... 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంది.
రెపో రేటు 4 శాతం...
రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం) 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 3 శాతంగా కొనసాగనుంది.
IMG
90 శాతం రుణం..
కరోనా నేపథ్యంలో చిన్న సంస్థలు, వ్యాపారులు, మధ్య, సామాన్యుని కి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. దీనిప్రకారం... తన వద్ద ఉన్న పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90 శాతం రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ (పసిడి రుణాలకు లోన్‌ టు వ్యాల్యూ నిష్పత్తి) ఇది 75 శాతంగా ఉంది.
నాబార్డ్ కు వెసులుబాటు
వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్‌బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్‌ సెక్టార్‌ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఆయా రంగాలకు రుణాలను అందించే విషయంలో నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ద్రవ్య లభ్యత విషయంలో కొంత వెసులుబాటు కలుగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఆర్‌బీఐద్రవ్యపరపతి విధాన ప్రకటన
ఎప్పుడు: ఆగస్టు 6
ఎవరు:ఆర్‌బీఐద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)
ఎందుకు:ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి

బ్యాంకింగ్‌ సేవల కోసం ప్రత్యేక హబ్‌
అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్‌ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, బ్యాంకింగ్‌ సేవల పటిష్టత లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేషన్‌ హబ్‌) ఏర్పాటు చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ఆగస్టు 6న గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్‌ ప్రధాన బాధ్యతల్లో ఒకటి.
ఓడీఆర్‌ ఏర్పాటు...
కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యలే ధ్యేయంగా ఈ దిశలో డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఒక పైలట్‌ స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ (ఓడీఆర్‌) ఏర్పాటు ప్రతిపాదన కూడా ఈ విభాగంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటి.
స్టార్టప్స్‌కు ప్రాధాన్యత..
ఇక స్టార్టప్స్‌ విషయానికి వస్తే, వీటికి ప్రాధాన్యతా రంగం హోదాను కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. తద్వారా ఈ తరహా యూనిట్లు తగిన రుణ సౌలభ్యతను సకాలంలో అందుకోగలుగుతాయి.
పీఎస్‌ఎల్‌ పరిమితి పెంపు..
ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్‌ఎల్‌) పరిధిలో చిన్న, సన్నకారు రైతులకు, అలాగే బలహీన వర్గాలకు కూడా రుణ పరిమితులను పెంచాలని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్‌ఎల్‌) పునరుత్పాదకత ఇంధన రంగాలకు రుణ పరిమితులను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. సోలార్‌ పవర్, కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు
ఎప్పుడు: ఆగస్టు 6
ఎవరు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు:బ్యాంకింగ్‌ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం కోసం

జీవితకాల గరిష్టానికి ఫారెక్స్‌ నిల్వలు
భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్‌) ఏ వారానికి ఆ వారం సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిలకు చేరుతున్నాయి. 2020, జూలై 31తో ముగిసిన వారంలో అంతకుముందు వారం (జూలై 24)తో పోల్చిచూస్తే, ఫారెక్స్‌ నిల్వలు ఏకంగా 11.93 బిలియన్ డాలర్లు పెరిగి 534.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 7న విడుదల చేసింది. తాజా ఫారెక్స్ నిల్వలు దాదాపు 13.4 నెలల దిగుమతులకు సరిపోతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ తెలిపారు.
ఆర్‌బీఐ వివరాల ప్రకారం...
  • పసిడి నిల్వల విలువలు పెరగడం, దిగుమతులు అంతగా లేకపోవడంతో తగ్గిన విదేశీ మారక వినియోగం, డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్‌ విలువలు ఎగయడం వంటి అంశాలు ఫారెక్స్‌ రికార్డులకు కారణం.
  • జూన్ 5న భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు మొట్టమొదటిసారి అర ట్రిలియన్ మార్క్‌ దాటాయి. 2020, ఏప్రిల్‌ నుంచి జూలై 31 వరకూ ఫారెక్స్‌ నిల్వలు 56.8 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
  • సమీక్షా వారంలో ఫారిన్ కరెన్సీ అసెట్స్‌ విలువ 10.347 బిలియన్ డాలర్లు ఎగసి490.829 బిలియన్ డాలర్లకు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జీవితకాల గరిష్టానికి భారత ఫారెక్స్‌ నిల్వలు
ఎప్పుడు: ఆగస్టు 7
ఎవరు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధి
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ మౌలిక నిధి’ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు అత్యంత పవిత్రదినమైన బలరామ్‌ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నిధిని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. ఈ నిధి ద్వారా రుణాలు అందించడానికి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలుత రైతులకు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు.
ప్రధాని ప్రసంగం-వివరాలు
  • చిన్న రైతుల సాధికారతే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో భారీగా సంస్కరణలు తీసుకువస్తున్నాం.
  • వ్యవసాయంలో దిగుబడులు పెంచడంలో ఇబ్బందుల్ని అధిగమించామని, పండిన పంటల్ని కాపాడుకోవడంలో ఎదురయ్యే సమస్యల్ని ఈ నిధి తీరుస్తుంది.
  • ఈ నిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఆధునిక సౌకర్యాల కల్పన జరిగేలా పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుంది.
  • ఒకే దేశం, ఒకే మండీ విధానం ద్వారా రైతులు పండిన పంటల్ని ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తున్నాం.
పీఎం కిసాన్ నిధుల విడుదల
పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.17 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ ఆరో విడత నిధుల విడుదల ద్వారా రైతు ఖాతాలో నేరుగా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ అయిందని ప్రధాని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన తర్వాత 10 వేల కోట్ల మందికిపైగా రైతులకు 90 వేల కోట్ల వరకు నిధులు అందాయి.
వ్యవసాయ మౌలిక నిధి-వివరాలు
  • పండిన పంటను నిల్వ చేసుకునే సామర్థ్యం లేక రైతులు పంటల్ని రోడ్ల మీద పారబోసే దృశ్యాలను మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. అలాంటి వృథాని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసింది.
  • ఈ నిధితో రైతులు సొంతంగా తమ గ్రామాల్లోనే పంటల్ని నిల్వ చేసుకోవడానికి ఆధునిక సదుపాయాలను కల్పించుకోవడానికి వీలు కలుగుతుంది.
  • గ్రామాల్లోనే పంట సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు వ్యవసాయం పండుగలా మారుతుంది. అంతేకాదు వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది.
  • మొత్తం 10 వేల ఆహార శుద్ధి కేంద్రాలు, 350అగ్రీ స్టార్టప్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
  • పంట దిగుబడుల్ని కాపాడుకుంటే మంచి ధర వచ్చేవరకువేచి చూసే అవకాశం కూడా రైతులకు ఈ నిధి ద్వారా లభిస్తుంది.
  • రైతు సంఘాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రీ స్టార్టప్‌లు వంటి వారందరికీ ఈ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకు క్రెడిట్‌ గ్యారంటీ ఈ నిధి ద్వారా రైతులకు లభిస్తుంది. మొత్తం నాలుగేళ్ల పాటు రుణాలు మంజూరు చేస్తారు.
  • 2020 ఏడాది 10వేల కోట్లు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 30 వేల కోట్ల రూపాయల చొప్పున రుణాలు పంపిణీ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధి ప్రారంభం
ఎప్పుడు: ఆగస్టు 9
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు:వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం

రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత
నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం... రూ. 2 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016, నవంబర్ 8న రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్‌ చేసిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్‌ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
నాలుగేళ్లు.. 7,071 కోట్ల నోట్లు...
గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్‌ను కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ తక్కువ చేసింది. డిజిటల్‌ పేమేంట్లకుప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్‌బీఐ... వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది.
గత నాలుగేళ్లుగా ముద్రించిన నోట్ల సంఖ్య (కోట్లలో)

సంవత్సరం

రూ. 500 నోటు

రూ. 2 వేల నోటు

2016–17

429.22

354.29

2017–18

578.10

11.15

2018–19

628.48

4.66

2019–20

822.77



మొత్తం

2,458.57

370.1

క్విక్ రివ్యూ:
ఏమిటి:రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: భారతీయ రిజర్వు బ్యాంక్
ఎందుకు:నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు

భారత్‌కు ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
Current Affairs
భారత్‌లోకి వివిధ మౌలిక ప్రాజెక్టులకు వచ్చే ఏడాది కాలంలో 3 బిలియన్ డాలర్ల రుణాలు అందించడానికి సంబంధించిన ప్రణాళికలను బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ఢిల్లీ–మీరట్‌ ర్యాపిడ్‌ రైల్‌ , ముంబై మెట్రో రైల్, ముంబై అర్బన్ట్రాన్స్పోర్ట్‌ ప్రాజెక్టు, చెన్నై పెరిఫిరల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు, హరియాణా బైపాస్‌ లింక్‌ రైల్వే ఉన్నాయని బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీజే పాండ్యన్ఒక ఇంటర్వూ్యలో తెలిపారు.
మెత్తం రుణాల్లో 25 శాతం..
ఏఐఐబీ ఇచ్చిన మొత్తం రుణాల్లో 25 శాతంతో భారత్‌ అతిపెద్ద రుణ గ్రహీతగా ఉందని ఈ సందర్భంగా పాండ్యన్తెలిపారు. 2020 జూలై 16 నాటికి 24 దేశాల్లోకి 87ప్రాజెక్టులకు 19.6 బిలియన్డాలర్ల రుణాలను ఏఐఐబీ ఆమోదించినట్లు వెల్లడించారు. 2016లో ఏఐఐబీ ప్రారంభమైననాటి నుంచీ భారత్‌లోకి 17 ప్రాజెక్టులకు 4.3 బిలియన్డాలర్ల రుణాలను ఆమోదించినట్లు చెప్పారు.
టీవీలపై నియంత్రణ..
కలర్‌ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రకాల టీవీలను దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి లైసెన్స్ పొందాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు 3 బిలియన్ డాలర్ల రుణం
ఎప్పుడు: జూలై 30
ఎవరు : ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ)
ఎందుకు: భారత్‌లోకి వివిధ మౌలిక ప్రాజెక్టులకు

దేశంలో 21 యూనికార్న్‌ స్టార్టప్‌లు
దేశీయంగా యూనికార్న్‌ హోదా పొందిన (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) స్టార్టప్‌లు 21 ఉన్నాయి. ఈ విషయాన్ని హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ జాబితా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో తీర్చిదిద్దిన యూనికార్న్‌ల సంఖ్య 40కి పైగా ఉంటుందని హురున్‌ రిపోర్ట్‌ చైర్మన్‌ రూపర్ట్‌ హుగ్‌వర్ఫ్‌ తెలిపారు.
జాబితాలోని ముఖ్యాంశాలు..
  • 21 దేశీ యూనికార్న్‌ల విలువ సుమారు 73.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వీటిలో 11 సంస్థల్లో చైనాకు చెందిన ముగ్గురు ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయులు స్థాపించిన యూనికార్న్‌ల విలువ 99.6 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటుంది.
  • యూనికార్న్‌ల సంఖ్యాపరంగా అమెరికా, చైనా, బ్రిటన్‌ తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.
  • చైనాతో పోలిస్తే భారత్‌లో యూనికార్న్‌ల సంఖ్య పదో వంతు మాత్రమే. చైనాలో ఏకంగా 227 స్టార్టప్‌లు ఈ హోదా సాధించాయి.
  • సగటున ఒక స్టార్టప్‌ సంస్థ యూనికార్న్‌గా ఎదగడానికి భారత్‌లో ఏడేళ్లు పడుతోంది. అదే చైనాలో 5.5 సంవత్సరాలు, అమెరికాలో 6.5 ఏళ్లు పడుతోంది.
  • చైనాకు చెందిన ఆలీబాబా 5 సంస్థల్లో, టెన్సెంట్‌ 3 సంస్థల్లో, డీఎస్‌టీ గ్లోబల్‌ 3 భారతీయ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాయి.
  • దేశీయంగా 21 యూనికార్న్‌లలో పేటీఎం, ఓయో రూమ్స్, బైజూస్, ఓలా క్యాబ్స్‌ మొదలైనవి ఉన్నాయి. 8 దిగ్గజ స్టార్టప్‌లకు కేంద్రమైన బెంగళూరు .. యూనికార్న్‌ల రాజధానిగా నిలుస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దేశీయంగా యూనికార్న్‌ హోదా పొందిన (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) స్టార్టప్‌లు 21
ఎప్పుడు: ఆగస్టు 4
ఎవరు: హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ జాబితా
Published date : 01 Sep 2020 12:06PM

Photo Stories