Skip to main content

ఆగస్టు 2017 ఎకానమీ

చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి నిరోధక సుంకం
చైనా నుంచి దిగుమతి అయ్యే టాంపర్డ్ గ్లాస్‌ల (మొబైల్ స్క్రీన్ సేవర్) పై భారత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దిగుమతి నిరోధక సుంకం (యాంటీ డంపింగ్ డ్యూటీ) విధించింది. టన్ను టాంపర్డ్ గ్లాస్‌లపై 52.85 డాలర్ల నుంచి 136.21 డాలర్ల వరకు పన్ను విధింపు వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ ఆగస్టు 21న నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై 5 ఏళ్లపాటు దిగుమతి నిరోధక సుంకం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు

త్వరలో చెలామణిలోకి రూ.200 నోట్లు
మొదటిసారిగా రూ.200 నోట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చిన్నపాటి లావాదేవీలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు వీలైనంత త్వరగా వీటిని వాడుకలోకి తీసుకురావాలని రిజర్వుబ్యాంకును ఆదేశించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. రూ.2000 నోట్లు కూడా ఆశించిన స్థాయిలో తిరిగి బ్యాంకులకు చేరకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
త్వరలో రూ.200 నోట్లు
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : చిన్న నోట్ల కొరత తీర్చేందుకు

ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనుండగా.. బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు.
2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : కేంద్ర పౌరవిమానయాన శాఖ
ఎందుకు : సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని

నీతి ఆయోగ్ 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక- 2017-18 నుంచి 2019-20’ని ఆగస్టు 24న ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు ఇందులో ఉన్నాయి.
ప్రణాళికలోని ముఖ్యాంశాలు
- వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది.
-కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది.
-2019-20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి.
- సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : నీతి ఆయోగ్
ఎందుకు : ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి

లక్ష్యాన్ని దాటిన తొలి జీఎస్‌టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించాయి. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 29న వెల్లడించారు. అలాగే.. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ విధానం కింద రిజిస్టర్ కాగా వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయి.
జూలైలో జీఎస్‌టీ ద్వారా మొత్తం రూ.91,000 కోట్లు మాత్రమే లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: జీఎస్‌టీ జూలై నెల వసూళ్లు రూ.92,283 కోట్లు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు
Current Affairs
2016-17లో దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 16న విడుదల చేసిన నాలుగో అంచనాల నివేదిక మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. అందులో 11.01 కోట్ల టన్నుల వరి పండింది. ఇక పప్పుధాన్యాలు 2.29 కోట్ల టన్నులు, పత్తి 2.29 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. 2015-16లో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.01 కోట్ల టన్నులు కాగా, ఈసారి 55 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది. వరి ఈసారి 61 లక్షల టన్నులు అధిక ఉత్పత్తి జరిగింది. ఇక పత్తి 2015-16లో 1.63 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2016-17లో అదనంగా 66 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా

మెట్రో రైలు పాలసీ - 2017
దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నూతన మెట్రో రైలు విధానం 2017 ని ఆమోదించింది. ప్రైవేట్ రంగంతో పాటు ఇతర మార్గాలైన వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ (VCF), బాండ్ల జారీతో నిధులు సేకరించేందుకు ఇందులో చర్యలు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 16న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం తాము చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థలతో జట్టుకట్టడం తప్పనిసరి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి, వ్యయం తగ్గింపునకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. మెట్రో ప్రాజెక్టుల అమలుకు ఏకీకృత నిబంధనలను రూపొందించడంతో పాటు, నిధుల సేకరణకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
మెట్రో రైలు పాలసీ-2017 ముఖ్యాంశాలు
  • నిధుల డిమాండ్‌ను తట్టుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి.
  • మొత్తం ప్రాజెక్టులో లేదా అనుబంధ విభాగాలైన చార్జీల వసూలు, నిర్వహణలో ప్రైవేట్ సంస్థ పాలుపంచుకోవాలి.
  • ప్రైవేట్ రంగంలోని వనరులు, నిపుణత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడానికే ఈ నిర్ణయం.
  • స్టేషన్‌లో వాణిజ్య ఆస్తుల అభివృద్ధి, స్థలాల లీజులు, వాణిజ్య ప్రకటనల ద్వారా లభించే ఆదాయానికి సంబంధించి తీసుకునే చర్యలను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్టులో సవివరంగా తెలియజేయాలి.
  • సమయానుగుణంగా చార్జీలను సవరించేలా నిబంధనల మార్పునకు, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించారు.
కేంద్రం నుంచి నిధులు పొందే మార్గాలు: వయబిలిటీ గ్యాప్ ఫండ్, కేంద్ర గ్రాంట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం), 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈక్విటీ షేరింగ్.
విద్యా సెస్‌తో నిధి: సెకండరీ, ఉన్నత విద్య ద్వారా సమకూరే సెస్ నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘మాధ్యమిక్ అండ్ ఉచ్చతర్ శిక్షా కోశ్’(ముస్క్)గా పిలిచే ఈ నిధి మానవ వనరుల శాఖ నిర్వహణలో కొనసాగుతుంది. ముస్క్ నిధులను మాధ్యమిక, ఉన్నత విద్య పథకాలకు వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెట్రో రైలు పాలసీ - 2017
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ మద్దతు
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికోసం పదేళ్లపాటు రూ.27,413 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ కన్నా ముందు ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన కారణంగా.. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో ఆగస్టు 16న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. జూలై 1, 2017 నుంచి మార్చి 31, 2027 వరకు ఇది వర్తిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక పాలసీ-2007ను సిక్కింతో పాటు ప్రత్యేక హోదా పొందుతున్న జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ కేంద్రం అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తొలి పదేళ్ల పాటు ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా 4,284 పరిశ్రమలకు ప్రత్యక్ష నగదు సరఫరా ద్వారా రీఫండ్ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పదేళ్లపాటు రూ.27, 413 కోట్లు
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జీఎస్టీ అమల్లో భాగంగా

22 క్యారెట్లకు పైబడిన బంగారం ఎగుమతులపై నిషేధం
22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 22 క్యారెట్లు పైబడిన స్వచ్ఛత బంగారం ఎగుమతిపై నిషేధం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు

వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి
2017-18లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీతో స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆగస్టు 16న నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకం కింద రైతులు బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ రుణంపై బ్యాంకులు 7 శాతం వడ్డీ విధిస్తుండగా.. ఇందులో 2 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. వాయిదా చెల్లింపులు క్రమంగా తప్పకుండా చెల్లించే వారికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : భారతీయ రిజర్వు బ్యాంకు

త్వరలో కొత్త 50 రూపాయల నోట్లు
ఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్ బ్లూ) ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చినా పాత రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో కొత్త 50 రూపాయల నోటు
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా
ఎందుకు : భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా

అమెరికా నుంచి తొలిసారిగా ముడి చమురు దిగుమతి
ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8-14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి.

ఫోర్బ్స్ సృజనాత్మక కంపెనీల్లో మూడు దేశీ సంస్థలు
Current Affairs
నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. హెచ్‌యూఎల్ క్రితం సారి 31వ స్థానంలో ఉండగా ఈసారి ఏడో స్థానానికి, ఏషియన్ పెయింట్స్ 18వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకాయి. ఎయిర్‌టెల్ కొత్తగా 78వ ర్యాంకుతో జాబితాలో చోటు దక్కించుకుంది. టీసీఎస్, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టూబ్రో గతేడాది జాబితాలో ఉన్నప్పటికీ ఈసారి స్థానం లభించలేదు. దీంతో లిస్టులో భారతీయ సంస్థల సంఖ్య అయిదు నుంచి మూడుకి తగ్గింది.
2017 జాబితాలో తొలిస్థానంలో సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్, రెండో స్థానంలో టెస్లా మోటర్స్, మూడో స్థానంలో అమెజాన్‌డాట్‌కామ్ ఉన్నాయి. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల సంస్థలకు ఇందులో చోటు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 100 ఇన్నోవెటివ్ కంపెనీస్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఫోర్బ్స్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయి.
ఆర్థిక సర్వే ప్రధానాంశాలు
  • 2017-18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016-17లో 3.5%.
  • రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు.
  • పాలసీ రేట్లను 25-75 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు.
  • డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

నదుల్లో 15-20% మధ్య ప్రవాహాలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా నదుల్లో 15 నుంచి 20 శాతం మధ్య నీటి ప్రవాహాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జీవనోపాధికి, పర్యావరణ పరిరక్షణ చర్యల నిమిత్తం నదుల్లో కొంత లోతు మేర స్వచ్ఛమైన నీటిని లభ్యమయ్యేలా 15 నుంచి 20 శాతం నదుల ప్రవాహాలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలకు ఏ రాష్ట్రమైనా కట్టుబడి ఉండటం సాధ్యం కాకపోతే ఆ రాష్ట్రం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను కలవొచ్చని సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నదుల్లో 15 నుంచి 20 శాతం ప్రవాహాలు తప్పనిసరి
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణకు

2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు
2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవారాలంటే.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.6.4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయడింది. ఈ మేరకు ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబ ఆదాయం రూ.96,703గా ఉంది. దీన్ని 2022-23 నాటికి రూ.2,19,724లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు - రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు- రివర్స్ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది.
తగ్గనున్న ఈఎంఐ భారం
రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది.
మరిన్ని ముఖ్యాంశాలు..
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగింపు.
  • బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం- 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎటువంటి మార్పు లేదు.
  • 6.25 శాతానికి దిగివచ్చిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేటు.
  • ప్ల్లస్ 2 లేదా మైనస్ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి.
  • 2017 జూలై 28కి 392.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు.
  • ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష 2017 అక్టోబర్ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం) జరుగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
రెపో రేటు పావు శాతం తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రిజర్వు బ్యాంకు
ఎక్కడ : ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో

కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్-22’
‘భారత్-22’ పేరుతో కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్-22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 4న ప్రకటించారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లను ప్రభుత్వం సమీకరించింది.
భారత్-22 జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్-22లో చేర్చారు.
మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే.. ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదే తరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కొత్త ఈటీఎఫ్ భారత్ - 22
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

11.4 లక్షల పాన్‌కార్డులు డీయాక్టివేట్
దేశవాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం క్రియారహితం (డీయాక్టివేట్) చేసింది. అందులో కొన్నింటిని రద్దు కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నంబరుతో అనుససంధానం చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది.
డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ విభాగం ఇ- ఫిల్లింగ్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. అందులో ’Know Your Pan’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ పేజీ వస్తుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జాగ్రత్తగా పూర్తిచేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
11.4 లక్షల పాన్‌కార్డులు డియాక్టివేట్
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : పాన్‌కార్డుల సమాచారం వడపోతలో భాగంగా

ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధి
పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించింది.
వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుండా) అడ్వాన్స్‌ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నాటికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధి
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : కేంద్ర ఆదాయ పన్నుల విభాగం
ఎందుకు : పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో
Published date : 17 Aug 2017 01:42PM

Photo Stories