Skip to main content

వన్డే సిరీస్ కోల్పోయిన భారత్

విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలిసారి స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది.
మార్చి 13న జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 35 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఉస్మాన్ ఖాజా (106 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సిరీస్‌లో రెండో సెంచరీ సాధించగా, హ్యాండ్స్‌కోంబ్ (60 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 50 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (89 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా...భువనేశ్వర్ (54 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్) పోరాడారు. జంపాకు 3 వికెట్లు... కమిన్స్, స్టొయినిస్, రిచర్డ్సన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
  • భారత్‌లో భారత్‌పై ఐదు వన్డేల సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉస్మాన్ ఖాజా (383) (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా-358 పరుగులు; 2015లో) పేరిట ఉన్న రికార్డును ఖాజా తిరగ రాశాడు.
  • ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఆ తర్వాత సిరీస్ గెలిచిన నాలుగో జట్టు ఆస్ట్రేలియా. గతంలో దక్షిణాఫ్రికా రెండుసార్లు (2003లో పాక్‌పై; 2016లో ఇంగ్లండ్‌పై) ఇలా చేయగా... పాక్ (భారత్‌పై 2005లో)... బంగ్లాదేశ్ (జింబాబ్వేపై 2005లో) ఒక్కోసారి ఈ ఘనత సాధించాయి.
  • ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్‌లో తొలుత 2-0తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వరుస పరాజయాలతో సిరీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.
  • వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు.
  • కోహ్లి సారథ్యంలో స్వదేశంలో భారత జట్టు కోల్పోయిన తొలి వన్డే సిరీస్ ఇదే. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్డే సిరీస్ కోల్పోయిన భారత్జట్టు
ఎప్పుడు : మార్చి 13
ఎక్కడ : భారత్
Published date : 14 Mar 2019 07:53PM

Photo Stories