Skip to main content

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్)’ పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 27న వెల్లడించారు.
దీంతో దేశంలో రైల్వే జోన్‌ల సంఖ్య 18కి చేరనుంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి కొత్త జోన్‌ను ఏర్పాటుచేయనున్నారు.

కొత్త జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని (ఏపీ పరిధిలోది) విజయవాడ డివిజన్‌లో విలీనం చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగాన్ని (ఒడిశా ప్రాంతంలోది) రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌గా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. ఇది తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లతో కూడుకుని ఉంటుందని ప్రకటించారు.

ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు..
దేశంలో ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే డివిజన్ల విసృ్తతి, పరిమాణం, పనిభారం, అవకాశం, ట్రాఫిక్, పాలన అవసరాల అధారంగా రైల్వే జోన్లు ఏర్పాటు చేశారు. చివరిగా 2003-04లో రైల్వే జోన్లను పునర్ వ్యవస్థీకరించారు.

ద.మ. రైల్వేలో ఆరు డివిజన్లు...
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 6 డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు తాజాగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి వెళతాయి. కొత్త రైల్వే జోన్ పరిధిలో జోనల్ స్థాయి రైల్వే ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలు, రైల్వే పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్) పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 28 Feb 2019 04:49PM

Photo Stories