వాయుసేనలోని ఏ స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు?
హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో సెప్టెంబర్ 10న జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఈ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్‌కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్‌కు రాజ్‌నాథ్ అందించారు.
రూ.59 వేల కోట్లతో...
రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్‌లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత వైమానిక విన్యాసాలు నిర్వహించారు. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో 2016లో భారత్ ఒప్పందం చేసుకుంది. 2020, జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి.
గోల్డెన్ ఏరోస్‌కే ఎందుకు?
తొలి విడతలో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్‌కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల నుంచి 2019 ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. 2019, ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్ లో శిక్షణ తీసుకున్నారు.
చదవండి:
రఫేల్ ప్రత్యేకతలు, ఒప్పందం-వివరాలు, రఫేల్ తయారీ సంస్థ పేరు
ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వాయుసేనలోకి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా
ఎక్కడ : 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్, అంబాలా వైమానిక స్థావరం, హరియాణా