Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 28 కరెంట్‌ అఫైర్స్‌

Supreme Court

Supreme Court: ‘పెగాసస్‌’పై విచారణకు ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?

దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో 300మందికి పైగా మొబైల్‌ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్‌ శర్మ,  ఎడిటర్స్‌ గిల్డ్‌ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్‌ 27న 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

కమిటీ సభ్యులు
జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన జస్టిస్‌ రవీంద్రన్‌  ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీఎస్‌ఏ)కు 2013 నుంచి 2019 వరకూ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆలోక్‌ జోషి: జస్టిస్‌ రవీంద్రన్‌కు సహాయకారిగా ఉంటారు. 1976 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆలోక్‌ జోషి ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్‌ వింగ్‌ (రా)లో కార్యదర్శిగా, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
డాక్టర్‌ సందీప్‌ ఒబెరాయ్‌ : ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్‌ కమిటీ అయిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండరైజేషన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రో టెక్నికల్‌ కమిషన్, జాయింట్‌ టెక్నికల్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.

సాంకేతిక కమిటీ సభ్యులు

  • డాక్టర్‌ నవీన్‌కుమార్‌ చౌధరి(సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌)
  • డాక్టర్‌ పి.ప్రభాహరన్‌(కంప్యూటర్‌ సైన్స్, సెక్యూరిటీ విభాగంలో ప్రొఫెసర్‌) 
  • డాక్టర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమస్తే(కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌లో ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : భారత సుప్రీంకోర్టు
ఎందుకు : దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి...


DRDO: దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి ఏది?

Agni 5

అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశా రాష్ట్రం బధ్రక్‌ జిల్లా తీరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌లో అక్టోబర్‌ 27న ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని–5ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సిద్ధం చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అగ్ని–5 క్షిపణి ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : భారత రక్షణ శాస్త్రవేత్తలు
ఎక్కడ    : డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్, బధ్రక్‌ జిల్లా తీరం, ఒడిశా రాష్ట్రం
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా...


PM Trudeau Cabinet: కెనడా రక్షణ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ?

Anita Anand

కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ (53) నియమితులయ్యారు. ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో కేబినెట్‌లో రక్షణ మంత్రిగా ఇండో కెనడియన్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు కెనడా దేశ చరిత్రలో ఒక మహిళ రక్షణ మంత్రి కావడం ఇది రెండోసారి. గత రక్షణ మంత్రి హర్‌జిత్‌ సజ్జన్‌ కూడా భారత సంతతికి చెందిన వారే. 2019లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన అనితా ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓక్‌విల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కొత్త పార్టీ ప్రకటన చేసిన మాజీ సీఎం?
కొత్త పార్టీ పెడుతున్నట్టు పంజాబ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అక్టోబర్‌ 27న ప్రకటించారు. పార్టీ పేరు, గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతి తెలిపిన అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీకి 2022, ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కెనడా రక్షణ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ?
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : అనితా ఆనంద్‌
ఎందుకు : కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో నిర్ణయం మేరకు...


LGBTQ: ‘ఎక్స్‌’ జెండర్‌ పాస్‌పోర్టును జారీ చేసిన దేశం?

US Passport

అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్‌’ జెండర్‌ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. అయితే, ‘ఎక్స్‌’ జెండర్‌ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు.

16వ తూర్పు ఆసియా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం?
బ్రూనై ఆతిథ్య దేశంగా అక్టోబర్‌ 27న నిర్వహించిన 16వ తూర్పు ఆసియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇండోఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్‌ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్‌ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని సదస్సుల్లో మోదీ పేర్కొన్నారు.

బ్రూనై...
రాజధాని: బందర్‌ సెరీ బేగవన్‌; కరెన్సీ: బ్రునై డాలర్‌
ప్రస్తుత సుల్తాన్, యాంగ్‌ డి–పెర్టువాన్, ప్రధాని: హసనల్‌ బోల్కియా
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ‘ఎక్స్‌’ జెండర్‌ పాస్‌పోర్టును జారీ చేసిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : అమెరికా
ఎందుకు : అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో భాగంగా...

NBFID: ఎన్‌బీఎఫ్‌ఐడీ చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ బ్యాంకర్‌?

K V Kamath

కొత్తగా ఏర్పాటయిన నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌బీఎఫ్‌ఐడీ) చైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్టోబర్‌ 27న కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక రంగం పరోగతి, ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించి ఎన్‌బీఎఫ్‌ఐడీ బిల్లు 2021కు మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

ఈఏసీ–పీఎం చైర్మన్‌ ఎవరు?
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం)ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 27న పునర్‌వ్యవస్థీకరించింది. అయితే దీనికి ప్రస్తుత చైర్మన్‌ వివేక్‌ దేవ్రాయ్‌ మరో రెండేళ్లు కొనసాగుతారు. 2017 సెప్టెంబర్‌లో మండలి ఏర్పాటయ్యింది.

మైటీ స్టార్టప్‌ హబ్‌తో గూగుల్‌ భాగస్వామ్యం
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన మైటీ స్టార్టప్‌ హబ్‌తో గూగుల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఇరు సంస్థలు కలిసి యాప్‌స్కేల్‌ అకాడమీని ప్రారంభిస్తాయి. దీని ద్వారా అత్యంత నాణ్యమైన యాప్స్‌ను భారతీయ స్టార్టప్స్‌ అభివృద్ధి చేసేందుకు సాయపడతాయి. గేమింగ్, హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్‌తోపాటు సామాజికంగా ప్రభావం చూపే యాప్స్‌ అభివృద్ధిపై అకాడమీ దృష్టిసారిస్తుంది.


Sports Awards: ఖేల్‌రత్న అవార్డుకు ఎవరి పేర్లను సిఫార్సు చేశారు?

Sports Awards

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఒకేసారి 11 మంది పేర్లను క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. 2021 ఏడాదికిగాను ప్రతిపాదించిన ఈ అవార్డులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచ్చిన మరో 35 మంది పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కూడా సిఫారసు చేశారు. అర్జున అవార్డుల జాబితాలో భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా ఉన్నాడు. ఎంపిక కమిటీ సిఫార్సులు ఇలా...

ఖేల్‌రత్న అవార్డులకు...
1. నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌): టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం 
2. మిథాలీ రాజ్‌ (క్రికెట్‌)
3. సునీల్‌ ఛెత్రి (ఫుట్‌బాల్‌)
4. రవికుమార్‌ దహియా (రెజ్లింగ్‌): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం
5. పీఆర్‌ శ్రీజేశ్‌ (హాకీ): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో సభ్యుడు
6. లవ్లీనా బోర్గోహెయిన్‌ (బాక్సింగ్‌): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం
7. ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
8. సుమీత్‌ అంటిల్‌ (జావెలిన్‌ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
9. అవని లేఖరా (షూటింగ్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం 
10. కృష్ణ నాగర్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
11. మనీశ్‌ నర్వాల్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఖేల్‌రత్న అవార్డు–2021కు 11 మంది పేర్ల ప్రతిపాదన
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ
ఎందుకు : క్రీడాకారులు తమ ప్రతిభతో దేశానికి పేరు తెచ్చినందున...


APIIC: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి?

MSME Parks Anantapuram

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మూడు సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) పార్కులు ఏర్పటుకానున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఏపీఐఐసీ వీటిని అభివృద్ధి చేస్తోంది. మొత్తం రూ.18.11 కోట్ల వ్యయంతో జిల్లాలోని కోటిపి(రూ.7.46 కోట్లతో), రాప్తాడు(రూ.4.83 కోట్లతో), కప్పలబండ(రూ.5.82 కోట్లతో)లో ఈ పార్కులను అభిద్ధి చేయనున్నారు. ఒక్కొక్కటి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నాయి.

రూ.2,868 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.2,868.60 కోట్ల మేర పెట్టుబడులతో పలు భారీ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు అక్టోబర్‌ 27న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం లభించింది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇవి తోడ్పడనున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మూడు సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు ప్రణాళికలు
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
ఎక్కడ    : అనంతపురం జిల్లాలోని కోటిపి, రాప్తాడు, కప్పలబండలో...
ఎందుకు : చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు...


Nikhat Zareen: మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ఎక్కడ జరిగింది?

Nikhat Zareen

తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హరియాణలోని హిసార్‌లో అక్టోబర్‌ 27న ముగిసిన ఈ ఈవెంట్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్‌ 52 కేజీల విభాగం ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచి, పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్‌కు టోర్నీ ‘బెస్ట్‌ బాక్సర్‌’ పురస్కారం కూడా లభించింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన బాక్సర్లు.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ ప్రకారం 2021, డిసెంబర్‌లో టర్కీలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీ పడేందుకు నిఖత్‌ అర్హత సాధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న క్రీడాకారిణి?
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : నిఖత్‌ జరీన్‌
ఎక్కడ    : హిసార్, హరియాణ
ఎందుకు : 52 కేజీల విభాగం  ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచినందున...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 27 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Oct 2021 07:33PM

Photo Stories