Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 8 కరెంట్‌ అఫైర్స్‌

Pakistan Flag

Tehreek-i-Labbaik: ఉగ్రవాద సంస్థ టీఎల్‌పీపై నిషేధం ఎత్తివేసిన దేశం?

ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌–ఇ–లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ)పై పాకిస్తాన్‌ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు నాలుగో షెడ్యూల్‌ నుంచి టీఎల్‌పీని తొలగిస్తూ నవంబర్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్‌ కేబినెట్‌ ఉగ్రవాద ని«రోధక చట్టం, 1997 ద్వారా టీఎల్‌పీపై విధించిన నిషేధాన్ని పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు ఎత్తివేస్తున్నట్టు పాక్‌ ప్రభుత్వం వెల్లడించింది. గతకొద్ది నెలలుగా పాకిస్తాన్‌లో టీఎల్‌పీ హింసను రాజేస్తోంది.

ఏమిటీ టీఎల్‌పీ?
తెహ్రీక్‌–ఇ–లబ్బాయిక్‌ అంటే మహమ్మద్‌ ప్రవక్త అనుచరుల ఉద్యమం (బరేల్వి) అని అర్థం. ఇస్లాంను దూషించేవారిని కఠినంగా శిక్షించడం, దీనికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్‌లో సగం మంది ప్రజల్లో బరేల్వి ఉద్యమం పట్ల మద్దతు ఉంది. సూఫీ సంప్రదాయాలతో కూడిన ఇస్లాంను వ్యాప్తి చేయడమే వీరి ఉద్దేశం.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌–ఇ–లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ)పై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు    : పాకిస్తాన్‌ ప్రభుత్వం
ఎక్కడ    : పాకిస్తాన్‌
ఎందుకు : పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు...

 

Drone Attack: ఇరాక్‌ ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?

Mustafa al-Kadhimi

ఇరాక్‌ ప్రధానమంత్రి ముస్తఫా–అల్‌–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. నవంబర్‌ 7న వేకువజామున కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. 2021, అక్టోబర్‌ నెలలో వెలువడిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను ఇరాన్‌ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది.

ఇరాక్‌...
రాజధాని:
బాగ్దాద్‌; కరెన్సీ: ఇరాకీ దినార్‌
ప్రస్తుత అధ్యక్షుడు: బర్హమ్‌ సలీహ్‌
ప్రస్తుత ప్రధానమంత్రి: ముస్తఫా–అల్‌–కదిమి

సియెర్రాలియోన్‌లో విషాదం
సియెర్రాలియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో కనీసం 98 మంది సజీవదహనం కాగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని శివారులోని వెల్లింగ్టన్‌ ప్రాంతంలో నవంబర్‌ 6న ఒక బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దెబ్బతిన్న ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న ఆయిల్‌ను పట్టుకునేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సమయంలో పేలుడు ఘటన చోటుచేసుకుంది.

సియెర్రాలియోన్‌...
రాజధాని:
ఫ్రీటౌన్‌; కరెన్సీ: లియోనే
ప్రస్తుత అధ్యక్షుడు: జూలియస్‌ మాడ బయో


Malnourished: పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు?

Children

దేశంలోని చిన్నారుల్లో 33 లక్షల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా అందులో దాదాపు సగం మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు నవంబర్‌ 7న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది.

ముఖ్యాంశాలు..

  • 2021 అక్టోబర్‌ 14వ తేదీనాటికి దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహారలోపంతోనూ, 15.46 లక్షల మంది చిన్నారులు మధ్యస్త పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నట్లు అంచనా. ఈ గణాంకాలు ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్‌ ట్రాకర్‌’యాప్‌లో నమోదై ఉన్నాయి. ఈ గణాంకాలు నేరుగా అంగన్‌వాడీ సిబ్బంది నమోదు చేసినవే.
  • 2020 గణాంకాలతో పోలిస్తే తీవ్ర పౌష్టికాహారలోపం ఉన్న ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల సంఖ్యలో ఏడాది కాలంలోనే 91 శాతం పెరుగుదల నమోదైంది.
  • మహారాష్ట్రలో అత్యధికంగా 6.16 లక్షల మంది చిన్నారుల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారు.
  • తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు ఆరోగ్యవంతులతో పోలిస్తే మృత్యువాత పడేందుకు 9 రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి.
  • 2011 జనగణన ప్రకారం దేశంలో 46 కోట్ల మంది చిన్నారులున్నారు.
  • కోవిడ్‌ మహమ్మారి పేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని నిపుణుల అంచనా.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు?
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు    : మహారాష్ట్ర, బిహార్, గుజరాత్‌ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా...


Table Tennis: డబ్ల్యూటీటీ కంటెండర్‌ టోర్నిలో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన జోడీ?

Manika Batra-Archana Kamath

వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) కంటెండర్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన మనిక బత్రా–అర్చన కామత్‌ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. స్లొవేనియాలోని లాస్కో నగరంలో నవంబర్‌ 7న ముగిసిన ఈ టోర్నీలో మనిక–అర్చన ద్వయం మహిళల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సొంతం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో మనిక–అర్చన జంట 11–3, 11–8, 12–10తో మెలానీ –అడ్రియానా దియాజ్‌ (ప్యూర్టోరికో) జోడీపై విజయం సాధించింది.

అబుదాబిలో భారత క్యూరేటర్‌ ఆత్మహత్య
భారత్‌కు చెందిన చీఫ్‌ పిచ్‌ క్యూరేటర్‌ మోహన్‌ సింగ్‌ నవంబర్‌ 7న యూఏఈ రాజధాని అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో చీఫ్‌ క్యూరేటర్‌గా పని చేస్తున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) కంటెండర్‌ టోర్నమెంట్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సొంతం చేసుకున్న జోడి?
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు   : మనిక బత్రా–అర్చన కామత్‌ జోడీ
ఎక్కడ : లాస్కో నగరం, స్లొవేనియా
ఎందుకు : ఫైనల్లో మనిక–అర్చన జంట 11–3, 11–8, 12–10తో మెలానీ –అడ్రియానా దియాజ్‌ (ప్యూర్టోరికో) జోడీపై విజయం సాధించినందున...


Paris Masters Tennis tournament: అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌?

Novak Djokovic

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో 37వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను గెలిచాడు. నవంబర్‌ 7న ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ముగిసిన పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 4–6, 6–3, 6–3తో మెద్వెదేవ్‌ (రష్యా)పై గెలిచాడు. ఈ విజయంతో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (36 మాస్టర్స్‌ టైటిల్స్‌)ను వెనక్కి నెట్టి అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. పీట్‌ సంప్రాస్‌ (అమెరికా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సవరించాడు.

సౌరభ్‌  చౌదరీ ఏ క్రీడకు చెందినవాడు?
ప్రెసిడెంట్స్‌ కప్‌ అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్లు సౌరభ్‌  చౌదరీ రజతం, అభిషేక్‌ వర్మ కాంస్యం సాధించారు. పోలాండ్‌లోని వ్రోక్లా నగరంలో నవంబర్‌ 6న జరిగిన ఫైనల్లో సౌరభ్‌ 24 పాయింట్లు, అభిషేక్‌ వర్మ 21 పాయింట్లు స్కోరు చేశారు. రీట్జ్‌ (జర్మనీ) 34 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో మనూ భాకర్‌ (భారత్‌)–జవాద్‌ ఫరూగి (ఇరాన్‌) జోడీ బంగారు పతకం గెల్చుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌?
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు    : సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌
ఎక్కడ  : పారిస్, ఫ్రాన్స్‌
ఎందుకు : పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 4–6, 6–3, 6–3తో మెద్వెదేవ్‌ (రష్యా)పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నందున...


Covid-19: 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా?

ZyCov-D vaccine

కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణకు గాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ కోటి డోసుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చినట్లు అధికార వర్గాలు నవంబర్‌ 7న తెలిపాయి. ఈ టీకాకు 2021, ఆగస్టు 20న డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ ఒక్కో డోస్‌కు పన్నులు మినహాయించి రూ.358 ఖర్చవుతుంది.

ఏ.వై. 4.2 వైరస్‌ అనేది ఏ వ్యాధికి చెందినది?
కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఏ.వై.4.2 వ్యాప్తిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఏవై.4.2 వేరియంట్‌కు సంబంధించిన కేసులు 0.1 శాతం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుతానికి దేశంలో డెల్టా వేరియంట్‌ (బి.1.617.2 మరియు ఏవై.ఎక్స్‌) మాత్రమే ఆందోళనకర స్థాయిలో ఉందని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా?
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు     : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ 
ఎందుకు : కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణకు గాను...


Morning Consult: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేత?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సర్వే, పరిశోధన సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ తెలిపింది. దేశాధినేతల పనితీరు విషయంలో ప్రజల ఆమోదం ఎలా ఉంది? వారి ఆదరణ పెరిగిందా? తగ్గిందా? అనే అంశాలపై మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం... వివిధ దేశాధినేతలతో పోలిస్తే.. ప్రధాని మోదీ పనితీరుకు ఎక్కువ ప్రజామోదం(70 శాతం) లభించింది.

అత్యంత ప్రజామోదం ఉన్న తొలి పది మంది నేతలు...

స్థానం దేశాధినేత పేరు  ప్రజామోదం శాతం
1 భారత ప్రధాని నరేంద్ర మోదీ 70
2 మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ 66
3 ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58
4 జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ 54
5 ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ 47
6 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 44
7 కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో 43
8 జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిడా 42
9 దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే–ఇన్‌ 41
10 బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ 40

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా భారత ప్రధాని మోదీ
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు     : అమెరికాకు చెందిన సర్వే, పరిశోధన సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’
ఎక్కడ    : ప్రపంచంలో
ఎందుకు : మోదీ పనితీరుకు ఎక్కువ ప్రజామోదం ఉన్నందున...

Padma Awards: పీవీ సింధుకు పద్మభూషణ్‌ పురస్కారం

కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్‌ సర్వీసెస్‌ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రభవన్‌లో జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను 2021, నవంబర్‌ 8న ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గ్రహీతలకు అవార్డులను అందజేశారు.  

కార్యక్రమంలో భారత స్టార్‌ షట్లర్, ఒలింపిక్‌ పతక విజేత పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించగా.. ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 6 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Nov 2021 07:26PM

Photo Stories