Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 3 కరెంట్ అఫైర్స్
New Political Party: పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పనున్న వ్యక్తి?
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నవంబర్ 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ రిజిస్ట్రేషన్‌కు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్... 1942, మార్చి 11న జన్మించారు. వారిది సైనిక కుటుంబం. తొలుత సైన్యంలో చేరిన అమరీందర్... 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ తరపున...
1980లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ ఎంపీగా అమరీందర్ గెలిచారు. 1985లో అకాళీదళ్‌లో చేరి ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. 1998లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2002, ఫిబ్రవరి 26న తొలిసారిగా పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2017, మార్చి 16న రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 50కిపైగా కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు సీఎంగా అమరీందర్‌ను మార్చాలంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో... 2021, సెప్టెంబర్ 18న సీఎం పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పనున్నట్లు ప్రకటించిన వ్యక్తి?
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్
ఎక్కడ : పంజాబ్
National Sports Awards 2021: ఖేల్‌రత్న అవార్డును ఎంతమందికి ప్రదానం చేయనున్నారు?
2021 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 3న ప్రకటించింది. నవంబర్ 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది పురస్కారాల్లో 12 మందిని ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేశారు. అలాగే 35 మంది అర్జున అవార్డుకు, పది మంది ద్రోణాచార్య అవార్డుకు, ఐదుగురు ద్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు ఇలా....
ద్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కార విజేతలు...
1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్): టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం
2. మిథాలీ రాజ్ (క్రికెట్)
3. సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
4. రవికుమార్ దహియా (రెజ్లింగ్): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం
5. పీఆర్ శ్రీజేశ్ (హాకీ): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో సభ్యుడు
6. లవ్లీనా బోర్గోహెయిన్ (బాక్సింగ్): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం
7. ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
8. సుమీత్ అంటిల్ (జావెలిన్ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
9. అవని లేఖరా (షూటింగ్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం
10. కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
11. మనీశ్ నర్వాల్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
12. మన్‌ప్రీత్ సింగ్(హాకీ)
అర్జున అవార్డుకు ఎంపికైన వారు...
1. అర్పిందర్ (అథ్లెటిక్స్)
2. సిమ్రన్‌జీత్ కౌర్ (బాక్సింగ్)
3. శిఖర్ ధావన్ (క్రికెట్)
4. భవానీ (ఫెన్సింగ్)
5. మౌనిక (హాకీ)
6. వందన (హాకీ)
7. సందీప్ నర్వాల్ (కబడ్డీ)
8. హిమాని పరబ్ (మల్లకంబ్)
9. అభిషేక్‌వర్మ (షూటింగ్)
10. అంకిత రైనా (టెన్నిస్)
11. దీపక్ పునియా (రెజ్లింగ్)
12. దిల్‌ప్రీత్ (హాకీ)
13. హర్మన్‌ప్రీత్ (హాకీ)
14. రూపీందర్ (హాకీ)
15. సురేందర్ (హాకీ)
16. అమిత్ (హాకీ)
17. బీరేంద్ర (హాకీ)
18. సుమిత్ (హాకీ)
19. నీలకంఠ శర్మ (హాకీ)
20. హార్దిక్ సింగ్ (హాకీ)
21. వివేక్ సాగర్ (హాకీ)
22. గుర్జాంత్ (హాకీ)
23. మన్‌దీప్ (హాకీ)
24. షంషేర్ (హాకీ)
25. లలిత్ కుమార్ (హాకీ)
26. వరుణ్ కుమార్ (హాకీ)
27. సిమ్రత్‌జీత్ సింగ్ (హాకీ)
28. యోగేశ్ (పారా అథ్లెటిక్స్)
29. నిషధ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
30. ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
31. భవీనా పటేల్ (పారా టీటీ)
32. హర్వీందర్ సింగ్ (పారా ఆర్చరీ)
33. శరద్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
34. సుహాస్ (పారా బ్యాడ్మింటన్)
35. సింగ్‌రాజ్ (పారా షూటింగ్)
ద్రోణాచార్యా అవార్డుకు ఎంపికైన వారు..
ద్రోణాచార్యా జీవిత సాఫల్య పురస్కారం...
1. టీ.పీ.ఉసెప్ (అథ్లెటిక్స్)
2. సర్కార్ తల్వార్ (క్రికెట్)
3. సర్పాల్‌సింగ్ (హాకీ)
4. అషాన్‌కుమార్ (కబడ్డీ)
5. తపన్ కుమార్ (స్విమ్మింగ్)
రెగ్యులర్ ద్రోణాచార్యా...
1. రాధాకృష్ణన్ (అథ్లెటిక్స్)
2. సంధ్య (బాక్సింగ్)
3. ప్రీతమ్ (హాకీ)
4. జైప్రకాశ్ (పారా షూటింగ్)
5. రామన్ (రెజ్లింగ్)
ద్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం...
1. లేఖ (బాక్సింగ్)
2. అభిజీత్ కుంతే (చెస్)
3. దేవేందర్ (హాకీ)
4. వికాస్ (కబడ్డీ)
5. సజ్జన్ సింగ్ (రెజ్లింగ్)
IREDA: విజిల్–బ్లోవర్ పోర్టల్‌ను ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వ శాఖ?
కేంద్ర పునరుత్పాక ఇంధన శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ).. నవంబర్ 2న న్యూఢిల్లీలో ప్రజావేగు పోర్టల్ (విజిల్–బ్లోవర్)ను ప్రారంభించింది. విజిలెన్స్ అవగాహన వారం 2021 (అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు)లో భాగంగా ఈ పోర్టల్‌ను ఐఆర్‌ఈడీఏ చైర్మన్, ఎండీ ప్రదీప్‌కుమార్ దాస్, సీవీసీ అడిషనల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ సింగ్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఐఆర్‌ఈడీఏ ఉద్యోగులు మోసం, అవినీతి, అధికార దుర్వినియోగం తదితర అంశాలపై సమాచారం ఇవ్వొచ్చు.
నీతి ఆయోగ్ వైస్ పేరు?
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. నవంబర్ 3న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.
ఫారెక్స్ నిల్వల్లో భారీ వృద్ధి...
విదేశీ మారకద్రవ్య నిల్వలు 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 58.38 బిలియన్ డాలర్లు పెరిగి 635.36 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక పేర్కొంది. విదేశీ మారకద్రవ్య నిల్వల నిర్వహణపై అర్థ వార్షిక నివేదికను ఆర్‌బీఐ ఆవిష్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రజావేగు పోర్టల్ (విజిల్–బ్లోవర్) ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర పునరుత్పాక ఇంధన శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మోసం, అవినీతి, అధికార దుర్వినియోగం తదితర అంశాలపై సమాచారం ఇచ్చేందుకు...
EWS Welfare Department: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం.. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నవంబర్ 2న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే జైన్‌ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఏటా వైఎస్సార్ అవార్డులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పేరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను ఇక నుంచి ప్రతీ ఏటా ఆం‘ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1వ తేదీన ఇవ్వనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నవంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రంగాల్లో అపారమైన సేవలందించిన వారిని సత్కరించేందుకు ఈ అవార్డులను ప్రభుత్వం నెలకొల్పిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం...
Solar Power: ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే పిలుపునిచ్చిన దేశం?
సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ నవంబర్ 2న గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
సౌర కాలిక్యులేటర్...
ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని మోదీ తన ప్రసంగంలో వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌తో సమావేశం...
గ్లాస్గో సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీ నవంబర్ 2న మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, అపరకుబేరుడు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. సుస్థిర అభివృద్ధి, భూతాపోన్నతిని తగ్గించే చర్యలపై చర్చలు జరిపారు. అనంతరం నేపాల్ ప్రధాని దేవ్‌బాతో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తోనూ మోదీ చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని పిలుపు
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనుగడ సాధించాలంటే...
COP26: భారత్ ప్రారంభించిన ఐరిస్ కార్యక్రమ ఉద్దేశం?
వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐఆర్‌ఐఎస్–ఐరిస్) అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టింది. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా గ్లాస్గోలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్‌ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌లు హాజరయ్యారు.
ఏమిటీ ఐరిస్?
సీడీఆర్‌ఐ భాగంగా ఐరిస్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని కింద చిన్న ద్వీప దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో తలెత్తే ముప్పులపై మదింపు వేస్తారు. వీటిని తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణం, సామర్థ్య పెంపునకు ఆర్థిక వనరుల సమీకరణకు తోడ్పాటు అందిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య సహకారం వల్ల ఇది సాధ్యమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐఆర్‌ఐఎస్–ఐరిస్) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు...
Emergency Needs: నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలని ప్రకటించిన దేశం?
చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం నవంబర్ 1న ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ తెలిపింది.
అనేక సందేహాలు..
ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని చైనా ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన.. అక్కడి ప్రజలను అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
France: దేశంలోని ఏ నగరంలో ప్లగ్ అండ్ ప్లే సెంటర్ ఏర్పాటు కానుంది?
భారతీయ నగరం హైదరాబాద్‌లో... ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల వేదికగా పేరొందిన ‘ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ సెంటర్’ ఏర్పాటు కానుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా–2021’ సదస్సు లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కె.తారకరామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ‘ప్లగ్ అండ్ ప్లే’ప్రతినిధులు అక్టోబర్ 30న భేటీ అయ్యారు. 2021, డిసెంబర్‌లో తమ సంస్థ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని ఈ భేటీ అనంతరం వారు ప్రకటించారు. మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయ సాంకేతికత, ఆరోగ్యం, ట్రావెల్, ఫిన్‌టెక్ తదితర రంగాలపై ‘ప్లగ్ అండ్ ప్లే’ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ప్లగ్ అండ్ ప్లే సంస్థ ప్రతినిధులు
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 2 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్