ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ పరీక్ష విజయవంతం
Sakshi Education
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి ‘నాగ్’ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది.
రాజస్తాన్‌లోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్‌లో అక్టోబర్ 22న ఈ తుది దశ ప్రయోగాలను నిర్వహించారు. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్‌డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాగ్ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
నాగ్ క్షిపణి విశేషాలు...
- శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఏటీజీఎం) నాగ్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.
- నాగ్ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు.
- మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రరుునా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు.
- ఈ క్షిపణి క్యారియర్‌ని రష్యాకు చెందిన బీఎంపీ-2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్ బిఫోర్ లాంచ్’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)
ఎక్కడ : పోఖ్రాన్, జైసల్మేర్ జిల్లా, రాజస్తాన్
ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు
Published date : 23 Oct 2020 06:43PM