Skip to main content

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల కొత్త తేదీల ప్రక‌ట‌న

2021 ఏడాదిలో టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలను నిర్వహించ‌నున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రక‌టించింది.
Current Affairs

ఈ మేర‌కు మార్చి 30న ఒలింపిక్స్‌ క్రీడల నూతన తేదీల‌ను ప్రక‌టించింది. 2021లో జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరుపుతామని టోక్యో 2020 ఒలింపిక్స్ చీఫ్ యోరో మొరీ వెల్లడించారు. వాయిదా పడక ముందు అసలు షెడ్యూల్‌ ప్రకారం 2020, జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ 2020 జరగాల్సి ఉంది. మ‌రోవైపు స‌మ్మర్ పారాలింపిక్స్‌ను 2021, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నిర్వహించ‌నున్నట్లు ఐఓసీ తెలిపింది.

6 బిలియన్‌ డాలర్లు అదనం..
షెడ్యూల్‌ ప్రకారం 2020 ఏడాదిలో జరగాల్సిన ఒలింపిక్స్‌ నిర్వహణ వ్యయం 12 బిలియన్‌ డాలర్లు (సుమారు. రూ. 90 వేల కోట్లు)గా ఉంది. ఒప్పందం ప్రకారం ఈ బడ్జెట్‌ను నిర్వాహక కమిటీ, జపాన్‌ ప్రభుత్వం, టోక్యో మహా నగరం కలిపి భరిస్తాయి. ఇందులో ఐఓసీ ఇస్తున్న 1.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 10 వేల కోట్లు), ప్రైవేట్‌ సంస్థల ద్వారా సేకరించిన 5.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 42 వేల కోట్లు) మినహా మిగిలినదంతా జపాన్‌ ప్రజాధనమే. అయితే ఏడాది ఆలస్యం ఏకంగా మరో 50 శాతం అదనపు మొత్తం మీద పడే పరిస్థితి వ‌స్తోంది. అదనంగా మరో 6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 45 వేల కోట్లు) కేటాయించాల్సి వస్తుందని జపాన్‌ ఆర్థికరంగ నిపుణుల అంచనా.

క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల కొత్త తేదీల ప్రక‌ట‌న
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)
ఎక్కడ : టోక్యో, జ‌పాన్
ఎందుకు : కోవిడ్-19 కార‌ణంగా ఒలింపిక్స్ వాయిదా ప‌డిన నేప‌థ్యంలో

Published date : 31 Mar 2020 06:27PM

Photo Stories