తొలిసారిగా పులికి కరోనా వైరస్
అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న బ్రాంక్స్ జంతుప్రదర్శనశాలలోని నదియా అనే ఆడపులి (4) ఈ వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ అధికారులు ఏప్రిల్ 5న ప్రకటించారు. రోజూ నదియా బాగోగులు చూసే ఉద్యోగి ద్వారా ఈ వైరస్ సోకినట్టుగా వైల్డ్ లైఫ్ సొసైటీ అధికారులు భావిస్తున్నారు. బ్రాంక్స్ జూపార్కులో నదియాతోపాటు మరో ట్విన్ స్టిసర్ అజుల్, రెండు అముర్ పులులతోపాటు మూడు ఆఫ్రికన్ సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. బ్రాంక్స్ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ చెప్పారు.
పిల్లికి కూడా...
కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఆధారాలు లేనప్పటికీ, పెంపుడు జంతువుల యజమానుల నుంచి వాటికి సోకే అవకాశం వుందని జంతు నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు బెల్జియంలో ఒక పిల్లికి, హాంకాంగ్ లో రెండు శునకాలకు వాటి యజమానుల నుంచి కరోనా వైరస్ సోకిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.