Skip to main content

తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు.
Edu news

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ హిమ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్లారు.

జస్టిస్ హిమా కోహ్లి...
ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.

2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...

  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

    క్విక్ రివ్యూ :
    ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ప్రమాణం
    ఎప్పుడు : జనవరి 7
    ఎవరు : జస్టిస్ హిమా కోహ్లి
    ఎక్కడ : రాజ్‌భవన్, హైదరాబాద్

  • Published date : 08 Jan 2021 06:35PM

    Photo Stories