Skip to main content

తలసరి ఆదాయం నెలకు రూ.10,534

2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం నెలకు రూ.10,534కు పెరిగిందని కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) మే 31న తెలిపింది.
2017-18లో నమోదైన నెలవారీ తలసరి ఆదాయం రూ.9,580తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం అధికం. ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 2018-19లో రూ.1,26,406గా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,14,958తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. దేశ ప్రజల అభ్యున్నతికి తలసరి ఆదాయాన్ని కొలమానంగా పరిగణిస్తారు. తాజా గణాంకాల ప్రకారం.. స్థూల దేశీయ సంపద 2018-19లో సుమారు 11.3 శాతం వృద్ధితో రూ. 188.17 లక్షల కోట్లుగా ఉంది. 2017-18లో ఇది రూ. 169.10 లక్షల కోట్లు.

ద్రవ్య లోటు 3.39 శాతం
2018-19లో ద్రవ్యలోటు జీడీపీలో 3.39 శాతంగా నమోదైంది. బడ్జెట్‌లో సవరించిన అంచనా అయిన 3.4 శాతంతో పోలిస్తే స్వల్పంగా తక్కువ. వ్యయాలు తగ్గడం, పన్నుయేతర ఆదాయం పెరగడం దోహదపడింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకారం.. విలువ పరంగా చూస్తే ద్రవ్యలోటు రూ.6.45 లక్షల కోట్లుగా నమోదైంది. దేశంలో నిరుద్యోగ రేటు 2017-18 సంవత్సరంలో 6.1 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇది 45 ఏళ్లలోనే అత్యధిక రేటు కావడం గమనార్హం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తలసరి ఆదాయం నెలకు రూ.10,534
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరం
ఎవరు : కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో)
Published date : 01 Jun 2019 05:42PM

Photo Stories