Skip to main content

టాప్ 50లో నిలవడమే భారత్ లక్ష్యం

సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచ బ్యాంక్ రూపొందించిన సులభతర వాణిజ్య దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఈ జాబితాలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేయాల్సిందిగా తన జట్టును కోరానని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నిబంధనలు భారత్‌లో ఉండాలని, వ్యాపారం చేయడం చౌకగా ఉండే ప్రయత్నాలు కూడా చేయనున్నామని తెలిపారు. జనవరి 18న ఇక్కడ 9వ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తూ... దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, వ్యాపార వేత్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అడ్డంకులు తొలగిస్తాం...
అభివృద్ధిని కుంటుపరిచే అడ్డంకులను తొలగించటంపై దృష్టి పెడుతున్నామని, సంస్కరణలు కొనసాగిస్తామని, అనవసరమైన నియంత్రణలు ఎత్తివేస్తామని మోదీ ఉద్ఘాటించారు. జీఎస్‌టీ అమలు, పన్నుల హేతుబద్ధీకరణ కారణంగా లావాదేవీల వ్యయాలు తగ్గాయని, వివిధ కార్యకలాపాలు మెరుగుపడ్డాయని వివరించారు. డిజిటల్ ప్రక్రియలు, ఆన్‌లైన్ లావాదేవీలు, సింగిల్ పాయింట్ ఇంటర్‌ఫేస్ వంటి అంశాల కారణంగా వ్యాపారం చేయడం వేగవంతమవుతోందని తెలిపారు. ఐటీ ఆధారిత లావాదేవీల ద్వారానే ప్రభుత్వ కొనుగోళ్లు, సమీకరణలు, డిజిటల్ చెల్లింపులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. పాలన మెరుగుపడేలా చూ స్తున్నామని, ‘సంస్కరణలు, పనితీరు సాధించడం, మార్పు తీసుకురావడం, మరింత మెరుగైన పనితీరు సాధించడం తమ తారక మంత్రమని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం....
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని, వివిధ అంశాల్లో చాలా మార్పు కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని, లోతైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టామని వివరించారు. వీటన్నింటి ఫలితంగానే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు మన ఆర్థిక వ్యవస్థపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. సంస్కరణలు తేవడంలో, నియంత్రణలు తొలగించడంలో ఇదే జోరు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు..
ప్రభుత్వ విధానాల కారణంగా భారత్‌లోకి గత నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయని నరేంద్ర మోదీ తెలిపారు. అంతకు ముందటి 18 ఏళ్లలో ఈ పెట్టుబడుల్లో సగం కూడా రాలేదని వివరించారు. అన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నామని, 90 శాతానికి పైగా ఆమోదాలు ఆటోమేటిక్ రూట్‌లోనే లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి బాటన పయనిస్తోందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో సగటున ఏడాదికి 7.3 శాతం వృద్ధిని సాధించామని, 1991 తర్వాత జీడీపీ జోరు పెరిగిందని తెలిపారు. మన దేశంలో యువ జనాభా బాగా పెరుగుతోందని, వీరి కోసం ఉద్యోగకల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరిగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అందుకే తయారీ, మౌలిక రంగాలపై ఎన్నడూ లేనంతగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఆధునికమైన, సత్తాగల నవ భారత్‌ను నిర్మించే దిశగా మౌలిక రంగంలో పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

యురేనియం సరఫరాపై ఒప్పందం
వైబ్రాంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగపడే యురేనియం సరఫరా కోసం భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి: సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్ లక్ష్యం
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ: గాంధీనగర్
Published date : 19 Jan 2019 07:51PM

Photo Stories