Skip to main content

టాప్‌–10లో నీరజ్‌ పసిడి ప్రదర్శన..రెండో ర్యాంక్‌కు నీరజ్‌

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన మరో స్థాయికి చేరింది.
టోక్యో ఒలింపిక్స్‌లోని ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో పది అద్భుత ఘట్టాల్లో అతని ప్రదర్శనకు స్థానం లభించిందని ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) వెల్లడించింది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కాడు. ‘ఒలింపిక్స్‌కు ముందు నీరజ్‌ చోప్రా ప్రతిభ గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్‌ ఆకాశాన్ని తాకింది. అంతలా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు’ అని ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. విజయం తర్వాత నీరజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్‌ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. ఒలింపిక్స్‌కు ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌లో 1,43,000 మంది ఫాలోవర్లు ఉండగా... ఒలింపిక్‌ చాంపియన్‌ అయ్యాక, ఆ పోస్ట్‌ పెట్టాక ఏకంగా 32 లక్షల మంది ఫాలోవర్లు జమ అయ్యారని డబ్ల్యూఏ తెలిపింది.

రెండో ర్యాంక్‌కు నీరజ్‌ :
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్‌ ఆగస్టు 11వ తేదీన ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. జర్మనీకి చెందిన జొనాస్‌ వెటెర్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
Published date : 12 Aug 2021 06:06PM

Photo Stories