Skip to main content

స్వామి కేశవానంద భారతి కన్నుమూత

రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన తత్వవేత్త, శాస్త్రీయ సంగీతకారుడు స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు.
Current Affairs
1940, డిసెంబర్ 9న జన్మించిన ఆయన వృద్ధాప్య సమస్యలతో సెప్టెంబర్ 6న కర్ణాటకలోని మంగళూరులో కన్నుముశారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కాసర్‌గఢ్‌లోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా ఉన్న కేశవానంద భారతి శ్రీపాద గల్వరు యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు.

మైలురాయి... ఆ తీర్పు
కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం.

రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ..
కేరళ ప్రభుత్వం వర్సెస్ కేశవానంద భారతి కేసు తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది. రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది.

మొదట కేరళ హైకోర్టులో...
భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది. అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన తత్వవేత్త కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : స్వామి కేశవానంద భారతి (79)
ఎక్కడ : మంగళూరు, కర్ణాటక
ఎందుకు : వృద్ధాప్య సమస్యలతో
Published date : 09 Sep 2020 12:17PM

Photo Stories