Skip to main content

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణం స్వీకారం

సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నవంబర్ 18న ప్రమాణం స్వీకారం చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఈ పదవిలో ఉంటారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు.

జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేపథ్యం ఇలా..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్‌గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్‌గా రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ప్రమాణం స్వీకారం
ఎప్పుడు: నవంబర్ 18, 2019
ఎవరు: జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 18 Nov 2019 05:32PM

Photo Stories