Skip to main content

శ్రీలంక ప్రధానిగా మహింద ప్రమాణం

శ్రీలంక ప్రధానిగా మహిందరాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
Current Affairs
కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయంరాజమహవిహారయలో ఆగస్టు 9న జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా ఆయన ప్రమాణం చేశారు. మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయరాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటురాజపక్స కుటుంబం హవా సాగనుంది.

225కు గాను.. 150 సీట్లు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్‌ఎల్‌పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్‌ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్‌ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది.

24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి..
మహిందరాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి 2020 ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక13వ ప్రధానిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : మహిందరాజపక్స
ఎక్కడ : కొలంబోకు సమీపంలోని కేలనియా
Published date : 10 Aug 2020 06:03PM

Photo Stories